‘ఉపాధి హామీ’ ఉసురు తీస్తున్నారు!

‘ఉపాధి హామీ’ ఉసురు తీస్తున్నారు!
X

జి రామ్ జి బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. ఇది చట్టం కాబోతున్నది. అయితే సరికొత్త చట్టం కాదు. ఇప్పటికే ఇది అమలులో ఉన్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 గా నిన్నటి వరకు అమలులో ఉన్నది. రాష్ట్రపతి ఆమోదంతో కొత్త పేరు అమలులోకి వస్తుంది. అందులో ఏ అంశాలున్నాయనే విషయం పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. గ్రామాలలో ఉన్న పేదలకు ప్రత్యేకించి వ్యవసాయ కూలీలకు ఈ చట్టం ఉపాధిని కల్పిస్తున్నది. దాని మీద చర్చలు ఎన్నో జరిగాయి. విమర్శలు, ప్రతి విమర్శలు మరెన్నో వచ్చాయి. అయితే నిరుపేదలకు ఈ చట్టం ఎంతో మేలు చేస్తుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ చట్టంలో గతంలో ఉన్న ముఖ్యమైన అంశం మారిపోతున్నది. అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా విషయం. గతంలో ఈ పథకం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ కొత్త చట్టం ద్వారా ఖర్చులో రాష్ట్రాలపై భారం మోపనున్నది. బడ్జెట్‌లో 60 శాతం కేంద్రం నుంచి, 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంది. ఇంకా కూలీల శ్రమ యంత్రాల వాడకం పైన కూడా కొన్ని నిర్ణయాలు చేశారు. అంతేకాకుండా అత్యంత ముఖ్యమైనది, కూలీల డిమాండ్‌ను బట్టి కాక, ప్రభుత్వాల నిర్ణయాలను బట్టి పనులను కల్పిస్తారు. గతంలో కనీసం వంద రోజుల పని దినాలను కల్పించాల్సి ఉంది. కాని దానిని 125 రోజులకు పెంచారు. ఇది కేవలం కంటితుడుపు మాత్రమే.

రాష్ట్రాల మీద గతంలో దీని భారం ఉండేది కాదు. కానీ ఈ రోజు రాష్ట్రాలు ఇందులో ఆర్థికంగా తమ బడ్జెట్‌లను వెచ్చించాలి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వాటాను కల్పించకపోతే, ఆ పథకం అమలు సాధ్యం కాదు. ఇప్పటికే చాలా పథకాల్లో ఇటువంటి షరతులు విధించి, పథకాలనే నిలిపివేసిన ఘటనలున్నాయి. ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకం అందులో భాగమే. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను వెచ్చించకపోవడం వల్ల కేంద్రం నిధులను విడుదల చేయడం ఆపేసింది. పంజాబ్ రాష్ట్రంలో ఈ స్కాలర్ షిప్స్ సమస్య ప్రభుత్వాన్నే మార్చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలను రేపు కూలీల ముందు దోషులుగా నిలబడే పరిస్థితి రాబోతున్నది. అంటే జి రామ్ జి పథకం రేపు రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయతను బజారులో నిలబట్టే పరిస్థితి రాబోతున్నది. దానితో పథకమే ప్రశ్నార్థకం కాబోతున్నది. కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్నది కూడా అదే. క్రమంగా ఈ పథకాన్ని ఆచరణలో రద్దు చేయాలన్నదే ఉద్దేశం. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాలు తమ బడ్జెట్‌ల ద్వారా అమలులో ఉన్న పథకాలనే కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను సరైన సమయంలో చెల్లించలేని దీనస్థితిలో ఉన్నాయి.

