భారత-ఇయు ఒప్పందం ఉభయతారకం

భారత యురోపియన్ యూనియన్ మధ్య దాదాపు 20 ఏళ్ల పాటు జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి జనవరి 27న ఒప్పందం కుదిరి అంతర్జాతీయ వాణిజ్యం లో కొత్త శకం ప్రారంభమైంది. గత నాలుగేళ్లలో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలలో ఇది నాలుగవది. మొత్తంగా 19వది. చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ ఒప్పందాలు వచ్చే యేడాది ఆరంభంలో అమలులోకి వస్తే 97% వస్తువుల ధరలు తగ్గి వాణిజ్యం ఇతోధికంగా వృద్ధి చెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి సత్వర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాను గొప్పదేశంగా చేసే పేరిట భారత సహా అనేక దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ వాణిజ్య విస్తరణకు అవరోధాలు కల్పిస్తున్న పూర్వరంగం లో ప్రపంచ జిడిపిలో 23% కలిగి, 200 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే భారత, 27 యురోపియన్ దేశాల యూనియన్ల మధ్య ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఏ రకంగా చూసినా పెద్ద ముందడుగు. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నారనే అక్కసుతో భారత దిగుమతులపై 25% అదనపు సుంకాలు విధించడం వల్ల ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుండి రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి లక్షలాది మంది మహిళలు, శ్రామికులు ఉపాధి కోల్పోయారు.
వెనెజువెలా చమురు నిల్వల దోపిడీకి ట్రంప్ ఆ దేశం అధ్యక్షుడు మదురోను రహస్య ఆయుధాలు ప్రయోగించి సైనిక విమానాలలో తరలించి అమెరికాలో నిర్బంధించారు. డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్ ను బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడానికి చేసిన యత్నాలను, అదనంగా 10% దిగుమతి సుంకం విధించడాన్ని డెన్మార్క్ ప్రభుత్వం, నాటో కూటమి సభ్యదేశాలు తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించడంతో ట్రంప్ తోకముడవక తప్పలేదు. ఇన్నాళ్లు నాటో కూటమి సభ్యదేశాలుగా అమెరికాకు వంత పాడినా తమపై కూడా ట్రంప్ బెదిరింపులకు దిగడంతో ఇయు దేశాలు 145 కోట్ల పెద్ద జనాభాతో పెద్ద మార్కెట్‌గా ఉన్న భారతతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా పెత్తందారీ, బెదిరింపు వైఖరి వల్ల భారతదేశం కూడా తమ ఉత్పత్తులకు అనువైన ప్రత్యామ్నాయ మార్కెట్‌ల కోసమే ఇయుతో ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. చైనా చవక ఉత్పత్తులు వచ్చిపడుతున్న వేళ ధరలు తగ్గడానికి ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఉభయులకు శ్రేయష్కరమని నేతలు గుర్తించారు. 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో ఇయు భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వస్తుసేవల వాణిజ్య శేషం భారత్‌కు అనుకూలంగా ఉంది.
దాదాపు 98% వాణిజ్యం సుంకాలు లేకుండా స్వేచ్ఛగా జరగడం వల్ల భారత ఉత్పత్తుల ధరలు తగ్గి గిరాకీ మరింత పెరిగి దేశీయంగా వస్త్రపరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమల్లో మన మహిళలు, శ్రామికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. 145 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉన్న భారత్‌లో మధ్యతరగతి, ఉన్నత వర్గాల సంఖ్య పెరుగుతున్నందున చాక్లెట్‌లు, బిస్కెట్‌లు, పాస్తా, తదితర ఉత్పత్తులను సుంకాలు లేకుండా అనుమతి ఇస్తారు. వివిధ రకాల కార్లపై ప్రస్తుతం ఉన్న 110% ఉన్న దిగుమతి సుంకాలను భారత్ క్రమేణా 10 శాతానికి తగ్గిస్తుంది. ధరలు తగ్గి విదేశీ కార్లకు గిరాకీ పెరగవచ్చు. గత యేడాది జులైలో బ్రిటన్ భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇంకా అమలు కాలేదు. అందువల్ల 27 ఇయు దేశాలు ఆమోదించాకే ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. అందుకు దౌత్యపర కృషి అవసరం. మిషన్- 500 పేరుతో 2030 నాటికి భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే ప్రయత్నాలు ట్రంప్ నిర్ణయాలు, అనిశ్చిత వైఖరి వల్ల ముందుకు సాగలేదు. ఇయు దేశాలపై ట్రంప్ ఒత్తిడి పని చేస్తే కొన్ని దేశాలు ఒప్పందం అమలులో జాప్యం చేయవచ్చు. అయితే దుందుడుకు వైఖరి వల్ల ఏకాకిగా మారుతున్న అమెరికా కూడా భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదు. అందులో భాగంగా భారత్‌పై విధించిన 25 శాతం సుంకం ఉపసంహరించవచ్చు.
