ఇండిగో సంక్షోభం.. ఇదిగో పరిష్కారం

ఇండిగో సంక్షోభం కారణంగా ఇప్పుడు దేశం మొత్తం పబ్లిక్ రంగం ప్రాధాన్యతపై చర్చ మొదలైంది. వేలాదిమంది సోషల్ మీడియాలో పబ్లిక్ రంగం పాత్ర ఈ దేశ విమానయాన రంగంలో షోషించిన నిర్మాణాత్మక పాత్రపై అనేక చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ రంగం పాత్రను చరిత్రలోనే మనం తొంగిచూస్తే అనేక విజయాలు మనకు కనిపిస్తాయి. భారత దేశంలో పబ్లిక్ రంగం అనేది సాధారణ ఆర్థిక వ్యవస్థలో ఒక రంగం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యపు సామాజిక, ఆర్థిక బలాన్ని నిలబెట్టే స్తంభం. స్వాతంత్య్రం తర్వాత ఈ దేశం సమగ్ర అభివృద్ధి సాధించాలంటే ప్రజల అవసరాలను కేంద్రంగా పెట్టుకున్న ఆర్థిక నిర్మాణం అవసరమైంది. అదే బాధ్యతను పబ్లిక్ రంగం నెరవేర్చింది. బ్యాంకింగ్ నుంచి రైల్వేలు, విమానయానం, కోల్ ఇండియా నుంచి స్టీల్ అథారిటీ వరకు, కోట్లాది ప్రజల ప్రయాణాలు, పొదుపులు, ఉపాధి, జీవన ప్రమాణాలు పబ్లిక్ రంగాలపై ఆధారపడి ఉన్న వాస్తవం. లాభాలను కంటే ప్రజల అవసరాలను ముందుకు పెట్టడం, దూరప్రాంతాలకు సేవలు చేర్చడం, సామాజిక సమానత్వాన్ని చూపించడం ఇవన్నీ పబ్లిక్ రంగం నుంచే సాధ్యమయ్యాయి.
కానీ నేడు ఈ రంగం దాడులు పెరుగుతున్నాయి. ప్రైవేటీకరణను అభివృద్ధి అని అమ్మే ప్రభుత్వాలు పబ్లిక్‌రంగ సంస్థలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తున్నాయి. లాభాల్లో ఉన్న సంస్థలకూ ‘స్ట్రాటజిక్ డిస్‌ఇన్వెస్ట్‌మెంట్’ పేరుతో వేలం వేయడం సాధారణమైంది. ప్రజల సొమ్ముతో నిర్మించిన సంస్థలను కొంతమంది కార్పొరేట్ వర్గాలకు అప్పగించడం ద్వారా ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థను క్రిమినలైజ్ చేస్తున్నాయి. బ్యాంకులను విలీనాలు, మూసివేతల దిశగా నెట్టడం, బొగ్గు బ్లాకులను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం, రైల్వే, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలను విడదీసి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడం ఇవన్నీ ప్రజలపై భారాలు మోపే నిర్ణయాలే. ప్రైవేటు రంగం లాభాలను మాత్రమే చూసే క్రమంలో సామాజిక బాధ్యతలు, ధర నియంత్రణ, గ్రామీణ సేవలు అన్నీ అరుదైపోయే ప్రమాదం ఉంది. భారతదేశం లాంటి అసమానతలున్న దేశంలో పబ్లిక్‌రంగం కేవలం వ్యాపారం కాదు. అది సామాజిక సమీకరణ యంత్రాంగం.లాభాలు లేకున్నా సేవలను విరమించకుండా కొనసాగించగల రంగం ఇదొక్కటే.
ప్రైవేటీకరణ పేరుతో పబ్లిక్ రంగాన్ని ముసుగులో హరించడం నేరం. ఒక తరానికి చెందిన సొమ్ము, శ్రమ, కలలతో నిర్మించిన ఈ ఆస్తులు దేశ భవిష్యత్తుకు కేవలం పెట్టుబడులు కాదు, రక్షణ. ప్రస్తుత అసమానతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ రంగం బలోపేతం అత్యవసరం. ఉపాధి తగ్గిపోతున్న సమయంలో పబ్లిక్ రంగ విస్తరణ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదు. చిన్న, పెద్ద, మధ్యతరగతి ప్రజలందరూ ఆధారపడే భద్రతా వల ఈ రంగమే. కాబట్టి పబ్లిక్ రంగాన్ని రక్షించడం అనేది కేవలం గతాన్ని కాపాడడం కాదు, భవిష్యత్తును కాపాడడం. కానీ పాలకులు ప్రజలకంటే, దేశం అవసరాల కంటే పెట్టుబడి దారుల అవసరాలే మిన్నగా ఉంటున్నాయి. అందుకు ఉదాహరణే ఈ ఇండిగో సంక్షోభం అన్నది వాస్తవం. ఇండిగోలో ఇటీవలే బయటపడిన యాజమాన్య, వాటాదారుల మధ్య అధికార పోరు దేశ విమానయాన రంగం ఎంత అస్థిరంగా మారిందో ప్రత్యక్షంగా చూపిస్తున్న సంఘటన. మార్కెట్‌లో 60 శాతానికి పైగా వాటా ఉన్న సంస్థ ఒక్కరోజు అంతర్గత ఒడిదుడుకులకు లోనైతే దేశవ్యాప్తంగా వేలాది ఫ్లైట్లు రద్దయ్యే ప్రమాదం, ప్రయాణికులు ఇరుక్కుపోయే పరిస్థితి, షేర్ మార్కెట్‌లో కోట్లు ఆవిరయ్యే అనిశ్చితి, ఇవి అన్నీ ఒక్కసారిగా వెల్లువెత్తాయి. ఇది కేవలం ఒక కంపెనీ గొడవ కాదు; ఇది విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించిన ప్రభుత్వ విధానాల ఘోర వైఫల్యం.
