స్మృతికీ, మౌనానికీ మధ్య..ఠాగూర్, కాదాంబరి, మృణాళిని

“Between Memory and Silence… Tagore, Kadambari, and Mrinalini.”
X

ఐదుగురు పిల్లల తల్లి అయిన భార్య మృణాళిని పట్ల, రవీంద్రునికి ఏదైనా గా ఢమైన అనుబంధం ఉందని అంగీకరించడం, వదిన కాదంబరి జ్ఞాపకానికి ద్రోహం చేయడమేనని విస్తృతంగా ప్రచారమై, అనేక అపార్థాలకు తావిచ్చిం ది. అంతే కాకుండా, కాదంబరీ దేవి, ఠాగూర్‌కు మధ్య ఉండవచ్చనే సన్నిహి త సంబంధం చుట్టూ అల్లిన రొమాంటిక్ పురాణం, వాస్తవం, కట్టుకథ, విపరీత భావనలు, అంతులేని ఊహాగానాలు, కల్పిత రచనలకు ప్రేరణయింది. తన భార్య కోసం ఠాగూర్ పడిన దుఃఖం ‘గమనించదగ్గ విధంగా వ్యక్తిగతం కాదని, సాధారణీకరించబడినదని’, ‘నిజానికి రవీంద్రనాథ్ తన భార్య మరణానంతరం గానీ, ఆమె మరణానంతర జీవితం లో గానీ ఆమెను పెద్దగా తలచుకోలేదు’ అని కూడా ఎక్కువ గా ప్రచారమైంది. ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ టాగూరు, తల్లి శారదాదేవి. పద్నాలుగు మంది సంతానంలో ఆఖరి వాడుగా (తొమ్మిదవ కుమారుడు) రవీంద్రనాథ్ జొడసంకోలో జన్మించారు. ఆయన తండ్రి వివాహాలకు విరోధి. బాల్యవివాహాలను ప్రోత్సహించారు. తక్కువ స్థాయి వారి ఇంటి నుండి, లేదా అతని సంస్థానంలో పనిచేసే వారి పిల్లలనే కోడళ్లుగా ఎంచుకున్నారు.

రవీంద్రుడు రాస్తున్న కొత్తలో అతనిపై అయిదవ అన్నయ్య జ్యోతీంద్రనాథ్ ప్రభావం ఎక్కువగా ఉండేది. పొడుగ్గా, అందంగా, గంభీరంగా ఉండే అతను గొప్ప నాటక రచయిత, రంగస్థల ప్రముఖుడు, సంగీతకారుడు, కళాకారుడు, సంపాదకుడు, వ్యాపారవేత్త. అనేక తలమునక లై ఇంటి విషయాలను, భార్య కాదంబరిని సైతం అంతగా అతను పట్టించుకోలేదు. తరచుగా తీరిక లేకుండా ఉన్నా, ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో, పెద్దలు కుదిర్చిన వివాహమే1868లో, అతనికి పదేళ్ల కాదంబరీ దేవి (అసలు పేరు మాతంగిని)తో జరిగింది. కాదంబరీ దేవి తండ్రిది నిరాడంబరమైన, మధ్యతరగతి కుటుంబం. ఠాగూర్ కుటుంబ ఎస్టేట్‌కు సంబంధించిన గృహ సహాయకుడిగా పనిచేశారు. అలాంటి వివాహం, భావోద్వేగ పరంగా పరిణతి చెందిన ఇద్దరు సమాన భాగస్వాముల మధ్య సంబంధంగా ప్రా రంభం కాలేదు. ఆ కారణంగా వారి మధ్య వివాహం అంత సామరస్యంగా కొనసాగలేదు. వారిద్దరి మధ్య మైలు దూరం ఉండేది. ఆ కుటుంబంలో ఒంటరితనం, అభద్రతను ఆమె అనుభవించింది. అతనికి తగ్గ భార్యగా అనిపించుకోడానికి, వివాహం తరువాత, భర్త అత్తమామల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చదువును కొనసాగించింది. సంగీతం నేర్చుకుంది. తెలివితేటల విషయంలో భర్తకు ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంది. అతను రచించి దర్శకత్వం వహించిన నాటకంలో సైతం, అతనితో పాటు నటించింది. కోడళ్లు అందరిలోనూ కాదంబరే నలుపు. అయినా ఎవరికీ తక్కువ కాని అందం. ఆమె కళ్లు, నవ్వు టాగూరును అమితంగా ఆకర్షించేవి. భర్త తనదైన రీతిలో కాదంబరిని ప్రేమించి, ఆమె పట్ల శ్రద్ధ చూపించి ఉండొచ్చు. కానీ శ్రద్ధ చూపడం ఎల్లప్పుడూ భావోద్వేగ సాంగత్యం కాదు. కాదంబరి ఒక సున్నితమైన, తెలివైన, ఊహాశక్తి గల మహిళ. ఆమెకు ఒక గాఢమైన భావోద్వేగ బంధం అవసరమైంది.

