నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?

నిర్లక్షం నిప్పు.. ఎవరిది తప్పు?
X

గోవా క్లబ్‌లో ఆదివారం (7.12.2025) అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదం గ్రామ పంచాయతీ వ్యవస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వరకు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు ఎలా జరిగాయో బట్టబయలు చేసింది. ఈ ప్రమాదానికి దారితీసిన భద్రతా వైఫల్యాల్లో బాధ్యులైన వారందరూ “తిలాపాపం తలా పిడికెడు” అన్న చందంగా వ్యవహరించారు. బూడిద కుప్పల సాక్షంగా పాతిక ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మృతుల్లో 20 మంది నైట్‌క్లబ్ సిబ్బందే. వీరంతా వలస కార్మికులు, వీరిలో నలుగురు నేపాల్, ఐదుగురు ఉత్తరాఖండ్ నుంచి, జార్ఖండ్, అసోం నుంచి ముగ్గురేసి, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి ఇద్దరేసి, పశ్చిమబెంగాల్ నుంచి ఒకరు వచ్చారు. వీరితోపాటు ఐదుగురు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. టూరిస్టుల్లో ఢిల్లీకి చెందిన ఒకే కుటుంబం లోని ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. మృతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచి రూ.2 లక్షలు వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం ఆనవాయితీగా జరిగింది. అంతటితో ఈ ప్రమాదాలకు ముగింపు పలికినట్టు కాదు.

ఇది దేశం మొత్తం మీద భద్రతా ప్రమాణాలపై నేరపూరిత నిర్లక్షం మళ్లీ వెలుగు లోకి తెచ్చింది. ఈ ప్రమాదానికి దారి తీసిన భద్రతా ప్రమాణాల ఉల్లంఘనలు మీవల్ల కాదు మీవల్లనే అంటూ గ్రామ పంచాయితీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అధికారుల పరస్పర నిందారోపణలు స్వైర విహారం చేస్తున్నాయి. గోవా అర్పోరా వద్ద బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ ఏర్పాటైన స్థలమే పర్యావరణ పరిరక్షణ జోన్‌లో ఉంది. గోవా చట్టం ప్రకారం ఈ స్థలాన్ని వ్యవసాయేతర సంస్థలకు వినియోగించరాదు. ఈ స్థలాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయకూడదు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ ప్రమాణాలను పట్టించుకోకుండా బగానది నుంచి వెలువడిన నిల్వనీటిపై అంటే నీటికయ్యపై ఈ క్లబ్‌ను నిర్మించారు. సాధారణంగా ఈ ఉప్పునీటి కయ్యల్లో రొయ్యలు సాగు చేస్తుంటారు. ఈ క్లబ్ నుంచి మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా సన్నని ఇరుకు రోడ్డు నిర్మించారు. ఈ క్లబ్ చిన్న నీటి కొలనుకు విభజనగా నిర్మాణమైంది. ఒకవైపు చిన్న నీటి కొలను ఉండగా, మరోపక్క బగానది ఆనుకుని ఉంది.

భవన భద్రతా నిబంధనలకు విరుద్ధంగా ఈ క్లబ్‌ను నిర్మించారని పంచాయతీ అధికారులు భవనం కూలగొట్టడానికి సిద్ధం కాగా, రాష్ట్ర పంచాయతీ రాజ్ అధికారులు అడ్డుకున్నారని అర్పోరా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు రోషన్ రేడ్కర్ ఆరోపించారు. అయితే ఎంఎల్‌ఎ మైకేల్ లోబో పంచాయతీ అబద్ధాలు చెబుతోందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెస్టారెంట్ నడపడానికే అనుమతి ఇవ్వగా, గ్రామ పంచాయతీ రెస్టారెంట్‌కు, నైట్‌క్లబ్‌కు కూడా అనుమతించిందని ఆరోపించారు. నైట్‌క్లబ్‌కు అనుమతి ఇవ్వాల్సింది ఎక్సైజ్ డిపార్టుమెంటే తప్ప పంచాయతీ బాధ్యత కాదని వ్యాఖ్యానించారు. 20 ఏళ్ల నాటి ఈ క్లబ్‌కు తాజాగా 2023లో గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చింది. గత ఇరవై ఏళ్లలో ఈ క్లబ్ యాజమాన్యం అనేక చేతులు మారింది. ఆదివారం రాత్రి క్లబ్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకుండా పైరోగన్‌లు, బాణాసంచా కాల్పుల ప్రదర్శన నిర్వహించారు. దీనికి తోడు కొబ్బరి ఆకులతో తాత్కాలిక షెడ్ నిర్మించడం, మండే వస్తువులు ప్లాస్టిక్, ఫైబర్, ఫోమ్ ప్యాకేజింగ్ వంటి అలంకరణలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి.

