మరో పోతిరెడ్డిపాడు కానున్న నాగార్జునసాగర్ గండి

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నాగార్జునసాగర్ జలాశయానికి గండికొట్టి రూ. 1200 కోట్ల వ్యయంతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టినట్టుగా, ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘జల్ జీవన్ మిషన్’ పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టని, అందుకు కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తున్నదని, పైగా ఈ పనులు గుట్టుచప్పుడు కాకుండ సంవత్సర కాలంగా కొనసాగిస్తున్నట్టుగా పత్రికల్లో సాక్ష్యాధారాలతో వార్తలు చూసి తెలంగాణ జనం విస్తుపోతున్నా రు. నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయం. ఈ జలాశయం నుంచి నీటి నిర్వహణ అంతా.. సాగునీటికైనా, తాగునీటికైనా.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 ప్రకారం జరగాలి కూడా. కొత్త ప్రాజెక్టులను చేపట్టేటప్పుడు రెండు రాష్ట్రాలు అనుసరించవలసిన పద్ధతులను కూడా విభజన చట్టం రెండు చోట్ల స్పష్టంగానే పేర్కొన్నది.
విభజన చట్టంలో ఏముంది?: విభజన చట్టంలో ఈ అంశంపై పేర్కొన్న పేరాలను పాఠకుల కోసం యథాతథంగా ఉటంకిస్తున్నాను. అపెక్స్ కౌన్సిల్ విధులను నిర్దేశిస్తూ సెక్షన్ 84, పేరా 3 (ii) లో ఇట్లా రాసినారు. planning and approval of proposals for construction of new projects, if any, based on Godavari or Krishna river water, after getting the proposal appraised and recommended by the River Management Boards and by the Central Water Commission, wherever required; గోదావరి లేదా కృష్ణా నదీ జలాల ఆధారంగా ఏవైనా కొత్త ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలను నదీ యాజమాన్య బోర్డులు, అవసరమైన చోట కేంద్ర జల సంఘం ద్వారా మూల్యాంకనం చేయించి, సిఫార్సు పొందిన తర్వాత మాత్రమే వాటికి ఆమోదం ఇవ్వాలి.
షెడ్యూల్ 11, పేరా 7 లో ఈ విధంగా పేర్కొన్నారు. No new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the State of Telangana or the State of Andhra Pradesh without obtaining sanction from the Apex Council on River water resources. All such proposals shall be first appraised and technically cleared by the respective Board, before sanction by the said Apex Council. నదీ జల వనరులపై ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ నుండి అనుమతి పొందకుండా తెలంగాణ రాష్ట్రం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి లేదా కృష్ణా నదులపై, తగిన విశ్వసనీయత ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఎటువంటి కొత్త నీటి వనరుల ప్రాజెక్టులను కూడా చేపట్టకూడదు. ఇటువంటి ప్రతిపాదనలన్నింటినీ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించే ముందు, సంబంధిత బోర్డు ద్వారా పరిశీలించి, సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంటుంది.
చట్ట ఉల్లంఘనకు బాధ్యత ఎవరిది?: రాష్ట్ర విభజన చట్టంలో ఇంత విస్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడి ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో తాగునీటి ప్రాజెక్టును చేపట్టడం అక్రమం. ఉమ్మడి జలాశయం నుంచి ఒక ప్రాజెక్టును చేపడుతున్నప్పుడు పక్క రాష్ట్రానికి, సంబంధిత బోర్డుకు తెలియజేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదా? అట్లే జల్ జీవన్ మిషన్ పథకం కింద నిధులు సమకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలను గుర్తు చేసి, ఆ ప్రకారం ప్రాజెక్టుకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందిన తర్వాతనే తాము నిధులు సమకూరుస్తామని చెప్పాల్సిన బాధ్యతను ఎట్లా విస్మరిస్తుంది? చట్ట ఉల్లంఘనను ఎట్లా ప్రోత్సహిస్తుంది? అంటే ఎపి కుట్రపూరిత వ్యవహారంలో కేంద్రం కూడా ఒక భాగస్వామి అని అనుకోవాల్సి వస్తున్నది. ఇది కృష్ణా బోర్డు నిష్క్రియాపరత్వానికి, పక్షపాత ధోరణికి ఒక ప్రబలమైన సాక్ష్యం. అంతకు మించి సంవత్సర కాలంగా పనులు సాగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై సమాచారమే లేకపోవడం దేనికి సూచన? సోయి దప్పి నిద్ర పోతున్నదని అనుకోవాలా? లేక నిద్ర నటిస్తూ ఎపికి పరోక్షంగా సహకరిస్తున్నదని అనుకోవాలా? చేతులు కాలినాక ఆకులు పెట్టుకున్నట్టు 50 శాతం పనులు పూర్తి అయినాక పత్రికల్లో వార్తలు వెల్లువెత్తగానే డ్యామేజీ కంట్రోల్లో భాగంగా కృష్ణా బోర్డుకు లేఖ రాయడం ఒక మొక్కుబడి చర్యగానే భావించాలి. ఇప్పుడు 50 శాతం పూర్తి అయిన ఆ అక్రమ ప్రాజెక్టును ఆపడం సాధ్యమేనా?
