యుపిఐ చార్జీలు ప్రజలకు భారమే!

UPI charges are burden on the public!
అక్టోబర్ 15 నుండి దేశవాసులపై కేంద్రం మరో పన్నును విధించబోతోంది. యుపిఐ చెల్లింపులపై రూ. 2 వేలు దాటిన ఆర్థిక లావాదేవీలపై 0.4 % మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎం డిఆర్)పేరిట పన్ను వసూలుకు తెర లేవనుంది. ఒక్కో డబ్బు మార్పిడికి కనీసం రూ. 5 నుండి గరిష్టంగా రూ. 300 దాకా ఈ అదనపు భారం వినియోగదారులపై పడనుంది. దీని పై కేంద్రం ఎన్ని చిలుక పలుకులు చెప్పినా ఇది ముమ్మాటికీ జనంపై ఆర్థిక భారం మోపడమే. ప్రజలకు అలవాటైపోయిన విధానాన్ని ఖజానాకు రాబడి మార్గంగా మార్చుకోవడమే దీని ఉద్దేశం. ఇలా వసూలు అయ్యే సొమ్మును బ్యాంకులకు, ఈ యాప్‌లు నడిపే సంస్థలకు పంచుతామని ఎన్‌పిసిఐ అంటోంది. 2021 లో ప్రజలను ఆన్‌లైన్ పేమెంట్ వైపు మళ్లించేందుకు అప్పుడు నామమాత్రంగా ఉన్న ఎండిఆర్‌ను ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు ద్వారా సర్దుబాటు చేస్తూ వస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రూ. 2000 కోట్లు ఇందుకోసం కేటాయించారు. అయిదేళ్ల కాలంలో ఆన్‌లైన్ చెల్లింపులు లక్షల కోట్లలో పెరిగిపోవడం వల్ల ఈ సొమ్ము సరిపోదు. అందుకే ఈ కొత్త కోతలు మొదలుకానున్నాయి.
మనం ఏది కొన్నా, ఎవరికీ డబ్బులు పంపాలన్నా మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకున్న గూగుల్ పే, ఫోన్ పే లాంటి డిజిటల్ వాలెట్ ద్వారా ఆన్ లైన్ పేమెంట్ చేస్తున్నాం. పదేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత కోవిడ్ - 19 విజృంభణల కారణంగా జనం స్మార్ ఫోన్లు కొని, చెల్లింపులకు వాటిపై ఆధారపడడం ఎక్కువైంది. దేశంలోని 120 కోట్ల ఫోను వాడకందార్లలో సగానికి పైగా దీనికి అలవాటు పడిపోయారు. పర్సులో డబ్బులు పెట్టుకోవడం, బ్యాంకుల్లో క్యాష్ డ్రా చేయడం తగ్గిపోయింది. ఎటిఎంల వద్ద కూడా రద్దీ తగ్గింది. బ్యాంకులు ఎటిఎంల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. డబ్బు చలామణి ఎటిఎంల ద్వారా 10% కాగా, ఇంటర్ నెట్ పేమెంట్ 5%, మొబైల్ పేమెంట్ 85% కి పెరిగింది. ఆన్‌లైన్ చెల్లింపులవల్ల కరెన్సీ ముద్రణ కూడా తగ్గిపోయింది. గత అయిదేళ్ల కాలంలో ఆర్‌బిఐ కొత్త నోట్ల ముద్రణకోసం చేసే ఖర్చు గణనీయంగా పడిపోయింది. దీని కోసం ఏటా సుమారు రూ. 6వేల కోట్ల దాకా అయ్యే ఖర్చు రూ. 4.5 కోట్లకు తగ్గింది. కరెన్సీ నోటు జీవితకాలం 4 ఏళ్లు మాత్రమే. పనికిరాని నోట్ల స్థానంలో కొత్త వాటి కోసం ఏటా రూ. వేయి కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. ఆర్‌బిఐ ప్రవేశ పెట్టనున్న ప్లాస్టిక్ కరెన్సీతో ఈ ఖర్చు కూడా తగ్గిపోతుంది.
