నేల కేవలం మట్టి ముద్ద కాదు

నేల కేవలం మట్టి ముద్ద కాదు
X

చిన్నప్పుడు పొలానికి వెళ్తే

మట్టిపై నడిచిన పాదాలకి కూడా

పూలు పూసినట్టు అనిపించేది

రైతు చేతివేళ్ళ మధ్య నుంచి జారిపడిన వడ్ల గింజ

కొద్ది రోజులకే మొలకెత్తి పచ్చని ఊపిరిలా నిలబడి

మన కళ్లలో మెరుపులు నింపేది

అది నేల మన కన్న తల్లి

నేలకు మాటలు రావు

కానీ ఆ నేల హృదయం తడితో నిండి

కమ్మని వాసనతో మనల్ని పరవశుల్ని చేస్తుంది

నేల నిశ్శబ్దంగా మన పాదాల చెమటని తుడిచి

మన భవిష్యత్తును

ఓ పచ్చని వాకిట్లో నడిచేలా చేస్తుంది

కానీ ఇప్పుడా నేల పాత పుస్తకంలా మౌనంగా

గదిలో ఓ చివరి మూలన పడుకుని ఉంది

ఇక ఇప్పుడు నేల కాదు

మనల్ని మనమే చూసుకోవాల్సిన సమయం వచ్చింది

ఇవ్వాళ మన చలనాలు నగరాల్లోనూ, నగిషీల్లోనూ

వేగంలోనూ తల మునకలయి పోయాయి

పొలాలు పాత స్నేహితుల్లా, దూరంగా నిలబడిపోయాయి

ఒకప్పుడు వర్షంతో కబుర్లు చెప్పిన నేల

ఇప్పుడా వర్షం కోసం మౌనంగా ఎదురు చూస్తోంది

‘నేల అమ్మ లాంటిదిరా, ఆమె ఒంట్లో తడి ఆరితే

ఇంట్లో భోజనం కూడా కమ్మగా రాదు’

మా చిన్నప్పుడు పెద్దలు చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి

మనం నేల అవసరాన్ని, దాహార్తినీ మరిచిపోయాం

వాతావరణంలో గాలి వేడెక్కింది, జలాలు క్షీణించాయి

పచ్చదనం కాలిపోయింది, పర్వతాలు కూలిపోయాయి

జీవవైవిధ్యం గాజు గుళికల్లా పెటిల్లుమని విరిగిపోతోంది

నన్ను కాపాడితేనే మీ భవిష్యత్తు పచ్చగా ఉంటుంది అని

నేల మాట్లాడదు అది మౌనంగానే ఉంటుంది

ఆ నేల నిశ్శబ్దమే మనకు గుణపాఠం

ఇప్పుడా నేలను రక్షిద్దాం నేలను రక్షించుకోకపోతే

రేపు మనకు అన్నం ఎవరు పెడతారు

ఈ నేల కేవలం మట్టి ముద్ద కాదు

అది మన ఊపిరి మన బతుకు మన భవిష్యత్తు

నేలతల్లిని మర్చిపోతే మట్టి మౌనం వహించదు

మన కథే ముగిసిపోతుంది

- వారాల ఆనంద్

Tags

Next Story