తెలంగాణ ఎగుమతులకు యుద్ధం సెగ

తెలంగాణ ఎగుమతులకు యుద్ధం సెగ
X

పశ్చిమాసియా యుద్ధ బీభత్సం అంతర్జాతీయ సరఫరా గొలుసులను చిన్నాభిన్నం చేసి చమురు, గ్యాస్ ఇతర కీలక అవసరాలు ఎవరికీ అందకుండా ఎంత కల్లోలం సృష్టిస్తోందో తెలిసిందే. భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కావలసినవి కాకుండా ఆటంకాలు ఏర్పడి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి అమెరికా, యుఎఇ, సౌదీ అరేబియా, తదితర దేశాలకు ఎగుమతులు స్తంభించిపోతున్నాయి. దీంతో ఎగుమతిదారులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఇతర దేశాలతో ముడిపడి ఉన్న మార్కెట్ వ్యవస్థ తలకిందులవుతోంది. తెలంగాణ నుంచి ఇతర దేశాలకు సంబంధించి మొత్తం పది ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలలో అయిదు ప్రస్తుతం గందరగోళానికి గురవుతున్నాయి. అమెరికా, సౌదీ అరేబియా, కువైట్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఇప్పుడు తెలంగాణ నుంచి కీలకమైన పరికరాలు ఎగుమతికాక స్తంభించిపోతున్నాయి.

తెలంగాణ ఎగుమతి మార్కెట్లలో 50% ఈ విదేశీ మార్కెట్లపై నిమగ్నమై ఉంటున్నాయి. అత్యధికంగా ఎగుమతి జరిగే ప్రధాన దేశాల్లో అమెరికా 23.64 శాతం, యుఎఇ 11.74 శాతం, సౌదీ అరేబియా 6.74 శాతం వరకు ఎగుమతి వాణిజ్యంలో పాలుపంచుకుంటున్నాయి. ఇంకా చైనా 3.69 శాతం, ఫ్రాన్స్ 3.38 శాతం, బ్రిటన్ 2.72 శాతం, టర్కీ 2.32 శాతం, జెక్ రిపబ్లిక్ 1.95 శాతం, బంగ్లాదేశ్ 1.83 శాతం, కువైట్ 1.75 శాతం వరకు తెలంగాణతో వాణిజ్యం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ యుద్ధ సంక్షోభంతో వాణిజ్య ఒప్పందాల్లో అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఇంతవరకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, తెలంగాణ ఎగుమతుల పనితీరు పటిష్టంగానే సాగింది. 2023 24లో రూ. 1,16,182 కోట్ల విలువైన సరకుల ఎగుమతులు జరగ్గా, 202425లో రూ. 1,61,843 కోట్ల విలువైన ఎగుమతులు జరిగి 39.3 శాతం ఆధిక్యాన్ని చూపించాయి. ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్‌క్రాఫ్ట్ విడిభాగాలు, ఫార్మాక్యూటికల్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రిక్, ఇంజినీరింగ్ పరికరాలు తదితర ఎగుమతులు విరివిగా జరిగాయి.

దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు చెప్పుకోదగిన విధంగా ఎగుమతులు అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 500 రిజిస్టర్డ్ ఎగుమతిదారులు తెలంగాణలో ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుత సంక్షోభంతో గల్ఫ్‌దేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. వాణిజ్య ఒప్పందాలు ఇంకా ఖరారు కాకపోవడమే ప్రధాన కారణంగా అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడెక్ట్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) వెల్లడించడం గమనార్హం. నీతి ఆయోగ్ ఎక్స్‌పోర్టు సన్నాహక సూచిక 2024 ప్రకారం ఎగుమతుల్లో అన్ని రాష్ట్రాల కన్నా మొత్తం మీద తెలంగాణ ఎనిమిదో స్థానం వహించింది. లాజిస్టిక్స్ అండ్ సేఫ్టీ 2024 రిపోర్టు ప్రకారం తెలంగాణ ఎచీవర్స్ కేటగిరీలో ఉంది. అయితే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర అస్థిరతకు దారితీస్తోందని ఎగుమతిదారులు చెబుతున్నారు.

అయినా తలకు మించిన భారంతో యూరప్ మీదుగా గల్ఫ్‌దేశాలకు నౌకల ద్వారా రవాణా చేస్తుండడం తమకు కష్టం అవుతోందని కొందరు చెబుతున్నారు. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితి ఏర్పడితేనే కానీ తమకు వెసులుబాటు లభించదని అంటున్నారు. ఇతర ఎగుమతిదారులు విమాన రవాణా ఛార్జీలు భరించలేక పోవడంతో ఇప్పుడు తమకు ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగానే వస్తున్నాయని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు నిర్బంధం ఉండడంతో ఇతర విభాగాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ దేశాలకు ఎగ్ పౌడర్, ఫ్రోజెన్ ఎగ్ లిక్విడ్ ఎగుమతి చేయడానికి ఇదివరకటిలా నౌకలు లభించడం లేదని దాంతో రవాణా ఛార్జీల భారం పెరిగిపోతోందని కొందరు ఎగుమతిదారులు ఆందోళన వెలిబుచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా చాక్లెట్‌లు రవాణా చేసేవారు తమకు గతం కన్నా ఆర్డర్లు తగ్గాయని చెప్పారు.

ఇక పెట్రోలు నుంచి వెలువడే ఉప ఉత్పత్తులతో రసాయనాలు, ఎరువులు తయారు చేసే సంస్థలు తగిన ఉత్పత్తి చేయలేక మూతపడుతున్నాయి. ఫార్మాక్యూటికల్, సెమీకండక్టర్లు, డిటెర్జంట్, రంగులు, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తుల తయారీకి కూడా ఆటంకం ఏర్పడుతోంది. దేశంలోని ఎరువుల ఉత్పత్తి గత నెల రోజుల్లో నాలుగో వంతు పడిపోయింది. ఇంధనం కొరతతో సూరత్ లోని వస్త్రాల తయారీ యూనిట్లు వారానికి ఐదు రోజులే పనిచేస్తున్నాయి. గుజరాత్ లోని సిరామిక్ హబ్‌గా ఉన్న మోర్జీలో మూడింట ఐదు వంతుల మంది కార్మికులు తమ పనులు సాగక ఇళ్లకు తిరిగి వచ్చేస్తున్నారు. సిరామిక్ బట్టీలను మండించడానికి ఉపయోగించే ప్రొపేన్ కొరతగా ఉండడమే దీనికి కారణంగా దీనికి కారణం.

ఎల్‌పిజి గ్యాస్ లేక పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతుండడం ప్రతిచోటా చూస్తున్నదే. గ్యాస్ సిలిండర్లకు వాస్తవానికి కొరత లేదని, అనవసరంగా ఆందోళనతో బారులు తీరి నిరీక్షించనక్కర లేదని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నా కృత్రిమ కొరత తప్పడం లేదు. బ్లాక్‌మార్కెట్‌లో అసలు ధరకు మూడింతలు ఎక్కువ చేసి విక్రయించడం పరిపాటి అవుతోంది. యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. అప్పుడు రేషనింగ్ చివరి మార్గం కావచ్చు. కొవిడ్ మహమ్మారిలా నిజంగానే అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రపంచ దేశాలు ఒకరికి మరొకరు సహకరించుకోవడం, నిల్వలు అధికంగా ఉన్నవారు తోటి వారికి పంపిణీ చేయడం వంటి సమష్టి కార్యాచరణ పాటించక తప్పదు.

Tags

Next Story