మరో రెండు ఉపద్రవాలు

venezuela vs japan
ప్రపంచానికి గాజా, ఉక్రెయిన్ అనే రెండు సమస్యలు చాలవన్నట్లు వెనిజుయేలా, జపాన్ రూపంలో రెండు కొత్త సమస్యలు తయారవుతున్నాయి. ఈ నాలుగింటికి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలతో నిమిత్తం ఉండటం గమనించదగ్గది. సంవత్సరాలుగా సాగుతున్న గాజా, ఉక్రెయిన్ యుద్ధాల గురించి తెలిసిందే. ఇపుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లుండి దక్షిణ అమెరికాలోని వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోతో లేని పేచీలు మొదలుపెట్టారు. మరొకవైపు, అమెరికాకు అత్యంత సన్నిహిత దేశమైన జపాన్ అధ్యక్షురాలు సనే తకాయిచీ అదే పద్ధతిలో చైనాతో అక్కరలేని తగవును లేవనెత్తారు. గాజా విషయం తెలిసిందే. ఆ ప్రాంతం పాలస్తీనాలో భాగం. పాలస్తీనాను 27 సంవత్సరాల క్రితం బలవంతంగా విభజించి ఇజ్రాయెల్‌ను సృష్టించిన పాశ్చాత్య కూటమి, ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఏర్పడగలవని స్వయంగా ప్రకటించి కూడా, ఆ మేరకు ఐక్యరాజ్య సమితిలో తీర్మానించి కూడా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.
పాలస్తీనా ప్రజలు అందుకు ఆగ్రహించటం వల్ల ఆవిర్భవించిందే గాజా ప్రాంతంలో హమాస్ చేసిన తిరుగుబాటు. స్వతంత్ర పాలస్తీనాకు అనుకులంగా ప్రపంచమంతా గొంతెత్తినా లెక్కచేయని ఇజ్రాయెల్, అమెరికాలు, గాజా ప్రాంతాన్ని, వెస్ట్ బ్యాంక్‌ను కూడా ఆక్రమించి ఇక పాలస్తీనా దేశమున్నదే లేకుండా చేయాలని రకరకాల కుయుక్తులు పన్నుతున్నాయి. దీనంతటిలో అమెరికా అధ్యక్షుని ప్రత్యక్ష పాత్ర ఉంది. ఉక్రెయిన్ విషయానికి వస్తే, ఆ సమస్య పరిష్కారానికి ట్రంప్ పలు విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు పైకి తోస్తుంది. కాని వాస్తవంలో ఆ సమస్యకు మూలమే అమెరికా. అందులో వ్యక్తిగతంగా ట్రంప్ పాత్ర కూడా ఉంది. సోవియెట్ యూనియన్, దానితో పాటు వార్సా సైనిక కూటమి 1991 లో రద్దయిన వెనుక ఇక ప్రచ్ఛన్న యుద్ధమంటూ లేని స్థితిలో, పాశ్చాత్య దేశాల ‘నాటో’ సైనిక కూటమిని కూడా రద్దు చేయటానికి బదులు అమెరికా, యూరప్ కలిసి అదే విధంగా కొనసాగించాయి. నాటో రద్దు కాకపోయినా కనీసం మరింత విస్తరించబోమంటూ రష్యాకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి, ఇంకొక 12 దేశాలను కొత్తగా చేర్చుకుని రష్యా సరిహద్దుల వైపు విస్తరించాయి.
అదే క్రమంలో ఉక్రెయిన్‌ను కూడా నాటోలో చేర్చుకుని రష్యాను ఇక పూర్తిగా చక్రబంధంలోకి తెచ్చే ప్రయత్నం సాగటం వల్ల మాత్రమే ఆ ప్రమాదాన్ని నిరోధించేందుకు ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలైంది. ఉక్రెయిన్, యూరప్‌లను ట్రంప్ ఇపుడు తప్పు పడుతున్నారు గాని, వాస్తవానికి ఆయన గత పర్యాయం అధ్యక్షునిగా ఉన్నపుడు నాటో విస్తరణకు అనుకూలురే. దానినట్లుంచితే, ఈసారి అయినా ఉక్రెయిన్ యుద్ధ పరిసమాప్తికి ఆయన ప్రయత్నాలు దోబూచులాట వలెనే ఉన్నాయి తప్ప ఖచ్చితమైన విధానం కనిపించదు. చివరకు ఏమి జరిగేదీ, ఎప్పుడు జరిగేదీ తెలియకుండా కొనసాగుతున్నదా సమస్య. పాలస్తీనా వలెనే ఉక్రెయిన్ సమస్య కూడా అమెరికా నాయకత్వాన పాశ్చాత్య దేశాల సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసం ఉనికిలోకి వచ్చి కొనసాగుతున్నాయి.