ఠాగూర్ తల్లి అతని14వ ఏటనే, ఇనుప బీరువా కింద పడి చనిపోయింది. త ల్లి లేకపోవటంతో బాటు, సాహిత్యం పట్ల వదిన కాదంబరి ఆసక్తి, తల్లిలేని తనాన్ని మరిపించే విధంగా ఆమె ఆలనాపాలనా, ఠాగూర్ పట్ల ఆమె ప్రేమ, తల్లి ప్రేమకు ప్రత్యామ్నాయంగా, ఆత్మబంధంగా మారింది. ఠాగూర్‌కు, తనకన్నా రెండేళ్లే పెద్దదైన వదిన కాదంబరీ దేవితో, చనువుతో కూడిన దగ్గరతనం అలా మరీ ఎక్కువయింది.

ఈ లోగా తండ్రి అతనిని విదేశాలలో చదువుకు పంపే ఏర్పాట్లు చేశారు. ఠాగూర్‌ను విదేశాలకు పంపే ముందర, అక్కడ అలవాటుపడేందుకు వీలుగా, అతనిని అలహాబాదు పంపిచారు. అతని రెండవ అన్నయ్య సత్యేంద్రనాథ్ అప్పట్లో సివిల్ పరిక్షల్లో పాసై ప్రభుత్వ ఉన్నతోద్యిగిగా అక్కడ ఉన్నారు. తన స్నేహితుడు డాక్టర్ ఆత్మారాం పాండురంగ్ ఇంట్లో బస చేయడానికి అతనిని అక్కడ నుంచి బొంబాయికి పంపాడు. ఆ ఇంట్లో విదేశాల నుండి అప్పుడే తిరి గి వచ్చిన ఆత్మారాం అందమైన కుమార్తె కూడా ఉంది.

ఆ మరాఠీ యువతి అతనికి విదేశీ ఆచార వ్యవహారాల గురించి శిక్షణ ఇస్తూ, ఠాగూర్‌తో ప్రేమలో పడింది. ఆమె అసలు పేరు ‘అన్నా’. ప్రేమతో ఆమెకు ‘నళిని’ అని పేరు పెట్టారు ఠాగూర్. లండన్ చేరాక టాగూర్ లూసీస్కాట్ ఇంటిలో ఉన్నారు. అతనికి నలుగురు కూతుర్లు. అందులో చివరి అమ్మాయి లూసీతో, సంగీత ప్రేమలో పడ్దారు. నాట్యం పేరుతో మరి కొందరి తోనూ.. ‘ఈ ప్రేమ వ్యవహారాలు అన్నీ తెలిసి’ ఠాగూర్‌ను పెళ్లి పేరుతో కలకత్తాకు పిలిపించాల్సి వచ్చింది.

విదేశాలలో విద్యపేరుతో జరిగిన ఠాగూర్ ప్రేమ వ్యవహారాలన్నీ, ఏవిధమైన దాపరికం లేని దగ్గరి తనం కారణంగా కాదంబరికి తెలియకుండా పోలేదు. అయినా ఠాగూర్ పట్ల ఆమె అనురాగంలో మార్పురాలేదు. ఆమెను కలుపుకొనే, ఠాగూర్‌కు వివాహం నిశ్చయం చేసి, పెళ్లి జరిపించారు. ఆ తరువాత నాలుగు నెలలకే కాదంబరి, అధిక మోతాదులో నల్లమందు తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఆమెను చూసుకొని ఉండవచ్చు, కానీ ఆ వివాహం ఆమె కోరుకున్నటువంటి నిరంతర భావోద్వేగ సాన్నిహిత్యాన్ని అందించినట్లు కనిపించదు. పిల్లల కోసం ఆరాటంలో బావగారు సత్యేంద్ర ఠాగూర్ బిడ్డ ఇందిరతో గడిపేది. పదహారేళ్ల వారి వైవాహిక జీవితంలో సంతానానికైనా నోచుకోని, భర్తతో విఫలమైన వైవాహిక సంబంధం ఆమెను వేధించేది. తల్లి మరణం కంటే ఎక్కువగా, కాదంబరి మరణం ఠాగూర్‌ని కలవర పరిచింది. ఆమె మరణానికి ముందే 1887లో ఠాగూర్ రాసిన ప్రసిద్ధ గీతం ‘తొబూ మోనే రేఖో (అయినా గుర్తుంచుకో)’లో, నేను ఎంత దూరం వెళ్ళిపోయినా, లేదా దగ్గరే ఉండి కంటికి కనిపించకుండా పోయినా, నన్ను మాత్రం గుర్తుంచుకో’ అన్నది అందులో ప్రధానం.