వాటికితోడు ఎన్నికల్లో గెలవడానికి ఆర్థిక పరిస్థితిని దృష్టింలో ఉంచుకోకుండా చేసిన వాగ్దానాలు రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండలుగా మారిపోయాయి. వీటన్నింటిని నిర్వహించడానికి బ్యాంకులనుంచి అప్పులు తీసుకోవడానికి రిజర్వు బ్యాంకు అనుమతి కోసం విరామం లేకుండా ప్రయత్నిస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం తమ అప్పుల పరిమితులను దాటిపోయాయి. దీనితో చాలా రాష్ట్రాలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రభుత్వ భూములను అమ్మకానికి పెడుతున్నాయి. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తెలియదు. సరిగ్గా ఈ పరిస్థితిలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తమ బడ్జెట్ నుంచి నిధులను కేటాయించడమంటే అది వాస్తవ విరుద్ధమే అవుతుంది. ఇది మరింత సంక్షోభానికి దారి తీసే అవకాశముంది. అంతిమంగా ఈ పథకమే ఆగిపోయే పరిస్థితులున్నాయి. ఈ పథకాన్ని మొదటి నుంచి బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వ్యతిరేకత దృష్టితోనే చూస్తున్నది.

నిధుల కేటాయింపులు కానీ, ఖర్చు గానీ ఏనాడు డిమాండ్‌కు తగ్గట్టుగా లేవు. దానికి తోడు కార్డులను తొలగించడం అనేది ఒక నిత్య కార్యక్రమంగా పెట్టుకున్నారు. గత రెండేళ్లలో దాదాపు 50 లక్షల కార్డులను దేశవ్యాప్తంగా తొలగించారు. అంతేకాకుండా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి చేయాల్సినంత ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ చట్టం అంతిమ సమాధి. దీనికి బిజెపి సామాజిక నేపథ్యమే కారణం. ఈ పథకాన్ని గ్రామాల్లోని ధనిక, మధ్య తరగతి రైతులు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చిన తర్వాత కూలీలలో వేతనం డిమాండ్ పెరిగిందని, తమ పొలాల్లో పని చేయడానికి ముందుకు రావడం లేదని వాళ్లు వాదిస్తున్నారు. అంతేకాకుండా కూలీలలో పెరిగిన ఈ స్వేచ్ఛ గ్రామాల్లో వ్యవసాయ కూలీ పెరుగుదల అనివార్యమైందని, దానితో వ్యవసాయ ఖర్చులు పెరిగాయని రైతులు తమ వ్యతిరేకతను బహిరంగంగానే వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఈ వర్గమే బలమైనది. ఓట్లు గాని, ఇతర ఏ రాజకీయ ప్రయోజనాలకు గానీ ఈ వర్గమే ఆధారం. ఇది వర్గం, కులాల రీత్యా ఆధిపత్యం కలిగి ఉంది. అందువల్ల ఈ పథకానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడమంటే ఆధిపత్య కులాలకు, వర్గాలకు అండగా నిలబడడమే. దీని వల్ల బిజెపి ఆధిపత్య కులాల్లో బలాన్ని స్థిరం చేసుకోవడానికి వీలవుతుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఈ చట్టానికి తక్షణ లక్షం. బెంగాల్‌లో ధనిక, మధ్య తరగతి వర్గం ప్రస్తుతం మెల్లగా బిజెపి వైపునకు నడుస్తున్నది. దీని వల్ల వాళ్లు మరింతగా బిజెపిని బలపరిచే అవకాశముంది. బెంగాల్‌లో నూటికి 50శాతం మంది ఎస్‌సిలు, ఎస్‌టిలు, ముస్లింలు ఉన్నారు. వీళ్లంతా భూమిలేని నిరుపేదలే. దాని వల్ల ఈ వర్గాలకు వ్యతిరేకింగా మధ్య తరగతి వర్గం కూలీలను సమీకరించే పనిలో పడ్డారు. అందుకే ఈ చట్టం ద్వారా మరో ప్రయోజనం పొందాలని పథకం వేశారు. అదే పేరు మార్పు. అందులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి, రామ్ పేరును చేర్చడం రెండో ప్రయోజనం. ఎందుకంటే ఇక్కడ పరోక్షంగా ముస్లింల మీద వ్యతిరేకత రెచ్చగొట్టడం. మహాత్మా గాంధీ పేరును తొలగించడం వల్ల జరిగే చర్చలో పరోక్షంగా ముస్లింల విషయాన్ని చేర్చి తమకు అనుకూలంగా దీనిని మలుచుకోవడంలో సఫలీకృతం కావాలని ఆలోచన చేస్తున్నారు. మహాత్మాగాంధీ పైన బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలకు మొదటి నుంచి సదాభిప్రాయం లేదు. అది మహాత్మా గాంధీ హత్యతోనే బయట పడింది.

