నెలసరి సమస్యలపై గురిపెట్టి..!

వైద్య విద్యార్థినిగా ఉన్నప్పుడే కుటుంబం నిర్వహిస్తున్న “కడియం ఫౌండేషన్” ద్వారా పాఠశాల విద్య మానేసే బాలికల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గమనించారు. గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో వైద్యురాలిగా పనిచేసేటప్పుడు, మహిళలు తమ నెలసరి చక్రం సమయంలో శుభ్రత పాటించే విధానంపై అవగాహన పెంచారు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నెలసరి సమయంలో అవసరమైన ప్యాడ్లను ఉచితంగా అందించే పథకానికి పునాది వేసారు. అదే ధోరణి కొనసాగిస్తూ, ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలిగా మహిళలు, ముఖ్యంగా ఉద్యోగిణులు పనిచేసే స్థలాల్లో అవసరమైన సౌకర్యాలపై చట్టసభను కదిలించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు వరంగల్ ఎంపి డాక్టర్ కడియం కావ్య. 2025 డిసెంబర్ 5న, వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపిగా ఉన్న డాక్టర్ కడియం కావ్య ఒకే సమావేశంలో రెండు ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టిన తొలి తెలంగాణ మహిళగా నిలిచారు. వీటిలో ఒకటైన మెన్‌స్ట్రువల్ బెనిఫిట్స్ బిల్ -2024, మహిళల నెలసరి ఆరోగ్యం పట్ల చట్టబద్ధత కల్పించడానికి చేసిన ధైర్యవంతమైన అడుగు. ఈ బిల్లులో ప్రభుత్వం, ప్రైవేటు రంగాలతోపాటు అన్ని కార్యాలయాల్లో సురక్షిత, శుభ్రమైన టాయిలెట్స్ తగిన ఆరోగ్య వసూలు కల్పించే విధంగా, ఉచిత/ రాయితీ ధరల ద్వారా శానిటరీ నాప్కిన్స్‌ను అందించాలని, అలాగే నెలకు రెండు రోజుల చెల్లింపులతో కూడిన విశ్రాంతి ఇవ్వాలని ఎంపి డా. కడియం కావ్య ప్రతిపాదించారు.
మహిళల్లో తీవ్రమైన నెలసరి నొప్పి హార్ట్ అటాక్ నొప్పికీ సమానమనే యూనివర్శిటీ కాలేజ్ లండన్ పరిశోధనను ఎంపి డాక్టర్ కావ్య ఆధారంగా చూపించారు. ఇది ఒక సాధారణ బిల్లు కాదు; మహిళల నెలసరి గురించి భారతీయ సమాజంలో శతాబ్దాలుగా నెలకొన్న నిశ్శబ్దం, అపహాస్యం, నిర్లక్ష్యానికి ఇది ధైర్యమైన సవాలు. భారతదేశంలో పరిస్థితి ఎంత తీవ్రమో గణాంకాలు చెబుతున్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5 ప్రకారం, 15 -24 ఏళ్ల యువతుల్లో కేవలం 58% మంది మాత్రమే పరిశుభ్రమైన శానిటరీ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ శాతం మరింత తగ్గుతుంది -అక్కడ 60% కంటే ఎక్కువ మంది ఇప్పటికీ పాత బట్టలపై ఆధారపడుతున్నారు. ఇవి సరైన రీతిలో శుభ్రం చేయకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. పలువురు బాలికలు నెలలో నాలుగు- ఐదు రోజుల పాటు పాఠశాలకు దూరమవుతారు. నొప్పి, అవసరమైన శానిటరీ నాప్కిన్స్ లభ్యత లేకపోవడం, మరుగుదొడ్లు లేని దుస్థితి ఇవన్నీ కారణాలు ఉన్నాయి. వీటి కారణంగా విద్యార్థుల పాఠశాలకు గైర్హాజరు కావడంతో పిల్లల విద్యలో లింగ వ్యత్యాసం మరింత పెరుగుతోంది. ఆర్థిక భారం కూడా చిన్నది కాదు. ఒక సానిటరీ ప్యాక్ ధరే రూ. 30 -నుంచి రూ. 50 ఉండటం వల్ల లక్షల కుటుంబాలకు ఇది నెలనెలా వారికి భారం అవుతుంది. కొవిడ్ సమయాల్లో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక మంది మహిళలు చిరిగిన బట్టలతో గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. నెలసరి సమయంలో రక్తనష్టం, పోషకాహార లోపంతో మహిళల్లో రక్తహీనత మరింత తీవ్రమైంది.
