యే ‘షోలే’ హమ్ నహీ భూలేంగే

యే ‘షోలే’  హమ్ నహీ భూలేంగే
X

షోలే, ‘ద ఫైనల్ కట్’ అంటూ 2025 డిసెంబరు 12న మళ్లీ దేశమంతటా షోలేను విడుదల చేస్తున్నారు. ఇది 4కే, డాల్బీ 5.1 హంగులు అద్దిన సిసలైన మూల వెర్షన్. 1975లో సెన్సార్ అభ్యంతరాలు చెబితే, రి-షూట్ చేసిన క్లైమాక్సునే మనం ఇన్నాళ్లుగా చూస్తూ వచ్చాం. అయితే, కత్తెర పడని పతాక సన్నివేశాలతో ఈసారి కొత్తగా వస్తోందీ ఆల్ టైం బ్లాక్ బస్టర్.

ఒకానొక డ్రీం గర్ల్, ఎవర్‌గ్రీన్ హీరో, యాంగ్రీ యంగ్ మేన్, ఒక కల్ట్ మాస్ క్లాసిక్.. వీటన్నిటి డీఎన్‌ఏ షోలే ఇప్పటికి ఏభై ఏళ్ల కిందట వచ్చింది షోలే. ఇది ఒక సినిమా మాత్రమే కాదు, మన జీవనంలో ఓ విడదీయలేని భాగం. చూసిన ప్రతిసారీ సరికొత్త అనుభూతులను కలిగిస్తూ ఉంటుం ది. ఏభై సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా, ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంది. ఈ సినిమాకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇండియా 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని దూరదర్శన్ నేషనల్ టెలివిజన్ ఛానల్లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రసారం చేశారు. 2025 సెప్టెంబరు 7న టొ రంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (TIFF) 50వ ఎడిషన్ లో షోలే 4K వర్షన్ గాలా ప్రెమియర్ 1800 సీట్లు ఉన్న రాయ్ థామ్సన్ హాలులో ప్రత్యేక ప్రదర్శన చోటు చేసుకొంది.

రాంగఢ్ గావ్, మాల్గాడీ (గూడ్స్ బండి)ని బందిపోటులు దారిమళ్లించుకుపోతూ ఉంటే ఇన్‌స్సెక్టర్ బల్దేవ్ సింహ్ ఠాకుర్ ప్రాణాలు పణం పెట్టి వారికి ఎదురొడ్డి పోరాడడం, ఇద్దరు దొంగలు.. వీరూ, జయ్.. ఆయనకు సైదోడు నిల్చి చేసిన ప్రాణాంతక సాహసం, స్నేహం, ప్రేమ, ఆక్రోశం, పగ, రెండు హోలీ పండుగలు, ఎదిగివచ్చిన కొడుకుకు వృద్ధ తండ్రికి తుది వీడ్కోలును పలకాల్సిరావడం అన్నీ ఇంకా తాజాగా గుర్తుండనే ఉన్నాయి జనాలకు. ప్రతి చిన్న పాత్రా చెప్పే సంభాషణాలన్నీ ప్రేక్షక లోకానికి కంఠస్థం. ఆ అద్భుతమైన డైలాగ్ రచయితలు సలీమ్- జావేద్ లు. సబ్బాస్.. హీ.. అంటూ ఠాకుర్‌కేసి గబ్బర్ చూసి నవ్విన నవ్వు‘ఓ సాంబ’ అనే ఊతపదం, క్లోజ్-అప్ షాట్లు, గుర్రాలపై దండెత్తి వచ్చిన బందిపోట్లను, తెల్లని ఫుల్ స్లీవ్స్ బనియన్, మెడలో పూల దండతో ఓ చిన్నపూరింటి కర్రల దడిలో నుంచి పిస్తోలుతో వీరూ కాల్చిపడేసి, గురి తప్పనందుకు పిస్తోలును ముద్దుపెట్టుకు చిరునవ్వు రువ్విన సీనునూ ఓ పట్టాన మరచి పోగలమా. (ఎడిటింగ్ బాధ్యత ఎం.ఎస్. షిండేది). కథానాయకులు ఇద్దరూ మొదటి రీలు నుంచి చివరి రీలు దాకా రెండో, మూడో జతల బట్టల్నే ధరించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకొంటే గాని గుర్తుకు రానంతలా ఈ చలనచిత్రంలో లీనమై పోతాం. ఆ ఘనత డ్రెస్మెన్ డిసూజ, కాస్ట్యూమ్స్ తయారుచేసిన మిసెస్ శాలిని షాహ్‌లకు, చెరేలారామ్, కచిన్స్, రోబ్ స్టయిలో, న్యూస్టైలో అసిస్టెంట్స్ బాబు, విఠల్‌లకు దక్కుతుంది.

