బాలూ విగ్రహం చుట్టూ.. భావోద్వేగాల చిటపటలు

Bala subramanya statue issue
X

Bala subramanya statue issue

కళలకు, కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఉండవు. అయితే కళలు, కళాకారులు ఆయా సందర్భాలలో ఎందుకు వివాదాస్పదం అవుతుంటారు? శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం అనే ప్రఖ్యాత నేపథ్య సినీ గాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం ప్రస్తుతం వివాదాంశం అయింది. డిసెంబర్ 15 బాలసుబ్రమణ్యం జయంతి. ఆ సందర్భంగా ఆయన అభిమానులు, బంధుమిత్రులు విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. తెలంగాణకు గొప్ప సాంస్కృతిక కేంద్రంగా భాసిల్లుతున్న రవీంద్రభారతిలో ఆ విగ్రహ ప్రతిష్ఠకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఇది తెలంగాణావాదులు కొందరికి అభ్యంతరకరం అయింది.. అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఎస్‌పి బాలు విగ్రహం బదులు ఉత్తరాంధ్రకు చెందిన కళాకారుడు వంగపండు ప్రసాదరావు విగ్రహం పెడితే ఇప్పుడు అభ్యంతరం చెప్తున్న తెలంగాణ క్రాంతి దళ్ ఫౌండేషన్ నాయకుడు పృథ్వి ఆ పని చేసేవాడు కాదేమో. అంతెందుకు, బాలు విగ్రహం స్థానంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో సినీ నేపథ్య గాయకుడు రామకృష్ణ విగ్రహం పెడితే తాను రెండు తట్టల మట్టి కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠకోసం మోసి సంఘీభావం తెలిపేవాడినన్నారు పృథ్వి. అంటే, ఇటువంటి భావోద్వేగాలు ఆయా సందర్భాలలో అప్పటి పరిస్థితులను బట్టి, ఆయా వ్యక్తుల వ్యవహార శైలిని బట్టి ఉంటాయి అన్నట్టే కదా.

బాలసుబ్రమణ్యం విగ్రహం పెట్టబోతున్న ప్రాంగణంలోనే మరో ప్రముఖ గాయకుడు ఘంటసాల విగ్రహం కూడా ఉన్నది. దానిని తీసేయాలని ఉద్యమకారులు అడగడం లేదు. ఆ మాటకొస్తే ఒక్క రవీంద్రభారతి ఆవరణలోనే కాదు, హైదరాబాద్ నగరంలో చాలాచోట్ల అనేకమంది విగ్రహాలు ఉన్నవి. పలు ప్రాంతాలకు కూడా ఎందరో తెలంగాణకు చెందనివారి పేర్లు ఉన్నవి. అందులో చాలామంది ఆంధ్ర ప్రాంతంవారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకంటే కూడా ఆంధ్ర ప్రాంతంవారివి ఎక్కువ ఉండే అవకాశం ఎందుకు ఉందంటే పది పన్నెండేళ్ల క్రితంవరకు ఆ ప్రాంతానికి కూడా హైదరాబాదే రాజధానిగా ఉండింది కాబట్టి. భావోద్వేగాలు ఎల్లవేళలా అందరి విషయంలో ఒకేలాగా ఉండవు. నిజానికి ఘంటసాల విగ్రహం పెట్టింది 2012లో. అప్పుడు దాన్ని ఆవిష్కరించిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమం తారస్థాయికి చేరిన రోజులవి. కిరణ్ కుమార్ రెడ్డి ‘తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని శాసనసభ సాక్షిగా తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకుంటున్న రోజులు అవి. అయినా ఎవరూ అడ్డుకోలేదు. ఘంటసాల తెలంగాణ వాస్తవ్యుడు కాకపోయినా ఇక్కడి అత్యధిక సంఖ్యాకుల ఆకాంక్షలను వ్యతిరేకించిన వ్యక్తి కాదు, కనీసం బహిరంగంగా కాదు.

