ఇటు రా!

ఎవరివో కానీ
దారిలో నలిగిపికిలినట్లున్నావు
రా! ఇటు రా! మెల్లగా ఈ పక్కకు నా కడకు -
చెట్టు నీడ అనో, నదీ తీరం అనో అనుకో
గొప్ప పూల తోట కాకపోయినా
అమ్మ జోల పాట అవకపోయినా
ఆగిపోవడానికి కాదులే
మనశ్శరీరాలు ఒకింత సేద దీరడానికే
రా, కూర్చో, ఇప్పటికిప్పుడు మాట పెకలట్లేదా
పెకిలించాలని పెనుగులాడకు
మరింత పికిలి పోకు
నీ మౌనాన్ని తర్జుమా చేసుకుంటానులే
స్థిరంగా కూర్చోనూ లేవా, ఫర్వాలేదు
వాలిపో నా మీదకు
ఒక స్తంభం అనుకో లేక పందిరో అనుకో
ఆనుకో, అల్లుకుపో అలసట పడక
తెప్పరిల్లాక విప్పాలనిపిస్తే పెదవి విప్పు
విప్పుతూ కుదుట పడు, అది ఉప్పస
నీ దారి కథను వినడానికే ఇక్కడ
నేనున్నాననుకో
కనులు ధారగా కురుస్తే
కురవనీ, నిలవరించకు
లోపలి బరువు ఖాళీ
అవనీ, అది ఊరట
తేటపడ్డ చూపులకు నేను చదువరినవుతాను
పెనుగాలీ తుఫానూ గురు
తుకొస్తే ఉలికిపడి
వణికిపోకు కూలిపోకు
నీ లోనా బయటా కుదురుకునేదాకా
ఇదే నీకు చిరునామా
నిమ్మళ పడు నిశ్చింతగా -
వెయ్యేళ్ళ వ్యూహాలెందుకు
ఇప్పటికీ విరామమే జీవితం, విశ్రమించు
కొత్త కలలకు ఇదే అదను, శయనించు
సత్తువ చేకూరాక చిత్తం కుదుట పడ్డాక
మళ్ళీ నీ దారిలోకి ఇష్టమైతే వెళ్ళవచ్చు
దూర తీరం పిలుపుకు దగ్గరయేందుకు-
మరిచిపోకు, మళ్లీ దారి పట్టాక
డస్సినట్లనిపించినపుడల్లా పక్కకు జరుగు
అక్కడ నేను వుంటాను కాకపోతే మరొకరు
తప్పక మనిషొకడుంటాడు ఆసరాకు -
అసలు, మనిషి అంటేనే ఆసరా
ప్రియ బాటసారీ!
ఒక సమయంలో నీకు మరొకరు
మరొక వేళలో మరొకరికి నువ్వూ!
- దర్భశయనం శ్రీనివాసాచార్య
Tags
-
Home
-
Menu