తెలంగాణ ప్రాజెక్టులను చట్టం పేరుతో అడ్డుకున్న ఎపి: ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన పాలమూరు -రంగారెడ్డి, డిండీ తదితర ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ అమలు పరచడానికి చర్యలు తీసుకుంటే కేంద్రానికి, కృష్ణా బోర్డుకు, కేంద్ర జల సంఘానికి విభజన చట్టంలో పైన ఉటంకించిన పేరాలను పేర్కొంటూ డజన్ల సంఖ్యలో లేఖలు రాసి, కోర్టుల్లో కేసులు వేసి వాటిని ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డుపడిన ఎపి ప్రభుత్వం, తాను మాత్రం కొత్త ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే చేపట్టడం గత దశాబ్ద కాలంలో మనం చూసిందే. తాగునీటి ప్రాజెక్టు పేరిట నాగార్జునసాగర్ జలాశయానికి కొడుతున్న గండి ఒక తాజా ఉదాహరణ.
ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయి కమిషన్ అయిన ప్రాజెక్టులకు కేంద్రం జారీ చేసిన గజిట్ నోటిఫికేషన్ ప్రకారం అనుమతులు పొందడానికి డిపిఆర్‌లను కేంద్ర జల సంఘానికి పంపితే, వాటికి అనుమతులు ఇవ్వొద్దని ఎపి ప్రభుత్వం సిడబ్ల్యుసికి బోలెడన్ని లేఖలు రాసింది. అయితే సిడబ్ల్యుసి మాత్రం ఆ లేఖలను పట్టించుకోకుండా అనుమతులను జారీ చేసింది. కేంద్రంలో చంద్రబాబు మద్దతుతో మోడీ ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉండడంతో సిడబ్ల్యుసి వైఖరిలో కూడా మార్పు గోచరిస్తున్నది. ఒక్కొక్కటిగా ఎదో కారణం చూపి డిపిఆర్‌లను వాపస్ చేస్తున్నది. కాళేశ్వరం మూడో టిఎంసి, పాలమూరు- రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డిపిఆర్‌లను 2024 లోనే వాపస్ చేస్తే, ఇప్పుడు తాజాగా సమ్మక్క ప్రాజెక్టు డిపిఆర్‌ను కూడా వాపస్ చేసింది. అదే సమయంలో ఎపి ప్రాజెక్టులకు మాత్రం కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నది.
సాగర్ గండి మరో పోతిరెడ్డిపాడు కాకుండా ఉంటుందా?: శ్రీశైలం జలాశయానికి గండికొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించడం కూడా తొలుత మద్రాస్ నగరానికి 15 టిఎంసిల తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టుగానే ప్రారంభమైంది. ఇంతింతై.. వటుడింతై అన్నట్టు.. 1500 క్యూసెక్కులు తరలించే తాగునీటి ప్రాజెక్టు ఎన్టిఆర్ హయాంలో నాలుగు గేట్లతో 11,500 క్యూసెక్కులు తరలించే సాగునీటి ప్రాజెక్టుగా రూపం మార్చుకున్నది. ఆ తరవాత వైఎస్సార్ హయాంలో మరో పది అదనపు గేట్ల నిర్మాణంతో 55,000 క్యూసెక్కులను తరలించే ప్రాజెక్టుగా అవతరించింది. ఇప్పుడు చంద్రబాబు హయాంలో పోతిరెడ్డిపాడు కింద తవ్విన శ్రీశైలం కుడిగట్టు కాలువ సిసి లైనింగ్ పూర్తి కావడంతో దానికి సామర్థ్యం 80వేల క్యూసెక్కులకు పెరిగింది. ఈ ఏడాది శ్రీశైలం జలాశయానికి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు కృష్ణా జలాలు చేరుకున్న దృశ్యాలు మనం చూసినాము.
ఇక గోదావరి బేసిన్లో చూస్తే.. పోలవరం- నల్లమలసాగర్ పేరుతో 200 టిఎంసిలు తరలించే ప్రాజెక్టుకు అనుమతులు సాధించేందుకు గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవతో రెండు రాష్ట్రాల మధ్య ఈ విషయంలో ఒక అంగీకారానికి రావడానికి కమిటీలు వేసి సమావేశాలు నిర్వహిస్తున్నది. తెలంగాణ ప్రజల ప్రతిఘటనకు జడిసి కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ప్రాజెక్టుకు అనుకూలంగా ఒప్పించేందుకు పాలమూరు ప్రాజెక్టుకు ఎన్ఒసిని ఎర వేస్తున్నట్టు ఇంతకు ముందు చర్చకు వచ్చింది.
అప్రమత్తతే శ్రీరామ రక్ష: ఇప్పుడు చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, కేంద్రం అండతో నాగార్జునసాగర్ ఉమ్మడి జలాశయానికి గండి కొట్టి 7 టిఎంసిలను తరలించే తాగునీటి ప్రాజెక్టుగా మొదలైన ఈ ప్రాజెక్టు మరో పోతిరెడ్డిపాడుగా మారదన్న గ్యారంటీ ఎవరు ఇస్తారు? శ్రీశైలం గండి తాగునీటి ప్రాజెక్టుగా మొదలై సాగునీటి ప్రాజెక్టుగా ఎట్లా విస్తరించిందో మన అనుభవంలో ఉన్నదే. తెలంగాణ ప్రజలు, పౌర సమాజం అప్రమత్తమై నిద్ర లేచి ప్రతిఘటించకపోతే నాగార్జునసాగర్ గండి కూడా మరో పోతిరెడ్డిపాడుగా మారి తీరుతుంది. మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. తస్మాత్ జాగ్రత్త!
శ్రీధర్‌రావు దేశ్‌పాండే
94910 60585
(రచయిత తెలంగాణ అస్తిత్వ వేదిక కో- ఆర్డినేటర్, విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజనీర్, సాగునీటి శాఖ)
-
Home
-
Menu
