కేరళ లిటరరీ ఫెస్టిఫల్, మరికొన్ని ఆలోచనలు..

కేరళ లిటరరీ ఫెస్టిఫల్, మరికొన్ని ఆలోచనలు..
X

డిసెంబర్, జనవరి మాసాలు దేశవ్యాప్తంగా సృజనకా రుల పండుగ రోజులు. నాట్యం, సంగీతం, చిత్రకళ, శిల్పకళ, సాహిత్యం వంటి అనేక సృజన రంగాలలో నిష్ణాతులైన వారు భాగస్వాములయ్యే అనేక ఫెస్టివల్స్‌తో దేశం అంతా కళకళలాడుతూ ఉంటుంది. పూణే, కలకత్తా, జైపూర్, హైదరాబాద్.. ఇలా అనేక నగరాల్లో లిటరరీ ఫెస్టివల్స్, చెన్నైలో అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన, హిందూ లిటరరీ ఫెస్టివల్స్ జరిగాయి. కొచ్చిన్‌లో డిసెంబర్ నుండి మార్చి 31వరకు అతిపెద్ద అంతర్జాతీయ ఆర్ట్ ఫెస్టివల్ ‘కొచ్చి ముజిరిస్ బెన్నాలి’ ( Kochi Muziris Biennale) ఇంకా జరుగుతూనే ఉంది. ఆసియాలోనే అతిపెద్ద సాహిత్య పండుగ కేరళ లిటరరీ ఫెస్టివల్ జనవరి 22నుండి 25, 2026 వరకు హెరిటేజ్ ప్రాంతంగా యునెస్కో భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా గుర్తించిన పోర్ట్ సిటీ, కోజికోడులోని అరేబియా సముద్ర తీరపు ఇసుక తిన్నెల వద్ద జరిగింది. దేశ విదేశాల నుండి సుమారు ఐదు లక్షల మంది సాహిత్యం పట్ల అభిలాష ఉన్న ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేసినా అంతకన్నా ఎక్కువే ఈసారి హాజరయ్యారు అని అంటున్నారు. 2016లో డి.సి.బుక్స్ పబ్లికేషన్స్ అధినేత రవి డిసి నేతృత్వంలో ప్రారంభమైన KLF 8వ ఎడిషన్ ఈ 2026 ఈవెంట్. దీనికి ఆయనే ఫౌండర్ & చీఫ్ ఫెసిలిటేటర్‌గా, ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు గతంలో కేంద్ర సాహిత్య అకాడమీకి, ఆ తరువాత నేడు కేరళ సాహిత్య అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ కె.సచ్చిదానందన్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

కె.ఎల్.ఎఫ్ పండుగకు జర్మనీని అతిథి దేశంగా ఆహ్వానించారు. కేఎల్‌ఎఫ్ ప్రాంగణంలోనే ‘జర్మనీ ఫెవీలియన్’ను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా CKLF పేరుతో కె.ఎల్.ఎఫ్ ప్రాం గణంలోనే ఏర్పాటు చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలు, థియేటర్, సంగీతం, పుస్తక ప్రదర్శనలు, వంటి వాటి కోసం కూడా ప్రత్యేక హాల్స్ ఏర్పాటు చేశారు. 8 ప్రధానమైన ప్రాంగణాలలో సమావేశాలు, అనేక వర్క్‌షాప్స్, మీట్ ద రైటర్స్, పుస్తకాలపై రచయితల సంతకాల కోసం ఏర్పాట్లు కూడా జరిగాయి. 18 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు సాహిత్యం అస్తిత్వం, అనువాదాలు, పర్యావరణ, మానవ హక్కులు, ఆర్కిటెక్చర్, చరిత్ర, జెండర్, భాష, సినిమాలు, ఆటలు, సైబర్ సెక్యూరిటీ, పబ్లిక్ పాలసీ వంటి అనేక విషయాలపైన ప్రసంగించారు. సునీత విలియమ్స్, సచ్చిదానందన్, గీతా హరిహరన్, కిరణ్ దేశాయ్, అబ్దుల్ రజాక్, అభిజిత్ బెనర్జీ, గుర్నాహ్, పీకో అయ్యర్, బెన్ జాన్సన్, జిమ్మీ వాల్స్, రానా దాస్ గుప్తా, చిత్రా సుబ్రహ్మణ్యం, మను పిళ్ళై, శశిధరూర్, అరవింద్ సుబ్రహ్మణ్యం వంటి ఇంకా అనేకమంది ప్రముఖులు వివిధ అంశాలపై మాట్లాడారు.

