నింగిలో మృత్యుఘోష ఆగేదెప్పుడు?

ఆది అంతమూ లేని ఆకాశాన్ని.. అసలైన స్వేచ్ఛకు ప్రతీకగా మనం భావిస్తూ ఉంటాం. అయితే.. సమున్నతంగా, అనంతంగా వ్యాపించిన ఆ నీలి ఆకాశమే.. జాతిని ముందుకు నడపాల్సిన విలువైన వ్యక్తులను నిర్దాక్షిణ్యంగా చిదిమేసినప్పుడు కలిగే దుఃఖం మాటల్లో చెప్పలేనిది. తనను నమ్ముకున్న అనుచరులు పోటీ చేస్తున్న చోట ప్రచారానికో, దగాపడిన ప్రజలకు ధైర్యం చెబుదామనో, దేశప్రగతిని పట్టాలెక్కించే మరో కార్యక్రమం కోసమో.. విమానంలోనో, హెలీకాప్టర్‌లోనో బయలుదేరిన నేతలు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయినప్పుడు.. అది చెప్పలేని విషాదంగా పరిణమిస్తుంది. దేశ గమనాన్ని మార్చి, కోట్లాది జాతిజనుల కలలకు ప్రతీకలుగా నిలిచిన ఆ వ్యక్తులు ఈ ప్రపంచం నుంచి మాయమైన తీరు.. ఒక తరానికి పీడకలగానే నిలిచిపోతుంది. భారతప్రజాస్వామ్య చరిత్రలో అలాంటి అత్యంత విషాదకరమైన పీడకలలు ఎన్నో ఉన్నాయి. అశేష ప్రజానీకానికి ఆరాధ్య దైవాలుగా నిలిచిన ఆ నేతల చివరి ప్రయాణాలను తలచుకుంటే.. నేటికీ గుండె బరువెక్కక మానదు. ఈ జాబితాలో ప్రజల మనసులు గెలిచిన నాయకుల నుంచి అన్ని రంగాల ప్రముఖులూ ఉన్నారు. విమాన ప్రమాదాలు అనగానే తెలుగువారికి ముందుగా కొన్ని పేర్లు గుర్తుకు వస్తాయి. వారిలో యలవర్తి నాయుడమ్మ ఒకరు. చిన్న రైతు కుటుంబంలో పుట్టిన నాయుడమ్మ అంతర్జాతీయ స్థాయి రసాయన శాస్త్రవేత్తగా ఎదిగారు.
అప్పట్లో ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీకి సలహాదారుగా పనిచేసిన ఆయన, ఐక్యరాజ్యసమితితోపాటు పలు అంతర్జాతీయ సంస్థలకు, విదేశీ సంస్థలకు కూడా సలహాదారుగా పనిచేశారు. కెనడాలోని ఐడిఆర్‌సి సమావేశానికి హాజరై 1985 జూన్ 23న తిరిగి వస్తున్న క్రమంలో ఆ ఎయిర్ ఇండియా పేలిపోవటంతో కన్నుమూశారు. ఈ వార్త వినగానే.. ఆయన భార్య డాక్టర్ పవన ఆత్మహత్య చేసుకుని మరణించటం మరో విషాదం. ఇలాంటి విషాద వార్తలు వినగానే తెలుగువారికి ఎపి మాజీ సిఎం రాజశేఖరరెడ్డి, నాటి లోక్‌సభ స్పీకర్ జిఎంసి బాలయోగి, సినీ నటి సౌందర్య మరణాలు గుర్తుకు రాకుండా ఉండవు. లోక్‌సభ మాజీ స్పీకర్, టిడిపి నేత జిఎంసి బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. భీమవరం నుంచి బయలుదేరిన ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేట్ హెలికాప్టర్, కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలోని ఓ చెరువులో కూలిపోయింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత తెలుగువారికి ఎంతో సుపరిచితురాలైన ప్రముఖ సినీ నటి సౌందర్య 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఇక.. తెలుగు రాష్ట్రాల ప్రజల జనహృదయ నేతగా పేరు తెచ్చుకున్న నేత దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 14 వ సిఎంగా పనిచేసిన వైఎస్‌ఆర్.. 2009, సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.