అవి రెండు అట్లుండగా ఇటీవల అమెరికా అధ్యక్షుడు వెనిజుయేలా పై దాదాపు యుద్ధ సన్నాహాలనదగ్గవి మొదలుపెట్టారు. ఆయన తన ఎన్నికల ప్రచార సమయంలో, ఎన్నికైన తర్వాత కూడా, తను యుద్ధాలకు వ్యతిరేకమని, జరుగుతున్న యుద్ధాలను ఆపగలనని ప్రకటించారు. కొన్ని యుద్ధాలను ఆపినట్లు కూడా చెప్పుకున్నారు. కాని ఇపుడు వెనిజుయేలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై కత్తిగట్టారు. అందుకు ఏకైక కారణం ఆయన సోషలిస్టు కావటం. మదురో కన్నా ముందు అధ్యక్షుడు అయిన హ్యూగో ఛావేజ్ కూడా సోషలిస్టే. ఆయన అమెరికాను బలంగా వ్యతిరేకించారు. లాటిన్ అమెరికా మొత్తాన్ని అమెరికా మొదటి నుంచి పూర్తిగా తన నియంత్రణలో ఉండవలసిన ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నది. అటువంటి చోట తనను ఏ దేశం ఎంతమాత్రం ధిక్కరించినా, స్వతంత్రంగా వ్యవహరించినా అక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుని ఆ ప్రభుత్వాలను పడగొట్టడం, తమకు అనుకూలురను అధికారంలోకి తేవటం ఒక సర్వసాధారణ క్రీడగా మారింది. ఆ విధంగా గత 200 సంవత్సరాలలో కనీసం 20 సార్లు జోక్యం చేసుకున్నారు. క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో విషయంలో వైఫల్యం, చిలీలో అలెండీ ప్రభుత్వ పతనం కేసులు సుప్రసిద్ధమైనవి. ఈ చర్యలు అన్నింటికి అన్నీ అమెరికన్ కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం చేసినవే.
ఆయా ప్రభుత్వాలు వామపక్ష సిద్ధాంతాలు గలవి. అయితే ఇక చెప్పనక్కర లేదు. వెనిజుయేలాకు సంబంధించి ఈ రెండు కారణాలు కలిసి వచ్చాయి. ఛావేజ్ సోషలిస్టు కాగా, ఆయన వారసుడు మదురో కూడా సోషలిస్టు. ఇక ఆ దేశంలో చమురు నిల్వలు మొత్తం ప్రపంచంలోనే సౌదీ అరేబియాను కూడా మించి అత్యధికం కాగా, అమెరికన్ కంపెనీల చేతిలో ఉండిన ఆ నిల్వలను ఛావేజ్ జాతీయం చేశారు. మదురో అదే విధానాన్ని కొనసాగించటంతో, ట్రంప్ తన మొదటి పాలనా కాలంలోనే ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి విఫలయ్యారు. అవే ప్రయత్నాలు ఈ రెండవ విడత పాలనలో కొనసాగిస్తున్నారు. అయితే అందుకు ఒక సాకును ముందుకు తెచ్చారు. అది, వెనిజుయేలా నుంచి కొకైన్, ఫెంటానిల్ తదితర మాదకద్రవ్యాలు అమెరికాకు రవాణా అవుతున్నాయని, అటువంటి ఉత్పత్తి, రవాణా సంస్థకు స్వయంగా మదురో అధిపతి అన్నది ట్రంప్ ఆరోపణ. కాని అది ఎంత మాత్రం నిజం కాదని మదురో నిరాకరించటమే కాదు. అమెరికా సహా ఇతర పాశ్చాత్య స్వతంత్ర సంస్థలు, నిపుణులు కూడా కాదనటం గమనించదగ్గది. కాని ట్రంప్ వంటి ధోరణి గల నాయకులకు ఏ విషయంలోనూ నిజానిజాలతో నిమిత్తం లేదన్నది ఈసరికి ప్రపంచానికి అర్థమైపోయిన విషయం. అందుకు అనుగుణంగానే ఆయన మదురోపై నిరాధారమైన ఆరోపణలు, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనే హెచ్చరికలు చేయటం మొదలుపెట్టారు. వెనిజుయేలా సమీపానికి, కరిబ్బియన్ సముద్రంలోకి ఇప్పటికే యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు పంపారు. వెనిజుయేలాలో రహస్య కార్యకలాపాలు సాగించవలసిందిగా సిఐఎను ఆదేశించినట్లు బహిరంగంగానే ప్రకటించారు.
