పాటతల్లి పెద్దకొడుకు గోరటి వెంకన్న

గోరటి వెంకన్న సుప్రసిద్ధ వాగ్గేయకారుడు. పరిచయం అక్కరలేని పేరు. ఆటపాటతో తెలుగువాళ్లందరినీ తన్మయీభూతంగా అలరిస్తున్న ప్రజాకవి. హంస అవార్డు గ్రహీత. కాళోజీ పురస్కార సన్మానితులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు గౌరవం ఇనుమడింపజేసిన లిటరరీ లెజెండ్. వెనుకటికి సంకీర్తనల్లో అన్నమయ్య తిరుమలేశుడి మహిమాన్విత గాథను రాగిరేకులపై రాసి సరిగమలుకట్టి పాడినట్టు, వెంకన్న మట్టిమనుషుల జీవితాలనూ పల్లెనూ ప్రకృతిని శృతిచేసి సాహిత్యపుటల్లో నమోదు చేస్తున్న ఒక inspirable balladeer. తెలుగుజాతి పది కాలాలపాటు inspirational narratives అని గర్వంగా చెప్పుకోదగిన పాటలు రాశారు, రాస్తున్నారు. ‘అల సెంద్రవంక’,‘వల్లంకి తాళం’,‘ఏకునాదం మోత’,‘రేల పూతలు’, ‘పూసిన పున్నమి’ ఈ పాటల సంపుటాల్లో దేన్ని చదువుకున్నా గోరటి వెంకన్న పాటకళ, పాటకథ కాంతులీనుతూ రసరంజకంగా మన కళ్లముందు సాక్షాత్కరించగలదు. ముఖ్యంగా గ్లోబలైజేషన్‌ను తీవ్రస్వరంతో నిరసిస్తూ వెంకన్న రాసిన ‘పల్లె కన్నీరు పెడుతుందో’ పాట మాస్ పాపులారిటిలోనేకాదు, 2004 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఘోరంగా ఓడిపోయేలా తెలుగు ఓటర్లు తెలివిడిని ప్రదర్శించడానికి కారణభూతమైన ఒక హిస్టారికల్ సాంగ్.
వాగు ఎండిపాయెరో, నల్లతుమ్మ, సంత, అద్దాల అంగడి, కంచెరేగి తీపివోలె, యలమంద, గల్లీసిన్నది గరీబోల్ల కత పెద్దది, ఇద్దరం విడిపోతె, జబ్బకు సంచి చేతుల జెండ, సేతానమేడుందిరా, వేకువ పూత, వానొచ్చెనమ్మా, అక్కో మీరింటర నా బాధ, అందుకోర గుతపందుకో, రాజ్యహింస పెరుగుతున్నాదో, ఇదేమి ధర్మం, పల్లె అందాలు,పాట పాడేటి పిల్లలు, రేలాదూలా తాలెల్లా, వల్లంకి తాళం, సంచారం, తరమెల్లిపోతున్నదో, పొద్దువాలుతున్నదో ఇత్యాది పాటలన్నీ ప్రతిశ్రోతకు కంఠోపాఠం. ఆద్య కళలో పురుడుపోసుకుని తాతముత్తాతలనుంచి వ్యాప్తమవుతూ తనదాకా వచ్చిన వాగ్గేయకార సాంప్రదాయాన్ని సామాజికం చేసిన పాటల కథకుడు, పాటతల్లి పెద్దకొడుకు వెంకన్న. దళిత బహుజన స్పృహ, తెలంగాణ అస్తిత్వ చైతన్యం, మార్క్ అంబేడ్కర్ తాత్విక ధార, గ్రామీణ వాదం కలగలసిన శోభాయమాన గేయకవిత్వం వెంకన్నది. ప్రజోద్యమాలకు మద్దతునిస్తూ ‘లోకల్ టు గ్లోబల్’ విభిన్న ఇతివృత్తాలను వైభవోపేతంగా గానం చేసిన, చేస్తున్న జానపద విద్వాంసుడు, మనకాలపు మహాకవి గోరటి వెంకన్న. శ్రావ్యత, సరళత వెంకన్న పాటకు రెండు కళ్లు. వేదికల్లో ఆవేశం పూని ఆయన మాత్రమే చేసే యక్షగాన ఫణితినృత్యం సభికులకు సదా ముచ్చటేసే సమరోత్సాహం. చెట్టు, పిట్ట, కొండ, కోన, వాగు, వంక, చేను, చెలక, చెరువు సమస్త ప్రకృతి మధురంగా మార్మికంగా వెంకన్న పాటల్లో మనతో మాట్లాడతాయి.
