సర్వ అమానవీయ రుగ్మతలకు.. ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే!

సర్వ అమానవీయ రుగ్మతలకు.. ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే!
X

నేను నా సాహితీ యాత్ర: సరిగ్గా ఆరేళ్ళ క్రితం మనోధర్మ పరాగం అనే నవలను రాస్తున్నప్పుడు, ఆ కథను తెలుగు వాళ్ళదిగా చేయడం కోసమని నేను దా ని భూమికను మదురై నుంచీ కొన్నేళ్ల పాటు చిత్తూరుకు తీసుకొచ్చా ను. అయితే ఆ నవల పురివిప్పే కొద్దీ ఒకనాటి తొండనాడులోని భాగమైన చిత్తూరు జిల్లాలోని దక్షిణ ప్రాంతానికీ, కన్యాకుమారి నుంచీ మద్రాసు వరకూ వ్యాపించిన కర్ణాటక సంగీత ప్రపంచానికీ మధ్య వుండే అవిభాజ్యమైన సంబంధాన్ని తెలుసుకోగలిగాను. నేటి తమిళనాడులోని విల్లుపురం నుంచీ యిటు తిరుపతి వరకూ విస్తరించిన తొండనాడు అనే ప్రాంతానికున్న భిన్నమైన, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వమేమిటో అప్పుడే నాకు అర్ధమైంది. కర్ణాటక గాత్ర సంగీతంలో స్త్రీ రత్నత్రయమని పిలిచే వారిలో ఒకరైన డి.కె.పట్టమ్మాళ్ బాల్యం చిత్తూరులోనే గడచింది. మరో విదుషీమణి ఎమ్.ఎల్. వసంత కుమారి తల్లిగారు చిత్తూరు నుంచే మద్రాసుకెళ్లారు. ఆధునిక కర్ణాటక ప్రముఖ వాగ్గేయకారుడు మైసూరు సదాశివరావు చిత్తూరులోనే పుట్టాడు. చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై నుంచీ నాగయ్య వరకూ ఎందరో చిత్తూరులోనే పుట్టిపెరిగారు.

చిత్తూరుకు కేవలం అరవై మైళ్ళ దూ రంలో వుండే కంచి కర్ణాటక సంగీతాని కే కాదు, తొండనాడుకే రాజధానిగా ఉండే ది. స్వతంత్రం వచ్చేముందు వరకూ తెలు గూ, తమిళమూ ఎంతో స్నేహంగా కలిసి జీవించాయి. ఆ స్నేహం లోంచే తిరువయ్యూరు సంగీతత్రయం, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రీ పుట్టారు. మదురై తెలుగు సాహిత్యానికి శతా బ్దం పాటూ వేదికయ్యింది. భరతనాట్యం సదర్ పేరుతో వెలుగొందింది. తొండనాడులోని జనాలకు రెండు మాతృ భాషలుంటాయని చెప్పడం ఉత్ప్రేక్ష కాదు. కంబరామాయణం తెలుగు అనువాదానికి ముందుమాట రాస్తూ కట్టమంచి రామలింగారెడ్డి గారు ‘జాతి చేత తెనుగువారును అరవ వారును ఒక్కరని శాస్త్రజ్ఞుల సిద్ధాంతము. వీరిరువురకును ఎన్ని యోతరముల క్రిందట సామాన్యమైన తెగ ఒక్కటి యుండెడిది’ అని చెప్పారు. 1850 ప్రాంతంలో మాముత్తాత ఇప్పటి చిత్తూరు జిల్లాలోని రవణయ్యగారి పల్లి అనే పాతిక యిండ్ల గ్రామపు రైతుల ఆహ్వానం మేరకు తెలుగు పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయుడుగా నాటి అదే దక్షిణ ఆర్కాట్ జిల్లాలోని జింజికోట దగ్గరి వెంకటాపురం గ్రామం నుంచి వలసవచ్చి స్థిరపడ్డాడు. అయితే ఆయనప్పుడు చేసిన నూరుమైళ్ళ ప్రయాణం తీసుకొచ్చిన ఉపద్రవాలేమిటో తరువాతే నాకు తెలిసివచ్చాయి.

పరిపాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలుగా విభజించడం అవసరం. అయితే భాషను కొలబద్దగా చేసుకుని భాషాప్రయుక్త రాష్ట్రాల యేర్పాటు చేసుకోవడం తెలుగువాళ్లు చేసిన నేరం. కన్యాకుమారి నుంచీ నాగపూరు వరకూ తమిళ, కన్నడ, మలయాళ, మహారాష్ట్రులతో కలసి జీవిస్తున్న తెలుగువాళ్ళను ఒకటో లేక రెండు భాషాప్రయుక్త రాష్టాలలోకి తీసుకురావడం జరగని పని. ఈ రాజకీయ విభజనల వల్ల సగంమంది మాతృభాషను పరిరక్షించుకోవడం కోసం ఉద్యమాలు చేయవలసిన దుర్గతి సంభవించింది. తొండనాడుకైతే తన మూలాల్ని కోల్పేయే ప్రమాదం వచ్చింది. మనోధర్మపరాగం నవల నన్ను నా వేర్లను వెతుక్కోవలసినదిగాహెచ్చరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తరువాత జరిగిన అనేక సాంఘిన , సాంస్కృతిక విధ్వంసాలు ‘దాయాదుల తోట’ అనే నవలను రాసేలా చేసింది.

తొండనాడు చెరువుల కింద వ్యవసాయం చేసేప్రాంతం. ఏడాదికి యిరవై పదున్ల వానలు పడితేయేర్లు పారి చెరువులు నిండి రైతుకు ఒక పంటైనా యిల్లుచేరేది. యిక్కడి రైతులందుకే ఒకప్పుడు సుఖంగానే జీ వించారు. అయితే తొండనాడును రాయలసీమ గొడుగుకిందికి తోసి, ఇక్కడ కూడా యేర్లకు చెక్డాముల్ని గట్టేసారు. దాని తోడాముల దగ్గర వందల ఎకరాల్లో ఏడాదికి మూడు పంటలు పండుతున్నాయి. కానీ ఆయే ర్ల దిగువ పరీవాహిక ప్రాం తాల్లో వేల ఎకరాల్లో భూగర్భ జలాలు ఎండిపోయి, వందల అడుగుల బోర్లుదించి నా నీళ్లు అందక తాగే నీళ్ళు కూడా లేక ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోంచే కొత్తగా ‘నీరు పల్లమెరుగు’ అనే నవల రూపొందింది.

మా ముత్తాత నెలకొల్పిన ప లు కూటంలో పెద్దబాలశిక్ష, బాల రామాయణం, అమ రం, ఆంధ్ర నామసంగ్రహం, భారతంలోని ఆదిపర్వం పా ఠ్య పుస్తకాలుగా ఉండేవి. వీటితోబాటు నాటి ఉపాధ్యాయుడు గ్రామీణులకు భారత రామాయణాలలోని కథల నాధారంగా చేసుకున్న నాటాకాలను (వాటిని ఆట అనేవాళ్ళు) నేర్పించాలి. విరాట పర్వం, నలచరిత్ర ఏడాదికోసారైనా రైతులు పారాయణం చేసేవాళ్ళు. యివి కాకుండా పజ్జెనిమిది రోజుల భారత యజ్ఞాలు, వీరగాధలు, పేరంటాల కథలు, కాంభోజ రాజుకథ, బాలనాగమ్మ కథ, ముగ్గురు మరాఠీలు, పల్లెపడుచులు పాటలు, జంగం దేవర్ల పాటలు మొదలైన తొండనాడు జానపద సంస్కృతి తన రచనలకంతా గంభీరమైన నేపధ్యాన్ని సమకూర్చిందని మా నాన్న చెప్పుకున్నారు. ఈ పాదులోంచి పుట్టినవాడిని నేను. మా నా న్న మాటల్లోనే చెప్పాలంటే కొత్త నీటికి ఎక్కొచ్చిన చేప పిల్లలా నేను సాహిత్యంలోకి ప్రవేశించాను. తొలి నుంచీ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని బాగా ప్రభావితం చేసి రూపుదిద్దిన మార్కిస్టు మానవీయ దృక్పథం నాకూ జవసత్వాలనిచ్చింది. నా పదహారవ సంవత్సరంలో 1973లో నా మొదటి కథ వచ్చింది. పెద్ద మాటల్లో చెప్పాలంటే నా సాహిత్య స్వర్ణోత్సవం రెండేళ్ల క్రితమే జరిగిపోయింది. సృజనాత్మక రచన తొలిరోజుల్లో నాకు సాహి త్య సాధన గానూ, వ్యక్తిగత శోధన గానూ, ప్రాపంచికావగాహనా వేదిక గానూ, సత్యాన్వేషణా వాహిక గానూ తోడ్పడింది.

