స్వయంకృతాపరాధులు

నక్షత్రాల కాంతి కింద
అమాయకత్వం గులాబీ రేకులా రాలిపోయింది
ప్రతి హృదయంలోనూ అవసరాల విత్తనాలు
వ్యామోహాల పచ్చిక బయళ్లు
అత్యాశల అడవులే విస్తరించాయి
కంటి గోడలలో కొలువై ఉన్న దేవతలు
ప్రతి మంత్రం ముగిసేలోపే
అరిషడ్వర్గాల జ్వాలల్లో
ధూపదీప నైవేద్యాల్లా కరిగిపోతారు
ఇంద్రియాలను గెలవాలనే సంకల్పం
కేవలం ప్రతిమల మౌనంలోనే మిగిలిపోతుంది
పసితనం, కౌమార్యం, వృద్ధాప్యం
దశలన్నింటిలోనూ మారుతుంది వయసు
మారదు కీర్తికాంక్ష రూపం
కలువలలోని నీడలా వెంటాడుతూనే ఉంటుంది
చాటింగ్ల హోరులో, డేటింగ్ల మత్తులో
షికార్ల సంబరంలో, సినీ మమకారంలో
సమయ గడియారాన్ని తిప్పి పారేస్తుంటారు
ప్రతిరోజూ పత్రికల్లో
చిరునవ్వుల ఫోటోలు కాదు
దారి తప్పిన ముఖాలే,
పతాకశీర్షికలు అవుతున్నాయి
ఎడారిలో ఓయాసిస్సులు లేవు
వేదికలపై వైనాలే నిలిచాయి
జీవితం ఒక సాలిగూడు మనసే జాలి తీగ
సొంతంగా అల్లుకున్న వలలో
తమకు తామే చిక్కుకుంటారు
స్వయం కృతాపరాధులుగా
- డా.ఐ.చిదానందం
Tags
-
Home
-
Menu