ఆ పాట రవీంద్ర సంగీతాల్లో ప్రముఖమైన పాటగా మారింది. ఆమె మరణం, ఠాగూర్‌ని తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. చిత్రం కవితలో ఆమెని కవి హృదయంలో, కవిగా కీర్తించారు. తన మూడు పుస్తకాల్ని ఆమెకు అంకితం చేసారు. ఠాగూర్ జీవితం మీద, సాహిత్య ప్రస్థానం మీద కాదంబరి దేవి ప్రభావం అత్యంత గాఢమైనది. అతని మేధోపరమైన ఎదుగుదలలో ఆమె పోషించిన పాత్ర అమూల్యమైనది. అతను రాసిన వాటిని శ్రద్ధగా వింటూ, తగిన సలహాలు ఇస్తూ అతనికి మొదటి విమర్శకురాలిగా, అత్యుత్తమ శ్రోతగా ఆమె ఉంది. అతని ప్రతిభను గుర్తించి, నిరంతరం ప్రోత్సహించిన వారిలో ఆమె ముందు భాగాన ఉండింది. వారి మధ్య ఉన్న ఆత్మీయత అతని మనసులో సున్నితమైన భావాలను నింపింది. ప్రేమ, ఒంటరితనం, ప్రకృతి, మానవ సంబంధాల మీద అతను రాసిన అద్భుతమైన కవితలకు, ఎన్నో గీతాలు, నవలలు, నాటికల రచనల వెనుక ఆమెతో ఉన్న సాన్నిహిత్యం ప్రభావం ఉంది. తన వృద్ధాప్యంలో వేసిన అనేక చిత్రలేఖనాల్లో (పెయింటింగ్స్‌లో) కనిపించే స్త్రీల ముఖాలు చాలా వరకు ఆమెనే పోలి ఉంటాయని కళాకారులు భావిస్తారు. టాగూర్‌లో ఆమె ఎప్పటికీ ఒక నిత్య స్ఫూర్తిగా నిలిచిపోయింది.

నిజానికి కాలాతీతమైన ఠాగూర్ పాటల రాగాలు, గంభీరమైన కవితల వెనక ఒక నిశ్శబ్దమైన, స్థిరమైన శక్తిగా అతని భార్య, మృణాళిని దేవి కూడా ఉంది. చరిత్ర తరచు అతనిని సాహిత్యంలోని ఏకాకి యోగిగా గుర్తుంచుకున్నప్పటికీ, వారి ఉమ్మడి ప్రయాణం, ఒక మేధావికి ఆసరాగా నిలిచి, బెంగాల్ ఆత్మ మీద చెరగని ముద్ర వేసిన ప్రేమకు ఒక అందమైన నిదర్శనంగా నిలిచింది.

ఠాగూర్ గురించి మాట్లాడాలంటే, కళ, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక జాగృతితో నిండిన ఒక ప్రపంచం మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ మహనీయుని వెనుక ఉన్న వ్యక్తిని నిజంగా అర్థం చేసుకోవాలంటే, మృణాళిని దేవి నిశ్శబ్ద భక్తిని, ధర్మపత్నిని చూడాలి. ఆమె సౌందర్యం, స్థైర్యం, ఆమె అకాల మరణం ఆయన జీవిత రూపురేఖలను గాఢంగా తీర్చిదిద్దాయి. అంతేకాక, ఆయన దుఃఖం, స్మరణకు సంబంధించిన కొన్ని అత్యంత హృద్యమైన వ్యక్తీకరణలకు జన్మనిచ్చాయి.

