ప్రాణంపై వ్యాపారమా?

Profiteering at the cost of lives?
క్యాన్సర్.. ఈ ఒక్క మాట వింటేనే గుండెల్లో రాయిపడుతుంది. వ్యాధి కలిగించే శారీరక వేదన ఒకవైపు అయితే, ఆ చికిత్సకు అయ్యే ఖర్చు కుటుంబాన్ని ఆర్థికంగా గుల్లచేయడం మరొకవైపు. ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వేళ, ప్రాణరక్షక మందు రోగికి ఏకైక ఆశ. కానీ, అదే మందు ఆశల పందిరిని కూల్చేసే ఆర్థిక బాంబులా మారితే? రోగి ప్రాణాన్ని నిలబెట్టాల్సిన ఔషధం.. వ్యాపారుల లాభాల దాహానికి సాధనంగా మారితే? తాజాగా భారత సుప్రీం కోర్టు లేవనెత్తిన ప్రశ్నలు, మహారాష్ట్రలో బయటపడిన దారుణ వాస్తవాలు దేశ వైద్య వ్యవస్థలోని కుళ్ళిన కోణాన్ని నడిరోడ్డుపై నిలబెట్టాయి.
పది రెట్ల దోపిడీ.. ఇది ‘స్వేచ్ఛా మార్కెట్’ కాదు, ‘బహిరంగ దోపిడీ’! మందుల తయారీదారు లేదా మార్కెటింగ్ సంస్థ నుంచి రిటైలర్‌కు రూ. 2,700 లభించే ఒక అత్యవసర క్యాన్సర్ మందుపై ఏకంగా రూ. 27,000 గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పి)ముద్రించి ఉండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతాల ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు ఇది నిర్లక్ష్యం కాదు, రోగులపై జరుగుతున్న ‘బహిరంగ దోపిడీ’. తయారీ ధర (పిటిఆర్), గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పి) మధ్య వ్యత్యాసం ఉండటం సహజమే. రవాణా, నిల్వ, పంపిణీ, పన్నులు, మధ్యవర్తుల మార్జిన్లకు కొంత వెసులుబాటు అవసరమే. కానీ, ఏకంగా 1000 శాతం (పది రెట్లు) వ్యత్యాసం ఉండటాన్ని ఏ రకమైన మార్కెట్ సూత్రాల ఆధారంగా సమర్థించుకోగలం? రూ. 2,700 మందుపై రూ. 24,300 మేర పిండుకుంటున్న ఈ అదనపు మొత్తం ఎవరి జేబుల్లోకి వెళ్తోంది?
ఔషధాల విషయంలోనే కాదు, ఆసుపత్రులలో ఉపయోగించే వైద్య వినియోగ వస్తువులు, పరికరాల రూపంలోనూ రోగుల జేబులకు పెద్ద కన్నమే పడుతోంది. మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలనా విభాగం (ఎఫ్‌డిఎ) జరిపిన తనిఖీల్లో వెల్లడైన నిజాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఐవి ఇన్ఫ్యూషన్ సెట్ వాణిజ్య కొనుగోలు ధర రూ.11.05 కాగా, దానికి రోగి చెల్లించే ఎంఆర్‌పి రూ. 325 (సుమారు 2,841% శాతం మార్కప్!). సిరంజి ఆసుపత్రి కొనుగోలు ధర రూ. 7 లోపే కాగా, బిల్లులో ముద్రించే ఎంఆర్‌పి రూ. 57. మహారాష్ట్ర ఉదంతం నేరుగా క్యాన్సర్ మందులకు సంబంధించినది కాకపోయినప్పటికీ, వైద్య రంగాన్ని పట్టిపీడిస్తున్న ‘విచ్చలవిడి లాభాపేక్ష’కు ఇది నిలువుటద్దం. రోగి ఆసుపత్రి బెడ్‌పై ఉన్నప్పుడు అతనికి లభించే ఐవి సెట్ లేదా సిరంజిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు. ఆ బలహీనతనే ఆసుపత్రులు, కార్పొరేట్ శక్తులు తమ లాభాల యంత్రంగా మార్చుకుంటున్నాయి.
