మున్సిపోల్స్ ముంగిట..ఫోన్ ట్యాపింగ్ ముచ్చట!

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉండగా ప్రభుత్వంలోని పెద్దలు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఎప్పుడో ఒకసారి తప్పదు అనుకుంటున్న ఘట్టం ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. ముందుగా మాజీమంత్రులు హరీశ్‌రావు, ఆ తర్వాత కె.టి. రామారావు.. ఈ ఇద్దరినీ సిట్ పిలిచి ప్రశ్నించిన అనంతరం మాజీ పార్లమెంట్ సభ్యుడు సంతోష్ రావును కూడా పిలిచినప్పుడు తర్వాత లైన్లో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉన్నారన్న విషయం అందరికీ అర్థం అయిపోయింది.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో కెసిఆర్‌కు సిట్ ఇప్పటికే రెండు నోటీసులు ఇచ్చింది. మొదటి నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల హడావిడిలో ఉన్నందున రాలేనన్నారు. అలాగే తాను నివసిస్తున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వచ్చి విచారించుకొమ్మని చెప్పారు. దానికి సిట్ రెండోసారి మరో నోటీసిస్తూ అధికారికంగా ఆయన చిరునామా హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో ఉన్నందున అక్కడే విచారణ జరుపుతామని, అక్కడికి రావాల్సిందేనని తెలిపారు. సిట్ కోరినట్టుగా నందినగర్ లోని తన నివాసంలో విచారణకు హాజరుకావాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు. అయితే తనను ఈ కేసులో విచారించే విషయంలో నోటీసులు చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆక్షేపిస్తూ ఆయన పోలీసులకు ఆరు పేజీల లేఖ రాసారు.
ఇదంతా జరుగుతున్న సమయంలో కెసిఆర్ మనుమడు హిమాన్షు తన తాతగారు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పొలం పనులు పర్యవేక్షిస్తున్న ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది బాగా వైరల్ అయింది. వ్యవసాయ పనుల్లో తలమునకలై ఉన్నారు కాబట్టి లేదా మునిసిపల్ ఎన్నికల పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు కాబట్టి సిట్ విచారణకు హాజరు కానని కెసిఆర్ చెప్పడానికి వీలులేదు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది అంతిమంగా దర్యాప్తులో తేలాల్సిన విషయం. గతంలో ఒకసారి ఎప్పుడో కెసిఆర్ స్వయంగా ఒక టివి చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు.. అది రొటీన్‌గా ఇంటెలిజెన్స్ విభాగంవారు చేసుకునే పని అనీ, దానికి ముఖ్యమంత్రి దగ్గరికి అనుమతి కోసం రావాల్సిన అవసరం ఉండదని.
ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌ను సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు జరిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగున ఉన్న కర్నాటకలో ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ ఫోన్‌నే ట్యాప్ చేస్తున్నదని బిజెపి ఆరోపిస్తున్నది. కర్నాటక శాసనసభలోనే ఆ రాష్ట్ర మంత్రి హెచ్‌కె పాటిల్ గవర్నర్‌కు న్యూఢిల్లీ నుండి ఫోన్ ద్వారా ఆదేశాలు అందుతున్నాయని వ్యాఖ్యానించారు. మరో మంత్రి ప్రియాంక్ ఖర్గే ఇంకొంచెం ముందుకు పోయి లోక్‌భవన్‌కు ఢిల్లీ నుండి మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయంనుండి కూడా ఫోన్లు వస్తున్నాయంటూ వివాదానికి తెరలేపారు. ఆ రాష్ట్ర బిజెపి ఎంఎల్‌ఎలు ప్రభుత్వ వివరణ కోరుతూ ఆందోళన చేపట్టారు. ఇటువంటి సంఘటనల గురించి వింటుంటే అధికారంలో ఉన్నవారు తమ ప్రత్యర్థుల కదలికల మీద నిఘా వేసి ఉంచే ప్రక్రియల్లో ఫోన్ ట్యాపింగ్ భాగం అయిపోయిందా అన్న సందేహం కలగక మానదు. కర్నాటకలో వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వం మారితే కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య మీద ఫోన్ ట్యాపింగ్ చేసారని దర్యాప్తు జరుగుతుందేమో.
సరే, ఆ విషయం అలా ఉంచితే, ఒక ఆరోపణ వచ్చింది, దానికి సంబంధించి ప్రభుత్వం దర్యాప్తు జరుపుతున్నది కాబట్టి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా, పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా తప్పనిసరిగా కెసిఆర్ ఎప్పుడో ఒకసారి హాజరుకాక తప్పదు. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యతగల భారత పౌరుడిగా దర్యాప్తునకు సహకరిస్తానని కెసిఆర్ స్వయంగా లేఖలో పేర్కొన్నాక కెసిఆర్ మీద ఆరోపణలు చెయ్యడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినట్టని, రాష్ట్రసాధన కోసం 14 ఏళ్ళు ఉద్యమం చేసారు కాబట్టి ఆయనను దర్యాప్తుకు పిలవకూడదని, అదేదో మహా నేరమని భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆగ్రహించడంలో అర్థం లేదు. బిఆర్‌ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసారని ఆ పార్టీలో నిన్నటివరకూ ముఖ్య నాయకురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత స్వయంగా చెప్పారు.
