గెలుపు దిశగా బిసి స్పృహ

జనాభాలో సగం మేమే అనే స్పృహ వెనుకబడిన తరగతుల (బిసి) ప్రజలకు రావడానికే దశాబ్దాలు పట్టింది. దాని ఫలితం వల్లనే కాంగ్రెస్ పార్టీ బిసి డిక్లరేషన్ అనే ప్రత్యేక ఎన్నికల హామీని ప్రకటించింది. అలా గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేయించింది. రాష్ట్ర జనాభాలో ముస్లిమేతర బిసిలు 46.25%ఉన్నట్లు ఆ గణాంకాలు తేల్చాయి. ముస్లింలలో బిసి జనాభా 10.08% కలుపుకుని ఆ సంఖ్య 56.33కి చేరింది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల పాలనలో బిసిలకు 42% రిజర్వ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేసింది. అనుకున్నట్లుగానే అది చట్టాల మధ్యన ఇరుక్కుపోయింది. ఇలా ఎన్ని బిల్లులు ఆమోదించినా రిజర్వేషన్ల పెంపు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. అన్ని తెలిసిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో గొప్పగా మాట్లాడి ఆ తర్వాత చేతులు ముడుచుకొని కూర్చుంది. న్యాయస్థానంలో ఒక్క పిటిషన్‌తో ఈ బిల్లు అమలు కాకుండా అడ్డుకోవచ్చనేది బహిరంగ రహస్యమే. అనుకున్నట్లుగానే హైకోర్టు, ఆ తర్వాత సుప్రీం కోర్టు మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదనే నిబంధనపై తెలంగాణ ప్రభుత్వం బిల్లును తోసిపుచ్చింది. రాజ్యాంగంలోని 9 షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా 1993లో తమిళనాడు ప్రభుత్వం 69% రిజర్వేషన్లు సాధించిన బాటలో కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని బిసి సంఘాలు రాష్ట్రప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది.
సిఎం పలుమార్లు కేంద్రం వద్దకు వెళ్లినా ఈ ప్రసక్తిని ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావించలేదు. బిసి రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధానితో రాష్ట్ర బిజెపి నేతలు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. బిసిల్లోనుంచి ముస్లింలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర బిజెపి ఆ ప్రతిపాదనను అంగీకరించే వీలు లేదు. ఇలా అన్ని పార్టీలు తప్పుకొని బిసి రిజర్వేషన్ల పెంపు ప్రహసనం మధ్యలోనే వదిలేశాయి. చివరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల పెంపు లేకుండానే జరిగిపోయాయి. అయితే ఎన్నికల హామీల్లో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ బిసిలకు ఎన్నో ఆశలు కల్పించింది. ఆ ఆశల్లో ఏవీ నిజం కాకున్నా బిసిల్లో ఒక రకమైన కదలికకు మాత్రం ఆ డిక్లరేషన్ దోహదపడింది అనవచ్చు. కులగణన అయ్యాకే రిజర్వేషన్లు పెంచి, ఆ లెక్కన స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తమ నిజాయితీని నిరూపించుకుంటామని కాంగ్రెస్ సుమారు రెండేళ్ళపాటు చెబుతూ వచ్చింది. చివరకు ఆ హామీల అమలులో పార్టీ విఫలమైనా ఆ పలవరింత ద్వారా బిసిల్లో ఓ ఐక్యభావనను పెంచింది.
ఏ ప్రభుత్వం తమకు చేయని మేలు ఏదో చేసేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతోందనే ఆలోచన సాధారణ బిసి పౌరుడికి అనిపించింది. వ్యక్తులుగా ఉన్న బిసి జనాభా సమూహాలుగా మారేందుకు ప్రభుత్వహామీ పనికొచ్చింది. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశాన్ని బిసిలు శ్రద్ధ్దగా గమనిస్తూ వచ్చారు. వారిలో ఈ అంశంపై చర్చ మొదలైంది. ఎంతో విశ్వాసంతో చెబుతున్న ప్రభుత్వం చట్టపర చిక్కులు దాటి తమ హామీని నిలబెట్టుకుంటుందా అనే ఆసక్తి ఆ వర్గాల్లో మొదలైంది. సమాంతరంగా ప్రభుత్వ చర్యలను గమనిస్తూ తగిన ఒత్తిడిని పెంచడానికి బిసి సంఘాలు తమ కార్యాచరణను రూపొందించుకున్నాయి. బిసి నాయకులు పదేపదే సభలు, పాత్రికేయ సమావేశాలు నిర్వహించి బిసి వర్గాల్లో ఒక చైతన్య వాతావరణాన్ని సృష్టించారు.
