జీవవైవిధ్యంలో ‘జీబ్రా’ని రక్షించుకోలేమా!

జీవజాతుల్లో ప్రతి జీవికి ఒక ప్రాధాన్యం ఉంటుంది. జీవవైవిధ్య పరిరక్షణలో అన్నిజీవులు తమతమ పాత్రను నిర్వహిస్తాయి. భూగోళంపై 8 మిలియన్లకు పైగా వృక్ష జంతు జీవరాసులు ఉండవచ్చని, వాటిలో దాదాపు 2 మిలియన్ల జీవరాశులను శాస్త్రజ్ఞులు గుర్తించారని తెలుస్తున్నది. జంతుశాస్త్ర జాబితాలో ఉన్న అత్యల్ప సూక్ష్మజీవుల నుంచి అతి పెద్ద బ్లూ వేల్ వరకు అన్ని జంతువులకు ఒక్కో ప్రత్యేకత ఉన్నది. మానవ తప్పిదాలతో ఈ జీవుల మనుగడకు వందల ఏండ్లు నుంచి విఘాతం కలిగినట్లు అయితే వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ చివరకు అంతరించిపోయిన జంతువుల జాబితాలోకి చేరుతాయి. ఇలా ఇప్పటి వరకు అంతరించిపోయిన జీవుల సంఖ్య వేలల్లో ఉండవచ్చని, నేటికీ దాదాపు 905 జీవులు అంతరించిపోవడం జరిగిందని రుజువు చేయబడింది. మరి కొన్ని అరుదైన జీవజాతులు అంతరించడానికి ఎంతో సమయం పట్టదని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవజాతులు అంతరిస్తూ పోతే, జీవవైవిధ్యం దెబ్బతిని చివరికి మనిషి మనుగడ కూడా ప్రశ్నార్ధకంగా కావడంతోపాటు, మనిషి జాతి కూడా అంతరించే అవకాశాలు లేకపోలేదు. ఆఫ్రికా దేశాల్లో కనిపించే ఒక ప్రత్యేక జంతువు జీబ్రా అని పిలుస్తున్నాం.
నేటి ఆధునిక మానవుడి అతి తెలివి వల్ల జీబ్రాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు, ఒక రకమైన జీబ్రాలు అంతరించే దుస్థితికి చేరాయని జంతు ప్రేమికులు, శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేస్తున్నారు. రోడ్ల వెంట జీబ్రా క్రాసింగ్స్ ఉండడం మనం చూస్తున్నాం. జీబ్రా జాతులను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రతి ఏటా 31 జనవరి రోజున అంతర్జాతీయ జీబ్రాల దినం పాటించుట జరుగుతున్నది. అంతర్జాతీయ జీబ్రాల దినం -2026 ఇతివృత్తంగా ‘స్ర్టైఫ్స్ దట్ యునైట్ (ఏకం చేసే చారలు) అనబడే అంశాన్ని తీసుకున్నారు. భూగోళంపై ఉన్న విలక్షణ జంతువులుగా జీబ్రాలను గుర్తించారు. నలుపు, తెలుపు చారతో ప్రత్యేకంగా కనిపించే జీబ్రాలు గడ్డిని మేస్తూ అటవీ పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటాయి.కెన్యా, నమీబియా, అంగో లా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో కనిపించే జీబ్రాల సంఖ్య మానవ తప్పిదాలతో క్రమంగా తగ్గుతున్నట్లు గమనించారు.
మానవ ప్రమేయంతో జీబ్రాల నివాస ప్రాంతాలను అక్రమించడం, మాంసం/చర్మం కోసం వాటిని వేటాడడం, జంతువుల మధ్య మనుగడ పోటీ పెరగడం, జీబ్రాల సంచరించే దారులను మూసివేయడం, కొన్ని ప్రాంతాల్లో యుద్ధ వాతావరణాలు నెలకొనడం, అవగాహన లోపం లాంటి కారణాలతో వాటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇప్పటికే ‘ఖ్వగ్గా’ అనబడే జీబ్రా జాతి 19వ శతాబ్దంలోనే అంతరించిపోయింది. నేడు మైదాన ప్రాంత, పర్వత ప్రాంత, గ్రేవీ అనే మూడు రకాల జీబ్రా జాతులు కనిపిస్తున్నాయి. వీటిలో పెద్దగా కనిపించే గ్రేవీ జాతి జీబ్రాలు అంతరించే అంచున ఉన్నట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.నలుపు, తెలుపు చారలు కలిగిన జీబ్రాలు విలక్షణంగా కనిపిస్తూ తమ ప్రత్యేకతలను ప్రదర్శిస్తాయి.
ఒక్కో జీబ్రా చారలు ఒక్కో రకంగా మానవ హస్తరేఖల వలే ఉండడం విశేషం. ఈ చారల సహాయంతోనే అడవిల్లో తమ వెంటపడే సింహాలు, హైనాలు లాంటి మాంసాహార జంతువులకు కనబడకుండా తప్పించుకోగలుగుతున్నాయి. జీబ్రాలు గంటకు 65 కి.మీ దూరం ప్రయాణించగలవు. ఇవి అటవీ ప్రాంతాల్లో గుంపులుగా జీవిస్తూ, గడ్డిని తింటూ విత్తనాలను ఇతర ప్రాంతాలకు వెదజల్లుతూ జీవవ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడుతున్నాయి.అంతర్జాతీయ జీబ్రాల దినం వేదికగా జీబ్రాల సంరక్షణ చర్యలు, వాటి ప్రాధాన్యం, జీవ వైవిధ్య అవసరాన్ని వివరించడం, జీబ్రా చారలు కలిగిన వస్త్రాలు ధరించడం, వేటల నిషేధ చట్టాలను పటిష్టంగా అమలు పరచడం, విద్యాలయాల్లో పోటీల నిర్వహణ, సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం సముచితంగా ఉంటుంది. జీబ్రా జాతుల మనుగడ కొనసాగే విధంగా ప్రపంచ మానవాళి కృషి చేయాలని కోరుకుందాం.
- డాక్టర్. బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037
-
Home
-
Menu
