ఏకాకిగా అమెరికా

‘అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో రెండోసారి ఆశ్చర్యకరమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి ఏడాది పరిపాలన చూస్తుంటే అంతర్జాతీయంగా అమెరికాను ఏకాకిగా మారుస్తున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రపంచ జిడిపిలో 25 వ్యాపార భాగస్వామ్యం గల ఇండియా ఇయు తాజాగా కుదుర్చుకున్నవాణిజ్య ఒప్పందం కీలక భాగస్వామ్య దేశాలే అమెరికాకు దూరంగా మారుతున్నట్లు వెల్లడి అవుతున్నది. 17 సంవత్సరాల సుదీర్ఘ మంతనాల తర్వాత కుదిరిన ఈ ఒప్పందంతో భారత్, ఇయులోని 27 దేశాల్లో దాదాపు 200 కోట్ల మందితో కూడిన స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్ ఏర్పడుతుంది. ఈ మార్కెట్ పరిధిలో ఎగుమతి, దిగుమతి జరిగే దాదాపు 93 శాతం వస్తు, సేవలపై దాదాపుగా సుంకాలు ఉండవు. కొన్నింటిపై నామమాత్రపు సుంకాలు ఉంటాయి. యావత్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన భారత్-ఇయు వాణిజ్య ఒప్పందం ఒక విధంగా అంతర్జాతీయ వ్యవహారాలలో అమెరికా ప్రాధాన్యతను విస్మరించటమే అవుతుంది.
ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత, సోవియట్ యూనియన్ కూలిపోవడంతో అమెరికా ఒక విధంగా అంతర్జాతీయంగా ఏకైక ఆధిపత్య శక్తిగా నిలిచింది. అటువంటిది ట్రంప్ నాయకత్వంలో దాదాపు శతాబ్ద కాలంగా అమెరికాకు నమ్మకమైన మిత్రదేశాలుగా ఉంటూ వస్తున్న ఐరోపా దేశాలు నేడు దూరం జరుగుతున్నాయి. గ్రీన్ లాండ్‌ను ఆక్రమించుకొంటానని ప్రకటించినప్పుడు ఐరోపా యూనియన్ ప్రతిఘటించడం, ఎదురు దాడులకు సిద్ధం అనే సంకేతమివ్వడం ఓ విధంగా అమెరికా ధోరణుల పట్ల అభిశంసన వ్యక్తం చేయటమే. అంతర్జాతీయ మర్యాదలను కాలదన్ని పొరుగుదేశమైన వెనెజువెలపై దాడి చేసి, దేశ అధ్యక్షుడిని భార్యతో సహా బందీగా తన దేశం తీసుకొచ్చి, న్యాయస్థానం ముందు నిలబెట్టిన తీరు ట్రంప్ ప్రదర్శిస్తున్న అహంకారానికి పరాకాష్టగా చెప్పవచ్చు. అయితే అటువంటి బెదిరింపులు ఇరాన్, గ్రీన్ లాండ్ వంటి దేశాల విషయంలో పనిచేయడం లేదు.
అదే విధంగా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లకు పైగా సాగుతున్నా శాంతి ప్రతిపాదనలలో విఫలం కావడం, గాజా సంక్షోభంలో నిర్ణయాత్మకంగా వ్యవహరింపలేకపోవడం అంతర్జాతీయ వ్యవహారాలలో కుంచించుకు పోతున్న అమెరికా పెత్తనాన్ని వెల్లడి చేస్తున్నాయి. గాజా పునర్నిర్మాణం కోసం అంటూ ఐక్యరాజ్య సమితిని పక్కకు నెట్టివేసి సొంతంగా తన సారథ్యంలో ట్రంప్ ఏర్పాటు చేసిన శాంతి మండలిలో పలు కీలక దేశాలు పాల్గొనక పోవడం ఈ సందర్భంగా గమనార్హం. ఘర్షణల నివారణకు శాంతి సమాలోచనలు ఇప్పుడు ఐరోపా, అమెరికాలలో కాకుండా ముస్లిం దేశాలలో జరుగుతున్నాయి. అమెరికా, రష్యా వంటి దేశాలు తమ ప్రతినిధులను అక్కడకు పంపుతున్నారు. అమెరికా ‘పెద్దన్న పాత్ర’ క్రమంగా నిర్వీర్యం అవుతున్నట్లు స్పష్టం అవుతుంది. పైగా, పలుదేశాలు డాలర్‌ను త్రోసివేసి ఇతర కరెన్సీలలో వాణిజ్యం చేసేందుకు మొగ్గుచూపుతూ ఉండటం కూడా అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేసినట్లు అవుతుంది.
రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై మరిన్ని సుంకాల బెదిరింపులతో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ట్రంప్, భారత్ కన్నా ఎక్కువగా చమురు, ఇంధనం కొనుగోలు చేస్తున్న చైనా, ఐరోపా దేశాలపై నోరు మెదపలేకపోతున్నారు. చైనా ఎదురు సుంకాలు విధిస్తే ట్రంప్‌కు కాళ్లబేరానికి రాక తప్పలేదు. తన అహంకారపూరిత చర్యల ద్వారా ట్రంప్ అమెరికాను కాకుండా చైనాను మళ్ళీ గొప్పగా మారుస్తున్నారని ఓ ప్రపంచ సర్వే సూచిస్తోంది. ఐరోపాలో అమెరికాకు గట్టి మద్దతుదారునిగా ఉంటూ వస్తున్న బ్రిటన్ సైతం ఇప్పుడు పలు అంశాలలో విభేదిస్తున్నది. అందుకనే చైనాతో బంధం పటిష్టం చేసుకునేందుకు బ్రిటిష్ ప్రధాని ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు.
యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ఇసిఎఫ్‌ఆర్) థింక్ ట్యాంక్ కోసం 21 దేశాలలో జరిపిన ఈ సర్వేలో ట్రంప్ పాలనలో, అమెరికా దాని సాంప్రదాయ విరోధులకు తక్కువ భయపడుతుందని, దాని మిత్రదేశాలు ముఖ్యంగా యూరప్‌లో మరింత దూరంగా ఉన్నట్లు అనిపిస్తుందని కూడా తేలింది. చాలా మంది యూరోపియన్లు ఇకపై అమెరికాను నమ్మకమైన మిత్రదేశంగా చూడటం లేదు. ఉక్రేనియన్లు మద్దతు కోసం వాషింగ్టన్ కంటే బ్రస్సెల్స్ వైపు చూస్తున్నారు. ఈ సర్వే చేసిన దాదాపు ప్రతి ప్రాంతంలోని మెజారిటీ ప్రజలు రాబోయే దశాబ్దంలో చైనా ప్రపంచ ప్రభావం పెరుగుతుందని అంచనా వేశారని కనుగొన్నారు. చాలా మంది ఇయు పౌరులు చైనా త్వరలో ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వనరులలో ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తుందని అంచనా వేశారు. ఉక్రెయిన్, దక్షిణ కొరియాలలో మాత్రమే మెజారిటీ ప్రజాలు చైనాను ప్రత్యర్థిగా లేదా విరోధిగా చూస్తున్నారని, దక్షిణాఫ్రికా, భారతదేశం, బ్రెజిల్‌లలో ఎక్కువ మంది చైనాను రెండేళ్ల క్రితం కంటే మిత్రదేశంగా చూస్తున్నారని పోల్ కనుగొంది. చైనాతో సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, పాకిస్థాన్‌కు కీలక సైనిక సహాయం అందించే దేశంగా ఉన్నప్పటికీ అమెరికా ఏకపక్ష ధోరణుల కారణంగా ఆ దేశంతో తన సంబంధాలను మెరుగుపరచుకోక తప్పడం లేదు.