సునీత విలియమ్స్‌తో జరిగిన ఒక సంభాషణ కార్యక్రమాన్ని ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ నిర్వహించారు. అంతరిక్షంలో తన అనుభవాలను ఎంతో వివరంగా, సరదాగా పంచుకున్న ఆమె అందరి హృదయాలను గెలుచుకుంది. ఫైవ్ పార్టిషన్స్ అండ్ మేకింగ్ ఆఫ్ మోడరన్ ఏషియా పుస్తకాన్ని రాసిన ‘సామ్ డల్‌రేమ్‌పిల్’ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ అద్భుతంగా మాట్లాడాడు. మను పిళ్ళై గురించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యూత్‌కి ఆయన ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాడు. భాను ముస్తాక్, ఒమర్ మూస, గజాలా వాహబ్ ఇంకా అనేకమంది ప్రముఖులు వివిధ సెషన్స్‌లో పాల్గొన్నారు. ప్రతినిధులతో కిక్కిరిసిన ప్రధాన హాల్లో ప్రముఖ నటుడు, ఆలోచనపరుడు ప్రకాష్ రాజ్ Criminalising dissent! Who Gets LOCKED Up for Speaking Out? అనే అంశంపై జోసీ జోసఫ్‌తో సంభాషించారు. ప్రజాస్వామిక హక్కులపై, భిన్నాభిప్రాయంపై, బహుళత్వంపై జరుగుతున్న దాడులు, నిర్బంధం గురించి, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అసహనం గురించి ఆయన మాట్లాడారు.

చివరగా పౌరసత్వ ఆందోళనలో ఎంతో ప్రఖ్యాతి పొందిన ‘హమ్ యాద్ రహేంగే’ కవితతో ఆయన ప్రసంగాన్ని ముగించారు. కె.సచ్చిదానందన్, గీతా హరిహరన్‌లు సంపాదకత్వం వహించిన సంకలనం ‘The View from Hear: Stories And Poems Of Many Indias’ ‘పుస్తకంపై సబితా సచ్చి (కవి, సచ్చితానందన్ కూతురు) సంపాదకులు ఇద్దరితోనూ ఆసక్తికరమైన సంభాషణను నిర్వహించారు. వివిధ భాషలు, మతాలు, అస్తిత్వాలు, సంస్కృతులలో జీవిస్తూ రాసిన రచనలను ఒక దగ్గరకు తెచ్చే ప్రయత్నం ఈ సంకలనం చేసిందని వారు అ న్నారు. దక్షిణాది భాషలపై కూడా ఒక సెషన్ జరిగింది. అ నేక పుస్తకాలపై ఆయా రచయితలతో విశ్లేషణాత్మక చర్చలు జరిగాయి. కొత్త పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరిగాయి. ముఖ్య అతిథి దేశంగా పాల్గొన్న జర్మనీ కూడా KlFతో కలిసి జర్మన్ పెవిలియన్‌లో అనేక అంశాలపై సమావేశాలు, వర్క్‌షాప్‌లు నిర్వహించింది. డిప్లమసీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఎ ఐ, How Germany confronts the Past in the present, Craft of Creatives Writing as a Communal Experience, Room for imagination: Writer’s in Residence ఇలాంటి అంశాలపై సమావేశాలతో పాటు, జర్మనీ థియేటర్‌లో నాటికలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

