అమెరికా సుంకాల సెగ.. భారత్‌కు సవాల్

అమెరికా సుంకాల సెగ.. భారత్‌కు సవాల్
X

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా అత్యంత కీలకమైన వాణిజ్య శక్తి. ఆ దేశం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, పారిశ్రామిక రంగాలపై ప్రభావం చూపుతుంటాయి. ముఖ్యంగా దిగుమతులపై సుంకాలు విధించడం ద్వారా తన దేశీయ పరిశ్రమలను కాపాడుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా భారత్ తోసహా 14 ఆర్థిక వ్యవస్థలపై అదనపు సుంకాలు విధించేందుకు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (యుఎస్‌టిఆర్) ప్రతిపాదనలు చేయడం భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతోంది.

అమెరికా ప్రతిపాదించిన ఈ చర్యలను కేవలం రెండు దేశాల మధ్య వాణిజ్య సమస్యగా మాత్రమే చూడలేం. ప్రపంచ వాణిజ్య సమతుల్యత, స్వేచ్ఛా మార్కెట్ సూత్రాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్వావలంబనకు సంబంధించిన కీలక అంశం గా పరిగణించాలి. 2026 నవంబర్ 25న అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం 1974 నాటి వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద భారత్ తోపాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, బంగ్లాదేశ్, యూరోపియన్ యూనియన్ తదితర 14 ఆర్థిక వ్యవస్థలపై విచారణ అనంతరం చర్యలను ప్రతిపాదించింది. ఈ దేశాలు తమ పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ, ప్రభుత్వ ప్రోత్సాహకాలతో ప్రపంచ మార్కెట్లలో పోటీని ప్రభావితం చేస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది.

భారత్‌పై విధించనున్న అదనపు సుంకాలు గరిష్ఠంగా 25% వరకు ఉండవచ్చని ప్రతిపాదించగా, ఇరుదేశాల మధ్య పరస్పర వాణిజ్య ఒప్పందం కుదిరితే ఈ రేటును 17 శాతానికి తగ్గించే అవకాశాన్ని కూడా అమెరికా వెల్లడించింది. అయితే ఇవి ప్రస్తుతానికి ప్రతిపాదనలు మాత్రమే. తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రజాభిప్రాయ సేకరణ, సంప్రదింపుల ప్రక్రియ కొనసాగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అమెరికా ఈ నిర్ణయానికి చెప్పుకుంటున్న ప్రధాన కారణం పారిశ్రామిక రంగంలో అధిక ఉత్పత్తి సామర్థ్యం. భారత్‌లో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వంటి కార్యక్రమాల ద్వారా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దేశీయ తయారీ రంగాన్ని విస్తరించడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఉపాధి అవకాశాలను పెంచడం ఈ పథకాల ప్రధాన లక్ష్యాలు. అయితే ఈ విధానాలను అమెరికా తన పరిశ్రమలకు పోటీగా భావించడం గమనార్హం.

ఒక దేశం తన పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంచుకోవడం, దేశీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడం ఆర్థిక అభివృద్ధిలో సహజమైన ప్రక్రియ. దానినే అన్యాయమైన వాణిజ్య విధానంగా చిత్రీకరించి సుంకాల విధింపునకు కారణంగా చూపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటి. భారతీయ వస్త్రాలు, ఆభరణాలు, ఔషధ ఉత్పత్తులు, సముద్ర ఆహార పదార్థాలు, యంత్ర పరికరాలు, సాఫ్ట్‌వేర్ సేవలకు అమెరికా మార్కెట్ ఎంతో కీలకం. తాజా ప్రతిపాదనలో కొన్ని ఉత్పత్తులకు మినహాయింపులు ఉన్నప్పటికీ, అనేక రంగాలు సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, రత్నాభరణాలు, రొయ్యలు, సముద్ర ఆహార ఉత్పత్తులు, సౌర విద్యుత్ పరికరాల ఎగుమతిదారులకు ఆందోళన తప్పదు. మరోవైపు పేటెంట్ ఔషధ ఉత్పత్తులు, సెమీకండక్టర్ ఉత్పత్తులు వంటి కొన్ని కీలక విభాగాలకు మినహాయింపులు ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువుల ధరలు పెరిగితే అక్కడి కొనుగోలుదారులు ఇతర దేశాల నుంచి దిగుమతులకు మొగ్గుచూపవచ్చు.

దీంతో భారతీయ కంపెనీలకు ఆర్డర్లు తగ్గడం, ఉత్పత్తి మందగించడం, లాభాలు క్షీణించడం వంటి పరిణామాలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టమవుతుంది. పెద్ద కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించే సామర్థ్యం ఉన్నప్పటికీ, చిన్న ఎగుమతిదారులకు ఆర్థిక వనరులు పరిమితంగా ఉంటాయి. ఎగుమతులు తగ్గితే ఉత్పత్తి తగ్గి కార్మికుల ఉపాధిపై కూడా ప్రభావం పడుతుంది. అందువల్ల అమెరికా సుంకాల అంశాన్ని కేవలం వ్యాపారవేత్తల సమస్యగా కాకుండా లక్షలాది కుటుంబాల జీవనోపాధికి సంబంధించిన అంశంగా చూడాలి. అమెరికా సుంకాల ప్రతిపాదనలు భారతదేశానికి ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసే పరిణామం కూడా. దేశీయ తయారీ రంగం బలపడాలంటే కేవలం ప్రభుత్వ ప్రోత్సాహకాలు సరిపోవు. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా, పారిశ్రామిక రుణాల లభ్యత వంటి అంశాల్లో సమగ్ర పురోగతి అవసరం.

చిన్న పరిశ్రమలకు తక్కువ వడ్డీ రుణాలు, ఎగుమతి బీమా, సాంకేతిక సహాయం అందించాలి. సుంకాల వల్ల తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొనే రంగాలకు అవసరమైన విధానపరమైన మద్దతు కల్పించాలి. ప్రపంచీకరణ యుగంలో ఏ దేశమూ పూర్తిగా ఒంటరిగా ఆర్థిక అభివృద్ధిని సాధించలేదన్నది వాస్తవం. పరస్పర సహకారం, న్యాయమైన పోటీ, సమాన వాణిజ్య అవకాశాలే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పునాదులు. అమెరికా తన పరిశ్రమలను కాపాడుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతర దేశాల అభివృద్ధి ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా మాత్రమే తన ఆర్థిక బలాన్ని పెంచుకోవాలనుకోవడం సరైన విధానం కాదు.

భారత్ కూడా భావోద్వేగాలకు లోనుకాకుండా జాతీయ ప్రయోజనాలను కేంద్రంగా చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అమెరికా సుంకాల సెగ తాత్కాలికంగా భారత ఎగుమతిదారులకు ఇబ్బందులు కలిగించవచ్చు. కానీ దానిని అవకాశంగా మలుచుకుని దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఎగుమతి మార్కెట్లను విస్తరించడం, అంతర్జాతీయ వాణిజ్యంలో బలమైన స్థానాన్ని సంపాదించడం అవసరం. దౌత్యంలో సంయమనం, వాణిజ్యంలో అప్రమత్తత, ఆర్థిక విధానాల్లో ఆత్మవిశ్వాసం భారతదేశానికి ఇప్పుడు అత్యంత అవసరం. అమెరికా ఒత్తిడికి తలొగ్గకుండా, ఆ దేశంతో సంబంధాలను తెంచుకోకుండా జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడమే భారత్ ముందున్న అసలైన పరీక్ష.

- తిప్పర్తి శ్రీనివాస్

99484 39565

Tags

Next Story