సమాజపు సంతోషానికి, మనిషి ఉనికికి మన రచనలు దోహదపడాలి..నేను నా సాహితీ యాత్ర

మాది ప్రకాశం జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఇప్పుడు గ్రానైట్ వచ్చి చీమకుర్తి పేరు అంతర్జాతీయంగా కూడా తెలిసిపోయింది గానీ, నా చిన్నప్పుడు తిండిగింజలకు కూడా కరువును ఎదుర్కొన్నారు జనం. జొన్నలే ప్రధాన ఆహారం. చీమకుర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కూనంనేని వారి పాలెం, ఇప్పుడు ఆధునికంగా కె.వి.పాలెం అంటున్నారు. గబ్బు చమురు దీపాలతో మా రాత్రుళ్ళు గడిచేవి. ఇక నా పుట్టిన తారీకు మా అమ్మానాన్నలకే గుర్తులే దు. మా అమ్మ ఊహలు, గుర్తులను బట్టి 1952లో అని నిర్ధారించుకున్నాను. ఇక మా చదువులు ఎలా సాగేవంటే, పొద్దుటే స్కూలుకు పోవడం- పదీ పదకొండు గంటలకల్లా ఇళ్ళకు వచ్చి గేదెలను పొలాలకు తోలుకుపోయేది. పది తరవాత పంతులుకు పిట్ట దొరికేది కాదు. అలా ఐదుదాకా పంతులు బలవంతం మీద ఎలాగో ఓర్చుకొని ఇక చదువు చాలు అనుకున్నవాళ్ళే అందరూనూ! ఆ తరవాత మా తరం నాటికి మెల్లిగా చీమకుర్తి హైస్కూలుకు పోవడం మొదలైంది. అట్లా మా వూరిలో మొదటిసారిగా మెట్రిక్ పాసయిన తొలి వీరవనితను. మొదటి గ్రాడ్యుయేట్‌ని. సొంత నిర్ణయంతో నా కిష్టమైన వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్న మొదటి ఆడపిల్లని నేనే. సాధారణంగా ఎస్‌ఎస్‌ఎల్సీ పబ్లిక్ పరీక్షల్లో తప్పనిసరిగా తప్పి, ఇక వ్యవసాయంలో పడ్డవాళ్ళు మగపిల్లలు ఇద్దరు, ముగ్గురే చదువుకున్న వాళ్లు ఉన్నారు అప్పటికి. ఇది మా ఊరి చరిత్ర.
ఇటువంటి వాతావరణంలో నా చదువు ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఎనిమిదితో ఆగి, తిరిగి మెట్రిక్‌తో కొనసాగింది. ఇలాంటి, చదువుల్లేని పాలెంలో సాహిత్యానికి చోటెక్కడా! పిట్టకథల ద్వారానో, ఏడాదికొకసారి వతను గ్రామాలలో నాటకాలు ఆడిపోయే సమాజాల ద్వారా తెలుసుకున్న భారత, రామాయణ కథలే మాకు తెలిసిన సాహిత్యం. అలాంటిది, 1968లో మా ఊరు దాటి గుంటూరు చదువుకోసం రావడం- నాకు నీళ్ళ నుండి బయటపడ్డ చేపలాగా ఉన్నా- ఓ కొత్త ప్రపంచానికి కిటికి తెరిచినట్లయింది. అలా తొలిసారిగా కమ్యూనిస్టులతో కలిగిన పరిచయం దిగ్భ్రాంతిని కలిగించింది. మనుషులంటే వీళ్ళేననుకుని వాళ్ళతో మమేకం అయ్యాను. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేశాను.
విద్యార్థిగా స్టూడెంట్ ఫెడరేషన్‌లో పనిచేసినప్పటి నుండి, నా వివాహానంతరం విరసం, జెఎన్‌ఎమ్, పౌరహక్కుల సంఘం వంటి ప్రజాసంఘాలలో పనిచేసినప్పటికీ, జనంతో కలిసి పనిచేయడం పట్ల వున్న ఆసక్తి సాహిత్యం మీద వుండేది కాదు. 1973లో నేను విరసంలో చేరినా, రచనలు పెద్దగా చేసింది లేదు. మా కుటుంబానికి ఐ.వి.సాంబశివరావుతో ఉన్న అనుబంధం వల్ల ప్రసిద్ధ రచయితలైన కారా, రావిశాస్త్రి, శ్రీశ్రీ, కొకు వంటివారితో సన్నిహితంగా మెలిగేవాళ్ళం. కెవిఆర్, టియమ్‌ఎస్, వివి, చెర, కారామాష్టారు చలసాని మా ఇంటికి వచ్చి మాతో వున్నవాళ్లు. శ్రీశ్రీ ఏ సంఘం పనిమీద గుంటూరు వచ్చినా-, ఆయన వచ్చిన దగ్గర నుండి తిరిగి మద్రాసు రైలు ఎక్కేదాకా వెంబడే వుండేది. అలా ఆ పెద్దలందరి పరిచయం, సాన్నిహిత్యం కూడా నన్ను కదిలించలేకపోయింది. కాకపోతే చదవడం, ఆ చర్చలు వినడం కొంత మార్పును తెచ్చింది. అప్పట్లో ఈ సెల్‌ఫోన్లు లేవు, కెమెరాలు లేవు. అసలు ఫోటోలు దిగాలనే ఉద్దేశమే వుండేది కాదు. అదేగనుక ఉంటే చరిత్ర రికార్డులోకెక్కే ఫొటోలు ఎన్ని వుండేవో! చిన్నప్పటి నుండీ సాహిత్యం ఎక్కువ చదవకపోవడం, నాకు భాష మీద గాఢమైన పట్టు లేకోవడం వల్ల కూడా అలా రాయాలనే త లంపు వచ్చేది కాదు.
