నివాళి

ఎన్నో జీవరాశులున్న భూమి మీద సౌగంధికా పుష్పాల్లాంటి కవులు అరుదుగా పుడతారు. బతికిన వేళల్లో కాంతిపుంజాలై వెలుగుతారు. కీర్తి శరీరాలతో మిగిలాక శుక్ర తారలై స్థిరపడతారు. వాళ్ళు భూమి మానస పుత్రులు. తరాలు స్మరించే ప్రాణులు. వాళ్ళు ఖేద పడితే యుగాలు బాధపడతాయి. అటువంటి ఖేదమేదో భవభూతికి కలిగి ఉంటుంది. రంధ్రాన్వేషణ చేసేవాళ్ళను ఉద్దేశించి అంటాడిలా-
యేనామ కేచిదిహనః ప్రథయంత్యవజ్ఞం
జానంతు తే కిమపి తాంప్రతి నైషయత్నః
ఉత్పత్స్యతే మమ తు కోపి సమానధర్మః
కాలో హ్యయం నిరవధిర్విపులాచ పృథ్వీ
నా రచనలు నచ్చని కొందరు నిందిస్తున్నారు. వారికి తెలిసినదేదో అలాగే ఉండనివ్వండి. నేను రాస్తున్నది కళాకౌశలం లేని వాళ్ళ కోసం కాదు. కాలం అనంతం కదా! ఎప్పుడో ఒకప్పుడు ఈ విశాల భూతలం మీ ద నా వంటి రసహృదయుడు ఇంకొకడు పుట్టకపోడు.
ఆర్తితో పాడలేక ఏడ్పు జీర అలికినట్టు అనుశీలనం అనే లక్షణం లేనివాళ్ళు వాళ్ళ ఉద్దేశ్యాలు కవికి ఆపాదించి నలుపుతారు. కావ్య చర్చలో ఇలా మెరిగల్లా తగిలే వాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. అటువంటి సారస్వత కపటత్వం భవభూతిని పుండులా సలిపి ఉంటుంది. కానీ ఎక్కడా లొంగినట్టు కనబడడు. కళా కౌశలం లేని మనుషులకు దూరం గా తదనంతర తరాల్లో పుట్టే రస హృదయుల కోసం తన కవిత్వాన్ని దాచుకున్నాడు.
ఇటువంటి లక్షణమే మన ధూర్జటిలో కూడా ఉన్నట్టుంది. ఏది రాయాలో, ఎవరి మీద రాయాలో చేసే దిశా నిర్దేశాలు తనను బాధించి ఉంటాయని ఈ కింది పద్యం చెబుతుంది.
నీకుం గాని కవిత్వమెవ్వరికి
నే నీ నంచు మీదెత్తితిన్
చేకొంటిన్ బిరుదంబు, కంకణము
ముంజే గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు,
నా తనువు కీడుల్ నేర్పులుంగావు, ఛీ!
ఛీ! కాలంబు రీతి దప్పెడు జుమీ! శ్రీ కాళహస్తీశ్వరా!
నీకు తప్ప నా కవిత్వాన్ని ఇంకెవ్వరికీ ఇవ్వనని శంకరా! ప్రతినబూని ముడుపు కట్టాను. నియమానికి గుర్తుగా ముంజేతికొక కంకణం కట్టుకున్నా ను. జనం మెచ్చేలా ఈ నియమాన్ని ఇన్నాళ్లూ పాటించాను. దీని వల్ల వచ్చే మంచి చెడుల మీద ధ్యాస కూడా లేదు. కానీ క్రమంగా కాలంలో మార్పు కనబడుతోంది. ఛీ! ఛీ!
బొత్తిగా లౌక్యం లేని వాడు ధూర్జటి. తన నియమానికి విరుద్ధంగా రాయలేక అవస్థ పడ్డాడు. నిజానికి ఏ కాలంలో ఐనా కవులు స్వభావ విరుద్ధంగా రాయలేరు. అది వాళ్ళ ప్రతిపత్తిని దెబ్బ తీస్తుంది. ‘ఆపరితోషా ద్విదుషాంన సాధు మన్యే’ అంటూ పండితులు సం తృప్తి చెందేంత వరకు నా ప్ర యోగం సఫలమని భావించను అని చెప్పిన కాళిదాసు కూడా స్వభావ విరుద్ధంగా రాయలేదు.
ఎన్ని ఇబ్బందుల దిబ్బలున్నా కాల్పనిక లోకంలో బింబాలుగా వెలిగే కవులు ధన్యులు. మన గజిబిజి ప్రపంచాన్ని సరళం చేసి పోతారు. కాలాలతో నిమి త్తం లేకుండా వాళ్ళను ఇష్టపడటమే మనమిచ్చే నివాళి.
- రఘు
Tags
-
Home
-
Menu
