ఆర్థిక అవసరాలకు అంకెల సంకెళ్లు?

ఆదాయం ఉంది. నెలనెలా సంపాదన వస్తోంది. అవసరమైతే రుణం తీసుకుని గడువులోగా చెల్లించగలమనే నమ్మకమూ ఉంది. అయినా రుణ దరఖాస్తు పరిశీలనలో ముందుగా ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే.. మీ క్రెడిట్ స్కోరు ఎంత? గతంలో ఒక్కసారి వాయిదా ఆలస్యమైనా, ఇప్పటికే మూసివేసిన ఖాతా వివరాలు నివేదికలో తప్పుగా నమోదైనా ఆ చిన్న పొరపాటు నేటి అవసరానికి అడ్డంకిగా మారవచ్చు. డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్న కొద్దీ వ్యక్తిగత రుణ చరిత్రకు ప్రాధాన్యం పెరుగుతోంది. మరి గతపు అంకెలే నేటి ఆర్థిక సామర్థ్యాన్ని నిర్ణయించాలా? రుణ చెల్లింపుల్లో క్రమశిక్షణ అవసరమే. కానీ ఒకే స్కోరు ఆధారంగా వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును అంచనా వేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది.
దేశంలో ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్ హై మార్క్ అనే నాలుగు గుర్తింపు పొందిన క్రెడిట్ సమాచార సంస్థలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ ఖాతాలకు సంబంధించిన వివరాలను వీటికి అందిస్తాయి. సిబిల్ సంస్థ 2000 ఆగస్టులో స్థాపించబడగా, క్రెడిట్ బ్యూరో కార్యకలాపాలు 2004 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. 2005లో రూపొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) చట్టం 2006 డిసెంబరు 14 నుంచి అమల్లోకి రావడంతో ఈ రంగానికి చట్టబద్ధమైన నియంత్రణ ఏర్పడింది. సిబిల్ స్కోరు సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. రుణ చెల్లింపుల చరిత్ర, అప్పుల వినియోగం, ఖాతాల ప్రస్తుత స్థితి వంటి అంశాలు స్కోరుపై ప్రభావం చూపుతాయి. సమాచార తాజాదనాన్ని పెంచేందుకు ఆర్బీఐ 2025 డిసెంబరు 4న జారీ చేసిన సవరణలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం నెలలో 9, 16, 23, చివరి తేదీలను రుణ సమాచార సమర్పణకు ప్రాతిపదికగా నిర్ణయించారు. మధ్యంతర వివరాలను నాలుగు క్యాలెండర్ రోజుల్లో, నెలాఖరు పూర్తి సమాచారాన్ని తదుపరి నెల 5లోగా సమర్పించాలి. సమాచారాన్ని వేగంగా చేరవేయడమే కాకుండా, దాని ఖచ్చితత్వం, గోప్యత, తప్పుల సవరణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.
సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఆర్బీఐ వార్షిక అంబుడ్స్‌మన్ నివేదికలోని గణాంకాలు దోహదపడతాయి. 2025 డిసెంబరు 1న విడుదలైన 2024-25 నివేదిక
ప్రకారం, క్రెడిట్ సమాచార సంస్థలపై నమోదైన ఫిర్యాదులు 2022-23లో 1,039 ఉండగా, 2023-24లో 3,847కు, 2024-25లో 4,585కు చేరాయి. తాజా ఏడాది ఫిర్యాదుల్లో రుణాలు, అడ్వాన్సులకు సంబంధించినవి 3,856 కాగా, క్రెడిట్ కార్డులపై 262, ఇతర అంశాలపై 467 నమోదయ్యాయి. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన ఫిర్యాదుల వాటా మొత్తం సంఖ్యలో 84.1 శాతంగా ఉంది. ఈ గణాంకాలు ఫిర్యాదుల సంఖ్యను మాత్రమే తెలియజేస్తాయి. ప్రతి ఫిర్యాదులోనూ సంస్థ తప్పిదం నిర్ధారణైందని భావించరాదు. నివేదిక ప్రకారం 654 ఫిర్యాదులు ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి రాని సంస్థలకు సంబంధించినవి. అయినప్పటికీ పెరుగుతున్న ఫిర్యాదులు సమాచార నాణ్యత, సేవల ప్రమాణాలు, సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. రుణ ఖాతా మూసివేసినా వివరాలు నవీకరణ కాకపోవడం, చెల్లించిన బకాయి ఇంకా నివేదికలో కనిపించడం వంటి సమస్యలు వ్యక్తుల రుణ పరిశీలనను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అందుకే ప్రతి ఫిర్యాదునూ సమయానికి పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి, తగిన పరిష్కారం చూపడం అవసరం.