ఈ రకంగా నగదు లావాదేవీలు తగ్గి బ్యాంకుల్లో సిబ్బంది అవసరం కూడా తగ్గిపోయింది. బ్యాంకుల్లో నియామకాలు తగ్గి ఏడాదికేడాది సిబ్బంది సంఖ్య కుదించుకుపోతోంది. ఇవన్నీ బ్యాంకు లాభాల వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ఏవేవో అజ్ఞాత రుసుముల ద్వారా ఖాతాల్లోంచి సొమ్ములు హరిస్తున్న బ్యాంకుల లాభాల గ్రాఫ్ పెరిగిపోతోంది. బ్యాంకుల్లో లాభాలు పెరిగితే అది ప్రభుత్వానికి ఆదాయం పెరిగినట్లే. కరెన్సీ ఖర్చు, బ్యాంకుల నిర్వహణ వ్యయం తగ్గి బ్యాంకింగ్ రంగం ద్వారా కేంద్రానికి వందల కోట్ల ప్రయోజనం దక్కుతోంది. ఇక యాప్‌ల విషయానికొస్తే అవి ఇప్పటికే లాభాల్లో ఉన్నాయి. 2017 లో ప్రారంభమైన గూగుల్ పే కు మన దేశంలో 50 కోట్ల వాడకందార్లున్నారు. 2025 లో అది రూ. 50 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అది అమెరికాలోని ఆల్ఫాబెట్‌కు సొంతమైన గూగుల్‌కు అనుబంధ సంస్థ. యుపిఐ మార్కెట్‌ను 46% పంచుకుంటున్న ఫోన్ పే కూడా అమెరికాకు చెందిన వాల్ మార్ట్ కంపెనీది. బ్యాంకు లోన్‌లు, బీమా లాంటి వ్యాపారాల ప్రకటనల ద్వారా వాటిని అదనపు ఆదాయం ఉంటోంది. ఆన్ లైన్ పేమెంట్ ద్వారా వ్యాపారాభివృద్ధి పొందుతున్న సంస్థలు బ్యాంకులకు, పేమెంట్ ప్రాసెస్ చేసే కంపెనీకు ఇప్పటికే కొంత చార్జీలు చెల్లిస్తున్నాయి. కస్టమర్లపై ఎలాంటి భారం వేసే అవసరం లేకుండా ఈ వ్యవస్థలు లాభాలు పొందుతున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎండిఆర్ వసూలు ముమ్మాటికీ ప్రజల సొమ్మును దోచుకోవడమే. గూగుల్ పే లాంటి విదేశీ సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టే బదులుగా దేశీయ భీమ్ యాప్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసే అవసరం ఎంతో ఉంది. చైనాలో గూగుల్ పేను అనుమతి లేదు. ఆ దేశానికి వెళ్ళగానే అక్కడి యుపిఐ వేదికలైన అలీ పే తదితరాలను డౌన్ లోడ్ చేసుకోవలసిందే. సాంకేతికంగా ఎంతో ముందున్నామని చెప్పుకొనే మనకు దీటైన సొంత పేమెంట్ యాప్ లేకపోవడం శోచనీయం. కొత్త చార్జీలు కస్టమర్లపై పడవు, పూర్తిగా వ్యాపారులే భరిస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఎప్పటి మాదిరిగానే వినియోగదారులు యుపిఐ చెల్లింపులను ఉచితంగానే పొందవచ్చు అని ఆర్థిక శాఖ తెలుపుతోంది.
అయితే వ్యాపారుల పద్ధతి అందుకు భిన్నంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని వ్యాపారులు ఈ విధానంపట్ల తమ నిరసనలు ప్రదర్శిస్తున్నారు. నగదు ద్వారానే అమ్మకాలు ఉంటాయని బోర్డులు పెట్టారు. చక్కెర నగదుపై రూ. 60, యుపిఐ అయితే రూ. 61 అని సరుకుల ధరల వివరాలు విడివిడిగా వాటిపై ఉన్నాయి.ఎవరికీ నష్టం లేకుండా సజావుగా సాగుతున్న ఈ చెల్లింపు వ్యవస్థ నుండి ప్రైవేటు సంస్థలకు లాభాలు తెచ్చిపెట్టాలనే ఆలోచన పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. కాంగ్రెస్ ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తునట్లు లేదు. విపక్ష పార్టీలు స్తబ్దుగా ఉన్న చోట ఇప్పుడు యువత కదిలి వస్తోంది. ఎండిఆర్ ప్రవేశాన్ని కూడా అదే స్థాయిలో నిలవరించవలసిన అవసరం ఉంది.
బి.నర్సన్
9440128169
-
Home
-
Menu
