ప్రవహించేతనం కవిని తాజాగా ఉంచుతుంది.. నేను, నా సాహితీ యాత్ర

ప్రవహించేతనం కవిని తాజాగా ఉంచుతుంది.. నేను, నా సాహితీ  యాత్ర
X

తల్లి కడుపులో నుంచి నేలమీదికి వచ్చిన శిశు వు కంటి రెప్పలు మొదటిసారిగా తెరిచి వెలుగును చూసినట్టు, కొత్త చూపుతో నాదైన కవితా ప్రపంచంలోకి చీకటి దారిలో దీప కాంతిలా ప్రవేశించాను. నాకు రెండు పుట్టిన స్థల కాలాలు ఉన్నాయి. మా అమ్మమ్మ మాణిక్యమ్మ ఊరిలో సాంస్కృతిక బీజాలు పడ్డాయి. అక్కడే నాలో సాహిత్య భవనానికి పునాది పడిందనే చెప్పాలి. మా ఊరు, కుటుంబ వాతావరణం అనేకానేక విషయాలను నాకు బోధపడే చేసింది. రక్తం, చెమట, ధిక్కారం ముప్పేట కలెగల్సిన మట్టిలో విత్తిన విత్తనమై మొలకెత్తినప్పుడు వినిపించే ధ్వనిలా నేను కవిత్వంలోకి జీవాక్షరమై ప్ర తిధ్వనించాను. ప్రతిఘటించాను. పరిపరి విధాల పరివ్యాప్తమయ్యాను. ఆకలి తీర్చుకోవడానికి శ్రమించినట్టు నేను సాహితీ క్షుద్బాధ తీర్చుకోవడానికి కళ్ళల్లో వత్తులు వేసుకుని, బీజాక్షరాలను కలిపి పల్లె పాటలా గొంతెత్తుకున్నాను.

నేను మొగ్గలా సాహిత్య ప్రపంచంలోకి వికసిస్తున్నాను. మిత్రుల సహకారంతో నేను 1973 ప్రాం తంలో సిరిసిల్ల యువ సాహిత్య సమితి నిర్వహిం చే కవి సమ్మేళనాల్లో సభలలో చురుకుగా పాల్గొనేవాడిని. నా అభిరుచిని, సాహిత్యాభిలాషను గమనించిన అప్పటికే జక్కని వెంకటరాజం సాహి త్యంలో ఎదగడానికి తోడ్పడినాడు. ఆయన మిత్రుడు నిజాం వెంకటేశం సార్ పరిచయం నా సాహిత్య దిశ, దశను గొప్ప మలుపు తిప్పింది. నిష్ణాతులైన కవుల పుస్తకాలను అందుబాటులో ఉంచడమే కాకుండా నాకు వాటి ద్వారా ఒక స్ప ష్టమైన ప్రాపంచిక దృక్పథం ఏర్పడటానికి దోహదం చేశాడు. అంతేకాకుండా అధ్యయనం చేయడం ఒక ఎత్తు అయితే, మరొక ఎత్తు నా చుట్టూ జరుగుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పోరాటాలు నన్ను కలవరపరిచి నా సాహిత్యాన్ని మిక్కిలి ప్రభావి తం చేసిందనే చెప్పాలి. గ్రామాలలో భూస్వాముల అన్యాయాలు, అరాచకా లు అవినీతి, అక్రమాలు చేస్తూ పాలకులతో కలిసి ప్రజలను రక్షిస్తాం అనే పేరున తీవ్రంగా అణచివేశారు. ఈ ప్రాంతంలో ప్రజా ఉద్యమాలు పెల్లుబుకాయి. అటు పోలీసులు ఇటు ఉద్యమకా రుల మధ్య సామాన్య ప్రజలు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు. వీటన్నింటి ప్రతిఫలనాలు నా కవిత్వంలో ప్రతిబింబించాయి. ప్రశ్నించాయి.

అప్పటికే వివిధ పత్రికలలో కవిత్వం వచ్చినప్పటికీ నా ఆర్థిక స్థితిగతుల వలన పుస్తకంగా తీసుకురాలేకపోయా ను. కానీ 1986 నుంచి వచ్చిన కవిత్వాన్నంతా కవిత సంకలనాలుగా అచ్చు వేసి పదిలరుచుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు పాతాళగరిగె నుండి మనాది వరకు 18 కవిత్వం పుస్తకాలు అచ్చులో తీసుకువచ్చాను. ఆ పుస్తకాలు వివిధ ప్రతిష్టాత్మ క అవార్డులను తీసుకువచ్చి పెట్టాయి. కవిత్వంలో ఇమడని వస్తువులను, దృశ్యాలను, జీవిత శకలాలను మార్పులు చేర్పులను ఒక 20 కథలుగా రాశాను. ప్రతి కథకు ఒక ప్రత్యేక గుర్తిం పు వచ్చింది. అవి వివిధ సంకలనాలలో స్థానాన్ని పొందాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో నేను తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా 2007 నుండి 2012 వరకు పనిచేశాను. తెలంగాణ కవులలో, రచయితలలో, మేధావులలో ఏర్పడిన విపరీతమైన ఉక్కపోత, సాచివేత, నిశ్శబ్ద కాలంలో అధికారం చేపట్టిన పాలకుల తీరుపైన అనివార్యంగా వివిధ పత్రికల్లో నేను రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యాసాలు రాశాను.

నాయకుల ముసుగులను తొలగించి నిజ స్వరూపం బయట పెట్టాను. నాతో పాటు ప్రయాణించిన చాలామంది సృజనకారులు ఒకటి, అరా పుస్తకాలకే ఆగిపోయారు. ఇదే కాలంలో ఎలాంటి తాత్విక ప్రాపంచిక దృక్పథం లేని బతుకు తెరువు ఒక్కటే ముఖ్యమనే ఒక అరాచకవాద తరం ఒకటి వచ్చి చేరింది. మన పక్క వాడికి ఏమి జరిగినా పట్టని ఒక సాహిత్యకారుల గుంపు జాత ర, బెదిరినట్టు చమ్మక్ తప్ప కన్నీటి చెమ్మలేని, నిర్జీవ నిర్వాపక వ్యాధి వాక్యం ఒకటి తెలుగు సాహిత్యంలో ఉరుకురికి ‘బెరికి పంట‘ను తీస్తున్నారు. ఏ సృజనకారుడైన సమాజం, కాలంతో పాటు ప్రవహించే గుణం ఉన్నప్పుడే అత డు ఎప్పటికప్పుడు సాహిత్యంలో తనను తాను ‘సాన’ పెట్టుకుంటూ అప్పుడే పూ చి పువ్వులా తాజాగా ముందుకు పోతా డు. లేకుంటే నిలువ నీరై పోయి సభ్యతను, స్వచ్ఛతను కోల్పోతాడు.

- జూకంటి జగన్నాథం




Tags

Next Story