సినిమా టికెట్లపై రాజకీయ నాటకం

సినిమా టికెట్లపై రాజకీయ నాటకం
X
కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు రూ. 200 కు మించరాదని ఇటీవలనే నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్‌నుంచి మల్టీప్లెక్స్‌లతోసహా అన్ని థియేటర్లలో టికెట్ ధరలు

కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లు రూ. 200 కు మించరాదని ఇటీవలనే నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్‌నుంచి మల్టీప్లెక్స్‌లతోసహా అన్ని థియేటర్లలో టికెట్ ధరలు గరిష్టంగా రూ. 200 వరకు మాత్రమే ఉండాలని నిర్ణయించింది. సామాన్య ప్రేక్షకులకు కూడా సినిమాను చూసే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. థియేటర్ల యజమానులు, నిర్మాతలకు ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. సింగిల్ స్క్రీన్ల కంటే మల్టీప్లెక్స్‌ల నిర్వహణ ఖర్చులు అత్యధికంగా ఉంటాయని, దానివల్ల తమకు అన్యాయమే తప్ప న్యాయం జరగబోదని అభ్యంతరాలు లేవదీశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీలు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించడంతో టికెట్ ధరల పరిమితిపై హైకోర్టు స్టే విధించింది. ఈ విధంగా పరిమితి విధించడం సమంజసమా? అన్న సందేహం వ్యక్తం చేసింది. ఎక్కడ ఏ థియేటర్‌లో ఆ సినిమా ప్రదర్శిస్తున్నారో అక్కడి సౌకర్యాలు, సాంకేతికత, థియేటర్ విధానం, కస్టమర్ల ఎంపిక తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

తుది తీర్పు వచ్చేవరకు రూ. 200 టికెట్ ధరల పరిమితిని అమలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతానికి థియేటర్లు యధావిధిగా టికెట్ ధరలు వసూలు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. దీంతో పివిఆర్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ యజమానులకు, నిర్మాతలకు కాస్త ఊరట లభించింది. సినీ రంగ నిపుణులు ఈ టికెట్ ధర పరిమితి ఒక రాజకీయ చర్యగా వ్యాఖ్యానిస్తున్నారు. తక్కువ టికెట్ ధర వసూలు చేసే థియేటర్ల ద్వారా సినిమాను వీక్షించే అవకాశం కల్పించినప్పుడు, ప్రీమియమ్ స్క్రీన్ల థియేటర్లు తాము కల్పించే సౌకర్యాలు, ప్రస్తుత మార్కెట్ డిమాండ్, సీజన్, సరఫరా తదితర కారణాల ఆధారంగా టికెట్ ధర అధికంగా నిర్ణయించుకునే డైనమిక్ ప్రైసింగ్ విధానం ఉండాలని సూచిస్తున్నారు.

అలా కాకుంటే మల్టీప్లెక్స్ థియేటర్లు తమ ప్రణాళికల్లో పారదర్శకతను కోల్పోతాయని ప్రీమియమ్ స్క్రీన్లు వెనుకబడతాయని చెబుతున్నారు. చివరకు ప్రేక్షకులకు అవకాశం కోల్పోయే పరిస్థితి వస్తుందని అంటున్నారు. అయితే కర్ణాటక ప్రభుత్వం థియేటర్లు తమ ఇష్టానుసారం అడ్డగోలుగా టికెట్ల ధరలను పెంచి ప్రేక్షకులను దోపిడీ చేసే విధానాలకు అడ్డుకట్ట వేయాలనే టికెట్ ధరలపై పరిమితి విధించిందన్నది నిస్సందేహం. అయితే ఊహించని ఈ నియంత్రణ చర్యలు ఒక కంపెనీని, భారీగా పెట్టుబడి పెట్టిన నిర్మాతలను, ప్రొమోటర్లను, బ్యాంకు రుణాలను తీవ్ర ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇందులో మైనారిటీ వాటాదారులు కూడా నష్టాల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి ప్రాచుర్య విధానాలను తప్పించాలి. కంపెనీలు కూడా తమంతట తాము కార్యకలాపాలను నిర్వహించుకునేలా జోక్యం చేసుకోకూడదు. అంటే ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే.

