సామాజిక ప్రళయం-ధిక్కార స్వరం

సామాజిక ప్రళయం-ధిక్కార స్వరం
X

గద్దర్ ఒక సామాజిక ప్రళయం, ఆయన ఆట, పాట, మాట సమాజ చైతన్యంలో మరో ప్రళయం. సమసమాజ నిర్మాణం కోసం అణగారిన వర్గాలను వివక్ష, అసమానతుల నుండి ఆత్మగౌరవ కోసం నిరంతరం పాటుపడిన మహానుభావుడు ప్రజాయుద్ధనౌక ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. చిన్ననాటి నుండి గ్రామీణ ప్రాంతంలోని యాస భాషతో బుర్రకథలు, కథలు, పాటలు పద్యాలతో పల్లె జనాన్ని మెప్పించి వారి అభిమానం సంపాదించిన గద్దర్ అలియాస్ గుమ్మడి విట్టల్ రావు ప్రైమరీ స్థాయి నుండి ఎన్ని అష్టకష్టాలు ఉన్నా చదువులతోపాటు తన పాటలను కూడా మోసుకోని వచ్చిన గద్దర్ ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌లో చేరినప్పటి నుండి అప్పుడే ప్రారంభమైన నక్సల్‌బరి ఉద్యమాలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల వైపు ఆకర్షితుడయ్యాడు. వీటితోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో పేదల ఇండ్ల కోసం జరుగుతున్న భూ పోరాటంలో హైకోర్టు న్యాయవాది జి ఎం అంజయ్య లాంటి వారితో పరిచయం ఏర్పడి బస్తీల్లో తిరిగి ప్రజాచైతన్యం చేయడానికి కృషి చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళారు అప్పటినుండి ఆయన తన ఇంజినీరింగ్ చదువును మానివేసి ప్రజా ఉద్యమాల పైన మొగ్గు చూపారు. 1972లో జరిగిన ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలలో పాల్గొన్నారు.

1979లో వచ్చిన మాభూమి సినిమాలో బండెనుక బండి గట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకో నైజాం సర్కరోడా గోల్కొండ కోట కింద గోరి కడతం కొడుకో అనే పాట ఒక సంచలనం, చైతన్యం. ఒకవైపు సికింద్రాబాద్ మారేడుపల్లిలోని కెనరా బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తూనే ప్రజా ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు. కళాశాల సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కుటుంబ నియంత్రణ, పారిశుద్ధ్యంపైన పాటలు రాసి గ్రామగ్రామాన బుర్రకథలు నాటకాలు వేసి ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పేవారు. ఈ సందర్భంగా ఆయన గమనించిన కుల వివక్ష, అంటరానితనాన్ని గమనించి తిరుగుబాటు చేయాలని అటువైపు అడుగులు వేసి పాటలు రాశారు. భారత దేశం భాగ్యసీమరా! పాడిపంటలకు కుదవలేదు! ఎప్పుడు ఎండని జీవనదులు ఉండి సకల సంపదలు కలిగిన దేశంలో కరువెట్లుంది నాయన, అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు అనే పాట. చాలా ప్రాచుర్యం పొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపాటు భారతదేశంతో ప్రపంచ దేశాల దృష్టిని మరలించిన గద్దర్ ప్రపంచ వాగ్గేయకారుడయ్యారు.