ఇయు దేశాల కఠిన నియంత్రణా విధానాలు, భారత ఉత్పత్తులపై శానిటరీ, ఫైటో శానిటరీ, మొక్కలు, పశువులకు సంబంధించిన నిబంధనలు అమలులో అవరోధ కారణాలు కావచ్చు. ఉక్కు, సిమెంట్, అల్యూమినం, పరిశ్రమల నుండి వెలువడే బొగ్గుపులుసు వాయువులు, కార్బన్ బోర్డర్ నిబంధనలున్నాయి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి మరిన్ని పెట్టుబడులు కావాలి. అయితే భారత, ఇయు దేశాలు విలువ గొలుసులో వేర్వేరు స్థాయిల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో విరుద్ధ అంశాలు లేవు. ఉభయులు ఎవరి పరిశ్రమల్లో ఉత్పాదకశక్తి, నాణ్యత పెంచుకోవచ్చు. ప్రపంచంలో ఇయు 2వ పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, భారత్ ది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్‌లో కోట్లాది మంది జీవితాలతో ముడిబడ్డ సేద్యం, పాడి పరిశ్రమ, కోళ్ల ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను ఈ ఒప్పందంలో చేర్చలేదు. యూరప్ దేశాలనుండి అత్యాధునిక యంత్రాలు, వైద్య పరికరాలు, మందులు, సుంకాలు తగ్గి భారతీయులకు అందుబాటులోకి రావడం, ఆస్పత్రుల చికిత్సా రంగానికి, ప్రజారోగ్యం రంగాలకు మేలు. భారత చరిత్రలో ఇది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమనీ, అన్ని వాణిజ్య ఒప్పందాలకు మాతృక అని ప్రధాని మోడీ అభివర్ణించారు. కొత్త ఢిల్లీలో జరిగిన భారత ఇయు 16వ అగ్రనాయక సభకు మోడీ, ఇయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెరిలియన్, ఇయు కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కో స్టా అధ్యక్షత వహించారు.
భారత 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇయు నేతలను మన సాయుధ దళాల సాహస విన్యాసాలు, సాయుధ, వైజ్ఞానిక సంపత్తి ముఖ్యంగా బహు భాషలు, విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 2500 మంది కళాకారులు తమ తమ భాషలలో భిన్నత్వంలో ఏకత్వాన్ని భారతీయ ఆత్మ లా చేసిన అద్భుత నృత్యగాన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. భారత మహిళలు, తదితర శ్రామికులు అధికంగా పనిచేసే రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, ఆటో విడి భాగాలు, మందులు, ఔషధాలు, స్మార్ట్‌ఫోన్‌లు, సానపెట్టిన వజ్రాలు, డీజిల్, విమాన ఇంధనాలు ఎగుమతి చేస్తుంది. ఇయు దేశాలు మరిన్ని పెట్టుబడులు పెడతాయి. మన ఐటి, ఐటి ఆధారిత, ఆర్థిక, టూరిజం, నిర్మాణ తదితర రంగాల నిపుణుల సేవలను ఇయు దేశాలు ప్రోత్సహి స్తాయి. ఆ మేరకు వీసాలు ఇస్తారు. భారత ఇయు వాణిజ్యం ఇప్పటికే 220 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ద్వారా అది మరింత పెరిగే అవకాశముంది. అతిపెద్ద పొరుగు దేశం చైనాతో మనకు దిగుమతులు ఎక్కువ. వాణిజ్య శేషం భర్తీకి మరిన్ని ఎగుమతులు పెరగాలి. ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు మరిన్ని కుదిరి, వాణిజ్యం పెరిగితేనే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతుంది. అందుకు దీక్షాదక్షిత గల నాయకత్వం అవసరం.
- పతకమూరు దామోదర ప్రసాద్
94409 90381
-
Home
-
Menu
