లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే!

లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే!
X
‘కొద్ది రోజులలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించబోతున్న లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని, కమిషన్ సిఫారసు చేస్తున్నది.

‘కొద్ది రోజులలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఆవిర్భవించబోతున్న లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని, కమిషన్ సిఫారసు చేస్తున్నది. దానివల్ల హక్కులు ప్రజాస్వామ్యయుతంగా అమలు అవుతాయి. ఈ ప్రాంతంలోని విశిష్టమైన ప్రజల సంస్కృతి పరిరక్షణ, భూమి హక్కులతో కూడిన వ్యవసాయ హక్కుల రక్షణ సత్వర గతిన కేంద్రం నుంచి నిధుల సమీకరణ వేగవంతం అవుతాయి. అందువల్ల ప్రభుత్వం లద్దాఖ్ ప్రాంతాన్ని ఆరవ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతున్నాం’ అని జాతీయ ఆదివాసీ కమిషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను, ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరింది. సెప్టెంబర్ 11, 2019, జాతీయ ఆదివాసీ కమిషన్ సమావేశమై ఈ మేరకు తీర్మానించింది. అక్టోబర్ 31, 2019న కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేసి, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పటు చేసింది. ఇందులో ఒకటి జమ్మూ కశ్మీర్, రెండోది లద్దాఖ్. అయితే ఈ కమిషన్ పేర్కొన్నట్టుగా జమ్మూ కశ్మీర్ పునర్వవస్థీకరణ చట్టంలో చేర్చి ఉంటే బుధవారం లద్దాఖ్‌లోని లే లో జరిగిన మరణాలు, హింసాకాండ నివారించగలిగే వాళ్ళం. ఎస్‌టి కమిషన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్యాంగ హోదాతో నడుస్తున్న సంస్థ. ఆ సంస్థ చాలా జాగ్రత్తగా అన్ని విషయాలను పరిశీలించి సిఫారసు చేసింది. జాతీయ ఎస్‌టి కమిషన్ లద్దాఖ్ రాష్ట్రంలోని సామాజిక స్థితిగతులను క్షణంగా పరిశీలించింది. ఆదివాసుల జనాభా మొత్తం 97 శాతంగా గుర్తించింది. అంటే దాదాపు రాష్ట్రం మొత్తం ఆదివాసీలేననేది సత్యం. అటువంటప్పుడు ఎందుకు ప్రభుత్వ ఆరవ షెడ్యూల్‌లో చేర్చలేదో మనకు తెలియదు.

ఈ నేపథ్యంలో లద్దాఖ్ ప్రజలు కోరుతున్న ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం పూర్తిగా న్యాయమైనది, రాజ్యాంగబద్ధమైనది. దీనిలోపాటు రాష్ట్ర హోదా కల్పించి, స్వతంత్ర శాసనసభను కూడా ఏర్పాటు చేయాలనేది మరో డిమాండ్. జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేయాలనే గత ఎన్నో ఏళ్ళుగా ప్రజలు చేస్తున్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. దీనికి లద్దాఖ్ ప్రజలు హర్షించారు. అయితే అది కేవలం నీటిబుడగలాగనే మాయమైంది. జమ్మూ కశ్మీర్ మీది కోపంతో చేశారనేది ప్రజలు వెంటనే అర్థం చేసుకున్నారు. ఎందుకుంటే ఆరేళ్ళు కావస్తున్నా ఏమాత్రం అభివృద్ధిని నోచుకోలేదు. అంతే కాకుండా, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, దేశంలోని ఎవరైనా ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునేటట్టు, భూములు కొనేటట్టు అవకాశాలకు తలుపులు తెరిచారు. దీనితో లద్దాఖ్ ప్రాంతంలో భూముల క్రయ, విక్రయలు పెరిగాయి. ఇది కూడా లద్దాఖ్ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నది. ఎందుకంటే, కనీసం భూమిఉన్నా ఏదో పంట వేసుకొని జీవనం గడిపే అవకాశం ఉంటుంది. ఆ భూమి కూడా పోతే లద్దాఖ్ ప్రజల జీవితం తెగిన గాలిపటమే అవుతుంది. దీనితోపాటు మరొక పరిణామం చోటుచేసుకుంది. చైనా సరిహద్దులో పశువులు, ఇతర గొర్రెలు, మేకలు పెంపకానికి గడ్డి మొలిచే భూములున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో వీళ్ళు పశువులను మేపేవారు. కేంద్ర పాలిత ప్రాంతం ఏర్పడ్డ తర్వాత ఆ ప్రాంతాన్ని భారత సైన్యం ఆక్రమించుకున్నది. అందులోకి పశువుల, గొర్రెల కాపరులను అనుమతించదు లేదు. దీనితో వాళ్ళు జీవనోపాధిని కల్పించే పశుసంపదను అమ్ముకోవాల్సి వస్తున్నది.

