అక్రమ బహిష్కరణలు ఆగేదెన్నడు?

అక్రమ బహిష్కరణలు ఆగేదెన్నడు?
X

బంగ్లాదేశ్‌లో ఆరు నెలల నిర్బంధం తర్వాత 25 ఏళ్ల సునాలి ఖాతుర్ మాల్టాలోకి అడుగుపెట్టింది. ఇది కొంత ఉపశమనం కలిగించినా, సామూహిక అవమానంగా భావించి ఉండాలి. ఆమె అక్రమ వలసదారు కాదు, చొరబాటుదారు కాదు. వీసా గడువు ముగిసినా మన దేశంలో ఉంటున్న విదేశీ పౌరురాలు కాదు. అమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్త్రీ, గర్భిణి. చిన్న కొడుకుతో ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి న్యాయపరమైన అనుమతి లేకుండా భారతీయ అధికారులు బలవంతంగా అంతర్జాతీయ సరిహద్దులను దాటించారు. న్యాయవాదులు, వలసహక్కు సంఘాల జోక్యం, ఆమె కేసు కోర్టు ముందుకు తెచ్చేందుకు చేసిన యత్నాల పుణ్యమా అని ఆమె తిరిగి రావడం సాధ్యమైంది. దీనిపై ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి అస్పష్ట సూచనలు తప్ప ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆ సూచనలు కూడా సరైన ప్రక్రియ లేకుండా భారతీయ పౌరులను మరో దేశానికి నెట్టివేయడాన్ని ఏమాత్రం సమర్థించవు. సునాలీకి ఎదురైన కఠిన పరీక్ష చిత్రం ఏమీ కాదు. అసోం, చుట్టుపక్కల జిల్లాలనుంచి వచ్చిన పేద బెంగాలే మాట్లాడే ముస్లింలను అనుమానిత అక్రమ వలసదారులుగా ముద్రవేసి, చట్టబద్ధమైన బహిష్కరణలకు బదులుగా రహస్యంగా బహిష్కరణ మాదిరిగా సరిహద్దుల నుంచి నెట్టివేయబడుతున్న ఎన్నో కేసులలో ఇది ఒకటి. కేసు తర్వాత.. బంగ్లాదేశ్ ఈ వ్యక్తులను తమ పౌరులుగా అంగీకరించేందుకు నిరాకరించడం, వారు బంగ్లాదేశ్ జాతీయులు కాదని నొక్కి చెప్పి భారతదేశానికి తిరిగి పంపడం మామూలయింది.

పదేపదే ఇలా పలువురు తిరిగి రావడం పలు ప్రశ్నలకు దారితీస్తున్నది. బంగ్లాదేశ్ వారిని కోరుకోకపోతే, భారతదేశం వారిని గుర్తించడానికి నిరాకరిస్తే, వారి చట్టబద్ధమైన, మానవ పరమైన హోదా ఏమిటి? ఏ ప్రభుత్వం తమ సొంత పౌరులను భౌతికంగా తొలగించి, వదిలి వేయాల్సినంతగా భారంగా భావిస్తుంది. 2025 మే లో అసోంకు చెందిన ఇద్దరు మహిళలు -సోనా భాను, రహిమా బేగం- ను వారి ఇళ్లనుంచి తీసుకెళ్లి మిలిటరీ జోన్ మీదుగా తరలించి, భారతదేశం బంగ్లాదేశ్ మధ్య ఉన్న నో మ్యాన్ లాండ్ -నిర్జన ప్రదేశంలో వదిలి వేశారు. వారికి తిండిలేదు. నిలువ నీడలేకుండా కొన్నిరోజుల తరబడి బయటపడ్డారు. బంగ్లాదేశ్ అధికారులను వారిని తిరిగి తీసుకువచ్చి సరిహద్దు గార్డులకు అప్పగిస్తే, వారి నుంచి వేధింపులు భరించాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ పాఠశాల టీచర్ బైరుల్ ఇస్లాంను సుప్రీం కోర్టులో అప్పీలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌కు బలవంతంగా తరలించారు. చాలా కాలం క్రితం డి- ఓటరుగా గుర్తించబడిన హజేరా ఖాతున్ అనే వృద్ధ మహిళను ఇదే విధంగా బహిష్కరించారు. బంగ్లాదేశ్ ఆమెను తమ దేశంలో చేర్చుకోవడానికి నిరాకరించే వరకూ ఆమె తనను తాను రక్షించుకుంటూ బతకాల్సివచ్చింది.

