భూమి ఎవరి సొత్తు?

Whose property is the land?
X

Whose property is the land?

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రం అధికార, ప్రతిపక్ష పార్టీల భూ వివాదాలు, వాద ప్రతివాదాలతో, ఆరోపణలు, సవాళ్లతో దద్దరిల్లుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రపంచ ప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాల్ స్టాయి రాసిన ‘హౌ మచ్ ల్యాండ్ డస్ ఏ మాన్ నీడెడ్?’ అన్న కథను జ్ఞాపకం చేసుకుందాం. తెలుగులో ఇది ‘ఆరడుగుల నేల’ అన్న పేరుతో అనువాదం అయింది. ఈ కథలో కథానాయకుడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఎంత దూరం నడిస్తే అంత విస్తీర్ణం భూమి వేయి రూబుళ్ళకే అతనికి దక్కుతుంది, అన్న షరతు ఒప్పుకొని, ఆగకుండా నడవడం మొదలు పెడతాడు. సూర్యాస్తమయం దగ్గరపడుతున్న సమయానికి మరింత ఎక్కువ భూమి సంపాదించాలన్న ఆశతో వేగంగా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పరిగెత్తుతాడు. సూర్యాస్తమయం లోగా తాను అనుకున్న గమ్యస్థానానికి చేరి, పోటీ గెలిచి, భూమి సంపాదించుకుంటాడు కానీ, చివరికి ఆయాసంతో, నెత్తురు కక్కుకొని అక్కడికక్కడే మరణిస్తాడు.

తాను కోరుకున్నంత భూమి సంపాదించుకున్నా, దానిని అనుభవించే వీలే లేకుండా మరుక్షణంలో చనిపోయిన అతడిని పూడ్చేందుకు తవ్విన గొయ్యి సరిగ్గా ఆరడుగుల నేల. నిజానికి ఇతర సంప్రదాయాలు పాటించే వారికి, చివరికి ఆ ఆరడుగుల నేల కూడా పూడ్చేందుకు అవసరం లేదు. వారి ఆఖరి ప్రయాణానికి ఒక బండెడు కట్టెలు ఉంటే చాలు. అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్న మనుషులు, రాజకీయ నాయకులు టాల్ స్టాయి చెప్పిన ఆరడుగుల నేల కథలోని నీతిని ఎన్నటికీ గ్రహించలేరు. భూమిని సొంతం చేసుకునే ప్రయత్నాలు, భూ ఆక్రమణలు మనిషి పుట్టుక అంత పాతవి. మానవ జాతి చరిత్ర పొడుగునా నాడూ, నేడు ఆ భూమిపైన ఆధిపత్యం కోసమే, రాజ్యాలు, యుద్ధాలు, అధికారాలు, చట్టాలు, సైనిక బలగాలు, హింస అవసరం అయ్యాయి. గతమంతా తడిచెను నెత్తుటితో, కాకుంటే కన్నీళ్లతో.. అయినా భూమిని దురాక్రమించడం మాత్రం ఏనాడూ ఆగలేదు. దుక్కి దున్ని, పంటలు పండించి, నేలను కాపాడే జనం మాత్రం ఇప్పటికీ భూమి హీనులుగానే ఉన్నారు.

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ (భూ రికార్డుల డిజిటలైజేషన్ వ్యవస్థ) ద్వారా జరిగిన అక్రమాలు, సెక్షన్ 22ఎ నిషేధిత భూముల జాబితా, అసైన్డ్ ల్యాండ్ల వివరాలు చెబుతూ, సర్కారు భూములు అక్రమంగా వ్యక్తుల పేర్లకు మార్చబడినట్లు ఆరోపణలు చేసింది. ఈ నెల సెప్టెంబర్‌లో అసెంబ్లీలో, ఈ విషయాలపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ పాలనలో సుమారు రూ. ఒక లక్షకోట్ల విలువైన భూ అక్రమాలు జరిగాయి అన్నారు.