బిసిలంతా ఐక్యంగా ఉండాలనే స్పృహ ఉద్యోగ, వృత్తి వర్గాలతోపాటు శ్రామిక, గ్రామీణ వర్గాల దాకా పాకింది. దాని ఫలితం గత నవంబర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కనబడింది. స్థానిక సంస్థల్లో బిసిలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ సెప్టెంబర్ 26న తెలంగాణ ప్రభుత్వం జిఒ విడుదల చేసింది. ఈ జిఒ ఆధారంగా ఎన్నికల షెడ్యూల్‌ను సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రిజర్వేషన్లపై కోర్టుల్లో సవాలు చేయడంతో ఎన్నిక ప్రకటన రద్దు చేయక తప్పలేదు. బిసి కోటా పెంచకుండానే పాత పద్ధతిలోనే ఆ ఎన్నికలు జరపడానికి తిరిగి నవంబర్ 25న కొత్త షెడ్యూల్ విడుదలైంది. దాని ప్రకారమే డిసెంబర్‌లో ఎన్నికలు జరిగాయి. జనాభా ప్రాతిపదికన జరిగిన స్థానిక సంస్థల కేటాయింపులో భాగంగా సరాసరి రాష్ట్ర స్థాయి 17% రిజర్వేషన్లు మాత్రమే బిసిలకు దక్కాయి. బిసి జనాభా బతుకుతెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లడం వల్ల ఆ గ్రామాల్లో వారి సంఖ్య తగ్గిందని బిసి నేతలు అంటున్నారు. రిజర్వేషన్లు పెంచనిదే ఎన్నికలు సాగనియ్యమని హెచ్చరించిన బిసి నేతలు ప్రభుత్వాన్ని నిలవరించలేకపోయారు. అయితే వారి నిరసన గొంతులు బిసి గుండెలకు తాకాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బిసి అభ్యర్థుల విజయం గతం కన్నా పెరిగింది.
చాలా జిల్లాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాలు బిసిల వశమయ్యాయన్న వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో వచ్చిన బిసి చైతన్యానికి ఇది సూచిక అని పత్రికల్లో వ్యాఖ్యానాలు వచ్చాయి. జనరల్ సీట్లకు పోటీ చేసిన బిసి అభ్యర్థులు పైకులాల పోటీని తట్టుకొని విజయం సాధించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 1226 గ్రామ పంచాయతీల్లో 626 బిసి అభ్యర్థులు గెలిచారు. రిజర్వేషన్ల ద్వారా వచ్చిన 297 స్థానాలకు అదనంగా 600 జనరల్ స్థానాల్లో 329 చోట్ల నెగ్గగలిగారు. ఇదొక కొత్త పరిణామం. రిజర్వేషన్లు ఇయ్యండయ్యా అని అగ్రకులాల నేతల చుట్టూ తిరిగే కన్నా తమ ఓటు తమకే వేసుకుంటే సరిపోతుంది కదా అనే స్పృహ వచ్చిన తరుణం. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు కూడా విడుదలైంది. 2996 డివిజన్, వార్డు మెంబర్లలో 854 బిసి (జనరల్, మహిళ) లకు కేటాయించబడ్డాయి. గ్రామ పంచాయితీల మాదిరే వీటిలో కూడా బిసిలు తమ సత్తా చాటి వెయ్యికి పైగా డివిజన్, వార్డు మెంబర్ల స్థానాలు గెలుపొందే అవకాశం ఉంది. పుర ఫలితాల్లోనూ పంచాయతీ ఫలితాలు వస్తే రాష్ట్రంలో రాజకీయంగా బిసిలు ప్రబలమైన శక్తిగా మారవచ్చు. ‘మేమెంతో మాకంత’ అనే నినాదాన్ని సాకారం చేసుకోవచ్చు.
- బి.నర్సన్
94401 28169
-
Home
-
Menu
