సుకృతం

‘ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు’ అని అన్నమాచార్యుడు దేవదేవుడిని ఉద్దేశించి అంటా డు. కవిత్వం కూడా అంతే. ఎంతగా లీనమౌతామో అంత మురిసిపోతాం. వర్ణ బేధం లేని సంబరం అది. వాల్మీకి నుండి వచన కవి వరకు వాళ్ళ స్థాయికి తగిన పారవశ్యం అక్కడ దక్కుతుంది. అందుకే సంగీత సాహిత్యాలు మానవ నాగరికత నిర్మించుకున్న హర్మ్యాలు. యుగీన స్మృతులు అందులో తేలుతుంటాయి. అలాంటి పద్యాల్ని చూద్దాం ఇప్పుడు.
రాజు మరణించె నొక తార రాలిపోయె
కవియు మరణించె నొకతార గగనమెక్కె
రాజు జీవించె రాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు
ఈ పద్యం వినని తెలుగు జీవులు దాదాపు లేరని చెప్పొచ్చు. ఏ మాత్రం తికమక లేకుండా చదువరిని అత్యంత సరళంగా వశం చేసుకునే సాంద్ర చంద్రికలు జాషువా ఖండికలు. విద్యా గంధం లేని ఇంటి నుంచి కవిత్వ కెరటం వెల్లువెత్తటం చిన్న సంగతేమీ కాదు. ఏ పురాజన్మ సుకృతమో తనను కవిని చేసి ఉంటుంది.
హనుమచ్ఛాస్త్రి అనే పండితుడి దగ్గర కాళిదాసు కావ్యాలు పద్ధతిగా చదువుకున్నాడు. ‘వడగాడ్పు నా జీవితం, వెన్నెల నా కవిత్వం’ అని చెప్పుకున్నాడు. జాషువా అనగానే ఫిరదౌసి, గబ్బిలం అనే రచనల గురించే అందరూ మాట్లాడతారు కానీ ఎందుకో తను రాసిన ‘స్వప్నకథ’ చాలా మందికి గుర్తు రాదు.
నేనొకనాడు స్వప్నమున
నింగికి రివ్వున లేచి చంద్రబిం
బానకు దాపునం గనుల
పండువు సేయుచునున్న వింత మై
దానమునందు వ్రాలి ప్రమ
దంబున దిక్కులు సూచుచుండ నా
పై నును లేత వెన్నెల తు
పానులు వీచె మనోహరంబుగన్
ఇలాంటి ఆహ్లాద భరిత పద్యాలెన్నో రాశాడు. జాషువా ఏది రాసినా అందులో భావ సంపద ముప్పిరిగొంటుంది. ప్రతి ఖండిక పటం కట్టినట్టు మనసు మీద ఉండిపోతుంది. ఎక్కడా నాయికా నాయకుల మనో వికారాల కల్పనలుండవు.
ఇంక విషాద గతములకే మిగిలెన్ రసహీనమై మషీ
పంకము నాకలమ్మున, నభాగ్యుడ
నైతి; వయః పటుత్వమున్
గ్రుంకె, శరీరమం దలముకొన్నది వార్ధకభూత; మీనిరా
శాంకిత బాష్పముల్ ఫలములైనవి
ముప్పది యేండ్ల సేవకున్
వార్ధక్యంలో తన విషాద గతాన్ని గుర్తుకు తెచ్చుకున్న ఈ పద్యం తన వాస్తవిక జీవిత దర్పణం. తదనంతర కాలంలో విశ్వనాథ గురువు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి జాషువా కాలికి గండపెండేరం తొడగటం, దానిని తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాషువా చెప్పుకోవటం కాలుష్యం లేని సారస్వత కాల స్మృతులు. సహృదయులైన పాఠకులున్నంత వరకు
జాషువా అమరుడు.
- రఘు 9676144904
Tags
-
Home
-
Menu
