గెలుపు కోసం ‘సీట్ల పెంపు’ వ్యూహం

దక్షిణ భారతదేశంలో బిజెపికి కనిష్ట ఎన్నికల బలం ఉన్నప్పటికీ ఉత్తర భారత రాష్ట్రాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకుని 2029 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారం లోకి రావడానికి బిజెపి ఇప్పటినుంచే కొత్త ఎత్తుగడలు రచిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీగా సీట్లు గెలవడం ద్వారా కేంద్రంలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చని బిజెపి నమ్ముతోంది. దక్షిణాదిలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బిజెపికి బలం తక్కువ. 2024లో తమిళనాడులో 39/39 సీట్లు డిఎంకె గెలుచుకుంది. అయినప్పటికీ తమిళనాడులో ఓటుశాతం పెంచుకోవడం పైనా, కేరళలో ఓటు బ్యాంకు విస్తరణ పైనా బిజెపి దృష్టి పెట్టింది. ఇప్పుడు తమిళనాడు, కేరళలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు 2029 నాటికి పునాదిగా భావిస్తోంది. ఈమేరకు నియోజకవర్గాల పునర్విభజన 2029 నాటికి పూర్తి చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు లోక్‌సభ , రాష్ట్రాల అసెంబ్లీల సీట్లు 50 శాతం వరకు పెంచుకోవాలని ఆలోచిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన అన్న మాట లేకుండా సీట్లు పెంచుకోవడమే తమ లక్షంగా బయటకు నమ్మిస్తోంది.
అదే జరిగితే లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816 వరకు, అసెంబ్లీ స్థానాలు 4123 నుంచి 6385 వరకు పెరుగుతాయి. దక్షిణాదితో పోలిస్తే జనాభాలో వ్యత్యాసాల ఫలితంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఉంటున్నాయి. ఈ వ్యత్యాసాలను సవరించాలని దక్షిణాది రాష్ట్రాలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. 1951లో దేశం మొత్తంమీద జనాభాలో దక్షిణాది రాష్ట్రాల్లో 26 శాతం జనాభా ఉండగా, 2022 నాటికి ఇది 19 శాతానికి తగ్గింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సీట్ల పెంపు వ్యూహం గురించి ఎన్‌డిఎ మిత్రపక్షాలతోనే చర్చించారు తప్ప ఇతర రాజకీయ పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు జరపకపోవడం బిజెపి వ్యూహంలో మర్మం తెలుస్తోంది. సీట్ల పెంపు ఫార్ములా ప్రకారం ప్రస్తుత లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య 543 నుండి 816 కి పెరగడం తప్పదు. ఉత్తరభారత రాష్ట్రాల్లో 150 నుంచి 200 సీట్లు వరకు పెరుగుతాయి.
దీనివల్ల ఉత్తర భారత రాష్ట్రాల్లో “అన్యాయంగా బలమైన మెజారిటీ” లభిస్తుందని, దక్షిణ భారత రాష్ట్రాలను రాజకీయంగా నిర్వీర్యం చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో సీట్లు 80 నుంచి 120 కి పెరుగుతాయి. అదే సమయంలో తెలంగాణ సీట్లు 17 నుంచి కేవలం 26 వరకు మాత్రమే పెరుగుతాయి. ప్రస్తుతానికి ఉన్న 63 సీట్ల వ్యత్యాసం భవిష్యత్తులో 94 సీట్ల వరకు పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకనే జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసింది. అన్ని రాష్ట్రాలతో చర్చించిన తరువాతనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రతి రాష్ట్రానికి ప్రస్తుతం ఉండే సీట్ల సంఖ్యను జనాభా నిష్పత్తి ప్రకారం పెంచాలని, అదనపు సీట్లు ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువగా వెళ్లకుండా పరిమితం విధించాలని కోరుతోంది. ఇప్పటికే హిందీ ప్రాంతానికి పరిమితమైన పార్టీగా బిజెపికి ముద్ర ఉంది.
నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల ఆమోదం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత పదవుల నియామకం తదితర విషయాల్లో ఇప్పటికే ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య వ్యత్యాసం కనిపిస్తుండగా, సీట్ల పెంపు జరిగితే మరింత వ్యత్యాసం పెరుగుతుందన్న విమర్శ వస్తోంది. నిధుల కేటాయింపులో కానీ, అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరులో కానీ కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగుతోందని దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజనకు మోడీ ప్రభుత్వం గతంలో ప్రయత్నించగా దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో వెనక్కు తగ్గింది. ఇప్పుడు దక్షిణాది సీట్లు నేరుగా తగ్గించకపోయినప్పటికీ 50 శాతం సీట్ల పెంపు ప్రయత్నం దక్షిణాదికి అన్యాయమే చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రతి దశాబ్దానికి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. కానీ అసమానంగా జనాభా పెరిగినందున లోక్‌సభ నియోజకవర్గాల సీట్ల విస్తరణను 25 సంవత్సరాల పాటు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ స్తంభింప చేశారు.
ఆ తరువాత అటల్ బిహారీ వాజ్‌పాయ్ కూడా 2001లో అదే పద్ధతిని అనుసరించారు. 1976, 2002 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో సీట్ల సంఖ్య పెంచకుండా నియోజకవర్గాల సరిహద్దు మార్చారు. మళ్లీ 45 ఏళ్ల తరువాత మోడీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ప్రయత్నాలు ప్రారంభించింది. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్రం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలిస్తే దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గకపోయినా, సాపేక్షంగా ఉత్తర భారత రాష్ట్రాల్లో పెరిగిన సీట్లవల్ల దక్షిణాదికి ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఈ అసమానత ఉత్తరాది రాష్ట్రాల శాసనసభ ఆధిపత్యం పెరిగిపోవడానికి దారితీస్తుంది. అంతేకాదు సెక్యులరిజం, ఫెడరలిజం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నష్టం కలిగించే పాలకవర్గాల విధానాలను దక్షిణాది రాష్ట్రాలు ప్రతిఘటించడం కష్టతరమవుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం మత, కుల విభేదాలను వాడుకుంటోందని బిజెపిపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రాంతీయ విభజనలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags
-
Home
-
Menu
