ఆశయం

తెలుసునా మిత్రమా,
నీవెందుకు ఒంటరైనావో
నడకకు జతలేక పయనానికి దిక్కులేక
కలల గమ్యం వేటలో, ఆశల రహదారిలో
సొగసైన సవారీతో పరిగెత్తించిన
కోర్కెల గుర్రాలు
హఠాత్తుగా అపరిచితులైనట్టు
బ్రతుకు బండిని వదిలేసి
తమ దారి తాము చూచుకొని
ఒక్కటొక్కటిగా అదృశ్యమై
ఏ దూరాలకు పారిపోయాయో
ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా?
ఉచ్ఛ్వాస నిశ్వాసములకే ఉనికై,
ఊపిరికే ఊపిరై ప్రాణములో ప్రాణమై
ఎద పొదరింట్లో కొలువై
అతి ప్రీతిపాత్రమైన ఆశయం
ఉసురుదీసి జీవచ్ఛవాన్ని జేసి
ఎడంగా ఎందుకు వెళ్లిపోయిందో
ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా?
జీవిత సాఫల్య తీరం దిశకు
భద్రంగా మలుపు జీవననావ
నడిసంద్రపు సంధ్యలో తొట్రుపాటుతో
ముందుకు సాగనంటూ
గమనమెటో తేల్చుకొమ్మంటూ
బ్రతుకునెందుకు డోలాయమాన స్థితికి
లంగరేసిందో
ఎందుకో ఆలోచించావా ఇప్పటికైనా?
మది ఆలోచనా తరంగాల్లో
అమాస నిశా నిరాశల ఒత్తిళ్ళని
ప్రయత్న పోరాట పున్నమి వెలుగుల్తో
అలుపెరగక అధైర్యపడక తరిమేస్తే
కోరుకున్న ఆకాంక్షల గమ్యంవైపుకు
నడకకు దశ దిశ తోడు దక్కేనని
ఇప్పటికైనా ఆలోచించావా??
- రవి కిషొర్ పెంట్రాల, లాంగ్లీ, లండన్
Tags
-
Home
-
Menu
