ఐరోపాతో ఒప్పందం భారత్‌కు మేలే

అంతర్జాతీయ ‘ఒప్పందాలన్నిటికీ తల్లి’ వంటిదని అభివర్ణిసున్న భారత్ యూరోపియన్ చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి రావడానికి ఒక ఏడాది కాలం పడుతుందని భారతీయ వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. పర్యావరణ నిబంధనలు, కర్బన్ ఉద్గారాల నియంత్రణ, (ఐరన్, అల్యూమినియం, స్టీల్, సిమెంట్ ఎగుమతుల విషయంలో) ఇవన్నీ క్రమబద్ధీకరించవలసిన అవసరం ఉందని చెబుతున్నారు. కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సిబిఎఎం) పేరట ఐరోపా యూనియన్ ఈ నెల 1 నుంచి పర్యావరణ పన్నును అమలులోకి తెచ్చింది. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, ఎరువుల వంటివి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేయడానికి కర్బన్ ఉద్గారాల సమస్యను భారత్ ఎంతవరకు పరిష్కరించగలదన్న అనుమానం ఐరోపా యూనియన్‌కు పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో పర్యావరణ పన్ను నుంచి భారత్‌కు మినహాయింపు లభిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశం అవుతోంది. జనవరి 1 నుంచి జనరలైజ్‌డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జిఎన్‌పి) కింద సుంకాల భారం భారత్ ఎగుమతులపై 87 శాతం వరకు తగ్గుతాయి.
ఈ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చే వరకు భారతీయ ఉత్పత్తులకు తక్కువ పోటీ ఉంటుంది. అంటే ఒక ఏడాది కాలం పట్టవచ్చు. ఈ ఒప్పందాన్ని చట్టపరంగా పరిశీలిస్తే యురప్ యూనియన్ కమిషన్ ఈ మేరకు తన ప్రతిపాదనను యూరోపియన్ కౌన్సిల్ పరిశీలనకు ముందుకు తెస్తుంది. కౌన్సిల్ కనుక ఒకసారి ఆమోదిస్తే ఐరోపా యూనియన్, భారత్ ఒప్పందంపై లిఖితపూర్వకంగా సంతకాలు చేస్తాయి. దీని తరువాత ఈ ఒప్పందం ఐరోపా పార్లమెంట్ ఆమోదం పొందవలసి వస్తుంది. అప్పుడు కౌన్సిల్ నిర్ణయం అమలులోకి రావడానికి మార్గం ఏర్పడుతుంది. జనవరి 1 నుంచి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సిబిఎఎం) ప్రకారం భారత్ నుంచి ఎగుమతి అయ్యే అల్యూమినియం, స్టీల్, సిమెంట్ హెడ్రోజన్, ఎలక్ట్రిసిటీ, ఎరువులపై సుంకాల విధింపు ఉంటుంది. అలాగే ఐరోపా ఉత్పత్తులు ఐరన్, స్టీల్‌తో సహా అన్నిటిపైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద సుంకాల భారం నుంచి విముక్తి లభిస్తుంది. అయితే సిబిఎఎం కింద భారతీయ ఎగుమతులపై కార్బన్ ఛార్జెస్ (పర్యావరణ పన్ను) ఎక్కువగా ఉండవచ్చు.