‘ఎంత సల్లనిదమ్మ కానుగ నీడ/ఎండ సెగనే ఆపె పందిరి చూడ/ తలపైన తడికోలె అల్లుకున్నాకులు/తడిలేని వడగండ్ల తలపించు పూతలు/నిలువు నాపరాయి తనువుల తనమాను/ ఇరిసిన విరగని పెళుసులేని మేను’ అంటూ వెంకన్న వర్ణించిన ‘కానుగ నీడ’ మనకో వైద్యోపనిషత్తు.‘నోట మోదుగు సుట్ట నొసట నామంబొట్టు/తలకు తుండు గుడ్డ మెడకు తులసి మాల/ఏకుతారొకచేత సిరుతలింకొక చేత/వేదాల చదువకున్న ఎరుక కలిగుండు/రాగి బెత్తంలేని రాజయోగిలా ఉండు/ఆది చెన్నుడి అంశ మా నాయిన/ అపర దనుర్దాసు మా నాయన’ అంటూ పితృభక్తిని చాటుకున్న వెంకన్న పాట యువతకో జీవన నైపుణ్య పాఠం. ‘అలలు కదిలినా పాటే, ఆకు మెదిలినా పాటే, కలలు చెదిరినా పాటే, కలత చెందినా పాటే, ఏ పాటనే పాడను? బ్రతుకే పాటైన పసివాడను’ అంటాడు ఓ పాటలో వేటూరు సుందర రామమూర్తి. ఈ పాదాలు నూటికినూరుపాళ్లు సత్యప్రమాణంగా గోరటి వెంకన్నకూ వర్తిస్తాయి. వెంకన్న పాటలు అలవోకగా మనం పాడుకోగలం. కానీ, అంత సులువుగా పాట తయారుకాదనేది దాని రుచిని ఆరగిస్తున్నవాళ్లంగా మనకో ఎరుక తప్పనిసరి ఉండాలి. నిజమే, పాట ముందు పసివాడిలా మారిపోయి రోజులకు రోజులు ధ్యానంలో అవధానంలో ఉండిమాత్రమే వెంకన్న పల్లవి చరణాలను ఒక కట్టడంలా నిర్మిస్తాడు. అందుకే పాటలన్నీ ఆయన నోట ఎప్పుడు ఎక్కడ ఏది ఎంత కావాల్సివస్తే అంత కంఠస్థంగా పెల్లుబికి సభలను మంత్రముగ్ధం చేస్తుంది. బ్రహ్మంగారిలా లోకులకు వివరం వివేకం ఎలుగెత్తి చెప్పినా, గద్దరన్నలా నూతన ప్రజాస్వామికవిప్లవం కోసం ధ్వజమెత్తినా వెంకన్నపాట ఎత్తూ పొడవూ వెడల్పుల్లో తనకు తానేసాటి.