సాయంత్రం అయ్యేసరికి కేఎల్‌ఎఫ్ జరుగుతున్న సముద్ర తీర ప్రాంతం అంతా రంగు రంగుల లైట్లతో, యువతీ, యువకులతో, రకరకాల ప్రదర్శనలతో ఒక జాతర వాతావరణాన్ని తలపుకు తెచ్చింది. రాత్రి పొద్దుపోయే వరకు కోలాహలంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఆ ప్రాంగణంలో తిరుగుతూ తెలుగు ర చయితలు ఎవరైనా కనిపిస్తారేమో అని నేను వెతికినప్పు్పడు ఇద్దరు తప్ప ఎవ రూ మరెవరూ కనపడలేదు. కన్నడ, మ లయాళ, తమిళ దక్షిణాది రచయితలు, బెంగాలీ, అస్సామీ, ఒరియా, కాశ్మీరీ, హిందీ, వంటి భాషల రచయితలు, విదే శీ రచయితలు అనేకమంది ఉన్నారు.. కానీ ఈ ఫెస్టివల్‌లో తెలుగు భాషకు కనీస ప్రాధాన్యత కూడా లేకపోవడం కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న అంశం. సచ్చితానందన్, గీతా హరిహరన్‌తో మాట్లాడుతున్నప్పుడు, నిర్మొహమాటంగానే ఈ విషయాన్ని లేవనెత్తాను నేను. ఆంగ్లంలోకి అనువదించబడిన తెలుగు రచయితలు ఒకరిద్దరు తప్ప ఇతర భాషా రచయితలకు తెలుగు సాహిత్యం గురించి పెద్దగా తెలీదు అని వారు అన్నారు. సచ్చితానందన్ తెలుగు నుండి ఓల్గా బయటి రాష్ట్ర రచయితలందరికీ, తెలుసునని, ఆవిడ ఎప్పటినుంచో ఇలాంటి ఫెస్టివల్స్‌కు హాజరవుతున్నారని అన్నాడు. నా పుస్తకాన్ని ఆవిడ తెలుగులోకి అనువాదం చేసిందని గీతా హరిహరన్ చెబుతూ, అట్లా తెలుగు భాషలోని రచనలు కూడా ఇతర భాషల్లోకి, ఆంగ్లం లోకి వచ్చినప్పుడే తెలుగు రచయితలు ఇతర భాషా రచయితలకి తెలుస్తారు, అని ఆమె అనింది.

ఒక ఆరోపణగా కాకుండా, తెలుసుకునే ఆసక్తితోనే, నిర్వాహకులు రవి డిసిని, మరికొందరు మలయాళీ రచయితలను కూడా తెలుగు భాష మాట్లాడే రెండు రాష్ట్రాలు ఉన్నప్పటికీ, వాటి నుండి నామమాత్రంగా తప్పితే ప్రతినిధులు లేకపోవడం గురించి అడిగాను నేను. రవి తెలుగు భాషని తాము ఎంత మాత్రం డిస్క్రిమినేట్ చేయలేదని, తెలుగు రచయితలు కూడా వస్తున్నారు అని అన్నాడు. కానీ, నిజానికి తెలుగు నుండి ఓల్గా, అమ్మ డైరీ పుస్తకాన్ని రాసిన రవి మంత్రి ఈ ఇద్దరే ఫెస్టివల్‌లో వక్తలుగా ఉన్నప్పటికీ, నేను రవి మంత్రిని మాత్రం కలవగలిగాను. రవి పుస్తకాన్ని డిసి ప్రచురణా సం స్థ మలయాళంలోకి అనువాదం చేసి ప్రచురించింది కూడా. మొత్తం మీద తెలుగు సాహిత్యం ఇంగ్లీషులోకి కాదు కదా కనీసం ఇతర దక్షిణాది భాషల్లోకి కూడా పెద్దగా అనువా దం కాలేదు. తెలుగు రచయితలు ఒకరిద్దరి గురించి తప్ప చాలామందికి రచయితలు, సాహిత్యం గురించి అంతగా తెలియదు. అది వారి తప్పు ఎంత మాత్రం కాదు. మనవైపు నుంచి జరుగుతున్న అలసత్వమే అందుకు కారణం.

