చరిత్ర తిప్పే విచిత్ర మలుపులు

చరిత్ర ఒకోసారి చిత్రమైన మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులు అనూహ్యమైనవి. ఆ విధంగా జరిగినపుడు ప్రపంచం దిగ్భ్రాంతి చెందుతుంది. అందుకు కారణాలేమిటో, వాటి ప్రభావాలు ఏమిటో అవగతమయ్యేందుకు తగినంత కాలం తీసుకుంటుంది. అటువంటి ఒక చిత్రమైన మలుపును మనమిపుడు చూస్తున్నాము. అది, అమెరికా యూరప్‌ల మధ్య తలెత్తిన తీవ్రమైన విభేదాలు. ఉభయులు సుమారు 80 సంవత్సరాల పాటు కలిసి ప్రయాణం చేసారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం (1939 45) నుంచి, అంతకు ముందు కూడా ఇరువురూ సామ్రాజ్యవాదులు, వలస పాలకులు అయినా, ఆ యుద్ధం ఒక కీలక ఘట్టం కావటంతో పరస్పరం సన్నిహితమయారు. బ్రెట్టన్ వుడ్స్ చర్చలు (1944), ప్రపంచ బ్యాంకు (1944), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (1945)తో ఆరంభించి ప్రపంచ వాణిజ్య సంస్థ (1995) వరకు ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేసారు. మరొక వైపు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ లేదా ‘నాటో’ (1949) పేరిట సైనిక కూటమిని నెలకొల్పారు. ఇతరత్రా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిని కూడా తమ చెప్పు చేతలో పెట్టుకున్నారు. వీటన్నింటిని సాధనాలుగా మార్చుకుని ప్రపంచాన్ని ఉమ్మడిగా దోపిడీ చేసారు. సోవియెట్ యూనియన్ కొంత కాలం ఒక ప్రత్యామ్నాయంగా నిలిచినా 1991లో పతనం కావటం వారికి బాగా కలిసి వచ్చింది.
21వ శతాబ్దం మొదలైన సుమారు పదేళ్ల నుంచి రష్యా తిరిగి పుంజుకోవటం మొదలైనా, అంతకన్న ముఖ్యంగా చైనా వేగంగా బలపడినా అవి ఒక సవాలుగానైతే మారాయి గాని ఈ రెండు శక్తులను నిలువరించగల దశ ఇంకా రాలేదు. బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు, అందుకోసం బ్రిక్స్ మొదలైన రూపాలలో ప్రయత్నాలు ఆశాజనకంగానే కనిపించసాగాయి గాని, అవి ఈ రెండు శక్తులను కలవరపరచినా ఇంకా భయపెట్టే స్థాయికి ఎదగలేదు. దీనంతటి సారాంశం ఏమంటే, అమెరికా యూరప్‌ల కూటమి ఆధిపత్యం మరికొంత కాలం కొనసాగటమన్నమాట. ఇటువంటి పరిస్థితుల మధ్య అమెరికా యూరప్‌ల విభేదాలన్నవి ఎంత విచిత్రమైన మలుపు అవుతుందో ఊహించవచ్చు. వారి మధ్య ఇంకా తెగతెంపుల స్థితి అయితే ఇంకా రాలేదు గాని, పరస్పరం దూరం కావటం రోజు రోజుకు కొనసాగుతున్నది. అదే సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి. ఇద్దరిదీ పాశ్చాత్య ప్రపంచం. ఉభయులూ సామ్రాజ్యవాదులు. తక్కిన ప్రపంచంపై ఆధిపత్యం నెరపుతూ అక్కడి వనరులు, మార్కెట్లను, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను తమ గుప్పిట ఉంచుకోవటంలోనే వారి మనుగడ ఆధారపడి ఉంటుంది. అంతేకాదు. తమను కాదనే దేశాలపై సైనిక బలం ఉపయోగిస్తూ వచ్చిన వారు, అందుకోసమే ‘నాటో’ కూటమిని కొనసాగిస్తున్న వారు, ఆ అవకాశాలను చేజేతులా వదలుకోరు.
