విబి జి రామ్ జితో భారత్ వికసించేనా?

విబి జి రామ్ జితో భారత్ వికసించేనా?
X

ప్రభుత్వాలు మారినప్పుడల్లా నాటి పాలకుల విధానాలను, సంక్షేమ పథకాలను, వాటి పేర్లను మార్చడం పాలకుల రాజకీయ ఎత్తుగడలో భాగం, సహజం కూడా. అయితే మార్పు అనేది పాలకుల సర్వతోముఖాభివృద్ధికి కాకుండా ప్రజలకు కనీస జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా ఉండాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత పాలకులు రూపొందించిన అభివృద్ధి విధానాలను, సంక్షేమ పథకాలను లోప భూయిష్టమైనవిగా పేర్కొంటూ వాటిని ఆపివేయడం సర్వసాధారణమైన ప్రక్రియగా మారింది. గత ప్రభుత్వాలు ప్రారంభించి, పూర్తి కాని అభివృద్ధి పథకాల (నీటిపారుదల ప్రాజెక్టులు, విద్య, వైద్య తదితర రంగాల పనుల)ను యథాతథంగా కొనసాగిస్తే ఆ పేరుప్రతిష్ఠలు గత ప్రభుత్వానికి దక్కుతాయేమోననే అక్కసుతోనే నిలుపుదల చేయడం మూలంగా లక్షలాది కోట్ల ప్రజాధనం వృథా అవుతుంది. 2005 లో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం గ్రామాల నుండి పట్టణాలకి వలసలని నివారించడం, పేదరికాన్ని తగ్గించడం, మహిళా సాధికారతను సాధించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి ప్రధాన లక్ష్యాలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (కరువు పని, 100 రోజుల పని) చట్టం 2005 (Mahatama Gandhi National Rural Employ ment Guaranty Act) ను ప్రముఖ ఆర్థికవేత్తలు, మేధావులు, పార్లమెంటు సభ్యులు, వివిధ కమిటీలతో అనేక మార్లు సమావేశాలు నిర్వహించి వారి సూచనలను, సలహాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎంజిఎన్‌ఎఆర్‌ఇజిఎ చట్టరూపం దాల్చి రెండు దశాబ్దాలుగా (కొన్ని లోపాలు ఉన్నప్పటికీ) నిర్దేశించుకున్న లక్ష్యాల వైపు అడుగులు ముందుకు వేస్తున్నది.

ఈ పథకం చట్ట రూపంలో ఉన్న కారణంగా ఉపాధి కూలీలకు అన్యాయం జరిగితే చట్టపరంగా న్యాయాన్ని పొందే అవకాశం, ఉపాధి (పని)ని హక్కుగా డిమాండ్ చేసే అవకాశం ఉండడం ఉపాధి కూలీలకు ప్రధాన బలాలైతే ప్రభుత్వం ఈ పథకాన్ని నిరాటంకంగా కొనసాగించడానికి చట్టం రూపంలో హామీ పడి ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం 2025 లో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ (విబి జి రామ్ జి) మిషన్‌ను వికసిత్ భారత్ 2047 లక్ష్యాలలో భాగంగా తీసుకొచ్చామని చెబుతూనే గత ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలున్న కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎంజిఎన్‌ఎఆర్‌ఇజిఎ 2005 చట్టం తూచా తప్పకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఉపాధి హామీని నిరాటంకంగా కొనసాగించాలి అని చెబుతోంది. కానీ విబి జి రామ్ జి 2025 మిషన్ అనేది ప్రభుత్వ ఇచ్ఛ ఉన్నంత వరకే కొనసాగుతుంది. వీటి మధ్యనున్న ఈ వ్యత్యాసాన్ని గమనించకపోతే రాబోయే రోజుల్లో ఉపాధి హామీ అనేది ‘హక్కు’గా ఉండకుండా పోయే ప్రమాదముంది.

నూతన పథకంలో ‘25 రోజుల పని దినాలను అదనంగా పెంచడం’ జియో టాగింగ్ ఆధారంగా వేతనాల చెల్లింపులు తప్ప విబి జి రామ్ జి 2025 లక్ష్యాల్లో చెప్పుకోదగ్గ మార్పులేవీ లేవు. నూతన ఉపాధి పథకానికి కేటాయించే బడ్జెట్‌లో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10% వాటాను భరించాల్సి ఉంటుంది. గత ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేటాయించిన బడ్జెట్‌లో కూలీలు, సిబ్బంది వేతనాలకు 100%, సామాగ్రి కొనుగోళ్లకు వాటా 90%, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వాటా 10శాతం వాటాలు మాత్రమే భరించాయి. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉన్నది. దానికి తోడు నూతన ఉపాధి పథకంలో రాష్ట్రాల నెత్తిన మోపిన భారం కారణంగా ఒకవేళ ఆయా రాష్ట్రాలు ఆసక్తి చూపకపోయినా, రాష్ట్రాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలు లేకపోయినా సదరు రాష్ట్రాలు వాటా ఇవ్వలేదనే నెపంతో ఆయా రాష్ట్రాలపై వ్యతిరేకతను కూడగట్టి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చే విధంగా కుట్రలు చేయడం వలన పథకం లక్ష్యాలు నెరవేరకుండా ఉపాధి హామీ పథకం నిర్వీర్యమయ్యే అవకాశం ఉంది.

నూతన పథకంలో రెండవ ప్రధానమైన అంశం వర్షాకాలంలో వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఏర్పడుతుందనే కారణంతో 60 రోజుల పాటు ఉపాధి పథకాన్ని నిలిపివేయడం. దీని కారణంగా వ్యవసాయ కూలీల డిమాండ్ తగ్గి తక్కువ వేతనానికే పనికి వెళ్లాల్సి వస్తుంది. వ్యవసాయ పనులకు పోలేనటువంటి వారి జీవనోపాధి దెబ్బ తింటుంది. ఎనభై శాతం యాంత్రీకరణ జరిగిన వ్యవసాయ రంగంలో రెండు నెలల పాటు ఉపాధి పనులు నిలిపివేయడం ఉపాధి నిరోధక చర్యే అవుతుంది. నూతన ఉపాధి పథకంలో కేంద్ర నిర్ణయమే శిరోధార్యంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే నూతన ఉపాధి పథకం ఏ రాష్ట్రంలో జరగాలి, ఎటువంటి పనులు చేయాలనేది కేంద్రం ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది.

అప్పుడు రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గడమే కాక వికేంద్రీకరణ ఆదర్శం దెబ్బతిని రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయించే ప్రమాదముంది. బాధ్యత, జవాబుదారీతనం పేరుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం వలన ఉపాధి హామీ అసలు లక్ష్యం నెరవేరకుండా క్రమంగా పథకం ఉనికిని కోల్పోయే ప్రమాదముంది. ఏ పథకమైనా విజయవంతం కావాలంటే పాలకుల్లో దృఢ సంకల్పం, నిరంతర పర్యవేక్షణ, అధికారుల్లో చిత్తశుద్ధి ఉండాలి. అప్పుడే ఉపాధి పథక లక్ష్యాలైన స్థానిక సంస్థలు బలపడడం, ఉత్పాదక ఆస్తుల సృష్టి, ఆర్థిక అసమానతల తగ్గుదల, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ కొంత మేరకైనా సఫలీకృతమై సామాజిక, ఆర్థిక అంతరాల గోడల్ని బద్దలు కొట్టగలం. పాలకులు కూడా దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, డ్రగ్స్, ఉగ్రవాదం, అవినీతిలను ప్రధాన శత్రువులుగా భావించినప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుంది.

- డా. రాజు 9490393038

Tags

Next Story