భర్త మరణించిన రాధ, ఫ్లాష్ బాక్‌లో పెళ్లికి ముందు రాధ.. ఇలాగ ఒకే సినిమాలో ద్విపాత్రాభినయం చేసేసినంత పని జయ బాధురి చేసింది. అంగ్రేజ్ కే జమానే కే జైలర్‌గా అస్రానీ. హరిరాంనాయీగా కేశవ్ ముఖర్జీ, సూర్మా భూపాలీగా జగ్దీప్, ఠాకుర్ పెద్ద కోడలుగా గీత సిద్ధార్థ్ కాక్, ఇమాం సాహెబ్‌గా ఎ.కె. హంగల్ వంటి అతిథి నటులు వారికి అప్పగించిన పాత్రలను నమిలి మింగి త్రేన్చి ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..’ చెప్పేసుకున్నారు కదా. టైటిల్ కార్డులు పడేటప్పుడు వినపడే థీం మ్యూజిక్ మొదలుకొని పాటల్లో, సన్నివేశాల నేపథ్యంలో సంగీతం ఈ సినిమా లో పోషించిన పాత్ర అమోఘం. చిత్రానికి మ్యూజిక్ అందించినది ఆర్.డి. బర్మన్. షోలే ఎల్పీ రికార్డులను పాలిడార్ , డైలాగ్స్ ఆడియో క్యాసెట్స్‌ను 2 వాల్యూముల్లో మ్యూజిక్ ఇండియా లిమిటెడ్‌లు తీసుకురాగా విపరీతంగా అమ్ముడవడం, ది ‘షోలే : ద మేకింగ్ ఆఫ్ క్లాసిక్’ పేరుతో (అనుపమ చోప్రా రాసింది, పెంగ్విన్ ఇండియా అచ్చేసింది) పుస్తకాలు 2000 డిసెంబరులో ఇంగ్లిషు భాషలో వచ్చి సినీ ప్రేమికులను అలరించడం.. మరో చరిత్రండోయ్.

అమ్జాద్ ఖాన్ అనే ఒక వరిష్ట నటుడికి (గబ్బర్ సింగ్) రాత్రికి రాత్రి ‘ద బిగ్ బ్యాడ్ మేన్’ పట్టాన్ని కట్టింది షోలే. స్టంట్స్‌ను కూర్చింది మహమ్మద్ అలీ, అజీంలతోపాటు పరదేశీలు జిమ్, జెరీ. ఈ సినేమాకు డి. ఆర్. ఠక్కర్ సహాయక దర్శకుడు. ఈ అందరినీ మించి -ఈ చిత్ర దర్శకుడు రమేశ్ సిప్పిని గురించి చెప్పుకోవాలి. అతడు అతడి యవ్వనంలో, ఈ సినిమాని ఓ మహా యజ్ఞంలా నిర్వహించాడు. రెండున్నరేళ్లు పట్టిందట చిత్రీకరణకు. భారతదేశంలో అత్యంత ఎక్కువ మందిపైన ప్రభావాన్ని ప్రసరించిన చలనచిత్ర స్రష్ట అనే ఘనత లభించిందతడికి. రమేశ్ సిప్పి తండ్రి జి.పి. సిప్పి మహా సాహసి. అంతకు ముందు ప్రకాశ్ మెహ్రాతో సహా ఎందరికో షోలే కథని వినిపించి, నహీఁ బాబా నహీఁ అనే స్పందనలే విని, విని విసుగెత్తిన సలీం- జవేద్ లకు వారి కలను ఎట్టకేలకు నిజం చేసి చూపెట్టారు తండ్రి సిప్పి, పుత్రుడు సిప్పిలు. ‘ది గ్రేటెస్ట్ స్టార్- కాస్ట్ ఎవర్ అసెంబల్డ్’, ‘ది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్’ లాంటి ఈ పబ్లిసిటీ ఐడియాస్ ఖ్యాతి గీత సిప్పిది.

షోలే’ను రూ.3 కోట్లు పెట్టి తీస్తే, బాంబే మినర్వా థియేటర్లో 3 సంవత్సరాల పాటు రెగ్యులర్ షోస్ ,రోజుకు 3 ఆటలు ఆడింది. ఈ సినిమాని అది విడుదల అయిన ఆగస్టు 15న దూరదర్శన్‌లో చాలా సంవత్సరాలు పాటు ప్రదర్శిస్తూ వస్తున్నారంటేనే, అది జనసమూహ మస్తిష్కంలో ఎంతలా మమేకమైందీ చెప్పకనే చెప్పే ఫినామినన్. “షోలే కె దిన్, దిల్ ఖిల్ జాతే హైఁ..” మరి. ఒకే ఒక్కటి ‘ముఘల్- ఎ- ఆజమ్’ (1960), షోలే కూడ ఏకైకమే. ఇవి 1913లో సినిమా భారత్ కు వచ్చాక, ఇప్పటి వరకు మనకు దక్కిన అపురూప చలనచిత్ర రూపాలూ, గొప్ప వాణిజ్య మైలురాళ్లూను. ‘ముఘల్- ఎ- ఆజమ్’ విడుదలైన కాలంలో ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన రూ.11 కోట్లు ఇప్పటి ధరలలో పోల్చి చూస్తే రూ.4,000 కోట్లకు సమానం అని, ‘షోలే’ 1975లో విడుదలైనప్పటి నుంచి వసూలు చేసిన రూ.35 కోట్లు ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని చూస్తే, రూ.3,090 కోట్లు ఆర్జించినట్లవుతుందని ఒక ఇంగ్లిషు దినపత్రిక ద హిందుస్తాన్ టైమ్స్ 2024 అక్టోబరు 15 సంచికలో పేర్కొంది. ఏమైనా చరిత్ర సృష్టించిన, ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన సినిమా షోలే.

- దిలీప్

Tags

Next Story