కెసిఆర్ కుటుంబం, వారి బంధువులు కలిసి తొమ్మిది జిల్లాలు, 24 మండలాలు, 31 గ్రామాల్లో సుమారు 439 ఎకరాల భూమి కలిగి ఉన్నారని, కెసిఆర్, ఆయన భార్య శోభకి కలిపి 67.5 ఎకరాలు వున్నాయని రేవంత్ అన్నారు. అలాగే కల్వకుంట్ల తారక రామారావు 123 ఎకరాలు, కవితకు 37 ఎకరాలు, హరీశ్ రావుకు 30 ఎకరాలు, జోగినపల్లి సంతోశ్ కుమార్‌కు 79 ఎకరాలు, బినామీలకు, ఇతరులకు కూడా అనేక ఎకరాల భూములున్నాయని లెక్కలతో సహా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ భూ ఆక్రమణలు, చట్ట ఉల్లంఘనల ఆరోపణలపై 30 రోజుల్లోపల విచారణ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఒక హైలెవల్ కమిటీని నియమించింది.

ఈ ఆరోపణలను బిఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా తీవ్రంగా ఖండించింది. ఎదురుదాడికి దిగింది. రేవంత్‌రెడ్డి కుటుంబం సుమారు 308 ఎకరాల భూమి కలిగి ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వయంగా భూ అక్రమాలకు పాల్పడుతుందని, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్‌ఐఎల్‌టిపి) పేరుతో రూ. 5 లక్షల కోట్ల భూస్కామ్ జరుగుతోందని కెటిఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డికి సంబంధించిన ఒక కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 7 కోట్లకే కేటాయించారని కూడా బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేసారు. స్మార్ట్ సిటీ పేరుతో జరుగుతున్నది అంతా భూ దందానే అంటూ బిఆర్‌ఎస్ పార్టీ విమర్శలు చేసింది

పార్టీలు ఏవైనా కానీయండి, ఎన్నికలలో పోటీ చేసే సమయంలో దాఖలు చేసే అఫిడవిట్‌లలో నమోదు చేసే ఆస్తులు, గెలిచి అధికారంలోకి రాగానే ఊహాతీతంగా అనేక రెట్లు ఎలా పెరుగుతాయి? ఎంఎల్‌ఎలు, ఎంపిలు, వాళ్ళకు వచ్చే జీతభత్యాలతో అంత విలువైన, అన్నేసి ఎకరాల భూములను, అంత తక్కువ ధరకు ఎలా పొందగలుగుతున్నారు అనే న్యాయమైన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు అధికార, ప్రతిపక్ష పార్టీలునుండి ఎన్నటికీ దొరకవు.

ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ రిఫార్మ్ (సీలింగ్ ఆల్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్) యాక్ట్ 1973 (యాక్ట్ నెం.1 of 1973) వుంది. 1975 జనవరి ఒకటో తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చి ఇప్పటికీ తెలంగాణలో కూడా కొనసాగుతూనే ఉంది. మిగులు భూమిని బినామీలు, భార్య, పిల్లలు, బంధువుల పేర్ల మీద చూపించడం జరుగుతుంది. అలాగే పరిశ్రమలు, మత సంస్థలు, సహకార సంఘాలు మొదలైనవి వాటికి వున్న కొన్ని మినహాయింపులను వాడుకుని నాన్- అగ్రికల్చరల్ కన్వర్షన్ లాండ్స్ లేదా నకిలీ రికార్డులు సృష్టించడంద్వారా ఫేక్ కంపెనీలు, ట్రస్టులు, సొసైటీల పేరుతో వందలాది ఎకరాల భూములను కొందరు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారు. భూ పరిమితి చట్టం అమలు మన దేశంలో ఎప్పుడూ సమర్థవంతంగా జరగలేదు.

