పసిప్రాయాన్ని కాటేస్తున్న హెచ్‌ఐవి

ఆరోగ్యవంతమైన పిల్లలతో సమాజ పురోగతి సాధ్యపడుతుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన కుటుంబానికి సోపానమవుతుంది. నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ముచ్చట ఎంతోకాలం కాదని తెలియక తల్లడిల్లే కుటుంబసభ్యుల వేదన అంతాఇంతా కాదు. చేయని తప్పులకు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడుతూ దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తదితర కారణాలతో చాలామంది పిల్లలు హెచ్‌ఐవి బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి సుమారు 14 లక్షల మంది పిల్లలు 15 ఏళ్లలోపు హెచ్‌ఐవికి గురయ్యారు. మన దేశంలో తల్లి నుంచి బిడ్డకు, రక్తం ఎక్కించడం, అసురక్షిత రక్తమార్పిడి ద్వారా 5 శాతం మేరకు హెచ్‌ఐవి కేసులు వెలుగు చూస్తున్నాయి. హెచ్‌ఐవితో జీవిస్తున్న 15 ఏళ్లలోపు పిల్లల్లో సగానికిపైగా ‘యాంటీరెట్రో వైరల్’ మందులు వాడుతున్నారు.
చికిత్స కన్నా నివారణ ప్రధానమైనది. రోగం వచ్చాక చికిత్స కోసం పరుగులు తీసేకన్నా ముందే రోగం రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. నివారించదగ్గ జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు ప్రధానంగా తోడ్పడుతుంటాయి. అదే క్రమంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ రహిత సమాజంగా మార్చేందుకు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఆధునిక పరిశోధనల ఫలితాల వల్ల ప్రసవించి హెచ్‌ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు ఆ వ్యాధి సోకకుండా ముందుగానే గుర్తించే అవకాశం కలిగింది. దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో 21వ శాతాబ్దం తొలినాటి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా మొదలై 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హెచ్‌ఐవితో పిల్లలు జన్మిస్తుండడం బాధాకరం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. రోగులపట్ల సమాజంలో నెలకొన్న వివక్ష ఇందుకు కారణంగా తెలుస్తోంది. హెచ్‌ఐవి గుర్తించిన పిల్లలకు ‘యాంటీ రిట్రో వైరల్’ ద్వారా మందులతో సహాయం చేస్తూ వారి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ మందుపై అవగాహన కొరవడడం, అందకపోవడంతో చాలా మంది పిల్లలు మరణిస్తున్నారు.
రోగనిరోధక శక్తిని బలహీనపరిచే వైరస్ హెచ్‌ఐవి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, కేన్సర్‌తో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చికిత్స అందకపోతే శరీరంలో హెచ్‌ఐవి పునరుత్పత్తి చెందుతూ ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక అనారోగ్యానికి గురై చివరకు మరణిస్తారు. ఈ వైరస్ సోకిన పిల్లలు చికిత్సలేకుండా ఐదేళ్ల వయస్సు వరకు జీవించే అవకాశముంటుంది. గర్భిణీనుంచి బిడ్డకు వ్యాపించే హైచ్‌ఐవి వైరస్ వ్యాప్తిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టడంలో పురోగతి ఉన్నప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పటికీ అధిక సంఖ్యలో పిల్లలు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. 90 శాతం మేరకు తల్లినుంచి సంక్రమిస్తున్నాయి. కలుషిత సూదుల వాడుక, రక్తమార్పిడిలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి. 84 శాతంకు పైగా సబ్ సహారా ఆఫ్రికాలోని పిల్లలకు సోకుతున్నాయి.
2024 నాటికి 55 శాతం మంది పిల్లలకు మాత్రమే చికిత్స అందాయి. చికిత్స అందక సగం మంది పిల్లలు రెండేళ్లలోపు వయస్సులోనే మరణిస్తున్నారు. మన దేశంలో తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవి సంక్రమణ 74.6 శాతంకు తగ్గింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ కావడం ఊరట కలిగించే విషయం. అయినప్పటికీ మిజోరాం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో హెచ్‌ఐవి వైరస్ వ్యాప్తి రేటు ఒక శాతానికి ఎక్కువగా ఉండటం, అలాగే అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బీహార్ వంటి కొన్ని ప్రాంతాలలో హెచ్‌ఐవి పాజిటివ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వైరస్ సంక్రమిస్తున్న కేసులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం బీహర్ రాష్ర్టంలోని సీతామఢి జిల్లాలో ఏకంగా 7,400 హెచ్‌ఐవి కేసులు నమోదుకాగా, అందులో 400 మందికి పైగా చిన్నారులు ఉండడం కలకలం సృష్టించింది.
తల్లిదండ్రుల కారణంగానే ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించగా, ఒక్క కేంద్రంలోనే నెలకు 40 నుంచి 60 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైద్య పరీక్షలు చేసుకోకుండానే పెళ్లి చేసుకోవడం, ఉపాధి కోసం వలసలు వెళ్లడం, సామాజిక వివక్ష తదితర కారణాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అధికారులు తేల్చారు. సురక్షిత లైంగిక పద్ధతులు, కలుషిత సూదుల వినియోగం, క్రమం తప్పకుండా హెచ్‌ఐవి పరీక్షలు చేసుకోవడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అక్కడ ముమ్మరం చేశారు. మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నాలో చోటు చేసుకుంది. చేయని తప్పుకు ఆరుగురు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడ్డారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు సత్నా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దాతల నుంచి సేకరించిన రక్తంను ఆ పిల్లలకు ఎక్కించిన కొద్ది రోజులకే అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నతాధికారుల దర్యాప్తులో ఆ పిల్లలకు హెచ్‌ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం లో 2024 నాటికి 2,22,338 హెచ్‌ఐవి కేసులు నమోదుకాగా, ఇందులో 90 శాతం 15 49 ఏళ్ల మధ్య వయస్సు వారున్నారు.
హెచ్‌ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించడం ఆరోగ్య రంగానికి పెను సవాలుగా మారిన సందర్భంలో డెన్మార్క్ ఒక చారిత్రాత్మక విజయాన్ని అక్కునజేర్చుకుంది. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవి, సిఫిలిస్ వంటి వ్యాధులు సంక్రమించకుండా అడ్డుకోవడంలో ఆ దేశం విజయం సాధించింది. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సమర్థవంతమైన ఆరోగ్య విధానాలు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఈ విజయానికి కారణమయ్యాయి. ‘యాంటీ రెట్రో వైరల్’ చికిత్సతోపాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తే ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) వెల్లడించింది. దీన్ని డెన్మార్క్ అమలు చేయడంతో ఆరోగ్య రంగంలో పెద్ద మైలురాయిగా ఫిబ్రవరి 27, 2026న ఆ సంస్థ విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. డెన్మార్క్ సూత్రాన్ని అమలు చేయడంలో క్యూబా, థాయిలాండ్ వంటి దేశాలు పాటు పడుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమణను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, డెన్మార్క్ బాటలో నడచినప్పుడే ఫలితాలు అందుతాయని డబ్ల్యూహెచ్‌ఒ స్పష్టం చేసింది.
- కోడం పవన్ కుమార్
9848992825
-
Home
-
Menu