ఈ విగ్రహాల తగాదా జరుగుతున్న రవీంద్రభారతికి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు పెట్టారు. మరి ఆయన బెంగాలీ కదా అనే వితండవాదం చేసేవాళ్లకు చెప్పాల్సిందేమిటంటే విశ్వకవికి తెలంగాణ ఉద్యమ వ్యతిరేకత ఉండే అవకాశం లేదు. ఇది ఒక తొండివాదన తప్ప మరోటి కాదు. అంతెందుకు, తొలిదశ తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న రోజుల్లో ప్రఖ్యాత నటుడు ఎన్‌టి రామారావు తెలంగాణ ఉద్యమకారులు అందరినీ రెచ్చగొట్టే విధంగా ఒక సినిమాలో, తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగునాడు మనదే మనదే అని ఒక పాట పెట్టి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురై థియేటర్ల తెరలు తగలబెట్టించుకున్నారు. నిజానికి ఈ పాట రాసింది తెలంగాణకు చెందిన ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి కాగా, నటించింది మాత్రం ఎన్‌టిఆర్. అదే ఎన్‌టి రామారావు పార్టీ పెడితే ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకంటే ఎక్కువ ప్రజాదరణ ఆయనకు తెలంగాణలో లభించింది. ఎక్కువ సంఖ్యలో స్థానాలు గెలుచుకున్నారు.

తెలుగు సినిమా రంగం మద్రాసు నుండి హైదరాబాద్ తరలి రావడానికి ముఖ్యకారకుడు, వీర తెలంగాణవాది డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కదా. 1978లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే సినిమావారికి అవసరమైన అనేక సదుపాయాలు ప్రభుత్వం తరఫున కల్పించినప్పుడు రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న సినీ ప్రముఖులు దాదాపు అందరూ ఆంధ్ర ప్రాంతం వారే. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం ఫిలింనగర్ లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నారు సినిమా రంగంవారు.

1969 తొలి దశ ఉద్యమంలో కేంద్ర బలగాలను కూడా రప్పించి దాదాపు 350మంది యువతీయువకులు ఆ బలగాల కాల్పుల్లో మరణించడానికి కారకుడయ్యాడని ఉద్యమకారులు ఆ రోజుల్లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని విపరీతంగా ద్వేషించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కాలంలో చిరాన్ పార్క్‌కు కెబిఆర్ పార్క్ అని నామకరణం చేసి, దాని ప్రవేశద్వారం వద్ద బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇన్ని దశాబ్దాలు గడిచినా మలిదశ ఉద్యమం తీవ్రంగా ఉన్న రోజుల్లో కూడా ఎవరూ దాన్ని తొలగించాలని కోరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొలి ముఖ్యమంత్రి కాగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొద్ది కాలం పార్క్ పేరు కెబిఆర్ అని ఉచ్చరించడానికి కూడా ఇష్టపడకపోయినా తర్వాత రోజుల్లో తత్వం బోధపడి మిన్నకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్క్‌లో రోజు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసే వాళ్లలో మెజారిటీ ఆంధ్ర ప్రాంతం వారే.

అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర విభజనకు బద్ధ వ్యతిరేకి. కానీ ఆయన చేసిన ప్రజాహిత కార్యక్రమాల కారణంగా ఇప్పటికీ తెలంగాణలో అసంఖ్యాకులు ఆయనను ప్రేమిస్తారు. తెలంగాణలో కూడా ఆయన విగ్రహాలు లెక్కకు మించినన్ని. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అయిందని ఆనాటి హోమ్ మంత్రి చిదంబరం ప్రకటించగానే ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుతో రాత్రికి రాత్రి గుసగుసలాడి శాసనసభ్యులచేత మూకుమ్మడి రాజీనామాలు చేయించి విభజన ప్రక్రియను తాత్కాలికంగా వెనక్కు నెట్టిన ఆనాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య విగ్రహం హైదరాబాద్ నగర వీధుల్లో నిక్షేపంగా నిలిచే ఉంది కదా. ఇన్ని ఉండగా, ఒక్క బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉదంతానికి వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తున్నది, అందరిపట్ల, అన్ని సమయాలలో తెలంగాణ ప్రాంత ప్రజల భావోద్వేగాలు ఒకే రకంగా ఉండవు.