చిరు వ్యాపారికి పెట్టుబడి అవసరం కావచ్చు. రైతుకు సాగు ఖర్చుల కోసం, కుటుంబానికి వైద్యం లేదా విద్య కోసం రుణం అవసరమవచ్చు. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ నివేదికలో పొరపాటు ఉండటం లేదా చెల్లించిన బకాయి వివరాలు నవీకరణ కాకపోవడం రుణ పరిశీలనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, ఇంతవరకు అధికారికంగా రుణం తీసుకోని వ్యక్తికి క్రెడిట్ చరిత్ర లేకపోవచ్చు. దానిని ప్రతికూల చెల్లింపు చరిత్రతో సమానంగా చూడకూడదు. తక్కువ స్కోరు ఉన్న ప్రతి ఒక్కరికీ రుణం నిరాకరిస్తారని, అధిక స్కోరు ఉన్నవారికి తప్పనిసరిగా రుణం లభిస్తుందని చెప్పలేం. బ్యాంకులు ఆదాయం, వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపార స్థిరత్వం, ప్రస్తుత అప్పులు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ఆర్బీఐ నిర్దేశించిన రుణ మదింపు మార్గదర్శకాల ప్రకారం రుణగ్రహీత ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి వయస్సు, వృత్తి, ఆదాయ వివరాలు వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల క్రెడిట్ స్కోరు ఒక సూచిక మాత్రమే. వ్యక్తి ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి అది ప్రత్యామ్నాయం కాదు. గత రుణ చరిత్రతోపాటు ప్రస్తుత ఆదాయం, చెల్లింపు సామర్థ్యాన్ని సమగ్రంగా పరిశీలించినప్పుడే న్యాయమైన రుణ నిర్ణయం సాధ్యమవుతుంది.
సమస్యకు పరిష్కారం వ్యక్తిగత రుణ క్రమశిక్షణతోపాటు పారదర్శక వ్యవస్థలో ఉంది. వ్యక్తులు ప్రతి సంవత్సరం తమ క్రెడిట్ నివేదికలను పరిశీలించి, తప్పులుంటే సంబంధిత బ్యాంకు లేదా క్రెడిట్ సమాచార సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఫిర్యాదు 30 క్యాలెండర్ రోజుల్లో పరిష్కారం కాకపోతే, నిబంధనల్లో పేర్కొన్న అర్హతలు నెరవేరిన సందర్భాల్లో ఆలస్యానికి రోజుకు రూ.100 చొప్పున పరిహారం పొందే అవకాశం ఉంది. ఇందులో రుణ సంస్థకు 21 రోజులు, క్రెడిట్ సమాచార సంస్థకు మిగిలిన తొమ్మిది రోజుల గడువు ఉంటుంది.
ప్రతి క్రెడిట్ సమాచార సంస్థ నుంచి ఏడాదికి ఒకసారి ఉచిత పూర్తి క్రెడిట్ నివేదిక పొందవచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే వర్తించే నిబంధనల ప్రకారం ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. బ్యాంకులు క్రెడిట్ స్కోరుతోపాటు ప్రస్తుత ఆదాయం, అప్పుల భారం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ సమాచార సంస్థలు తప్పులను సకాలంలో సరిచేసి, వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందించాలి. రుణ క్రమశిక్షణను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, సమాచార లోపాల వల్ల సామాన్యుడికి అన్యాయం జరగకుండా చూడటమూ అంతే ముఖ్యం. గత చరిత్రను గౌరవిస్తూనే నేటి వాస్తవ పరిస్థితిని గుర్తించినప్పుడే అంకెలు ఆర్థిక అవకాశాలకు వారధులవుతాయి.. సంకెళ్లు కావు.
-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
96404 66464
Tags
-
Home
-
Menu