ఆ వైఫల్యాన్ని ప్రశ్నించే ఆలోచనే పాలకవర్గానికిలేదు. ఎయిర్ ఇండియాను భారాలు అవుతున్న పబ్లిక్ రంగం అని తక్కువ చేసి, నష్టాలను ఉద్దేశపూర్వకంగా పెంచిన తరువాత అతి తక్కువ ధరకు ప్రైవేటు చేతుల్లో వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇండిగో సంక్షోభం గురించి పెదవి విప్పడానికి కూడా ముందుకు రావడం లేదు. ఒక పబ్లిక్‌రంగ విమానయాన సంస్థ పనిచేసేది కేవలం లాభాల కోసం కాదు; అది జాతీయ అవసరాలను తీర్చే బాధ్యతను కూడా మోసేది. దూరప్రాంతాలకూ, లాభం రానివాటికీ సేవలందించేది. అత్యవసర సమయాల్లో విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను కొలువరించేది. విపత్తుల సమయంలో రక్షణ చర్యల్లో పాల్గొనేది. ఇవన్నీ ప్రైవేట్ రంగం చేయగలదా? వారి బోర్డు సమావేశాల్లో వాటాదారుల ఒత్తిడి ఒక మూలను ఇరుకోబెడితే, ఆ రాత్రే ధరలు ఎగసిపడతాయి;సేవలు నిలిచిపోతాయి.
ఇండిగో సంక్షోభం తర్వాత మార్కెట్ ఎలా స్పందించిందో చూస్తే భారత గగనయాన రంగం అనిశ్చితి ఎంత తీవ్రమో అర్థమవుతుంది.షేర్ ధర పతనంతో పెట్టుబడిదారులు ఆందోళన చెందినా, సాధారణ ప్రజల సమస్య మాత్రం మరింత సూటిగా మెదులుతుంది. ప్రయాణ ఖర్చులు పెరగటం, టికెట్లు అకస్మాత్తుగా దొరక్కపోవటం, సేవా నాణ్యత పడిపోవడం, మార్గాల ఎంపిక పూర్తిగా సంస్థల ఖజాన, లాభాల లెక్కల ఆధారంగా నిర్ణయించబడటం. విమానయాన రంగంలాంటి కీలక రంగాన్ని పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం ఒక దేశ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి ముప్పే. విమాన రూట్ల కేటాయింపు, అత్యవసర ఎయిర్‌లిఫ్ట్‌లు, అభివృద్ధి చెందని ప్రాంతాలకు కనెక్టివిటీ వంటి సేవలను ప్రైవేట్ కంపెనీలు తమ బ్యాలెన్స్ షీట్‌లను చూసుకుని మాత్రమే నిర్వహిస్తాయి.
అలా లాభం రాకపోతే, ఆ సేవలు నిలిచిపోతాయి. పబ్లిక్ రంగం ఉన్నప్పుడు మాత్రం లాభ-నష్టాలతో సంబంధం లేకుండా ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా నిలిచేవి. ఇది పబ్లిక్ రంగం ప్రాధాన్యతను సాక్ష్యాలతో రుజువు చేసే ముఖ్యమైన ఉదాహరణ. ఇండిగోలో జరిగిన మేనేజ్‌మెంట్ విభేదాలు, వాటాదారుల మధ్య అధికార యుద్ధాలు, అంతర్గత చెత్త పాలన దేశ విమానయాన రంగంలో ఒకే సంస్థ ఆధీనత ఎలా ప్రమాదకారకమో చూపుతున్నాయి. ప్రైవేట్ సంస్థల అప్రతిహత అధికారం, ప్రభుత్వ మౌన సమ్మతి రెండూ కలిపి ప్రజలకే భారమయ్యాయి. ఒక సంస్థ గందరగోళం కారణంగా దేశవ్యాప్తంగా వందల ఫ్లైట్లు ఆలస్యం కావటం అంటే, కొద్దిమంది పెట్టుబడిదారుల మీద దేశం మొత్తం ఆధారపడి ఉన్నదని అర్థం. ఇది అస్వాభావికమైన ఆర్థిక నిర్మాణం. ఇండిగో సంక్షోభం ఒక సంఘటన కాదు, అది ఒక సందేశం. దేశ విమానయాన రంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఆధీనానికి అప్పగించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది స్పష్టంగా చెబుతోంది. పబ్లిక్ రంగం మరింత బలపడాల్సిన అవసరం ఉంది. విమానయానాన్ని ప్రజా సేవగా తిరిగి నిర్వచించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే ప్రజల ప్రయాణం సురక్షితం, అందుబాటు, సమానత్వం కలిగినదిగా ఉంటుంది. లేకపోతే ఇండిగో నేటి సంక్షోభం రేపటి మరింత పెద్ద దుర్ఘటనలకు పునాది మాత్రమే అవుతుంది.
- టి.నాగరాజు
9490098292
-
Home
-
Menu