అదే విధంగా విద్యావంతులైన యువకుల్లో నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరుగుతున్నది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులైనవారు నమోదు చేసుకునే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌లో రిజిష్టర్ చేసుకున్న వాళ్ళ 3 వేల మంది ఉన్నారు. ప్రభుత్వంలో దాదాపు 5 వేల ఉద్యోగాలు ఖాళీలున్నవి. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోవడం లేదు. అందులో భాగంగానే వాళ్ళు రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్ కూడా ఉన్నది. అంతే కాకుండా రాష్ట్రంలో 21.9 శాతం నిరుద్యోగ రేటు ఉన్నది. 15 సంవత్సరాలు పైబడినవారు ఇప్పుటికి ముప్పైవేలమంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇందులో డిగ్రీ చదువుకున్న వాళ్లుతోపాటు, ఇతర తక్కువ విద్యార్హతలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లద్దాఖ్‌లో ఉన్న నిరుద్యోగ రేటు చాలా ఎక్కువ. దేశ నిరుద్యోగ రేటుతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.

అదే విధంగా లద్దాఖ్‌కు ప్రత్యేకంగా అసెంబ్లీ లేనందున ఆ రాష్ట్రం కోసం ఖర్చు చేసే బడ్జెట్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. 2024 25 సంవత్సరానికి రూ. 5958 కోట్లు కేటాయించగా, ఇందులో 60 శాతమే ఖర్చయింది. అందులో రూ. 2035 కోట్లు ప్రభుత్వ నిర్వహణకు అంటే లద్దాఖ్ ప్రజల విద్య, వైద్యం, ఇతర అవసరాల కోసం ఖర్చు చేసింది. నామమాత్రమే అనే విషయం మనకు అర్థం కాగలదు. అయితే ఈ పరిస్థితిల నేపథ్యంలో సోనమ్ వాంగ్ చుక్ అనే సామాజిక కార్యకర్త లద్దాఖ్ ప్రజల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకు రావడానికి గత రెండేళ్ళుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిర్లక్షం కారణంగా సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు నిరాహార దీక్షకు కూర్చున్న ఇద్దరి పరిస్థితి విషమించడంతో వాళ్ళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇది యువతరాన్ని ఉద్రేక పరిచింది. రోజురోజు పెరుగుతున్న నిరుద్యోగం, జీవన అభద్రతా భావం యువకులను వీధుల్లోకి తీసుకొచ్చింది. ఇది హింసకు దారితీసింది. ఇందులో మళ్ళీ నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా, 70 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు, సైనం జరిపిన కాల్పులు యువతరాన్ని మరింత రెచ్చిపోయే విధంగా చేశాయి. ఇది ఈ రోజు లద్దాఖ్‌లో ఉన్న స్థితి.

నాలుగు సంవత్సరాల క్రితం నేను, కొంతమంది మిత్రులం కలిసి లద్దాఖ్ వెళ్ళాం. అక్కడ ప్రజలను కలిశాం. కొన్ని గ్రామాలను కూడా చూశాం. అక్కడ శాంతిభద్రతల సమస్య లేదు. ప్రజలందరూ స్నేహంగా, శాంతియుతంగా సహకార జీవనం సాగస్తుంటారు. లద్దాఖ్‌లో రెండు ప్రాంతాలున్నాయి. ఇందులో ఒకటి కార్గిల్, రెండోది లే ప్రాంతం. కార్గిల్‌లో మెజారిటీ ముస్లింలు షియా తెగకు చెందిన వారు ఉంటారు. లే లో ప్రధానంగా బౌద్ధులు ఉంటారు. ప్రస్తుతం ఉద్యమంలో పాల్గొన్నది మెజారిటీగా లే ప్రాంతం యువకులే. బౌద్ధులు సహజంగానే కొంత శాంతియుతమైన స్వభావం కలిగి ఉన్నారు. కానీ పరిస్థితులు సాధువులనైన సాయుధులను చేస్తాయేమో అని అనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితులను సమీక్షించి అక్కడ ప్రజలు డిమాండ్ చేస్తున్నట్టుగా లద్దాఖ్‌ను రాజ్యాంగబద్ధంగా ఆరవ షెడ్యూల్‌లో చేరుస్తూ, రాష్ట్ర హోదా కల్పించడం, రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, యువతరానికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం సరైన చర్య అవుతుంది. అంతేకాని హింసాకాండ మీద, ఇతర పరిణామాల మీద మాత్రమే చర్చించి, అందుకు తగ్గట్టుగా శాంతిభద్రతల సమస్యగా చూస్తే ఇది మరింత దుష్పరిణామాలకు దారి తీసే అవకాశముంటుంది.


మల్లేపల్లి లక్ష్మయ్య

Tags

Next Story