జరిగిందేమిటంటే, ఇటీవలే మరణించిన ప్రముఖ తెలంగాణ గాయకుడు, కవి, రచయిత అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని ప్రభుత్వం రాష్ట్రగీతంగా ప్రకటించింది. 2004లో అప్పటి ఉద్యమ సంస్థ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ గీతాన్ని బాలసుబ్రమణ్యంతో పాడించి రికార్డు చేయడానికి నిర్ణయించుకుని అడ్వాన్స్ డబ్బు కూడా చెల్లించి ఒక బృందం చెన్నై వెళ్ళింది. గీతం అంతా చదివిన బాలసుబ్రహ్మణ్యం అందులో చివరగా వచ్చే స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఎదగాలి అన్న వాక్యం తొలగిస్తే తప్ప పాడనని అన్నారు. దానికి ఉద్యమకారులు అంగీకరించలేదు. బాల సుబ్రహ్మణ్యం తనకు చెల్లించిన డబ్బు తిరిగి ఇచ్చేశారు. అదే పాటను ఆ ప్రాంతానికి చెందిన మరో నేపథ్య గాయకుడు రామకృష్ణ పాడారు. ఉద్యమ కాలంలో ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు.

ఆ పాట పాడినందుకు గాయకుడు రామకృష్ణకు ఆంధ్ర ప్రాంతంలో అవమానం జరిగిందని తెలంగాణవాదుల ఫిర్యాదు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలనుకుంటున్న తరహాలోనే రామకృష్ణ శ్రేయోభిలాషులు, మిత్రులు, రాజమండ్రిలో ఆయన విగ్రహం సొంతంగా ఏర్పాటు చేయదలచుకున్నప్పుడు అక్కడి రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకించి ఆ పని జరగనివ్వలేదన్నది ఆ ఫిర్యాదు. తెలంగాణ ఉద్యమం మీద తీసిన ఒక సినిమాలో నటించినందుకు ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన వాటిని లెక్క చెయ్యలేదు.

ఉద్యమ సమయంలో ఆ పాటను అంతగా ఉపయోగించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాటను, ఆ పాట రచయిత అందెశ్రీని అంతగా పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించి అందెశ్రీని, ఆయన పాటను అక్కున చేర్చుకున్నారు. అంతేకాదు, దురదృష్టవశాత్తు ఇటీవల అందెశ్రీ మరణిస్తే అంత్యక్రియలకు స్వయంగా హాజరైన ముఖ్యమంత్రి ఆయన పాడెకు తన భుజాన్ని ఇచ్చారు. అందెశ్రీ గీతాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, రాష్ట్ర గీతంగా గుర్తించిన తర్వాత ఆ పాటకు సంగీతాన్ని సమకూర్చడానికి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణిని అందెశ్రీ స్వయంగా ఎంచుకున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో జరగబోయే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్ లో కూడా కీరవాణి కచేరి ఉండబోతున్నది. కీరవాణిని ఎవరూ అడ్డుకోబోవడం లేదు. ఆయనను కళాకారునిగానే తెలంగాణవాళ్ళు గుర్తిస్తున్నారని అర్థం.