ఇది భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా అరబిలియన్ మహిళలు పిరియడ్ పావర్టీతో బాధపడుతున్నారు. అమెరికాలో ప్రతి నాలుగురు టీనేజ్ అమ్మాయిల్లో ఒకరు ఈ సమస్య వల్ల పాఠశాలకు వెళ్లలేరు. ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ప్రపంచ పార్లమెంట్లు చర్యలు చేపడుతున్నాయి. స్కాట్లాండ్ 2020లో అందరికీ ఉచిత శుభ్రతా ఉత్పత్తులు అందించే చట్టం చేసింది. స్పెయిన్ 2023 నుండి నెలసరి విశ్రాంతిని అమలు చేస్తోంది. జపాన్ 1947 నుంచే ఈ విధానాన్ని అమల్లో ఉంచింది. అమెరికాలో అనేక రాష్ట్రాలు ‘ట్యాంపాన్ ట్యాక్స్’ ను రద్దు చేశాయి. భారతదేశం కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. ఎఎస్సేఎ వర్కర్ల ద్వారా రాయితీ ధరల పంపిణీ, పాఠశాలల్లో వెండింగ్ మెషిన్లు, ఇన్సినిరేటర్లు ఏర్పాటు, శుభ్రతా ఉత్పత్తుల వినియోగం 42% నుంచి 58% కి పెరగడం వంటి పురోగతి ఉంది. కానీ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కవరేజ్ ఇంకా చాలా తక్కువగా ఉంది. ఈ నెలసరికి సంబంధించిన సౌకర్యాలు, విశ్రాంతి హక్కుగా ఇచ్చే కేంద్ర చట్టం ఇప్పటికీ లేదు.
ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టే ప్రయత్నమే డాక్టర్ కావ్య బిల్లు. ఫ్యాక్టరీ కార్మికులు నుంచి వైద్యులు, ఉపాధ్యాయుల నుంచి గృహ సహాయకులు వరకు- అన్ని రంగాల మహిళలకు రక్షణ కల్పించేలా ఇది రూపుదిద్దుకుంది. మహిళల నెలసరి అనేది వ్యక్తిగత సిగ్గు విషయం కాదని, ఇది ప్రజారోగ్యానికి, లింగ న్యాయానికి సంబంధించిన అంశమని స్పష్టం చేస్తుంది. వ్యతిరేకాలు, వ్యయభారం వంటి అభ్యంతరాలు వచ్చినా, ఇతర దేశాల అనుభవాలు ఈ సౌకర్యాలు ఉత్పాదకతను పెంచుతాయని చూపాయి. పాఠశాల్లో ప్యాడ్లు అందిస్తే బాలికల హాజరు పెరిగిందన్న ఉదాహరణలు స్పష్టంగా ఉన్నాయి. వరంగల్ వంటి ప్రాంతాలనుంచి వచ్చిన ఈ చట్టప్రయత్నం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అంచున ఉన్న వర్గాల వాయిస్ కూడా జాతీయ విధానాలను మార్చగలవని ఇది నిరూపిస్తోంది. ఈ నెలసరి ప్రక్రియను గౌరవంతో చూడడం, దానికి అవసరమైన సౌకర్యాలను హక్కుగా ఇవ్వడం -ఇవి విలాసం కాదు; ప్రాథమిక మానవ హక్కులు. డాక్టర్ కడియం కావ్య వేసిన ఈ చిన్న దీపకాంతిని ఇప్పుడు ప్రభుత్వం, పార్లమెంట్, సమాజం కలిసి పిరియడ్ షేమ్ ని శాశ్వతంగా ముగించే జ్వాలగా మార్చాల్సిన సమయం ఇది.
- కేశిరెడ్డి మాధవి
-
Home
-
Menu