వెంకన్న పాట విస్తృతికి ఊహాజనిత ఉత్ప్రేక్షరూపకోపమలు కారణం కాదు. తాను పుట్టిపెరిగిన పాలమూరు, దాపున్న దుందుభి, కాలుకొద్ది అలుపు సొలుపెరుగక తిరిగిన ప్రదేశాలు, ప్రాపంచికానుభవం నుండి ‘క్వాట్రైన్స్ (Quatrains)’ రూపుదిద్దుకుంటవి. ఇందుకు ‘ధరాంతమున ధ్వనించె నాదం/దిగంతాలకే తాకిన వాదం/ తెలంగాణ జయశంఖారావం/దాశరథి ఘనకవనపు యాగం/ఎందరో వీరుల ఆశల స్వప్నం’ అంటూ ఎత్తకున్న తెలంగాణ ‘వైభవ గీతిక’ ఒక ప్రబల సాక్ష్యం. కవులు రాజకీయాలు మాట్లాడరు, రాస్తారు. పార్టీరాజకీయాల కంటే ప్రజారాజకీయాలే కవులు నడపాలని కాళోజీ నిరూపించాడు. కాళోజీ సాహిత్య వారసుడిగా వెంకన్న తెలుగువాళ్లకు తెలంగాణకు చాలినంత రాజకీయ ప్రబోధ చేశాడు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో పురుడుపోసుకున్న ‘రాములోరి సీతమ్మా’ పాటలో ‘ఎదపైని దిగులుబండ జరిగి బాధ తొలిగెనో/ఎండిన సెలిమె నిండిన అనుభూతి కలిగెనో/శ్రావణి ముందే మేలుకొని శంఖమూదెనో/ ఆషాడ మబ్బుజడిసి అడుగు వెనుకకేసెనో/శెర వెట్టినట్టి అరవైయ్యేండ్ల బలిమి ఓడెనో/కల నిజమాయని నేల తనను తడుముకున్నదో ‘ అంటూ పరివర్తన ధ్యేయమై ప్రజలకోణం పరిఢవిల్లే కొత్తముఖచిత్రాన్ని తెలంగాణకు కాంక్షిచాడు. వెంకన్నకు ముందు ప్రజాక్షేత్రాన్ని వాగ్గేయకార సాంప్రదాయంలో నాజర్, సుద్దాల హనుమంతు, గద్దర్, వంగపండు ఉద్దీప్తం చేసి ఉన్నారు. అల సెంద్రవంక ముందుమాట’ పాటల ఇంద్రధనుస్సు’లో వెంకన్న ద్వారా ‘ఆసాంప్రదాయం మరొక్కసారి ఎలా రి అడ్జెస్ట్ అయ్యింది’ చెపుతారు కె.శివారెడ్డి. ఒకటిన్నర దశాబ్దం క్రిందటి శివారెడ్డి మాటకు చేర్పుగా గోరటి వెంకన్న తన పూర్వీకులను మించి ప్రజాసాహిత్యాన్ని ‘రి స్ట్రక్చర్ అండ్ రి టెక్ట్చర్’ అమర్చిన అక్షరస్తపతి అని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు.
విప్లవం అంటే ఇరవై ఒకటవ శతాబ్దం ఆరంభంలో పూర్తిగా చరిత్రను మార్చే ఏక సంఘటనగా కాకుండా, క్రమేపి పునరావృతమయ్యే బహు సంఘటనలుగా ఆధునికత నిర్వచించాల్సివుంది’ అంటాడు. అంటే చరిత్రలో ఒకేసారి జరిగే భారీ మార్పుల కంటే, నిరంతరంగా జరుగుతున్న ఆయా పరిణామాలు ఆధునికతను రూపొందిస్తాయని పుచ్నర్ వ్యాఖ్యకు అర్థం. ఈ అర్థగౌరవాన్ని నిలబెడుతూ పాటకు రూప విప్లవం, వస్తు విప్లవం ప్రసాదించి తొంబైల అనంతర తెలుగు ప్రజల చరిత్రను ప్రకార్యాత్మక దిశలకూమలుపులకూ మళ్లించిన సాహిత్య విప్లవకారుడు, బహుజన తాత్వికుడు గోరటి వెంకన్న. అమెరికన్ పాటల సంప్రదాయంలో కొత్త కవితా వ్యక్తీకరణను సృష్టించినందుకు బాబ్ డిలన్ కు స్వీడిష్ అకాడమీ నోబెల్ బహుమతినిచ్చింది. మరి, ఇంటా బయటా ఇరవై ఇరవై ఐదు కోట్లమంది ఆస్వాదించే తెలుగుపాటకు నూతన అభివ్యక్తితోపాటు సరికొత్త వస్తువునూ జోడించి, Epic హోదా కల్పించిన వెంకన్నకు ఎన్ని నోబెల్స్ బాకీపడ్డాయో.
డా.బెల్లి యాదయ్య
98483 92690
Tags
-
Home
-
Menu