ఇక్కడ ఇంకో విషయం తప్పకుండా చెప్పుకోవాలి. జూబిలీహిల్స్ ప్రాంతంలో 1984 ప్రాంతాల్లో ఏర్పాటయిన జర్నలిస్టుల కాలనీకి ఎం. చలపతిరావు నగర్ అని పేరు పెట్టుకున్నారు. 2007 డిసెంబరులో ఆ కాలనీ చౌరస్తాలో చలపతిరావు విగ్రహాన్ని ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. గత 18 ఏళ్ళుగా ప్రతి యేటా ఆయన విగ్రహం నివాళులు అందుకుంటూనే ఉన్నది. నెహ్రూ సమకాలికుడు, సన్నిహితుడు, జాతీయస్థాయిలో ప్రఖ్యాతుడయిన చలపతిరావు శ్రీకాకుళంలో పుట్టాడు కాబట్టి హైదరాబాద్ లో విగ్రహం పెట్టొద్దని ఎవరయినా అన్నారా? కాబట్టి ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ప్రతిష్ఠ విషయంలో ఏర్పడిన వివాదాన్ని అనవసరంగా ఆంధ్ర ప్రాంత వ్యతిరేకతగా చిత్రించకుండా ఉంటే మంచిది. ముందే చెప్పుకున్నట్టు, ఇటువంటి భావోద్వేగాలు ఆయా సందర్భాలలో అప్పటి పరిస్థితులు, ఆయా వ్యక్తుల వ్యవహార శైలినిబట్టి ఉంటాయి. నిజానికి ఎవరి విగ్రహాలు ఎక్కడ పెట్టాలనే విషయం ప్రస్తుతం ఆలోచించవలసిన అంశమే కాదు.

ఈ విగ్రహాల విషయంలో ఇంకొక వాదన కూడా ఉంది. తెలంగాణవాదులు అంటున్నది ఏమిటంటే, ఆంధ్ర ప్రాంతాల్లో తెలంగాణనుంచి ప్రఖ్యాతి చెందిన వ్యక్తులెవరి విగ్రహాలు ఎందుకు లేవు అని. నిజమే, తెలంగాణ ప్రాంతంవాడైన పివి నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత లోకసభకు పోటీ చేసింది కూడా రాయలసీమలోని నంద్యాల లోకసభ నియోజకవర్గం నుండి. కనీసం పివి నరసింహారావు విగ్రహమైన ఆంధ్రలో ఉండాలి కదా. అలాగే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా తెలంగాణవారున్నారు. వారెవరి విగ్రహాలూ ఆంధ్రప్రాంతంలో లేవు కదా. మరి దానికి సమాధానం ఏముంటుంది?

అయితే రాష్ట్రం విడిపోయి రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాక 11 సంవత్సరాలు గడిచినా ఇంకా అక్కడ ఇక్కడ కొన్ని అపశ్రుతులు వినిపిస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలు ఎండిపోతే తెలంగాణ వారి దిష్టి తగిలిందని ఒక బాధ్యతారహితమైన, పనికిమాలిన వ్యాఖ్య చేశారు. పొద్దున లేస్తే తన నివాసంతో సహా, తన సినిమా కార్యకలాపాలన్నీ హైదరాబాదులోనే కొనసాగిస్తూ, ఇక్కడి సౌకర్యాలు అన్నీ అనుభవిస్తూ కూడా తెలంగాణ మీద, తెలంగాణ ప్రాంత ప్రజల మీద పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు అక్కసు వెళ్ళగక్కడం ఇవాళ కొత్త కాదు. అక్కడ ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు దానికి జవాబు అన్నట్టుగా పృథ్వీలాంటివాళ్లు బాలసుబ్రహ్మణ్యంవంటి వారి విగ్రహాల ఆవిష్కరణను అడ్డుకుంటారు. ఇప్పుడు కావాల్సింది విగ్రహాల వివాదం కాదు. రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం గడిచిపోయినా సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం, అందెశ్రీ పాటను రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించడం వంటి కొన్ని చర్యలు తప్ప తెలంగాణ కళలు, సాంస్కృతిక పునరుజ్జీవనానికి, వికాసానికి, వాటికి శాశ్వత కీర్తి తేవడానికి అవసరమైన విధానమే ఇప్పటివరకు ప్రభుత్వాలు రూపొందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం ఒక కమిటీ వేసినట్టు గుర్తు. ఆ కమిటీ నివేదిక పరిశీలించి,దాని అమలుకు తగిన చర్యలు తీసుకుంటే ఇటువంటి చిన్న చిన్న వివాదాలకు ఆస్కారం ఉండకుండా పోతుంది.




Tags

Next Story