అందువల్ల, అటువంటి ప్రమాదాన్ని నిరోధించేందుకు రానున్న కాలంలో తిరిగి రాజీపడి ఒకటి కాబోరని ఎంతమాత్రం చెప్పలేము. అదే సమయంలో ఇటీవల కాలపు విభేదాలను తక్కువ చేసి చూడలేము. వాటి తీరుతెన్నులను జాగ్రత్తగా గమనించటం అవసరం. ఈ కొత్త పరిస్థితికి ఆరంభం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నిక కావటం నుంచి జరిగింది. అమెరికాను తిరిగి గొప్పది చేయాలి (మేక్ అమెరికా గ్రేట్ అగైన్), అమెరికా పస్ట్ నినాదాలతో అధికారానికి వచ్చిన ఆయన గత ఏడాదిగా తీసుకుంటూ వస్తున్న చర్యలు, కొంతకాలంగా బలహీన పడుతున్న తమ దేశానికి అవసరమేమో గాని, (దానిపైనా అమెరికాలోనే సందేహాలు మొదలుయ్యాయి) యూరప్‌తో విభేదాలకు మాత్రం కారణం కాసాగాయి. ఆయనకన్న ముందటి అధ్యక్షులు యూరప్‌కు, తక్కిన ప్రపంచానికి మధ్య తేడా చూసేవారు. కాని ట్రంప్ అందరి వలెనే వారిపై కూడా భారీ సుంకాలు విధించారు. ఉక్రెయిన్ యుద్ధం మొత్తం యూరప్‌కే ముప్పు కాగలదని వారు ఆందోళన చెందుతుండగా, రష్యాకు అనుకూలంగా మాట్లాడసాగారు. నాటో ఏర్పడింది ఉమ్మడి రక్షణకు కాగా, సైనిక బడ్జెట్లను రెట్టింపు చేసి మీ రక్షణ మీరు చూసుకోండని చెప్పారు.
యూరప్‌లో అత్యధికం ఉదారవాద ప్రజాస్వామిక దేశాలు కాగా, అందుకు వ్యతిరేకమైన మితవాద పార్టీలను బహిరంగంగా బలపరచారు. గత నవంబర్‌లో ప్రకటించిన జాతీయ భద్రతా వ్యూహ పత్రంలోనైతే, అసలు యూరోపియన్ నాగరికతలే అంతర్థానమయే పరిస్థితి వచ్చిందంటూ అవమానపరచారు. ఇవన్నీ చాలవన్నట్లు, కెనడాను బలప్రయోగంతోనైనా అమెరికాకు 51వ రాష్ట్రంగా (ప్రస్తుత రాష్ట్రాలు 50) మార్చగలమని, గ్రీన్‌లాండ్‌ను డెన్మార్క్ తమకు స్వాధీనపరచకుంటే సైన్యాన్ని పంపి 51వ రాష్ట్రం చేసుకోగలమని ప్రకటించి పరస్పర సంబంధాలను మరింత విషమింప జేసారు. అమెరికా యూరప్ సంబంధాలు ఇటువంటి మలుపు తీసుకోవటానికి ఏకైక కారణం ట్రంప్ వ్యవహారశైలి అన్నది కనిపిస్తున్నదే. గమనించదగినదేమంటే, అటువంటి కూటమికి రష్యా, చైనాల నుంచిగాని, ఇతరత్రా బహుళ ధ్రువ ప్రపంచ నినాదాల నుంచి గాని ప్రమాదం ఏర్పడుతున్నదనుకుంటే, తెలివిగా వ్యవహరిస్తూ, తమ కూటమితో మరింత సఖ్యతను పెంపొదిస్తూ, ఆ ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవాలి. ఆ మేరకు కొత్త విధానాలను రూపొందించుకోవాలి.
