రాజ్యాంగ నైతికతకు సవాళ్లు

రాజ్యాంగ నైతికతకు సవాళ్లు
X

ఏటా నవంబర్ 26న మనం రాజ్యాంగ దినోత్సవం లేదా ‘సంవిధాన్ దివస్’ను 2015 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. 1939 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో తీర్మానించిన తరువాత, ఆ రోజును పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకున్నారు. అందువల్ల జనవరి 26వ తేదీని రాజ్యాంగం అమలు లోకి వచ్చే రోజుగా నిర్ణయించారు. 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించడం ఇవన్నీ చారిత్రక సత్యాలు. రాజ్యాంగం అనేది కేవలం ఒక రాజకీయ వ్యవస్థ మాత్రమే కాదు, ప్రభుత్వం యొక్క అధికారాలను రాజ్యాంగం లోని నిబంధనల ద్వారా పరిమితం చేసే రాజకీయ వ్యవస్థను సూచిస్తుంది. 1949 నవంబర్ 25న రాజ్యాంగ సభలో డాక్టర్ అంబేద్కర్ చేసిన చివరి ప్రసంగంలో భారత ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన మూడు ముఖ్యమైన 1. రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులు విడిచిపెట్టాలి. 2. రాజకీయాల్లో వ్యక్తి ఆరాధన ప్రమాదకరం. 3. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా మార్చాలి. అన్న హెచ్చరికలు చేశారు.

ప్రజాస్వామ్యంలో నాయకులు రాజ్యాంగానికి లోబడి ఉండాలే తప్ప, నాయకులకు రాజ్యాంగం లోబడి ఉండకూడదని కూడా హెచ్చరించారు. భారతీయ సమాజం శతాబ్దాలుగా కుల వ్యవస్థ, సామాజిక అసమానతలు, వివక్ష, మతపరమైన విభజనలతో ప్రభావితమై ఉన్నందున రాజ్యాంగం ప్రకటించిన సమానత్వాన్ని ఆచరణలోకి తీసుకు రావడం పెద్ద సవాలు. అందుకే రాజ్యాంగ నైతికతను ప్రజల్లో పెంపొందించడం అవసరమని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే విస్తృతమైన లిఖిత రాజ్యాంగం మనకు ఉన్నప్పటికీ, ఆ రాజ్యాంగం ఆశించిన విలువలు, మన ప్రభుత్వ వ్యవస్థలో, రాజకీయ నాయకుల ప్రవర్తనలో, పౌరుల సామాజిక జీవితంలో నిజంగా ప్రతిబింబిస్తున్నాయా? అని ప్రశ్నించుకుంటే వాస్తవ పరిస్థితులు ఏమిటో సాక్షాత్కరిస్తాయి. రాజ్యాంగబద్ధత (కాన్‌స్టిట్యూషనలిజం), రాజ్యాంగ నైతికత (కాన్‌స్టిట్యూషనల్ మొరాలిటీ)కు నిరంతరం ముప్పు కలిగిస్తున్న అనేక సవాళ్లు కొనసాగుతున్నాయి. రాజ్యాంగ నైతికత అంటే రాజ్యాంగంలో పొందుపర్చిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను కేవలం చట్టబద్ధ్దంగా కాకుండా, వ్యక్తిగత జీవితం లోనూ, సామాజిక వ్యవస్థ లోనూ ప్రభుత్వ పాలన లోనూ గౌరవించి ఆదరించడం. రాజ్యాంగ విలువలను ప్రభుత్వాలు, సంస్థలు, రాజకీయ నాయకులు, పౌరులు తమ ఆచరణలో భాగం చేసుకోవడమే నిరంతర ప్రక్రియ. దీనినే రాజ్యాంగ నైతికత అంటారు.

ప్రభుత్వాల పాలనలో రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నో కోణాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల మెజారిటీని అపరిమిత రాజకీయ అధికారంగా భావించకూడదని, అలా భావిస్తే ప్రమాదకరమని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఈమేరకు ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయో పరిశీలించాల్సిందే. తమకు అపరిమిత అధికారాలు ఉన్నట్టు ప్రభుత్వాలు భావిస్తే సంస్థాగత నియంత్రణలు, సమతుల్యతలు, వ్యక్తిగత స్వేచ్ఛ బలహీనమవుతాయి. సాధారణంగా ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయానికే ప్రాధాన్యం ఉంటుంది. అయితే మెజారిటీ ప్రజల అభిప్రాయం రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉండరాదు. మెజారిటీ ప్రజలు ఒక మతానికి చెందిన వారైనంత మాత్రాన మైనారిటీల హక్కులను హరించకూడదు. ఒక సామాజిక ఆచారం సంప్రదాయంగా కొనసాగుతున్నప్పటికీ అది సమానత్వానికి విరుద్ధంగా ఉంటే దాన్ని సమర్థించకూడదని రాజ్యాంగం స్పష్టం చేసింది.

ఇక రాజ్యాంగ సంస్థల రాజకీయీకరణ రాజ్యాంగ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం వల్ల వాటి నిష్పక్షపాత ధోరణి, తటస్థత దెబ్బతింటాయని రాజ్యాంగం స్పష్టం చేసింది. ఉదాహరణకు ఎన్నికల కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి), న్యాయవ్యవస్థ, సమాచార కమిషన్ వంటి రాజ్యాంగ సంస్థలను పరిశీలిస్తే ఎన్నికల కమిషన్‌పై గత కొన్నేళ్లుగా ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో, ప్రజల నిరసనలు ఎంత తీవ్రంగా ఉంటున్నాయో తెలిసిందే. అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి సంస్థలపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ రాజ్యాంగ సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా పనిచేయడం రాజ్యాంగ నైతికతకు అవసరం. పాలనలో న్యాయబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికత ఉండాలి.

తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని విస్మరించడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధం. కానీ ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే రాజకీయ అవసరాలు, పరిపాలనా సౌలభ్యానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి విస్తరించింది. రాజ్యాంగ నైతికతను బలపరుస్తూ సుప్రీం కోర్టు తీర్పులు చాలా వెలువడ్డాయి. పార్లమెంట్‌కు రాజ్యాంగ సవరణ అధికారం ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నాశనం చేయలేదని 1973 లో కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని 2017 లో కె.ఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీం తీర్పు చెప్పింది. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించే ఐపిసి సెక్షన్ 497ను 2018లో రద్దు చేసింది. వ్యక్తిగత గౌరవం, సమానత్వాన్ని సమర్థించింది. ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యాంగబద్ధ పాలనా సూత్రాలను సంపూర్ణంగా గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కట్టుబడి ఉండడం ప్రధాన కర్తవ్యం. రాజ్యాంగాన్ని పుస్తకాల్లో చదవడం కాదు. మన ఆలోచనల్లో, ప్రవర్తనలో, పాలనా విధానాల్లో ప్రతిబింబింప చేయాలి.

Tags

Next Story