బాల్యం బడుల్లోనే బ్రతకాలి

బాల్యం బడుల్లోనే బ్రతకాలి
X

తుపాకుల, తూటాల ధ్వనుల రాతల

సమర గీతాల మధ్య బాల్యం

భయం చెరసాలలో బందీ అయ్యింది

బాంబుల మోతల క్షిపణుల దాడుల

బతుకు శూన్యాల మధ్య బాల్యం

రాయలేని వేదనల కవిత్వమయ్యింది

పలక బలపాల బంగారు వికిరణాల

వెలుగులో తొలి ఉషస్సు నిశీధిలో

బాల కార్మికుల నిశ్శబ్ద రోదనల భారతం

చెత్త కుండీలలో వెతుకులాటగా మారింది

చిరునవ్వుల చిరుజల్లుల సవ్వడి గేయం

లింగ వివక్షత మేఘాల చాటున

బాల్యవివాహాల హింసా దీపమయ్యింది

పేదరిక కుంపటి రాత్రి మౌన గర్జనలో

ఆకలి గుండెల అశ్రు నయనాలు

బస్టాండ్ దారుల్లో ఎముకల గూడులయ్యాయి

పిల్లల కళల చిరునామా

ఆటపాటల స్వేచ్ఛా మధురిమ

మధుర జ్ఞాపక నెమలీకల సరిగమ

కోట్లాది బాలల కలల బతుకు ఆకాశం

సమాజ బడుల్లో జ్ఞానోదయమై కదలాలి

ఆకలి కేకలు, వివక్షత గాయాలు

వెట్టిచాకిరి వ్యధలు, యుద్ధ మరణాల

మారణహోమం మయమై

ఆనంద శాంతి కుసుమాల

నినాదాలు పరిమళించాలి

అంతరిక్ష ప్రేమ తారలై బాల్యం

అనంత విశ్వంలో పయనించాలి

ఫిజిక్స్ అరుణ్ కుమార్

Tags

Next Story