ఆయన మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. విమాన ప్రమాదంలో దేశం కోల్పోయిన మరో మేధావి హోమీ జహంగీర్ బాబా. 1966 జనవరి 24న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఈ ప్రపంచ ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త అకాల మరణం చెందారు. 1980 జూన్ 23న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మృతి చెందారు. ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన విమానాన్ని నడుపుతూ, ప్రమాదకర విన్యాసాలు చేయడానికి ప్రయత్నించగా, విమానం కూలిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మాధవరావు సింధియా 2001 సెప్టెంబర్ 30న విమాన ప్రమాదంలో మృతి చెందారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, ఆయన ప్రయాణిస్తున్న విమానం ఉత్తరప్రదేశ్ మైన్‌పురి సమీపంలో కూలిపోయింది. అలాగే, ప్రముఖ పారిశ్రామికవేత్త, హర్యానా మంత్రి ఓంప్రకాశ్ జిందాల్ 2005 మార్చి 31న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 2011 ఏప్రిల్ 30న తవాంగ్, ఇటానగర్ మధ్య జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అప్పటి అరుణాచల్‌ప్రదేశ్ సిఎం డోర్జి ఖండు దుర్మరణం చెందారు.భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ భార్యతోపాటు మరో 11మంది మరణించారు. నిరుడు జూన్ నెలలో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ మరణించారు.
ఇప్పుడు ఈ విషాద జాబితాలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరు కూడా చేరింది. ఇలా వరుసగా జరుగుతున్న విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు చరిత్రలో చెరగని విషాద ఘట్టాలుగా నిలిచిపోయాయి. తాజాగా, బుధవారం ఉదయం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండింగ్ అవుతుండగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మృతి చెందారు. ఈ వార్త విని యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ముంబై నుంచి తన సొంత నియోజకవర్గం బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విమానం బయల్దేరినప్పటి నుంచి రెండుసార్లు సిగ్నల్స్ కట్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటాలో తేలింది. ఉదయం 8:10 గంటలకు ముంబై ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం, ప్రారంభంలో 6 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించింది. 8:34 నిమిషాలకు మొదటిసారి సిగ్నల్స్ ఆగిపోయి, కొద్దిసేపటి తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యాయి. అయితే, 8:43 నిమిషాలకు బారామతి ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి.
ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు విమానం వేగం గంటకు 237 కిలోమీటర్లకు పడిపోయి, ఆకస్మికంగా సంబంధాలు తెగిపోవడంతో కూలిపోయినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. విమాన ప్రమాదాలకు చాలా సార్లు పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో నిర్లక్ష్యం కారణంగా కూలిపోయిన ఘటనలు గతంలో వెలుగుచూశాం. అంతేకాకుండా చాలాసార్లు విమానాలు నడిపే పైలట్లకు అనుభవం లేకపోవడం వల్ల.. వారు తీసుకునే తప్పుడు నిర్ణయాలతోనూ విమానాలు కూలిపోయే అవకాశాలుంటాయి. ఇక సాంకేతిక సిబ్బంది చేసిన తప్పుల కారణంగా సైతం విమానాలు కూలిపోతుంటాయి. పైలట్ -కంట్రోల్ రూమ్ మధ్య కమ్యూనికేషన్ కోల్పోవడం కూడా విమాన ప్రమాదానికి దారితీస్తుంది. వాతావరణం కూడా విమాన ప్రమాదాలకు కారణం అవుతుంది. బలమైన తుఫానులు, మెరుపులు, భారీ వర్షం, వాతావరణంలో అల్లకల్లోలం కారణంగా, విమానం నియంత్రణ కోల్పోయి ప్రమాదం బారినపడే అవకాశాలుంటాయని నిపుణులు అంటున్నారు. ఏదిఏమైనా ఈ తరహా ప్రమాదాలను నివారించగల ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలను రూపొందించుకోవటంతోపాటు ఇలాంటి ప్రమాదాలపై పారదర్శకమైన విచారణ కూడా జరిపించాల్సిన అవసరం ఉంది.
- ఐనం ప్రసాద్
9848928787
-
Home
-
Menu