అలాం టి నేను సాహిత్య రంగంలోకి రావడమంటే యాదృచ్ఛికంగా జరిగింది కాదు. అది కూడా ఒక పరిణామంలో ఒనగూడిందే. ఈ క్రమంలో సంఘాలలో పనిచేయడం, రచయితలతో, రచయితల సంఘాలతో సన్నిహితంగా ఉండడమేకాక- నా పట్టణ జీవితం వల్ల నా లోలోపల తెలియకుండానే గ్రామీణ సంస్కృతికి దూరమవుతూ పట్టణ నాగరికతలోకి దారితీయడం మొదలైంది. ఈ మార్పు వలన వదలలేని, స్వీకరించలేని అసంతృప్తీ, అశాంతి ఎదురయి, మానసికంగా ఘర్షణ పడుతున్న కాలం. ఇదిగో ఈ దశలో సంఘాలలో ఉండే సంస్కృతి కూడా దానికి తోడైంది. సాధారణ కార్యకర్తలు పనిచేసినా, నిజాయితీగా కష్టపడినా కూడా- కార్యకర్తల కంటే ఒక్క కవితో, కథో రాసిన వారికి ఇచ్చే గౌరవం నన్ను షాక్‌కు గురిచేసింది. ఈ మానసిక సంఘర్షణ ఒకవైపు కొనసాగుతుండగా- అదే కాలంలో స్త్రీ అస్తిత్వం మీద ప్రశ్నలు సమాజం మీదకు దూసుకొచ్చాయి. ఈ సంక్లిష్ట సమయంలో నన్ను నేను తెలుసుకోవడంలో భాగంగా మొదటిసారిగా సాహిత్యమంటే ఏమిటో తెలుసుకోవాలనుకుని అప్పుడు సీరియస్‌గా చదవడం ప్రారంభించాను.
అలా చదువుతూ, నేర్చుకుంటూ సాహిత్య రంగంలోకి వచ్చాను. అందుకు నా గ్రామీణ సంస్కృతి, మనుషులపై పరిశీలన నాకెంతగానో ఉపకరించాయి. నేను ఇన్నేళ్ళుగా నాకు లేవనుకుంటున్న పుస్తక భాష, భావుకత, ఉద్వేగాలు ఏమంత అవసరమని కూడా అనిపించలేదు. నా రచనకు ఎన్నుకున్న సాధారణ సగటు మనిషి గురించి చెప్పడానికి నాకు తెలిసిన మామూలు భాష, మాటలు సరిపోతాయనే ధైర్యం కలిగింది. ఈ క్రమంలో తొలిదశలో కవిత్వం రాయడం ప్రారంభించి- క్రమంగా వ్యాసాలు, కథలు, నవలల దాకా నా సాహిత్య ప్రస్థానం సాగింది. 1) ప్రశ్నే ప్రశ్నార్ధకమైన వేళ (కవితా సంకలం)తో ప్రారంభించి 2) జ్ఞానం అందరిదీ (సామాజిక వ్యాసాల సంపుటి) 3) పరామర్శ (సాహిత్య వ్యాసాల సంపుటి) 4) నెగడు, జీవనస్పర్శ, గీతలకావల, కాయితాల రుజువు (నాలుగు కథా సంకలనాలు) 5) నర్రెంక చెట్టుకింద, ఒండ్రుమట్టి, నిషిధ, మేరువు (నాలుగు నవలలు) రాయగలిగాను. ఇటీవల మరో కొత్త నవల ‘చుక్క పొడుపు’ ఇందులో నిషిధ, కాయితాల రుజువు కన్నడంలోకి అనువాదం అయ్యాయి.
నిజానికి నాకిప్పటికీ ఓ కార్యకర్తగా ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో కలిసి పనిచేయడం, సంభాషించడమే ఇష్టం. సాహిత్యం వాళ్ళ దగ్గర నుండే రావాలన్నది నా ఆకాంక్ష. అప్పుడే సమాజంలో ఆర్థిక, సాంస్కృతిక రంగంలో వస్తున్న మార్పు లు, ఆ క్రమంలో మనుషుల మనస్తత్వం, అసలు మొత్తంగా సమాజం సైకాలజీ ఎలా మారుతుం దో అర్థం చేసుకోగలం. ఇప్పుడైతే రచయిత బాధ్య త మరింత పెరిగిందనుకుంటున్నాను. అన్ని రం గాలూ, వ్యవ్థలూ విధ్వంసమై మనుషులను మతం, కులం పేరుతో చీల్చే తిరోగమన భావజాలం విజృంభిస్తున్న వేళ రచయితలు తటస్థంగా ఉండజాలరు. మానవ సంబంధాలు కరువైపోవడమేకాదు- కార్పొరేట్ ఇనుపడేగల కదంబహస్తాలలో మానవుని ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్న స్థితిలో మనం మౌనంగా ఉండడం నేరం. మన ఆనందానికే కాక సమాజపు సంతోషానికి, మనిషి ఉనికికి మన రచనలు దోహద పడాలనేది అందరి ఆశయంగా మారాలి, ఉండాలి.
- నల్లూరి రుక్మిణి
Tags
-
Home
-
Menu
