ఇతరుల కన్నా భిన్నంగా చెప్పాలనుకుంటా

I want to express things differently from others
X

మీ నేపధ్యం? ఎప్పటి నుండి రాస్తున్నారు?

మీ రచనలు,సాహితీ ప్రక్రియల గురించి చెబుతారా ?

నేను పుట్టి పెరిగింది నెల్లూరులో. ఇప్పుడు స్థిరపడింది హైదరాబాద్ లో. నా హైస్కూల్, కాలేజీ చదువులు కూడా నెల్లూరులోనే. D. K. W. మహిళా కాలేజీలో బి.ఎస్సీ చదివాను. నెల్లూరు జిల్లాలోనే విద్యానగర్లో బి.ఎడ్ పూర్తి చేసాను.

కాలేజీ రోజుల్లోనే ఆంధ్ర భూమి, మయూరి, పల్లకి, వ నితా జ్యోతి అనే పత్రికలకి కవితలు రాసి పంపితే కొన్ని ప్రచురించబడ్డాయి. ఆ తర్వాత వివాహం, పిల్లలు జీవితంలో స్థిరపడే దశలో చదవడం తప్ప రాయలేదు. హైదరాబాద్ కి వచ్చాక కొత్త ప్రదేశం, చుట్టూ ఉన్న వ్యక్తులు, వారి సంభాషణలు, కొన్ని కళ్ళ ముందు జరిగిన సంఘటనలు చాల రోజులు వెంటాడుతూ ఉంటే, దానికి పరిష్కారం అక్షరాలే తీర్చగలవు అనే నిశ్చయానికి వచ్చి, రాయకుండా ఉండలేని పరిస్థితుల్లో 2016 లో మొదటి కథ ‘సూపర్ టీచర్ సిండ్రోమ్’ పేరుతో రాసాను. అది ఆంధ్రజ్యోతి వారి నవ్య పత్రికలో ప్రచురితం అయింది. తర్వాత రాసిన ‘నల్ల సూరీడు’, ‘ఆసరా’ అనే కథలకు బహుమతులు లభించాయి. అలా ఇప్పటివరకు 100 కథలు రాసాను. 150 దాక కవితలు రాసాను. కొన్ని కథా సంపుటాలకు సమీక్షలు రాసాను. విమల సాహితీ ఆన్లైన్ పత్రికలో రెండు సంవత్సరాలు సంపాదకీయ వ్యాసాలు రాసాను. ఇప్పటివరకు ‘నల్ల సూరీడు కథలు’, ‘విజయ మహల్ సెంటర్ కథలు’ అనే రెండు కథా సంపుటాలు, ‘దిగులు వర్ణం’ అనే కవిత్వ సంపుటి వెలువరించాను.

మీ కన్నా ముందు తరం మహిళా రచయితలు రాసిన సందర్భానికి, ఇప్పటి పరిస్థితికి మధ్య మార్పు ఏమైనా ఉందా? ఆ తరం కన్నా భిన్నంగా మీ తరం రాస్తున్నది ఏమిటని మీరు అనుకుంటున్నారు ?

అప్పటితో పోల్చుకుంటే ఇప్పటి తరం మహిళలకు సమస్యలు చాల ఎక్కువ అయినాయి. అప్పుడు పంజరాల్లో బానిసల్లా ఉండి ఎదుర్కున్న సమస్యలు కొన్ని అయితే, ఇప్పుడు ఆ పంజరాలు బద్దలు కొట్టి విశాల ప్రపంచంలోకి అడిగిడాక, అడుగడుగునా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. నా వరకు అయితే భావుతక కన్నా, స్త్రీ సమస్యల మీదే నా దృష్టి ఎక్కువ. ముఖ్యంగా స్త్రీల పట్ల ఉన్న మూఢనమ్మకాలు, అర్ధం లేని ఆచారాలు పట్ల నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. శ్రామిక, బడుగు వర్గాల మహిళలు, ఎవరూ పెద్దగా ఆసక్తి చూపని గిరిజన ఆడవాళ్ళ స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ఎక్కువ రాయాలనుకుంటున్నాను. త్వరలో చల్లా ఏనాదులు అనే ఒక గిరిజన తెగ మహిళల జీవితాలను అక్షరీకరిస్తున్నాను. ఇంకా ఇప్పటి మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, సైబర్ మోసాలు వంటి అంశాలు కూడా నా రచనల్లో చోటు చేసుకుంటాయి. ఈ తరం మహిళలకు ఏం కావాలి?, వారు కోరుకునేది ఏమిటీ అనేవి కూడా ఇతరులకంటే భిన్నంగా చెప్పాలని నా అభిలాష.

సమాజంలోనే కాక, సాహిత్యంలోనూ పురుషాధిపత్యం, సెన్సార్‌షిప్, నియంత్రణలు ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ సాహిత్యంలో ఇలాంటి స్థితి వుందని మీరు భావిస్తున్నారా? ఒక వేళ ఉందనుకుంటే, ఈ స్థితి ఎలా మారుతుందని మీరు అనుకుంటున్నారు?