గాల్వాన్ ఘర్షణల సమయంలో చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినప్పటికీ, ఆ తర్వాతి సంవత్సరాలలో విశేషంగా పెంచుకుంటూ వస్తుంది. గతంలో చైనాకు వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసిన సైనిక కూటమి క్వాడ్‌లో భాగస్వామిగా చేరిన భారత్ ఇప్పుడు ఈ దిశలో ముందడుగు వేసేందుకు ఆసక్తి కనబరచే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో అమెరికా ప్రభావవంతంగా ఉంటుందని చాలామంది నమ్ముతున్నప్పటికీ, బ్రెజిల్, భారతదేశం, దక్షిణాఫ్రికా, టర్కీ వెలుపల అమెరికాలో కూడా అమెరికన్ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయానికి మెజారిటీ లేదు. చైనా పట్ల అనుకూల దృక్పథాలు పెరుగుతున్న నేపథ్యంలో సర్వే చేసిన దాదాపు అన్ని దేశాలలో మిత్రదేశంగా అమెరికా హోదా పడిపోయింది. యురోపియన్ యూనియన్ పౌరులలో ఇప్పుడు కేవలం 16% మంది మాత్రమే అమెరికాను మిత్రదేశంగా భావిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా 20% మంది దానిని ప్రత్యర్థిగా లేదా శత్రువుగా చూస్తున్నారు. ఈ సిరీస్‌లో నాల్గవదైన ఈ సర్వేను ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘యూరప్ ఇన్ ఎ చేంజింగ్ వరల్డ్’ ప్రాజెక్ట్‌తో కలిసి నిర్వహించారు. ప్రపంచంలో అధికార సమతుల్యత మారుతున్నందున, ఐరోపాపట్ల ప్రజల అవగాహన కూడా మారుతోందని ఇది సూచిస్తుంది. ముఖ్యంగా రష్యాలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, రష్యాలోని ప్రతివాదులు గత సంవత్సరం (41%) కంటే ఇప్పుడు యూరప్‌ను ప్రత్యర్థిగా చూసే అవకాశం ఎక్కువగా ఉంది (51%). 12 నెలల క్రితం (48%) కంటే అమెరికాను అలా భావించే అవకాశం తక్కువగా ఉంది. (37%) వాస్తవానికి, ఈ సర్వేలో అనేక దేశాలలో మాదిరిగా కాకుండా, చైనాలో మెజారిటీ ప్రజలు (59%) యురోపియన్ యూనియన్‌ను ఒక గొప్పశక్తిగా భావిస్తున్నారని తేలింది. 46% మంది ఈ కూటమిని ఎక్కువగా ఒక భాగస్వామిగా చూస్తున్నారు. ట్రంప్ యురోపియన్ యూనియన్‌కు వ్యతిరేక వాక్చాతుర్యం ఉన్నప్పటికీ 40% మంది అమెరికన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ‘యూరప్‌లోని రాజకీయ నాయకులు ఇకపై తమ సొంత పౌరులు ప్రస్తుత భౌగోళిక రాజకీయ మార్పుల రాడికల్ స్వభావాన్ని గ్రహించారా? అని తమను తాము ప్రశ్నించుకోకూడదు. వారు గ్రహిస్తారు’ అని భావిస్తున్నారు. యూరోపియన్లు పాత క్రమం ముగిసిందని చూస్తారనివారు చెప్పారు. యూరోపియన్ నాయకులు ఇప్పుడు ‘వాస్తవికంగా, అదే సమయంలో ధైర్యంగా’ ఉండాలి, ‘బహుళ ధ్రువ ప్రపంచంలో నిర్వహించడానికి మాత్రమే కాకుండా, ఆ ప్రపంచంలో ఒక ధ్రువంగా మారడానికి లేదా ఇతరులలో అదృశ్యం కావడానికి’ కొత్త మార్గాలను కనుగొనాలని స్పష్టం చేశారు.
- చలసాని నరేంద్ర
98495 69050
-
Home
-
Menu