మహాత్మా గాంధీని హత్య చేసిన నాథ్‌రామ్ గాడ్సే హిందూ మహాసభ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా పనిచేశాడని చరిత్రలో ఉన్న విషయం. అదే విధంగా మహాత్మా గాంధీ హత్యానంతరం ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకున్నాయని అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గోల్వాల్కర్‌కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నారు. అంతేకాకుండా 2014లో అప్పటి బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ నాథ్‌రామ్ గాడ్సే జాతీయ వీరుడు అని ప్రకటించారు. అదే విధంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన నాయకుడు రాజ్‌భయ్యా నాథ్ గాడ్సేను సమర్థిస్తూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా నాథ్‌రామ్ గాడ్సేకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లలో సావర్కర్ ప్రధానమైన వ్యక్తి. ఆయన అనేక సార్లు గాంధీని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. అయితే గత కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీ వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, తమ అనుబంధాన్ని చాటుకున్నారు.

అయితే బిజెపి మహాత్మా గాంధీని ప్రత్యక్షంగా విమర్శించిన సందర్భాలు తక్కువ. అదే విషయాన్ని గత రెండు రోజుల క్రితం పార్లమెంట్‌లో ఆ పార్టీ ప్రకటించింది. మహాత్మా గాంధీ జయంతిని స్వచ్ఛ అభియాన్‌గా జరుపుకుంటున్న విషయాన్ని కూడా ప్రకటించారు. అది నిజమే. ఇక్కడ గమనించాల్సింది మహాత్మా గాంధీ మీద కోపం ఆయన మీద కాదు. ఆయన ఏ విధానాలను అవలంబించి ముస్లింలను సోదరులుగా చూడాలని ప్రకటించారో ఆ అంశం వాళ్లకు నచ్చదు. ఇప్పుడే ఈ విషయాన్ని లేవనెత్తి, పేరు మార్చడానికి రాబోయే బెంగాల్ ఎన్నికలే కారణం. అక్కడ ముస్లింల మీద వ్యతిరేకతను రెచ్చగొట్టి మిగతా సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఈ చర్చ వాళ్లకు అవసరం. ఈ రోజు భారత దేశంలో ముస్లింలు ఉండి హిందూ సమాజాన్ని అవహేళన, దాడులు చేస్తున్నారంటే మహాత్మా గాంధీ విధానాలే కారణమని బిజెపి చెప్పదలచుకున్నది.

రాబోయేరోజుల్లో మహాత్మా గాంధీ సెక్యులరిజం, సర్వమత సమానత్వం అనే అంశాలమీద వాళ్లు కాకుండా, వివిధ వ్యక్తులతో మాట్లాడించి, ముస్లిం వ్యతిరేకతను తాము ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. జి రామ్ జి పేరును బాగా ప్రచారం చేయడం ద్వారా మరో ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం మీద విమర్శలు రాముని మీదికి మళ్లించి, వీళ్లంతా రాముని వ్యతిరేకులు, హిందూత్వ వ్యతిరేకులు అని చెప్పడం ద్వారా హిందూ భక్తులను కూడా ఇందులో భాగస్వాములను చేసి, దానిని సంఘటితం చేయాలనుకుంటున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడం ద్వారా వారి హిందూత్వ ఎజెండా ఉచ్ఛస్థాయికి చేరింది. ఇక వాళ్లు దేనిని సహించే స్థితిలో లేరు. అంతిమంగా హిందూత్వ భావాలను తమ ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించుకొని ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. నూటికి ఇరవై మందిగా ఉన్న ఉన్నత ఆదాయ వర్గాలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం వల్ల ప్రభుత్వాలను తారుమారు చేసే పథకాన్ని అమలు చేస్తున్నారు.

- మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)

Tags

Next Story