సమాజంలో ఉన్నట్లే సాహిత్యంలో కూడా పురుషాధిపత్యం ఉందనేది పూర్తిగా నిజం కాకపోయినా, విమర్శనాత్మక దృష్టితో చూస్తే పూర్తి స్థాయిలో మహిళా రచయితలకు న్యాయం మాత్రం జరగడం లేదని చెప్పవచ్చు. కథలు రాస్తున్న తొలి రోజుల్లో ‘సాహిత్యంలో కూడా ‘కాస్టింగ్ కౌచ్’ లాంటివి ఉన్నాయి. మన రచనలు వెలుగు చూడాలంటే కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త’ అని కొందరు సీనియర్ రచయిత్రులు నాకు చెప్పారు. అదే సమయంలో మనకి ప్రతిభ ఉంటే, ఎప్పటికైనా మన రచనలు వెలుగు చూస్తాయి అనే నమ్మకాన్ని కలిగించారు కొందరు పత్రికా సంపాదకులు. వారందరికీ నేను రుణపడి ఉంటాను. అర చేతితో సూర్యుడిని ఆపడం సాధ్యం కానట్లే, ప్రతిభను అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు అనేది నా అభిప్రాయం.

బొమ్మలు

గాయమైన మా గుండెలమీద

మీ కవిత్వ గేయాలేపనాలద్దవద్దు

మాటల తూటాలతో అబలలంటూ

మాపై మానసిక దాడి చేయకండి

చీకటి ఒంటరితనం అవకాశమిచ్చిందని

మా దేహాలతో ఆడి మా మానాల్లోకి

కరుకు గాజు పెంకులు దూర్చకండి

జాతుల సమరం మమ్మల్ని

నగ్నంగా ఊరేగిస్తే

మా అడుగులకు మీ జాలిచూపుల

మడుగులొత్తవద్దు

తలలేని మొండేలను చేసి

మమ్మల్ని మీ మగతనపు గుమ్మాలకు

అలంకారాలుగా వేలాడదీయకండి

మీ ఆరాధనలు వర్ణనల్లో

మమ్మల్ని రొమ్ములు, మర్మ స్థానం

మాత్రమే ఉన్న బొమ్మలను చేయకండి

మీ బుద్ధికి పుట్టిన తెగుళ్ళతో

ఓ సారి కొండ శిఖరం ఎక్కించి

మరోసారి మమ్మల్ని

అధఃపాతానికి

మా కోసం ఏ దినోత్సవాలు జరపకండి

మమ్మల్ని మాలాగే గుర్తించండి

మీ సహచర జీవులుగా నమోదు చేసుకోండి


సినాప్సెస్

నీ జన్మస్థానం ఎక్కడో ఎరుకైన నాడు

విశ్వపుత్రుడవవుతావు నువ్వు

ఆకులతో ఒంటిని కప్పుకున్న

రాతి గుహల నుంచి బయట పడి

చాలా కాలమైంది నువ్వు, నేను

కాళ్ళు చేతులు చెవులు కళ్ళు

లాంటి సాధారణ అవయవాలే

మా దేహాల్లో ఇమిడి ఉన్న రెండు రొమ్ములు

ఎదురుపడిన స్త్రీ రొమ్ములను చూసిన నీకు

కామ వికారపు అవాకారం కలిగిందంటే

నీ బుద్ది పాతాళపు బురదలో కూరుకుపోయినట్లే

ఇక నీ భావికి నువ్వు సమాధి కట్టుకున్నట్లే

హిజాబ్‌లను నడిరోడ్డు మీద తగులబెట్టిన వాళ్ళం

మేము బానిస పంజరాలు బద్దలు కొట్టి

చాలా కాలమైంది

నీలో ఇంకా దృష్టి అవకరం ఉండడం

విషప్పురుగు కాటుకన్నా ప్రమాదం

సత్వర చికిత్స కావలి నీకిక

ఒంటి నిండా కామపు రసిని కార్చుతున్న

నీ జ్ఞానేంద్రియాలకు

మదపు కుళ్ళతో దుర్గంధం వెదజల్లుతున్న

నీ నరాలను సెరిబ్రమ్ చేరకుండా కత్తిరించాలి

నీ మెదడులోని దుర్మార్గపు సినాప్సెస్ ను

ఏ రాతి బండకేసి బద్దలు కొట్టుకుంటావో

నీ విజ్ఞతకే వదులుతున్నాం

గుండెలపై చున్నీ కప్పుకోవాల్సింది మేము కాదు

నీ మన నేత్రాన్ని కప్పున్న కామపు శుక్లాలను

తొలగించుకోవాల్సింది నువ్వే ఇక



రోహిణి వంజారి


Tags

Next Story