పర్యాటకానికి పెద్దపీట

పర్యాటకానికి పెద్దపీట
X
ప్రపంచ దేశాల్లో 5వ అతి పెద్ద పర్యాటక మార్కెట్ కలిగిన దేశంగా భారత్ నిలుస్తూ 2027 నాటికి 3వ అతి పెద్ద పరిశ్రమగా పర్యాటకాన్ని

ప్రపంచ దేశాల్లో 5వ అతి పెద్ద పర్యాటక మార్కెట్ కలిగిన దేశంగా భారత్ నిలుస్తూ 2027 నాటికి 3వ అతి పెద్ద పరిశ్రమగా పర్యాటకాన్ని నిలపడానికి జోరుగా పథక రచనలు, అమలు జరుగుతుండడం హర్షదాయకం. భారత పర్యాటక రంగంలో సాంస్కృతిక, సాహస, పర్యావరణ లేదా ఎకో, వైద్య, వంట, క్రీడ, గ్రామీణ, ఆధ్యాత్మిక, వ్యాపార పర్యాటక విభాగాలు దేశ వైవిధ్యత, వారసత్వ సంపద, సమాజ అందాలను పర్యాటకులకు కనులవిందు చేస్తున్నాయి. దేశఆర్థికాభివృద్ధి, పర్యాటక కేంద్రాల అభివృద్ధి, స్థానిక ఆర్థిక పరిపుష్టి, ఉద్యోగ కల్పన, జిడిపిలో వృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి, సాంస్కృతుల సంరక్షణ, విదేశీ మారకద్రవ్యం, సాంస్కృతిక వినిమయం, మౌలిక వనరుల కల్పన లాంటి ప్రయోజనాలతో పర్యాటకం దేశ అభ్యున్నతికి తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నది. 2024 ట్రావెల్ టూరిజం అభివృద్ధి సూచిక ప్రకారం 119 దేశాల జాబితాలో భారత్‌కు 39వ స్థానం కల్పించబడింది.

ఇదే జాబితాలో 2021లో భారత దేశ స్థానం 54గా నమోదు అయింది. పర్యాటక పరిశ్రమ ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆ రంగాన్ని సమగ్రాభివృద్ధి చేయడం, దేశ ఆర్థికానికి ఊపిరిలూదడం, సంస్కృతి వారసత్వ సంపదలను కాపాడడం, దేశవిదేశీ పర్యాటకులను ప్రోత్సహించడం లాంటి అంశాలను అవగాహన కల్పించడానికి యుఎన్ వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్ చొరవతో, ఆ సంస్థ ఏర్పడిన రోజును గుర్తించి ప్రతి ఏట 27 సెప్టెంబర్ రోజుల ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. స్వతంత్ర భారతంలో ఇంక్రెడిబుల్ ఇండియా లేదా అపురూప భారతం అనే నినాదంతో పర్యాటక రంగానికి పెద్ద పీట వేయాలని భావించి ప్రతి ఏటా 25 జనవరి రోజున జాతీయ పర్యాటక దినం పాటించడం జరుగుతోంది. ప్రపంచ పర్యాటక దినం- 2025 ఇతివృత్తంగా పర్యాటకం -హరిత పెట్టుబడులు (టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్స్) అనే అంశాన్ని తీసుకొని ప్రచారం చేస్తున్నారు. పర్యాటక పరిశ్రమ విస్తరణతో ఆయా ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు లాభపడడంతో సమ్మిళిత అభివృద్ధి సుసాధ్యం అవుతున్నది. 2019 లో భారత్ పర్యాటక ద్రవ్య వినియోగం 127 బిలియన్ డాలర్లు ఉండగా, 2023లో 174 బిలియన్ డాలర్లకు పెరిగింది. పర్యాటక పరిశ్రమతో దేశ ఆర్థికాభివృద్ధి ఎంతగానో జరుగుతున్నది. భారత పర్యాటకంలో 65% వరకు తమిళనాడు, యుపి, మహారాష్ట్ర, కర్నాటక, ఎపి రాష్ట్రాలు మాత్రమే నమోదు చేసుకుంటున్నాయి. వైవిధ్యభరిత భారతంలో తాజ్‌మహల్, అజంతా ఎల్లోరా గుహలు, మహాబలిపురం, హంపి, హవా మహల్, ఆగ్రా ఫోర్ట్, చార్మినార్ లాంటి ప్రధాన ప్రదేశాలతో పాటు పుష్కర ఫేర్లు, తాజ్ మహోత్సవ్, సూరజ్ కుండ్ మేళా, కుంభమేళా లాంటివి కూడా విశేషంగా దేశవిదేశ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు నిర్వహించిన మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని అంచనా. వీటికి తోడుగా అందమైన బీచ్‌లు, హిల్ స్టేషన్స్, అద్భుత వారసత్వ కట్టడాలు, సుందర సహజ ప్రకృతి కమనీయాలు, మనసును మెప్పించే బ్యాక్‌వాటర్ అలలు, ఆధ్యాత్మిక కేంద్రా లు దేశ పర్యాటక పరిశ్రమకు పట్టుకొమ్మలుగా నిలుస్తున్నాయి. భారత ప్రభుత్వం, పర్యాటక మంత్రిత్వ శాఖ నేతృత్వంలో పలు పర్యాటక ప్రోత్సాహక పథకాలను ప్రకటిస్తూ, ఆచరణలో పెట్టడంతో ఈ రంగం దినదినాభివృద్ధిని నమోదు చేసుకుంటున్నది. మౌలిక వసతుల కల్పన, సేవల విస్తరణ, దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించడం లాంటి లక్ష్యాలను సుసాధ్యం చేయడానికి ఇంక్రెడిబుల్ ఇండియా 2.0, స్వదేశీ దర్శన్ పథకం, దేఖో అప్నా దేశ్, ప్రసాద్ స్కీమ్, నిచే టూరిజం, ఈ-విసా సౌకర్యం, నిధి+ డిజిటల్ పథకం లాంటివి ఆచరణలో పెట్టబడినవి. ఆర్థికాభివృద్ధితోపాటు ఉద్యోగ కల్పన, స్థానిక ప్రదేశాల అభివృద్ధి, మౌలిక వసతుల పెంపు లాంటివి పర్యాటక పరిశ్రమతో సుసాధ్యం కావడం వల్ల ఆ రంగాన్ని మరింత విస్తరించడానికి ప్రభుత్వాలతోపాటు సాధారణ పౌర సమాజం కూడా తమ వంతు కర్తవ్యాలను నిర్వహించి మేరా భారత్ మహాన్ అంటూ నినదిద్దాం, భారత్ దేశ సౌందర్యాన్ని ఇనుమడింపజేద్దాం.


డా: బుర్ర మధుసూదన్ రెడ్డి, 99497 00037

Tags

Next Story