పాషాణ హృదయాలపై ‘పెంబి’ ఆదివాసీల గర్జన

పాషాణ హృదయాలపై  ‘పెంబి’ ఆదివాసీల గర్జన
X

తెలంగాణ మ్యాప్‌లో ప్రస్తుత నిర్మల్ జిల్లాలోని ‘పెంబి’ ఒక చిన్న మండలం కావచ్చు, కానీ అక్కడ నివసించే గిరిజనుల పోరాట చరిత్ర హిమాలయమంత సాంద్రత కలిగినదిగానే చూడక తప్పదు. నిర్లక్ష్యానికి గురైన ఒక జాతి, తమ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పాలకుల కోటల పునాదులను కదిలించే ఒక ‘ప్రజా ఉద్యమం’ సాగించిన చరిత్రక ఆనవాళ్లతో తమ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుతం నినదిస్తున్నారు. నాడు కొమురం భీమ్ సాగించిన జల్ జంగిల్ జమీన్ పోరాటం నేటికీ పెంబి అడవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉందనట్లుగా ప్రస్తుత పరిస్థితి తెలుపుతున్నది. అభివృద్ధి అంటే హైవేలు, ఐటి టవర్లు, కాంక్రీట్ కట్టడాలు అని భావించే వారికి, పెంబిలోని దోత్తివాగు, కడం వాగులు ఒక చేదు నిజాన్ని గుర్తు చేస్తున్నాయి. వర్షాకాలం వస్తే ఈ మండలంలోని పలు ఆవాస గూడేలు ఒక ‘బహిరంగ జైలు’గా మారుతోందనటమే ఇందుకు సాక్ష్యం. ‘పెంబి’ మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉండగా 3 గ్రామపంచాయతీల పరిధిలోని 16 ఆవాస గ్రామాల పరిస్థితి అగమ్యగోచరమే.

ఈ 16 ఆదివాసీ ఆవాస గ్రామాలు (గోండు కోలం నాయకపోడు) వర్షకాలంలో ఎక్కడికక్కడ స్తంభించిపోవడం తప్ప మరోమార్గం లేని పరిస్థితి. దొందారి గ్రామపంచాయతీ పరిధిలోని చాకీరేవు గూడెంలో సుమారు 30 కుటుంబాలు ఉండగా ఒకటే బోరింగ్ ఉంది. ఈ లెక్కన కనీసం సరిపడ తాగునీటి వసతి కూడా లేదనేది అర్థం చేసుకోవాల్సిన అంశం. పక్కనే ఉన్న వాగులో అన్నీ రకాల నీటి సౌకర్యం తీర్చుకోవాల్సిందే. కరెంట్ ఉండదు. ఈ గూడెంలో ఫోన్ సిగ్నల్ ఉండదు. ఆ మండలంలో ఆదివాసీ ఆవాసాలకు, గూడెలకు వంతెనల నిర్మాణం లేకపోవడం వల్ల కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే ఆగడం లేదు. అక్కడ ఒక తరం విద్యకు, మెరుగైన వైద్యానికి దూరమవుతోందని గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ లేకపోవడం, అంగన్‌వాడీ పోస్టులు కూడా భర్తీ కాకుండా ఖాళీగా ఉండటం అంటే పెంబి మండలంలో పుట్టబోయే తరాన్ని పౌష్టికాహార లోపానికి, మరణానికి దగ్గర చేయడమే అవుతుంది.

పసుపుల, మందపెళ్లి, రాజురా వంతెనలు సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉండటం అనేది ఇంజనీరింగ్ లోపం కాదు, అది ప్రభుత్వ ప్రభుత్వాధికారుల నిర్లక్ష్య లోపం అనడంలో తప్పేమీ లేదేమో..! ముందే చెప్పినట్లుగా అభివృద్ధి అంటే కేవలం కాంక్రీటు కట్టడాలు మాత్రమే కాదు. అడవి బిడ్డల కన్నీళ్లు కూడా తుడవడమని పాలకులు ఎప్పుడు గుర్తిస్తారు? అభివృద్ధి నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నా పెంబి గడ్డపై ఆదివాసీల జీవితాలు మాత్రం ఇంకా వాగుల మధ్య, అడవి కంచెల మధ్య బందీ అయి ఉన్నాయంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటి పరిస్థితిలో తాజాగా సిపిఎం పార్టీ నేతృత్వంలో (మార్చి 21, 2026న) యాపలగూడ నుంచి ప్రారంభమైన పాదయాత్రను పెంబి గిరిజనులు ప్రారంభించారు.

దీనికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉడుత రవీందర్, నిర్మిల్ జిల్లా కార్యదర్శి గౌతం కృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యులు సురేష్, స్థానిక నాయకులు శంభు, నిర్మలాభాయ్, ధర్మరాజు, పగ్గు తదితరులు నాయకత్వం వహిస్తున్నారు. పెంబి మండల అభివృద్ధిని కాంక్షిస్తూ తలపెట్టిన ఈ పాదయాత్రను రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా స్వాగతించాలి. ఇది కేవలం ఒక రాజకీయ కార్యక్రమం కాదు. ఒక రకంగా ఇది పెంబి గిరిజన గుండె రగిలించిన నిప్పుకణికగా భావించాల్సి వస్తున్నది. ఎందుకంటే దోత్తివాగు, కడం వాగులు నేటికీ ఆదివాసీలకు శాపంగా మారాయి. మరోవైపు అత్యవసర వైద్యం అందక గర్భిణులు, రోగులు వాగుల ఒడ్డునే ప్రాణాలు వదిలేస్తున్న సందర్భాలు ఉన్నాయని ఆ ప్రాంతవాసులు ఆవేదన చెందుతున్నారు. ఈ స్థితిని చూసి పాలకులు, ప్రభుత్వాధికారుల గుండె కరగకపోవడం శోచనీయమే అవుతుంది. మరోవైపు పసుపుల, మందపెళ్లి, రాజురా వంతెనల నిర్మాణం దశాబ్దాలుగా ఎందుకు అసంపూర్తిగా ఉందో సమాధానం చెప్పే నాథుడే లేడు. ఇంకోవైపు పోడు భూములే గిరిజనుడి జీవనాధారం.

తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పట్టాలు ఇవ్వకుండా అటవీ శాఖ అడ్డంకులు సృష్టించడం అన్యాయమే అవుతుంది. ‘అడవి మాది.. అడవిలో పుట్టిన చెట్టు, పుట్ట మావి.. కానీ మా భూమి మాది కాదా..?’ అని పెంబి ప్రాంత గిరిజనులు పడుతున్న ఆవేదన నేడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకరకంగా ‘అడవిని నమ్ముకున్న వాడికి అడవిపై హక్కు లేకపోవడం’ ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం. పోడు భూములకు హక్కు పట్టాలు ఇవ్వకపోవడం ద్వారా ప్రభుత్వం గిరిజనులను వారి సొంత గడ్డపైనే ‘ఆక్రమణదారులు’గా చిత్రీకరిస్తోంది. అడవి అంటే చెట్లు మాత్రమే కాదు, ఆ చెట్ల నీడన బతికే మనుషులు కూడా అని ఈ వ్యవస్థ గుర్తించకపోవటం దురదృష్టకరమైన అంశం. ఇలాంటి అనేక సమస్యలన్నీ పెంబి మండలాన్ని వెనుకబాటుతనానికి సాక్ష్యంగా నిలుపుతున్నది. ఈ పరిస్థితుల్లో సిరిచల్మా నుంచి పులగంపండ్రి వరకు రహదారులు పడాలన్నా, ప్రతి గిరిజనుడికి పట్టా అందాలన్నా, కరెంటు వెలుగులు వికసించాలన్నా ఐక్యతతోనే సాధ్యం. ఆ ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఉంది.

పెంబి గడ్డపై జరుగుతున్న ప్రస్తుత పాదయాత్ర కేవలం నడక మాత్రమే కాదు, అభివృద్ధిని నిలదీసే నడక. హక్కులను సాధించుకునే వరకు విశ్రమించని పోరాటంగా చూడక తప్పదు. అడవి బిడ్డల ఆత్మగౌరవం చాటడానికి, రాబోయే తరాల బంగారు భవిష్యత్తు కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పాలకులారా మాకు కావాల్సింది ఓట్ల పండగలో ఇచ్చే హామీలు కావు, మా వాగులపై వంతెనలు, మా భూములపై హక్కులు, మా గూడెంలో విద్య, వైద్యం!’ సొంతగూడు కావాలని ఈ పాదయాత్రలో వినిపించే ప్రతి అడుగు చప్పుడు పాలకుల నిద్రను చెడగొట్టేలా ఉండాలి. ఇది కేవలం సిపిఐ(ఎం) పిలుపు మాత్రమే కాదు, పెంబి గడ్డపై దశాబ్దాలుగా అణచివేయబడిన ఆవేదనకు ప్రతినిధిగా నిలువాల్సి ఉంది. కేవలం తమ పార్టీ కార్యక్రమంలాగా కాకుండా పెంబి మండల సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించే యుద్ధభేరి కావాల్సిన అవసరం ఉంది.

- రాజేందర్ దామెర

Tags

Next Story