కాని, ట్రంప్ ఒక భిన్నమైన వ్యక్తిత్వం కలవాడు అయినందున అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పరిస్థితిని మరింత విషమింపజేసుకుంటున్నారు. స్వయంగా అమెరికాకు, యూరప్‌కు కూడా. ఇది తనకెంత అర్థమవుతున్నదో తెలియటం లేదు గాని, యూరోపియన్ నాయకులకు మాత్రం బాగానే అవుతున్నది. అందుకు ఈ నెల 1923 తేదీలలో జరిగిన దావోస్ సమావేశాలు బాగా అద్దం పట్టాయి. సమావేశాలకు ముందు వారాలలోనే గ్రీన్‌లాండ్ విషయం తీవ్రరూపం తీసుకుంది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ట్రంప్ అపహరించిన తీరుతో తక్కిన ప్రపంచంతో పాటు నిర్ఘాంతపోయి ఉన్న యూరప్‌లో, ఆయన గ్రీన్‌లాండ్ గురించి చేస్తుండిన ప్రకటనలు తీవ్ర వ్యతిరేకతలను సృష్టించాయి. అమెరికా అధ్యక్షునికి ఆ విషయం తెలిసి కూడా దావోస్‌కు అదే వైఖరి చూపుతూ వెళ్లారు. పైగా, గ్రీన్‌లాండ్ సమీపాన అంటార్కిటికా సముద్రంలో రష్యా, చైనా యుద్ధనౌకలు సంచరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో వారు సముద్ర గర్భం నుంచి విలువైన ఖనిజ సంపదను మైనింగ్ చేస్తున్నారని ఆరోపించటం మొదలుపెట్టారు. కాని అవేవీ నిజం కాదని గ్రీన్‌లాండ్, డెన్మార్క్, యూరోపియన్ యూనియన్ కొట్టివేసాయి. ఇదంతా దావోస్ సమావేశాలలో ముదిరి పాకానబడి కనిపించింది. అది ఏ విధంగానో అర్థం కావాలంటే ట్రంప్ కన్న ఎక్కువగా వివిధ యూరోపియన్ నాయకుల ప్రసంగాలను గమనించాలి. ఎందుకంటే, ఈ పరిణామాల వల్ల ఎక్కువ ఆందోళన చెందుతున్నది వారే గనుక.
ట్రంప్ తీరును పలు యూరోపియన్ దేశాలు విడివిడిగానే గాక, మొత్తం 27 దేశాల ఉమ్మడి వేదిక అయిన యురోపియన్ యూనియన్ సైతం ఖండించింది. వారిలో అతి తీవ్రంగా విమర్శించింది డెన్మార్క్, గ్రీన్‌లాండ్‌లతో పాటు కెనడా ప్రధాని మార్క్ కార్నీ కాగా, అమెరికాకు అత్యంత విధేయుడని భావించే బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం అరమరికలు లేకుండా తప్పుపట్టారు. ఒక నాటో దేశమైన డెన్మార్క్‌పైనే బలప్రయోగం జరిపి వారి ప్రాంతాన్ని గాని, కెనడాను గాని ఆక్రమించగలమనటం వారందరికి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దావోస్ కన్న ముందు రోజులలోనే కనిపించిన ఈ స్థితి అక్కడ అందరూ ముఖాముఖిన ఎదురుపడటంతో మరింత తీవ్రంగా మారింది. పైగా అక్కడ ట్రంప్, బలప్రయోగం లేకుండా తమకు ఏదీ లభించదని, తాము ఆ చర్యకు దిగితే తమ నెవరూ ఆపలేరని హెచ్చరించారు. ఒక స్థాయిలో ఇదంతా జరుగుతుండగా మరొక స్థాయిలో ఇంతే గమనార్హమైన పరిణామాలు మొదలయ్యాయి. యూరప్ ఇక ఆర్థికంగా, రక్షణ రీత్యా కూడా తన దారి తాను చూసుకుని స్వతంత్రంగా మారి అమెరికాపై ఆధారపడటం మానుకోవలసి రావచ్చునని సాక్షాత్తూ ఆ యూనియన్ కమిషనర్ ఉర్పులా ప్రకటించగా, అమెరికా నమ్మదగ్గ భాగస్వామికాదని, చైనా ఆధారపడదగినది అని ప్రకటిస్తూ కెనడా ప్రధాని తదితరులు చైనా వెళ్లి ఒప్పందాలు చేసుకోవటం మొదలు పెట్టారు. అమెరికాయూరప్ 80 ఏళ్ల సంబంధాలలో ఇవేవీ సాధారణమైన మార్పులు కావు.
- టంకశాల అశోక్ (దూరదృష్టి)
(రచయిత సీనియర్ సంపాదకులు)
-
Home
-
Menu