ప్రభుత్వ నిర్ణయంలో 75 సీట్లు అంతకంటే తక్కువ ఉన్న ప్రీమియం స్క్రీన్ కలిగిన థియేటర్లకు టికెట్ ధరపై పరిమితి వర్తించదు. అంటే చిన్న ప్రీమియం మల్టీస్క్రీన్ థియేటర్లు తమ స్వంత విధానం బట్టి టికెట్ ధరను నిర్ణయించుకోవచ్చు. దీనివల్ల ఆ థియేటర్ల వారికి కొంత ఊరట కలిగించినట్టే. చక్కని అనుభవాన్ని పొందడానికి టికెట్ ధర ఎక్కువైనా చెల్లించడానికి ప్రేక్షకులు సిద్ధపడినప్పుడు ఒక పాయింట్ వద్ద ధరపై పరిమితి విధించడానికి గల హేతుబద్ధతను ఎగ్జిబిటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఎయిర్‌లైన్ టికెట్లు కానీ లేదా హోటల్ రూమ్ ఛార్జీలు కానీ చెల్లించుకునే బాధ్యత వినియోగదారుల ప్రత్యేక హక్కుగా ఉండాలని చెబుతున్నారు. ఆ మేరకు వారు చెల్లించడానికి ఇష్టపడితే రాష్ట్రప్రభుత్వం తప్పనిసరిగా అంగీకరించాలని వాదిస్తున్నారు. ప్రభుత్వాలు పౌరుల ప్రయోజనాలను రక్షిస్తున్న కొన్ని సంఘటనలు ఉన్నాయన్నది వాస్తవం. ధనిక దేశమైన ఇజ్రాయెల్ కూడా పాప్‌కార్న్ లా తీసుకొచ్చింది.

ఈ చట్టం ఏం నిర్దేశిస్తుందంటే మూవీ థియేటర్లు, స్పోర్ట్ వేదికలు, ఇతర థియేటర్లు, తాము విక్రయించే ఆహార, పానీయాలు కాకుండా వినియోగదారులు తాము స్వంతంగా వేరే ఏవైనా కొని తెచ్చుకుంటే అడ్డుచెప్పడానికి వీలు లేదు. దీనివల్ల థియేటర్ల యజమానులు చాలా తక్కువ ధరకు తినుబండారాలను, పానీయాలను విక్రయించే అవకాశం కలుగుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం నమ్మకం. అయితే ఈ విషయంలో మనదేశంలో సుప్రీం కోర్టు వైఖరి మాత్రం పూర్తిగా భిన్నం. వినియోగదారులు స్వంతంగా తమ ఆహార పానీయాలను థియేటర్లలోకి తెచ్చుకునేలా అనుమతించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాదించినా సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే వినియోగదారులు వినోదం పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓవర్ ది టాప్ (ఒటిటి) వంటి దర్శన అవకాశాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నారు.

ఒర్మాక్స్ మీడియా ప్రకారం దాదాపు 601 మిలియన్ మంది ఒటిటిని వినియోగిస్తున్నారు. ఈ సబ్‌స్క్రిప్షన్ చెల్లింపులు 150 మిలియన్ వరకు ఉన్నాయి. ఇది ఇంకా పెరగవచ్చు. అలాగే టివి (సిటివి) కనెక్షన్ల వినియోగదారులు కూడా 87 శాతం పెరిగారు. స్మార్ట్ టివి వినియోగదారులు 129.2 మిలియన్ వరకు ఉన్నారు. సినీ నిర్మాతలు చాలా మంది తమ చిత్రాలు వేగంగా ప్రజల్లోకి వెళ్లడానికి ఒటిటి ద్వారానే ముందుగా రిలీజ్ చేస్తుండటం పరిపాటి అయింది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను నియంత్రించే పెద్దన్న బాధ్యత ప్రభుత్వం తీసుకోవలసిన అవసరం లేదని పిస్తోంది.

Tags

Next Story