క్రమంగా అది మానసికావసరంగా (pscychological necessity)గా కూడా మారింది. నిస్సిమ్ ఏజె కిఎల్ అ న్నట్టుగా నన్ను నేను యెదుర్కోవడానికీ, నన్ను నేను అదుపులో పెట్టుకోడానికి రచన తప్పనిసరి అవసరమైపోయింది. చాలామంది లాగే నేనూ నా కోసమే రాసుకుంటాను. అయి తే ఈ క్రమంలో సహృదయుడైన పాఠకుడికీ చేరువవ్వాలని గాఢంగా కోరుకుంటాను. పాఠకుడనే వాడు లేకుంటే ఏ రచనకైనా అస్తిత్వముండదు. అయితే రచయితగా నేను ప్రారంభించినప్పుడున్నంత సౌలభ్యం, సౌకర్యం యిప్పుడు లేదు. నేటి తెలుగుసాహిత్య మూ, సంస్కృతులు సోదర దక్షిణ భారత భాషలతో పోల్చడానికి వీల్లేనంత దయనీయంగా వున్నాయి. యిరవై కోట్ల మంది వుండే తెలుగు కు ఒక సాహిత్య పత్రికైనా లేదు. మనలో సగమైనా జనాభా లేని ఆ భాషల్లో వున్న పాఠకుల్లో మనకు నాలుగో వంతయినా లేరు. ఆ ప్రభుత్వాలు భాషా సాహిత్యాలకిచ్చే ప్రాముఖ్యత మనకు మచ్చుకైనా లేదు.

మనలో వున్న విద్యావంతులకు వ్యాపార సినిమాల పైన వున్నంత మోజు మరిదేనిపైనా లేదు. భారతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ వంటి పత్రికలు కేవలం మనకు చరిత్ర మాత్రమే! ఇప్పుడు కూడా పదికిపైగా సాహిత్య పత్రికలున్న సోదర దక్షిణ భారత భాషల్లో విందు భోజనాల్లాంటి పెద్ద ప్రత్యేక సంచికలూ వస్తున్నాయి. ఒకప్పుడు మారుమూల పత్రికలో కథ వచ్చినా చదివి స్పందించే వాళ్లు ఎందరో ఉండేవారు. యిప్పుడు యింకా రాస్తున్నావా అని అడిగే వాళ్లే కనబడుతున్నారు. తెలుగు సాహిత్యంలో యిది ఒక చీకటి కాలం. ఇటీవలి కాలంలో జరిగిన గ్రంధాలయ పునరుజ్జీవనోద్యమం, బుక్ బ్రహ్మ పుస్తకోత్సవం లాంటివి కొద్దిగా కాంతి కిరణాల్ని ప్రసరిస్తున్నాయి. కొత్తగా వచ్చిన యువ ప్రచురణకర్తలు చాలా పుస్తకాల్ని ప్రచురించి పెద్ద సంఖ్యలో పుస్తకాల్ని అమ్మగలగడం ఆశాజనకంగా వుంది. కాలక్షేప పుస్తకాలతో, ఊహా ప్రేమ కథలతో మురిసిపోతున్న పాఠకులలో కొందరైనా మంచి సాహిత్య పాఠకులయి తీరుతారనే నమ్మకముంది.

వాచకాని (text) కున్న ప్రాముఖ్యతను తెలుగు సినిమా విస్మరించినట్టుగా మరే యితర భాష రాష్ట్రాల్లోనూ నిర్లక్ష్యం చేయలేదు. కంప్యూట ర్లూ, ఇంటర్నెట్, సినిమాల లాంటి ఆధునిక మాధ్యమాలెన్ని వచ్చినా అవి వాచకపు మారు రూపాలే గానీ, వాచకపు ప్రాముఖ్యత ఎప్పటికీ తగ్గదు. యిప్పుడు ప్రపంచంలో వున్న సర్వ అమానవీయ రుగ్మతలకూ వున్న ఏకైక ఔషధం పుస్తకం ఒక్కటే! యిన్ని విపత్కర పరిస్థితులలోనూ సా హిత్యాన్ని నిష్కామకర్మగా భావించే రచయితలిందరుండడం తెలుగు వాళ్ళు గర్వించవలసిన విషయం. అయితే వాళ్ల మాటల్ని వినే పాఠకలోక మొకటి బలపడకపోతే, అది అరణ్య రోదనమే అవుతుంది. పుస్తకాలు చదవడమనే ఈ పనిని స్వయంగా రచయితలూ, తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ బలంగా కొనసాగించినప్పుడే పిల్లలూ, వి ద్యార్థులూ పాఠకులుగా ఎదుతారు. తెలుగువాళ్లిప్పుడు మిగిలిన భా షల వాళ్ళ నుంచీ నేర్చుకుని, తమను తాము నాగరికులమని అవసరం అత్యవసరమైంది.



- మధురాంతకం నరేంద్ర


Tags

Next Story