రవీంద్రునికి ఇరవయి రెండు, మృణాళినికి పదేళ్ల వయస్సులో వారి వివాహం జరిగింది. ఆమె అసలుపేరు భబతరిణి. మాజీ ప్రేమికురాలైన ‘అన్నా’ జ్ఞాప కం ప్రతిసారీ గుర్తుకు రావాలనే ఉద్దేశంతో, అతని పెద్దన్నయ్య ద్విజేంద్రనాథ్ టాగూరు భార్య పేరును ‘మృణాళిని’గా మార్చారు. ఆమె తండ్రి వేణూమాధ వ్ జొడసంకో భవనంలోనే ఒక ఉద్యోగి. ఇరవయ్యెనిమిదేళ్ల ఆమె జీవితంలో, పందొమ్మిదేళ్లు ఆయన భార్యగానే గడిపింది. ఆవేదన, నిస్సహాయతతో కూడిన ఆమె ఉత్తరాలన్నీ, అతని అపారమైన పాండిత్యం నీడలో కనుమరుగైపోయాయి. అతనికి ఆమె రాసిన ఒక్క ఉత్తరం కూడా దొరకలేదు. ఆమెకు రా సిన ఉత్తరాలలో, టాగూర్ తరచుగా గృహ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న విషయాల గురించే ప్రస్తావించారు. 18861896 కాలంలో, అంటే పదేళ్ల వ్యవధిలో, ఐదుగురు పిల్లలు- కుమార్తె బేలా, కుమారుడు రథి, కుమార్తె రేణుక, చిన్న కుమార్తె మీరా, చిన్న కుమారుడు శమీలకు జన్మనిచ్చింది.

కవి రవీంద్రనాథ్‌కు, భార్య మృణాళినిదేవికి మధ్య ఉన్న బంధం సహచర్యం, త్యాగం, ఆయన కవిత్వంలో శాశ్వతంగా ప్రతిధ్వనించి, ప్రగాఢమైన దుఃఖంతో కూడిన ఒక పవిత్రమైన గాథగా నిలిచిపోయింది. మరీ ముఖ్యంగా ఆమె మరణాంతరం ఇరవయ్యేడు కవితలతో 1902లో వచ్చిన ఆయన స్మరణ కావ్యం ఆ విషయాన్ని మరింత సుస్పష్టం చేస్తుంది. అత్యంత హృద్యమైన ఆ సంకలనంలోని కవితలు, తరచుగా ప్రముఖ సంకలనాలలో అధ్యయనం చేయబడ్డాయి. దుఃఖపు తక్షణ పరిణామాలమీద కచ్చితంగా దృష్టి సారించే ప్రధాన కవితలవి. కేవలం ఇరవయ్యెమిదేళ్ల వయస్సులో కన్నుమూసి, తమ ఐదుగురుపిల్లలను ఒంటరిగా పెంచే బాధ్యతను ఠాగూర్‌కు అప్పగించిన భార్య మృణాళిని దేవికి, ప్రత్యక్ష శోకగీత నివాళి ఆ సంకలనం. బెంగాలీ సాహిత్యంలో శోకాన్ని వ్యక్తీకరించే అత్యంత శక్తివంతమైన రూపాలలో ఒకటిగా ‘స్మరణ’ పరిగణించబడింది. సాంప్రదాయ విలాపాలకు భిన్నంగా, టాగూర్ ఆ కవితలన్నింటిలోనూ ఒ క ప్రగాఢమైన ఆధ్యాత్మిక పరిణామానికి లోనయారు.

మృణాళిని మరణానికి కేవలం దుఃఖించడమే కాకుండా, ఆమె పట్ల తనకు ఉండవలసినంత శ్రద్ధ తాను చూపించలేకపోయాననే అపరాధ భావనను కూడా, స్మరణలోని కవితలన్నింటా నిస్సందేహంగా టాగూర్ వ్యక్తపరిచారు. వారి ఇరవయ్యేళ్ల వైవాహిక జీవితంలో ఆమె ఎంతగా భాగమైపోయిందో దుఃఖంతో, నిరాశతో గుర్తుచేసుకున్నప్పుడు, ఆమె మరణం తర్వా త ఠాగూర్ మృణాళినితో ప్రేమలో పడినట్లు అనిపిస్తుంది. అందులో ఠాగూర్ అభ్యర్థనలు ఒక విధేయత గల భార్యకు కాకుండా, దూరమైన ప్రియురాలికి ఉద్దేశించినవిగా ఉంటాయి. ఇంటి పనులను నిరాడంబరంగా, ప్రశాంతంగా చేసే, భార్య గుణాలు ప్రస్తావించినప్పటికీ, కవి అనేక కవితలలో మృణాళినిని ఒక ఆకర్షణీయమైన భాగస్వామిగా, సరదా సహచరిగా పదేపదే తిరిగి కనుగొన్నట్లు అనిపిస్తుంది. అందులోని ఎనిమిదవ కవిత మృణాళిని పట్ల కవికి ఉన్న గాఢమైన ప్రేమను, ఆరాటాన్ని స్పష్టం చేస్తుంది.