ఇవి చట్టపరమైన బహిష్కరణలు కావు. అవి భారత చట్టం ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లు, విచారమలు, పర్యవేక్షణ లేకుండా చేసిన బహిష్కరణ చర్యలు. వారు తగిన సాక్ష్యాలు లేకుండా సామాజిక పరమైన కమ్యూనిటీలపై కేవలం అనుమానంతో ఈ చర్యలకు దిగారు. అసోం సంక్లిష్ట వలస చరిత్ర చాలా కాలంగా రాజకీయ పరంగా రూపుదిద్దుకున్నది. ఈ మధ్య కొద్ది కాలంగా అక్రమ వలసపై పాలనాపరమైన ధ్రువీకరణ మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా మారుతున్నట్లు కన్పిస్తోంది. చట్టపరమైన ప్రక్రియను కానీ, పేదల వాస్తవిక జీవితాలను కానీ అంతగా పట్టించుకోవడం లేదు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం, వలసదారుల (అసోం నుంచి బహిష్కరణ) చట్టం 1950 కింద వందలాది మంది సరైన పత్రాలులేని వ్యక్తులను వెనక్కి నేట్టివేసిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించుకుంటోంది. ఇలాంటి ప్రకటనలు రాజకీయంగా నియోజకవర్గాల్లో బాగా పనిచేస్తాయి. కానీ, ఏకపక్ష బహిష్కరణలు చట్టబద్ధంగా అసాధ్యం అన్న అంశాన్ని మరుగుపరుస్తాయి.

భారతదేశం - బంగ్లాదేశ్ మధ్య పరస్పరం వ్యక్తులను స్వదేశాలకు పంపించే ఒప్పందం లేదు. బహిష్కణకు స్పష్టమైన డాక్యుమెంట్‌లు, రుజువులు, వారిని స్వీకరించే దేశం అంగీకారం చాలా అవసరం. ఇవి లేకుండా నెట్టివేతలు నాటకాల వంటివే. దీనివల్ల తలెత్తే పరిణామాలు ప్రభుత్వాలకన్నా, ఆ పౌరుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. జీవితాలే తల్లకిందులైపోతాయి. నెట్టివేతకు లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు.. పేదవారై ఉంటారు. వారి చదువు అంతంత మాత్రమే. ఎక్కువ నిరక్షరాస్యులై ఉంటారు. అక్రమ వలస విషయంలో ఎలాంటి చిక్కులు ఎదురైనా, తమను తాము రక్షించుకునే సామర్థ్యం కూడా వారికి తక్కువే ఉంటుంది. రాజకీయపరంగా వాయిస్ లేని వారి వలసలకు, భాషా, -మతపరమైన మైనారిటీలకు మధ్య ఉండే తేడా తక్కువ. బెంగాలీ మాట్లాడే వారిని ఇప్పటికీ అనుమానితులు గానే చూస్తారు. ఒకప్పుడు రాజ్యాంగ పరమైన హామీగా ఉన్న పౌరసత్వం, కొన్ని కమ్యూనిటీల విషయంలో తాత్కాలిక హోదా మాదిరిగా ఉంది. ఇది డాక్యుమెంటేషన్ పై కాకుండా రాజకీయాలపై ఆధారపడి ఉంటోంది.

సునాలీ కేసు ఈ లోపాలను స్పష్టం చేస్తోంది. ఆమె కుటుంబానికి ఓటర్ల కార్డులు, రికార్డులు, రేషన్ కార్డులు ఉన్నాయి. కుటుంబానికి పశ్చిమబెంగాల్, అసోం రెండు రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. ఇంతవరకూ ఆమెకు అనుకూలంగా తీర్పురాలేదు. అయినా, ఆమెను, ఆమె భర్త, ఇద్దరు పిల్లలనుంచి వేరు చేసి తీసుకెళ్లారు. గర్భిణి అయి కడుపులో బిడ్డను మోస్తున్న సమయంలో ఆమెను సరిహద్దులు దాటించి పంపివేశారు. ఆమె, చిన్నకొడుకు అర్థం చేసుకోలేని కష్టాల చిక్కుకుని, అతని కుటుంబం చట్టపరమైన సహాయం కోసం ఇబ్బంది పడుతుండగా, నెలల పాటు విదేశీ గడ్డపై బతకాల్సి వచ్చింది. ఆమె వివరాలు పరిశీలించిన తర్వాత, బంగ్లాదేశ్ అధికారులు ఆమె బంగ్లా జాతీయురాలు కాదని నిర్ధారించి. ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. సునాలీ విషయంలో ఆమె పౌరసత్వం ఉన్న దేశం కంటే నెట్టివేయబడిన పొరుగు దేశం ఆమెకు తగిన ప్రక్రియకు కట్టుబడి ఉండడం విశేషం.