నిజానిజాలు నిగ్గు తేలాలంటే దర్యాప్తు జరగాల్సిందే. కెసిఆర్ సహా మిగిలిన నేతలు కూడా దర్యాప్తును ఎదుర్కోవాల్సిందే. ఇక్కడ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావును జ్ఞాపకం చేసుకోవాలి. కెసిఆర్‌కు పివి నరసింహారావు అంటే అమిత గౌరవం. హైదరాబాద్ నగరంలో నెక్లెస్ రోడ్ కూడలిలో పివి మార్గ్ ఏర్పాటు చేసి, ఆయన విగ్రహాన్ని కూడా నెలకొల్పిన కెసిఆర్ పివిని ఆదర్శంగా తీసుకోవాలి. పివి నరసింహారావు అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఐదేళ్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి దేశాన్ని అప్పులనుంచి బయటపడవేసి, సంస్కరణల బాటలో నడిపించిన మహానాయకుడు. ఆయనకే తప్పలేదు కేసులు ఎదుర్కోవడం. అందరికీ గుర్తుంటే పివి నరసింహారావు జార్ఖండ్ ముక్తి మోర్చా వారికి లంచాలు ఇచ్చిన ఆరోపణల మీద కేసులు ఎదుర్కొన్నారు. ప్రధాని పదవి నుండి దిగిపోయాక ఆయన కోర్టు మెట్లెక్కక తప్పలేదు.
దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు కాబట్టి, దేశాన్ని గడ్డు పరిస్థితుల్లో గట్టెక్కించారు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టడానికి వీల్లేదని ఆనాడు పివి అభిమానులో, కాంగ్రెస్ కార్యకర్తలో అనలేదు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి వారు చేస్తున్న వాదన కూడా సరైనది కాదు. ఒక్క కెసిఆరే కాదు, ఏ రాజకీయ నాయకుడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆరోపణలు వచ్చినప్పుడు నిలబడి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడం అవసరం. సరే, ప్రస్తుత దేశ రాజకీయాలలో అధికారంనుంచి వైదొలగినవాళ్ల మీద కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు కేసులు పెట్టడం, కోర్టులకు ఎక్కడం నిత్యకృత్యమైపోయింది. రాజకీయాల్లో ప్రత్యర్థులనే మాటకు అర్థం ఇప్పుడు ‘శత్రువులు’గా మారిపోయింది.
సరే, మళ్లీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దగ్గరికి వస్తే బిఆర్‌ఎస్ అధికారంలో ఉండగా ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఉన్న ప్రభాకరరావును అమెరికానుండి పిలిపించి మరీ విచారణ జరిపారు. ఇప్పుడు కెసిఆర్ ఈ కేసులో ఏదో ఒక రోజు సిట్ ముందుకు వెళ్ళక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణల మీద రాష్ట్ర ప్రభుత్వం పి.సి. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు కెసిఆర్ ఆ కమిషన్ ముందు హాజరైన విషయం తెలిసిందే. ఆయన దగ్గరికే వెళ్లి ప్రశ్నించడానికి సిద్ధపడ్డ సిట్‌కు అది నందినగర్ అయితే ఏమి, ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ అయితే ఏమి?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగాయంటున్న అక్రమాలు, అవినీతి ఆరోపణల మీద ఇప్పటికి ఫోన్ ట్యాపింగ్‌తో సహా నాలుగు కేసులు పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, ఫార్ములా ఈ కార్ రేసుల మీద, విద్యుత్ కొనుగోళ్ళు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల మీద పెట్టిన కేసుల్లో ఇప్పటికయితే ఒక్కటి కూడా పరిష్కారం పూర్తిగా జరిగి ఫలితాలయితే రాలేదు. వీటి పరిష్కారం విషయంలో రాష్ట్రప్రభుత్వానికి కూడా పెద్ద తొందర ఉన్నట్టు కనిపించదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కమిషన్ ఇచ్చిన నివేదికను కెసిఆర్ సవాలు చెయ్యడంతో హైకోర్టులో విచారణ జరుగుతున్నది. మరోవైపు ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ముందుంచి సిబిఐకి అప్పగించాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులో ఉన్నది. విద్యుత్ కొనుగోళ్ళ వ్యవహారంలో జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ నివేదిక 2024 అక్టోబరులోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కెటిఆర్ విచారణకు గవర్నర్ అనుమతి పొందినా, ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో డిఒపిటి అనుమతి కోసం రాష్ట్రప్రభుత్వం ఎదురు చూస్తున్నందున ఆ కేసు పెండింగ్‌లో ఉంది.
రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగాక రాజకీయ పార్టీల బలాబలాలు బహిరంగమయ్యే మున్సిపల్ ఎన్నికల ముంగిట్లో ఉండగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ నేడు సిట్ ముందు హాజరుకావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలకు, ఏడు కార్పొరేషన్లకు ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్నాయి. పార్టీ గుర్తుల మీద జరిగే ఈ ఎన్నికలలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నెలకొన్న ఈ పరిణామంవల్ల కెసిఆర్‌కు సానుభూతి పెరిగి బిఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందా? ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉండబోతున్న కాంగ్రెస్‌కు అనుకూలంగా ఫలితాలు ఉండబోతున్నాయా? పార్టీ నుండి బయటికి వచ్చి సొంతంగా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు మీద పోటీ చెయ్యబోతున్న కవిత వల్ల బిఆర్‌ఎస్‌కు నష్టమా, లాభమా అనేది ఈ మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతుంది. బిజెపి, జనసేన కలిసి చేసే పోటీ ఎవరికీ నష్టం చేస్తుంది? కాంగ్రెస్‌తో కలిసి వెళ్ళే సిపిఐ, కోదండరాం పార్టీ ఇంకా సందిగ్ధంలో ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ లబ్ధి పొందుతుందా? కాంగ్రెస్‌ను ఓడించాలన్న ఆలోచనతో తమకు బలం లేని చోట్ల బిజెపికి పరోక్షంగా సాయపడాలని బిఆర్‌ఎస్ ఆలోచిస్తున్నట్టు వస్తున్న వార్తలు నిజమయితే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
మరో మూడేళ్ళ తరువాత జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇవి రిహార్సల్‌గా భావించాలేమో!

-
Home
-
Menu