‘తీవ్రమైన ఈ విరహ బంధంలో/ నువ్వు దేశాన్ని, కాలాన్ని వదిలి ఎంతో దగ్గరగా వచ్చావు/ నా హృదయంలో కరిగిపోయి, అన్ని అడ్డుగోడలను బద్దలు కొట్టావు/ ఈ రోజు నీ కళ్లతో నేను సర్వస్వం చూస్తున్నాను/ నీ బాధను నేను అనుభవిస్తున్నాను /నా పనిలో, నీ అదృశ్య హస్తం ఉంది/ నీ కోసం నేను తపిస్తున్నప్పుడు, నీ ఆరాటాన్ని నేను అనుభవిస్తున్నాను/ మనం చెప్పాలనుకున్నవన్నీ చెప్పుకోగలిగి ఉంటే ఎంత బాగుండేది’.

ఆ కవితలు కుటుంబంలో అకస్మాత్తుగా ఏర్పడిన శూన్యత, ఆమె లేని లోటు వల్ల ఏర్పడిన నిశ్శబ్దం, మరణం మూలంగా ఏర్పడిన దిగ్భ్రాంతి వంటి విషయాలను వివరిస్తాయి. కవి ఎక్కడా తీవ్రమైన లేదా ఆవేశపూరితమైన శోకాన్ని వ్యక్తం చేయలేదు. తల్లిని కోల్పోవడం వల్ల వారి ఐదుగురు పిల్లలు అనుభవించిన వేదన గురించి ఆ కవితలలో ఎక్కడా ప్రస్తావన లేదు. ఆత్మజాలి నుండి దూరమయి, మానవ బాధ అనే విశ్వ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి, తన వ్యక్తిగత వియోగం ఒక మార్గంగా టాగూర్ భావిస్తారు. వ్యక్తిగత దుఃఖం నుండి విశ్వ దుఃఖం వరకు పయనిస్తారు. ఉపనిషత్ తత్వాలతో గాఢంగా ప్రభావితుడైన ఠాగూర్, మరణాన్ని అంతిమ వినాశనంగా చూడరు. దానికి బదులుగా, దానిని రహస్యమైనదిగా లేదా జీవితంలోని ఒక భిన్నమైన దశగా భావిస్తారు. ‘స్మరణ’లో, ఆయన తన దివంగత భార్యను, దూరమైన వ్యక్తిగా కాకుండా, విశ్వంలో విలీనమై, సాయంకాలపు ఆకాశంలో, గాలిలో, నిశ్శబ్ద రాత్రిలో ఒక భాగంగా మారిన వ్యక్తిగా సంబోధిస్తారు. మరణం ఒక పరివర్తన మాత్రమే, అంతం కాదు అని భావిస్తారు.

సాధారణ భావోద్వేగాలు ఎన్ని ఎలా ఉన్నా, దుఃఖం ప్రతి ఒక్కరికీ భిన్నంగానే ఉంటుంది. ఆ లోటు ఆ తరువాత జీవించి ఉన్న వారిని అనేక విధాలుగా బాధిస్తుంది. మరణం అవాస్తవంగా అనిపిస్తుంది. జీవితం అకస్మాత్తుగా దాని అర్థాన్ని కోల్పోయిందని, లేదా తమలో ఒక భాగమేదో పోయిందనిపిస్తుంది. చాలా మంది ఆ దుఃఖం నుండి పూర్తిగా ‘బయటపడలేరు’. బదులుగా దానిలో జీవిస్తుంటారు. జీవించి ఉన్న భాగస్వాములు వ్యక్తి గతంగా ఏమి కోల్పోయారో, చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. కానీ సృజనకారులు ఆ లోటును స్మరణ సాహిత్యాలతోను, చిత్రాలు, విగ్రహాలు, పాటలతోనూ వారిని సజీవం చేసుకుంటూనే ఉంటారు.

ముకుంద రామారావు

990 834 7273

Tags

Next Story