సిద్దిపేట జిల్లాలోని కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సుమారు 700 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో 388 ఎకరాలు ప్రభుత్వ అసైన్డ్ భూమి అని, ఆ భూమిని పేదలకు, దళితులకు పంపిణి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభాముఖంగా ఎంతో ఆవేశంగా ప్రకటించారు. సరిగ్గా ఇలాగే గతంలో రామోజీ ఫిల్మ్ సిటీని అసైన్డ్ భూములు లాక్కుని అక్రమంగా కట్టారని, లక్ష నాగళ్ళతో దాన్ని దున్నిస్తానని కెసిఆర్ ప్రకటించారు. తీరా బిఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే, రామోజీరావును కెసిఆర్ స్వయంగా కలిసి అభినందించాడు. ఓం సిటీ పేరుతో ఆయన ప్రారంభించనున్న భారీ ప్రాజెక్ట్‌ను స్వాగతించడమే కాక, రామోజీ ఫిల్మ్ సిటీలోని భూముల్లో ఒక్క ఎకరా కూడా అసైన్డ్, అక్రమమైనది లేదని కితాబిచ్చారు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ ‘ఆంధ్రా వలసవాదుల కబ్జాలో వేలాది ఎకరాల తెలంగాణ భూములు’ వున్నాయని వాటిని స్వాధీనం చేసుకుంటాం అంటూ తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు తోసహా అనేక మంది రాజకీయ నాయకుల, పారిశ్రామిక వేత్తల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లు, వారి భూముల వివరాలను ప్రకటించడం జరిగింది. నిజానికి వీళ్ళలో ఏ ఒక్కరూ, ఇంచు భూమిని కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పోగొట్టుకున్న దాఖలా లేదు.

ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భూముల తేనెతుట్టెను కదిలించడంతో, గతంలో ఆయన పనిచేసిన తెలుగు దేశం పార్టీ వాళ్ళ పేర్లు, వాళ్ళతో ఆయనకు ఉన్న సంబంధాలను కూడా బిఆర్‌ఎస్ బయటకు తెచ్చే ప్రయత్నంలో తలమునకలై వుంది. నిజానికి ‘భూ కబ్జాకోరులు ఇందుగలరు అందులేరని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసిన అందందే కలరు’. సాధారణ ప్రజలకి ఈ మొత్తం వ్యవహారం దొంగలు, దొంగలు ఊళ్ళు పంచుకునేప్పుడు జరుగుతున్న పంచాయితీగా అనిపిస్తూ వుండటంలో తప్పేమీలేదు. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు అని భక్తరామదాసు శ్రీరామచంద్రుడినే నిలదీయ గలిగాడు, కానీ మన ప్రజలకి ఇంకా అలా ఈ భూ కబ్జాదారులను అడిగే చైతన్యం రాలేదు. ఉపసంహారంగా మరో కథతో ముగిస్తాను.

భూమిని చాపలా చుట్టి మహా సముద్రపు అడుగున దాచిన హిరణ్యాక్షుడి కథ మనకి తెలుసు. విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి, భూమిని తన కోరలపై పెట్టుకొని, పైకి తీసి, రక్షించి, హిరణ్యాక్షుడిని వధించి లోకోద్ధరణ చేస్తాడు. బహుశా ఈ పురాణ కథలోలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను తాను భూమిని రక్షించే విష్ణుమూర్తిని అనుకోవచ్చు. కెటిఆర్, కెసిఆర్ ఇంకా అనేకమంది బినామీలు ఆయన దృష్టిలో భూకబ్జాలకు పాల్పడిన ఆధునిక హిరణ్యాక్షులు కూడా కావచ్చునేమో. కానీ ఆయన వైరి పక్షం వారు కూడా ‘దాల్ మే కుచ్ కాలా హై’ అని చెప్పడంలో ఎంతో నిష్ణాతులు. బిఆర్‌ఎస్ వారు, రేవంత్‌రెడ్డి తోసహా కాంగ్రెస్ పార్టీ మంత్రుల పేర్లను బయటపెడుతూ మీరు కూడా భూమిని కబ్జా చేసిన హిరణ్యాక్షులే అని లెక్కలతో సహా ఇప్పుడు తేల్చిచెబుతున్నారు. నిజానికి ప్రజల దృష్టిలో ఏ తేడా లేకుండా అటు, ఇటూ వున్నది అందరూ ఫిరాయింపుల్లో ఆరితేరిన హిరణ్యాక్షులే. పారదర్శకత, జవాబుదారీతనం ఏ వైపు చూసినా కనపడని చోట, ఇప్పుడు జరుగుతున్న ఈ హడావిడి ఎప్పటివలే మరికొంత కాలానికి సద్దుమణుగుతుంది. భూమి వీళ్ళను చూసి తప్పక ఫక్కున నవ్వుకుంటుంది.

విమల

Tags

Next Story