క్లబ్ ప్రవేశమార్గం చాలా సన్నగా, ఇరుగ్గా ఉండడంతో అగ్నిమాపక యంత్రాలు లోపలికి వెళ్లడానికి వీలు కలగక, 400 మీటర్ల దూరంలోనే అవి ఉండిపోవలసి వచ్చింది. క్లబ్‌కు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు లేవు. ప్రమాద సమయంలో ఫస్ట్‌ఫ్లోర్‌లో డాన్స్ ఏరియాలో 100 మంది వరకు ఉన్నారు.కమ్ముకున్న పొగ వల్ల చాలామంది ఊపిరాడక పోవడం వల్లనే చనిపోయారని తేలింది.2023లో ఈ క్లబ్ నిర్వహణకు వీలు కల్పించిన బాధ్యులైన ముగ్గురు అధికారులను ఆదివారం రాత్రి సస్పెండ్ చేశారు. క్లబ్ యజమానులు ఇంకా పట్టుబడలేదు. ప్రమాదంపై దర్యాప్తునకు సిఎం ప్రమోద్ సావంత్ ముగ్గురు అధికారులలతో కమిటీ వేశారు. ఈ కమిటీ వారం లోగా దర్యాప్తు నివేదిక సమర్పించవలసి ఉంది. ఈ ప్రమాదం మళ్లీ దేశం మొత్తం మీద అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారో సమగ్రంగా సమీక్ష జరగవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

గత ఏడాది రాజ్‌కోట గేమింగ్ జోన్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంనుంచి ఇటీవల అక్టోబర్‌లో జైపూర్ సవాయి మాన్‌సింగ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం వరకు సమీక్షించవలసిన అవసరం కనిపిస్తోంది. భద్రతా ప్రమాణాలపై నిర్లక్షం నిప్పు ఈ ప్రమాదాలకు దారితీస్తోందని సర్వసాధారణంగా తెలిసిన విషయమే. నోయిడా అధికార యంత్రాంగం గత ఏడాది 131 సొసైటీలు సరైన అగ్ని ప్రమాద భద్రతా ప్రమాణాల లోపంతో ఉన్నాయని గుర్తించింది. మంటలను ఆర్పే సామర్ధం, సాంకేతిక సౌకర్యాలు దేశం లోని ఫైర్ స్టేషన్లలో 96 శాతం లోపించాయని ఫైర్ అండ్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించడం గమనార్హం. కొన్ని ఫైర్ స్టేషన్లు కాలం చెల్లిన పరికరాలతో అల్లాడుతున్నాయి. వీటి నిర్వహణలోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అగ్నిమాపక శకటాల్లో చాలా వాటికి ఇంధనం నింపేందుకు తగిన ఆర్థిక వనరులు కూడా లేకపోవడం పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో తెలుస్తుంది. భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన వారెంతవారైనా సరే కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవడం ప్రారంభమైతేనే కొంతవరకైనా ప్రమాదాలను నివారించిన వారవుతారు. ఈ విషయంలో ప్రభుత్వాలు మేల్కోడానికి మరెన్ని విషాద సంఘటనలు చోటు చేసుకోవాలి ?

Tags

Next Story