తీవ్ర ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధికారుల ఓవర్ యాక్షన్ మాత్రమే కాదు, దేశం లో చట్టాలను గౌరవించకపోవడం. ప్రభుత్వ అధికారులు న్యాయవ్యవస్థను అతిక్రమించడం, రాజ్యాంగం కల్పించిన రక్షణలను ఇబ్బందికరంగా పరిగణించిన పక్షం అసలు పౌరసత్వం వ్యవస్థే దుర్బలంగా తయారవుతుంది. అనేక సందర్భాల్లో, కోర్టులు జోక్యం చేసుకుని సంజాయిషీ కోరడంతోపాటు, బహిష్కరణలను ఆపాయి. తప్పిపోయిన వ్యక్తులుగా ప్రకటించిన వారిని వెతికి పట్టుకుని హాజరుపరచాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. న్యాయవ్యవస్థ జోక్యం, ప్రక్రియ చాలా ఆలస్యం అవుతుంది. ఈలోగా బాధితులు నెలల తరబడి వేదన అనుభవిస్తారు. ప్రజాస్వామ్య గణతంత్రం లో ఏ పౌరుడూ ఎదుర్కోకూడని పరిస్థితులు అనుభవిస్తాడు. ఆ తర్వాత అందే న్యాయం వల్ల ఏం లాభం. మనదేశంలో కోర్టులు, లాయర్ల ఫీజులు ఖరీదైనవి, చాలా కుటుంబాలకు కేసులు ఏళ్ల తరబడి కొనసాగించే అవకాశాలు లేవు, అలాంటి వారు తక్కువే. రాజకీయ పరమైన చిక్కులు చాలా విస్తృతంగా ఉంటాయి మతం, భాష, సామాజిక ఆర్థిక స్థితి ఆధారంగా పౌరసత్వాన్ని తలగించడం చేస్తే, అది గందరగోళానికి దారితీస్తుంది. కొందరు పౌరుల విషయంలో వివక్షకు దారితీస్తుంది.

అది సాంకేతిక పరమైన, లేదా పాలనా పరమైన సమస్య కాదు, గణతంత్ర దృక్పథంలోనే మార్పునకు దారితీస్తుంది. స్వాతంత్య్రం అంతరం భారత రాజ్యాంగం విలువలపై ఆధారపడిన సమ్మిళిత వర్గంగా పౌరసత్వాన్ని పరిగణించాలని ఆకాంక్షించింది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, పౌరసత్వాన్ని అప్పుడప్పుడు చట్టవిరుద్ధ బలవంతం ద్వారా బహిష్కరణలకు సాధనంగా మార్చే ప్రమాదం ఉంది. ముందుకు సాగాలంటే, చట్టవిరుద్ధమైన బహిష్కరణలు వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఎంతమంది ఇలాంటి ఇబ్బందులకు గురయ్యారో బహిర్గతం చేయాలి. ప్రతి కేసుకు చట్టపరమైన ఆధారం అందించాలి. విదేశీయుల ట్రిబ్యునళ్లకు నిర్మణాత్మక సంస్కరణలు, న్యాయపరమైన పర్యవేక్షణ అవసరం. పేదలకు పౌరహక్కు కోల్పోకుండా చట్టపరమైన సహాయాన్ని విస్తృతం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం ఒక వర్గం పౌరులను శాశ్వత అనుమానితులుగా భావిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది. మత పరమైన అంతరాలను తీవ్రతరం చేస్తుందని రాజకీయ నాయకులు గుర్తించాలి. సునాలి ఖాతున్, ఇతరుల పునరాగమన ఉదంతం కోర్టులు, పౌర సమాజం, సాధారణ పౌరులు అన్యాయాన్ని తిప్పికొట్టగలరని రుజువు చేసింది. సరిహద్దులను దాటడం భౌగోళికం మాత్రమే కాదు ఓ హెచ్చరిక కూడా. గణతంత్ర రాజ్యం ఈ హద్దును మరచిపోకూడదు.

- గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్)

(రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు)

Tags

Next Story