1990లో వరంగల్లో నిర్వహించిన రైతు కూలి మహాసభ ఒక చరిత్ర భారతదేశవ్యాప్తంగా ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీపుల్స్‌వార్ పార్టీ ప్రాబల్యం అధికంగా ఉన్న సమయంలో రైతు కూలీల రైతుల సమస్యల పైన వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయం మార్కెట్ 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ చరిత్రాత్మకం వామపక్ష నక్సలైట్ ఉద్యమాల్లో భారీ సభగా చరిత్రకారులు చెబుతున్నారు. గుమ్మడి విట్టల్ రావు అలియాస్ గద్దర్ స్వగ్రామం మెదక్ జిల్లా, తూప్రాన్ పట్టణం. తండ్రి శేషయ్య తల్లి లచ్చుమమ్మలకుకు 31 జనవరి 1949న జన్మించారు. ఇద్దరు సోదరులు ముగ్గురు సోదరిమణులున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నిర్బంధం జరుగుతున్న క్రమంలో ప్రత్యేక తెలంగాణ డిమాండ్ ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు చర్చలు ప్రారంభమైనాయి. 1997 జనవరి ప్రాంతంలో భువనగిరిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోజు రోజుకో ఎన్‌కౌంటర్లు పెరిగిపోవడంతో ప్రజల నుండి పూర్తిగా వ్యతిరేకత ఇలాంటి సమయంలో పౌర సమాజం నుండి ప్రభుత్వానికి డిమాండ్ వచ్చింది పీపుల్స్ వార్, జనశక్తి వామపక్ష గ్రూపులతో చర్చలు జరిపి శాంతి నెలకొల్పాలని కమిటీ ఏర్పడింది. ప్రతినిధులుగా ఎస్‌ఆర్ శంకరన్, హైకోర్టు ఎడ్యుకేట్ బొజ్జ తారకం, ఆచార్య హరగోపాల్, వరవరరావు, గద్దర్‌లు ఉన్నారు.ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో వామపక్ష భావాలు కలిగిన వారందరూ గద్దర్ సారథ్యంలో ప్రజాఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. కానీ ప్రజాఫ్రంట్ ఎన్నికల్లో పాల్గొనమని చెప్పడంతో మద్దతుదారులంతా వెనక్కి వెళ్లారు. రాజ్యాంగ రక్షణ కోసమని గద్దర్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను భార్య విమల, కుమారుడు జీవిసూర్య కేంద్రతో కలిసి ఢిల్లీలో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గద్దర్ తో చర్చలు జరిపిన పిదప ఇంద్రవెల్లి నుండి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆనాటి సిఎల్‌పి నాయకుడు నేటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ద్వారా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ మేరకు గద్దర్ ఆదిలాబాద్‌లో జరిగిన ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు.

పాదయాత్ర ముగింపు సమావేశానికి కూడా రెండు రోజుల ముందుగానే ఆయన ఖమ్మం చేరుకొని ముగింపు సమావేశం హాజరయ్యారు. కానీ అప్పటికి ఆయన అనారోగ్యానికి గురికావడంతో కేవలం రాహుల్ గాంధీని కలిసి అభినందించి స్టేజి నుంచి దిగిపోయారు. అప్పటికి అనారోగ్యానికి గురైన ఆయన ఖమ్మం నుండి వచ్చి హైదరాబాదులో అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఒకవైపు పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతునిస్తూనే తనకు కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలని గద్దర్ ప్రజా పార్టీని రిజిస్టర్ చేయించారు. గద్దర్‌కు సినిమాలతో విడదీయరాని అనుబంధం ఉంది. మాభూమి సినిమాలో బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావురో నైజాం సర్కరోడా! పాట 1980 దశకంలో సామాజిక విప్లవం ఆలోచింపజేసింది. ఆర్ నారాయణమూర్తి తీసిన ఒరేరిక్షా సినిమాలో రాసిన ‘మల్లెచెట్టుకు పందిరి వోలె’, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మ అనే పాట మరో సంచలనం. ఇలా సినిమా రంగం ప్రవేశం చేసిన గద్దర్ నారాయణమూర్తి దర్శకుడు శంకర్, మోహన్ బాబు సినిమాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సూచనలు, సలహాలు ఇస్తూనే అనేక పాటలు రాశారు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న క్రమంలో జై బోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా! పోరు తెలంగాణ! అంటూ గర్జించారు. చివరన చిరంజీవితో గాడ్ ఫాదర్ లో నటించారు. ఇంకా విడుదల కానీ ఇండియా ఫైల్స్‌లో! బానిస లారా లేండి రా! బానిస బతుకులు వద్దురా!! అంటూ మరో చైతన్య గీతం నటించి పాడారు. అసమానతలు నెలకొన్న ప్రతిసారీ తన పాటలు చైతన్యంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజాన్ని జాగృతం చేశారు. ఒరే రిక్షా సినిమాకు, జై బోలో తెలంగాణ సినిమాకు రెండు పర్యాయాలు నంది అవార్డులు వచ్చిన ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఖమ్మంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సమావేశం కు హాజరైన నాటి నుండి అనారోగ్యానికి గురైన 20 జులై 2023న అపోలో స్పెక్ట్రమ్ ఆస్పత్రిలో చేరారు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు గుండెకు సంబంధించిన ఆపరేషన్ ఆగస్టు 3 న నిర్వహించారు. ఆపరేషన్ తర్వాత ఆరోగ్య సమస్యలు రావడంతో 6 ఆగస్టు తుది శ్వాస వదిలారు. ఏ పోలీసు తూటాలకు ప్రజల కోసం ఎదురొడ్డి నిలబడ్డ గద్దర్‌కు అదే పోలీసులు ఆఖరున సెల్యూట్ చేసి గౌరవించారు. ఆయనే ప్రజాయుద్ధ నౌక గద్దర్.

- అస శ్రీరాములు

94400 37196

- నేడు గద్దర్ జయంతి

Tags

Next Story