మదురోను పడగొడితే అయిదు కోట్ల డాలర్లు ఇవ్వగలమంటూ అక్కడి సైన్యాధికారులకు ఆశపెట్టారు. ఇక ఇటీవల అయితే, మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ సుమారు 20 వెనిజులా పడవలపై వైమానిక దాడులు జరిపి, దాదాపు 80 మందిని చంపించారు. అవన్నీ మామూలు మత్సకారుల పడవలని మదురో ప్రకటించారు. ఆ పడవలలో మాదక ద్రవ్యాలున్నట్లు ఆధారాలేమిటని అమెరికన్ మీడియా ప్రశ్నించగా ట్రంప్ జవాబు ఇవ్వలేకపోవటం గమనించదగ్గది. దానితో ఆయనపై అమెరికాలోనే విమర్శలు మొదలయ్యాయి. తన చర్యలు అమెరికా చట్టాలకు, అంతర్జాతీయ చట్టాలకు కూడా విరుద్ధమని నిపుణులు ఎత్తిచూపారు. దీనికిదే సమస్య కాగా, కొద్ది రోజుల క్రితం ఒక పడవపై దాడిలో కొందరు మరణించిన తర్వాత ఇద్దరు ఇంకా జీవించి ఉండగా, మరొక విడత దాడి జరిపి వారిని కూడా చంపివేయటంతో రిపబ్లికన్ సహా అమెరికన్ సెనెటర్లు సైతం తీవ్ర విమర్శలు చేస్తూ, అందుకు రక్షణ మంత్రి పీట్ హెగ్ సెట్‌పై విచారణ జరపగలమని ప్రకటించారు. ఎవరూ మిగలకుండా దాడి చేయాలని సైన్యాన్ని ఆయన ఆదేశించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.
అటువంటి రెండవ దాడిని తాను సమర్థించబోనని స్వయంగా ట్రంప్ వ్యాఖ్యానించటం విశేషం. ఈ వివరాలు ఎట్లున్నా, అసలు ఈ పరిణామాలన్నిటికి మూలం లాటిన్ అమెరికాకు వ్యతిరేకంగా ట్రంప్ సామ్రాజ్యవాదంలో ఉందన్నది తిరుగులేని వాస్తవం. మరొక వైపు, జపాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన తకాయి ఒకవేళ చైనా సైన్యం తైవాన్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే, తైవాన్‌కు మద్దతుగా, తమ ఆత్మరక్షణ కోసం, తమ సైన్యాన్ని పంపగలమని ప్రకటించి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించారు. తైవాన్ చైనాలో భాగమనే ఒకే చైనా విధానాన్ని స్వయంగా జపాన్ కూడా పాటిస్తున్నప్పుడు ఇటువంటి ప్రకటన చేయటం చైనాకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
దానితో వెంటనే తీవ్రమైన హెచ్చరికలు చేస్తూ, జపాన్‌కు ఆర్థికపరమైన నష్టాలు కలిగించే చర్యలు తీసుకోవటం ఆరంభించింది. ఒకవేళ జపాన్ సైనిక చర్యలకు పాల్పడినట్లయితే ఆ దేశాన్ని ధ్వంసం చేయగల సైనిక శక్తి తమకున్నదని చైనా సైన్యం వరుస హెచ్చరికలు జారీ చేస్తున్నది. ఈ ఆకస్మిక పరిణామాలు జపాన్‌లోనే గాక, ప్రపంచమంతటా పెద్ద కలకలం సృష్టించాయి. అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో జపాన్ ప్రధాని ఇటువంటి ప్రకటనలు చేయటం పట్ల ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అమెరికా మద్దతు లేనిదే, మద్దతు ఉందన్న ధైర్యం లేనిదే, జపాన్ వంటి దేశం చైనా వంటి దేశంపై ఇటువంటి వైఖరి తీసుకోజాలదని వేరే చెప్పనక్కర లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం జరగకపోవచ్చుగాక, కాని లోగడ చైనాను, తైవాన్‌ను కూడా ఆక్రమించిన చరిత్ర గల జపాన్ తిరిగి ఈ విధంగా వ్యవహరించటం ప్రమాదకర సంకేతాలను పంపుతున్నది.
టంకశాల అశోక్
దూరదృష్టి
-
Home
-
Menu