150మంది మలయాళీ రచయితలు పాల్గొన్న కె.ఎల్.ఎఫ్. లో నాలుగు రోజులపాటు మలయాళీ భాషలో కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య అనేక అంశాలపై వివిధ సెషన్స్ జరిగాయి. అంతేకాదు కన్నడ, తమిళ సెషన్స్ కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల బయట జరిగే ఇలాంటి అనేక సాహిత్య సభలను చూసినప్పుడు, తెలుగు సాహిత్యం చోటు, మొత్తంగా సాహిత్య ప్రపంచ ప్రాంగణంలో ఎక్కడ ఉంది అన్న ప్రశ్న సహజంగానే కలుగుతుం ది. కలగాలి కూడా. ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిన రచయితలు మనకు కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళ వైవిధ్య భరితమైన జీవితాలు, ఇక్కడి సాంఘిక, రాజకీయ పరిస్థితుల పైన రాసిన రచనలను ఆంగ్లంలోకి ఇతర భాషల్లోకి అనువా దం చేసే ప్రయత్నాన్ని మనం ఎందుకని చేయలేకపోయాం?

అకాడమీ బహుమానాలు వచ్చినవో, లేదా రచయితలు తాము స్వయంగా అనువాదం చేసుకున్నవో కొన్ని ఉండొ చ్చు, వాటి వాసి గురించి నేను మాట్లాడాలి అనుకోవడం లేదు కానీ, రాశిలో కూడా కొద్దిగానే ఉన్న ఈ అనువాదాలు తెలుగు సాహిత్య తీరు తెన్నులను, సమాజమంతటినీ రిప్రజెంట్ చేసేవి అని నేను అనుకోవడం లేదు. అనేక పరిమితుల్లోనే, ఆ కాసింత పని అన్నా జరిగింది. తెలుగునాట ఉన్న అనేక రచయితల సంఘాలు, ప్రచురణకర్తలు కూడా ఎందుకు ఈ అనువాద పనికి పూనుకోలేదో సీరియస్‌గానే ఆలోచించాల్సిన విషయం. నిజానికి 1920, 30 దశకాలలోనే ప్రపంచ సాహిత్యాన్ని, ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఊరూరా తిరుగుతూ పుస్తకాలు అమ్మిన చరిత్ర మనకుంది. ఇప్పుడు కూడా కొన్ని తెలుగు ప్రచురణా సంస్థలు అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగులోకి తేవడంలో ముందున్నాయి. ఈ పని బాగానే చేసాం. కానీ అప్పుడైనా, ఇప్పుడైనా ఇతర భాషలలోకి తెలుగు సాహిత్య అనువాదాలు చేయడంలో మనం ఫెయిల్ అయ్యాము.

ఇక నుండై నా ఆంగ్లంలోకి, ఇతర దేశీయ భాషల్లోకి తెలుగు సాహిత్యాన్ని అనువదించడాన్ని, ఒక ఉద్యమంలాగానే కొనసాగించాల్సిన అవసరం ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణాది భాషల మధ్య ఈ సాహితీ వారధుల నిర్మాణం జరూరుగా జరగాల్సిన తక్షణ అవసరం ఉంది. మన రెండు తెలుగు రాష్ట్రాల రచయితలము, మనదైన ప్రపంచంలో, మనవైన బృందాలతో, కార్యక్రమాలతో బిజీగానే ఉన్నాం. భిన్న అస్తిత్వాలు, అభిప్రాయాలతో పాటు, దాని వెన్నంటే ఉండాల్సిన సమిష్టి తత్వం మాత్రం మెల్లిగా ఇక్కడ లుప్తమైపోయింది. ఒక స్టాగ్నేషన్, జడ్జి మెంటలిజం, అపనమ్మకాలు, గ్రూపుతత్వం కూడా మన సృజనాత్మక ఆలోచనలలోకి వచ్చి చేరిన ఫలితాలు మన పరిధులను కుంచింప చేస్తున్నవేమో కూడా. దీన్ని ఒక స్థితి అందామా, లేక దుస్థితి అందామా?, దీని నుంచి తక్షణం బయటపడా లి. సాహిత్యం, సినిమా, కళలు, సంస్కృతి.. వీటన్నింటిపైన శరవేగంతో కమ్ముకుంటున్న తిరోగమన భావజాలం, నియంత్రణలు విస్తరిస్తున్న ఇవ్వాల్టి సమయంలో తెలుగు సాహితీ ప్రపంచం కొత్త రూపాన్ని, సారాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉంది.