మన దేశంలో ఔషధాల ధరలను నియంత్రించడానికి ఔషధ ధరల నియంత్రణ ఉత్తర్వు (డిపిసిఒ -2013) ఉంది. జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పిపిఎ) ఉంది. అత్యవసర ఔషధాల జాతీయ జాబితా (ఎన్‌ఎల్‌ఇఎం) ద్వారా వందలాది మందులపై సీలింగ్ ధరలు ఉన్నాయని, 131 క్యాన్సర్ నిరోధక మందుల ధరల నియంత్రణ వల్ల రోగులకు వందల కోట్ల ఆదా అవుతోందని ప్రభుత్వం గణాంకాలు చెబుతోంది. పిటిషనర్ తరఫున డాక్టర్ కిషన్ చంద్ర జైన్ వాదించినట్లు, ఎన్‌పిపిఎ పరిధిలోకి వచ్చే ‘షెడ్యూల్ ఔషధాల’ కంటే పరిధిలోకి రాని ‘నాన్- షెడ్యూల్ కేటగిరీ’ మందులే మార్కెట్లో సింహభాగం ఆక్రమిస్తున్నాయి. ఇటువంటి మందుల ప్రాథమిక ప్రారంభ ధర (ఇనీషియల్ ప్రైస్ ఫిజాక్షన్)పై ఎలాంటి కఠినమైన నియంత్రణ లేకపోవడమే కంపెనీలకు ఆయుధంగా మారింది. ‘మందు ఉచితంగా లభించినా సరిపోదు.. జన ఔషధి కేంద్రాల్లో అది దొరకనప్పుడు రోగి ఎక్కడికి వెళ్లాలి?’ అన్న సుప్రీం కోర్టు ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు.
ఈ అధిక ధరల ప్రభావం కేవలం వ్యక్తిగత రోగుల కుటుంబాలపైనే కాదు, మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థపై పడుతోంది. ఆయుష్మాన్ భారత్, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య భద్రతా పథకాల కింద రీయింబర్స్‌మెంట్ పొందేటప్పుడు, ఈ మోతాదుకు మించిన ఆసుపత్రి బిల్లుల భారాన్ని అంతిమంగా మోస్తున్నది సామాన్య పన్ను చెల్లింపుదారుడే. రోగుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పథకాల నిధులను సైతం అడ్డగోలుగా లాక్కుంటున్న వైనంపై ఆడిటింగ్ జరగాల్సిన అత్యవసరత ఉంది. వైద్య రంగంలో లాభాలు ఉండకూడదని ఎవరూ అనరు. ఫార్మా కంపెనీలకు పరిశోధన (ఆర్ అండ్ డి) ఖర్చులు, నాణ్యతా ప్రమాణాలు, పంపిణీ వ్యయాలు ఉంటాయి. కానీ, లాభానికి ద్రోహానికి మధ్య ఉన్న సరిహద్దు రేటును చెరిపేయడమే నేరం. ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు తక్షణమే ఈ క్రింది చర్యలు చేపట్టాలి. రిటైలర్‌కు ఇచ్చే ధర (పిటిఆర్), ఎంఆర్‌పిల మధ్య ఉండే మార్జిన్‌పై కఠినమైన గరిష్ఠ పరిమితి విధించాలి. ప్రతి ప్రాణాధార మందు, వైద్య పరికరం తయారీ ధర, పిటిఆర్, ఎంఆర్‌పి వివరాలు ప్రజలకు యాప్/ వెబ్‌సైట్ ద్వారా స్పష్టంగా కనిపించాలి.
ఆసుపత్రులు వాడే సిరంజిలు, ఐవి సెట్లు, స్టెంట్లు, గ్లోవ్స్ వంటి వస్తువులను కూడా ఎన్‌పిపిఎ కఠిన నియంత్రణ పరిధిలోకి తేవాలి. అత్యవసర, క్యాన్సర్ ఔషధాలన్నీ జన ఔషధి కేంద్రాలలో నిరంతరం అందుబాటులో ఉండేలా సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆసుపత్రి తలుపు దాటిన తర్వాత ఒక మనిషి కేవలం ఒక వినియోగదారుడు కాదు...జీవన్మరణ పోరాటం చేస్తున్న బాధితుడు! అతడి ఆవేదనను, కుటుంబ బలహీనతను మార్కెట్ అవకాశంగా మార్చుకోవడం నాగరిక సమాజానికి సంకేతం కాదు. సుప్రీం కోర్టు సెప్టెంబర్ 29న చేపట్టబోయే తదుపరి విచారణ కేవలం వ్యాఖ్యలకే పరిమితం కాకూడదు. కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్రమైన, పారదర్శకమైన ధరల విధానాన్ని దేశం ముందు ఉంచాలి. ప్రాణానికి ధర కట్టలేం.. కానీ ప్రాణంమీద పిండుకునే లాభానికి మాత్రం కచ్చితంగా పరిమితి ఉండాల్సిందే!
కాలగిరి శ్రీనివాసరెడ్డి
90101 28884
Tags
-
Home
-
Menu