స్టీల్ ఎగుమతిదారులు (భారత్) తమ ధరలను 15 నుంచి 22 శాతం తగ్గించుకోవలసివస్తుంది. ఐరోపా కార్లపై 110 శాతం వరకు భారత్ విధించే సుంకం 10 శాతం వరకు పరిమితమై తగ్గించుకోవలసి వస్తుంది. అయితే ఏడాదికి 2,50,000 యూనిట్ల వరకు కోటా పరిమితి ఉంటుంది. ఐదు నుంచి పదేళ్ల తరువాత కారు విడి భాగాలపై సుంకాలు పూర్తిగా రద్దవుతాయి. దీనివల్ల బిఎండబ్లు, మెర్సిడెస్ బెంజ్, వోక్స్ వ్యాగన్ వంటి ఐరోపా లగ్జరీ కార్లు ధర చాలా తగ్గిపోనుంది. ఐరోపా నుంచి దిగుమతి అయ్యే వైన్స్‌పై 150 శాతం నుంచి 40 శాతం వరకు, ఆల్కహాలుపై 150 నుంచి 50 శాతం వరకు సుంకాలు తగ్గనున్నాయి. ఆలివ్ ఆయిల్, కీవ్, పియర్స్, పళ్ల రసాలు, గొర్రె మాంసం పై 45 శాతం నుంచి 33 శాతం వరకు ఉన్న సుంకాలు భారం ఇక పూర్తిగా తొలగించబడుతుంది. ఇక సేవా రంగానికి సంబంధించి ఐరోపా కంపెనీలు భారత సేవా రంగంలోకి అందుబాటులోకి వస్తాయి. 144 ఇయు ఉపరంగాలు భారత ఎగుమతిదార్లకు అందుబాటులోకి వస్తాయి. ఐటి/ ఐటిఇఎన్ వంటి వృత్తి నైపుణ్య సాంకేతిక సేవలు అందుబాటులోకి రావడం విశేషం.ఈ ఒప్పందం ప్రభావం కేవలం స్వేచ్ఛా వాణిజ్యానికే పరిమితం కాకుండా ఐరోపా యూనియన్ దేశాలతో భారత్ మైత్రీ బంధం మరింత పటిష్టం కావడానికి దోహదం చేస్తుంది. భద్రత, రక్షణ ఒప్పందాలు కూడా ఈ వాణిజ్యం ఒప్పందంతో ముడిపడి ఉన్నాయి.
దావోస్ ఆర్థిక సదస్సు వేదికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐరోపా దేశాలతోపాటు భారత్ దేశాన్ని కూడా రష్యా చమురు కొనుగోలు చేసినందుకు టారిఫ్‌లు అత్యధికంగా విధిస్తానని హెచ్చరించిన నేపథ్యంతో ఈ ఒప్పందం జరగడం ఒక విధంగా ట్రంప్‌కు గట్టి సమాధానం ఇచ్చినట్టు సంకేతాలు వెలుపడ్డాయి. ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను ఎలాగైనా స్వాధీనం చేసుకుంటానని ట్రంప్ నిర్ణయాన్ని ఐరోపా యూనియను దేశాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. ఇక ఇన్నాళ్లూ రష్యా నుంచి చమురు కొనుగోలు అన్నది ప్రపంచ సమస్యగా ఉండేది. అమెరికా, ఐరోపా, భారత్ దేశాలు రష్యా నుంచి భారీ ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 ఫిబ్రవరి నుంచి ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాతనే ఈ పరిస్థితి ఏర్పడింది. రష్యాతో భారత్ రక్షణ సంబంధాలు మరికొంత కాలం కొనసాగుతాయి. ఇప్పటికిప్పుడు హడావిడిగా మారిపోవు.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2004 లోనే అంకురార్పణ జరిగినా చైనాకే ఐరోపా యూనియన్ ప్రాధాన్యత ఇచ్చింది. భారత్‌ను పట్టించుకోలేదు. అమెరికాతో భారత్‌కు పౌర అణు ఒప్పందం కుదరడంతో ఐరోపా యూనియన్ అప్రమత్తమైంది. ఐరోపా యూనియన్‌తో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, మారిషస్, యుఎఇలతో పాటు ఐస్‌లాండ్, లిబెన్‌స్టీన్, నార్వే, స్విట్జర్లాండ్‌లతో కూడిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంతో ఐరోపా యూనియన్ తన వైఖరి మార్చుకుంది. భారత్‌తో పంతాలు పట్టింపులు విడిచిపెట్టి చేతులు కలపడం అన్ని విధాలా భారత్‌ను బలోపేతం చేయడానికే వీలయింది. 27 ఐరోపా దేశాలతో వివిధ రంగాల్లో భారత్‌కు ప్రగాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండగా, ఐరోపా యూనియన్ కూటమి రోండో ఆర్థిక వ్యవస్థగా ఉంటోంది. అందువల్ల అమెరికా, చైనా నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పుటికీ ఇవి గట్టిగా నిలబడగలుగుతాయన్న నమ్మకం కలుగుతోంది.
-
Home
-
Menu