బుక్ బ్రహ్మ, కె.ఎల్.ఎఫ్ వంటి ఇతర ఫెస్టివల్స్‌ను చూసినప్పుడు మనకున్న అనేక పరిమితుల మధ్యనైయినా అంత పెద్ద ఎత్తున కాకపోయినా, సీరియస్‌గా వివిధ అంశాలపై సాహిత్య సభలు, కలిసి చేయాల్సిసిన పనులు రెండు తెలు గు రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే జరగాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. అలాగే, శరవేగంగా ముందుకు వస్తున్న సాహిత్య కార్పొరే టీకరణ, ప్రచురణలు, మొనోపోలీ, పెట్టుబడి మార్కెటింగ్ వ్యూహాల గురించి కూడా మరోమారు మాట్లాడుకుందాం. ఇంటలెక్చువల్ చర్నింగ్, డిస్కోర్స్ అవసరాన్ని, కొత్త జనరేషన్ యొక్క కొత్త అవసరాలను, ఆలోచనలను, దేశం, ప్రపంచం మునుపెన్నడూ లేనివిధంగా వేగంగా, అభ్యంతరకరంగా మారిపోతూ ఉన్న స్థితిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మన వ్యక్తీకరణలో, భాషలోనూ కూడా అనేక మార్పులు జరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడు.

ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా, ఆ వైపు ఉభయ తెలుగు రాష్ట్రా ల్లో, ఒకటి రెండు అడుగులు పడడం ఒక మంచి పరిణా మం. ఛాయా ప్రచురణకర్తలు నిర్వహించిన బుక్ బ్రహ్మ, ఉ స్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తున్న తెలుగు లిటరరీ కాంగ్రెస్ వంటివి అలాంటివే. ఇప్పుడు జరుగుతున్న అనేక పరిణామాల మధ్య, రెండు తెలుగు రాష్ట్రాల సృజనశీలురు, కనీసం నేటి సంక్లిష్ట పరిస్థితులను గుర్తించిన వాళ్ళయినా విశాల దృక్పథంతో కలిసి చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి.

దేశవ్యాప్తంగా జరుగుతూ ఉండే ఇలాంటి ఫెస్టివల్స్‌లో వీలైనప్పుడు పాల్గొనడం వల్ల ఇతర ప్రాంతాలలో, దేశాలలో జ రుగుతున్న అనేక అంశాలను, నూతన ఆవిష్కరణలను తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రచయితలను, కళాకారులను కలవడానికి, వినడానికి వీలవుతుంది. కొత్త విషయా లు, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక విషయాలలో జరుగుతున్న నూతన మార్పులను ఎంతో కొంత అర్థం చేసుకోవడానికి, ‘నేను నా గొప్పతనం, నేను నా రచన మాత్రమే’ అనే వలయాన్ని దాటి మన దృష్టి విశాలం కావడానికి కొంచెం అన్న ఇలాంటి ఫెస్టివల్స్ ఉపయోగపడతాయి. సాహిత్య, సాంస్కృతిక సమ్మేళనాలు ఎల్లలను చెరిపివేసి, సాహిత్యకారులను కళాకారులను ఏకం చేసేందుకు దోహదపడతాయని ఆశిద్దాం.

- విమల





Tags

Next Story