జన స్వర కేతనం విమల గానం

“People’s Voice, a melodious song.”
X

మన సమకాలీన సమాజపు బాధా వేదనల సామూహిక అ:త చేతన సారమే అరుణోదయ విమలక్క పాట. ఆమె వసంత మేఘ గర్జన స్వరం మన మస్తిష్కాలలో నిక్షిప్తమైన చైతన్యాన్ని, సామూహికం చేసి మనల్ని తట్టిలేపి మనల్నిమరింత మానవీయం చేస్తుంది. పాటై ప్రవహించే అక్క స్వరానికి శబ్దాన్ని దృశ్యంగా మార్చే అపూర్వ శక్తి వుంది. యాభైఏళ్లుగా నిర్విరామంగా నిబద్ధంగా గానాన్ని వినిపిస్తున్నది. గొంతు లేని కోట్లాది మూగ నిస్సహాయ, పీడిత తాడితులమైన మనందరి సామూహిక స్వరాన్ని ఆమె పలుకుతుంది. పల్లె దారుల్లోనూ, ప్రకృతి వనాల్లోనూ, ఉద్యమ వేదికలపైనా, అనుదిన జీవనరణ రంగం లోని సామాన్యుల మధ్య ఆమె పాట రణ నినాదమై మోగుతుంది. తన ప్రతి ప్రదర్శన లోనూ నిత్య నూతనంగా ఉండుంటూ మాను సంపెంగలా పరిమళిస్తూ, పావన నవజీవన బృందావనాన్ని మనకు వాగ్దానం చేస్తూనే వుంది.

మార్క్సిస్టు కళా సౌందర్య శాస్త్రం కళను జీవితానికి దూరంగా ఉన్న అలంకారంగా చూడదు. కళకు మూలం సమాజ. కళాకారుడి అనుభవానికి మూలం మానవ జీవితం, ప్రజల శ్రమ, సంబంధాలు, సంఘర్షణలు కళకు జీవ సారం అంటుంది. ఆ భావన కళకు వర్తించినప్పుడు, కళ ప్రజల జీవితం నుంచి పుట్టి తిరిగి ప్రజల చైతన్యాన్ని పెంచే జీవశక్తిగా మారుతుంది.ఈ అర్థంలో పాటై గలగలా ప్రవహించే విమలక్కను వినడం అంటే కేవలం తన స్వరాన్ని వినడం కాదు, మన సమాజపు నిలువెత్తు వేదనను, విఫల స్వప్నాలను ఆవేశ ఆగ్రహాలను, ధిక్కారాన్నీ, ప్రేమనూ తిరుగుబాటునూ దిగంబరంగా దర్శించడమే.

కళ ప్రజల కోసం అనే భావన ఒక పడికట్టు సిద్ధాంత వాక్యంగా చూడటం కాదు. అది ఒక సేంద్రియ సజీవాచరణ. పాట ప్రజల అనుభవంతో కలిసినప్పుడు సాంస్కృతిక శక్తిగా మారుతుంది. సరిగ్గా ఆ శక్తితోనే విమలక్క మన హృదయాలతో నేరుగా తన పాటతో సంభాషిస్తుంది. బ్రెహ్ట్ అన్నట్టు కళ ప్రేక్షకుడిని కేవలం భావోద్వేగంలో ముంచి వేయడం కాక ఆలోచింపజేయాలి. ప్రశ్నించా లి. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొత్త కళ్లతో చూడమని మన చేయి పట్టుకుని సాదరంగా స్వాగతించాలి. విమలక్క పాట విన్న తర్వాత సమాజం ఇలా ఎందు కు ఉంది? అనే ఆలోచనల్లోకి ప్రేక్షకుల్ని నెట్టేస్తుంది. విమలక్క పాటలోని అసలు సౌందర్యం కూడా ఇక్కడే ఉంది. మనకు నిత్యమూ వినిపిస్తున్నది కేవలం తన స్వర/పదసౌందర్యం కాదు. అది అనుదిన జన జీవనానుభవంతో కలగలిసిన శ్రమైక జీవన సౌందర్యం. అందుకే అక్కపాటలో తంగేడుపూల పరిమళంతో బాటు మట్టి వాసన ఉంటుంది. ఎలకోయిల కూతతో పాటు కూటికి లేని కార్మిక కర్షక కూలీల నిట్టూర్పు ఊపిరి ఉంటుంది. పోరాటపు పిలుపు ఉంటుంది. కారే కన్నీటితో పాటు రేపటి ఆశ ఉంటుంది.

కళ -సమాజ సంబంధం, జీవన వాస్తవికత, శ్రమజీవుల బతుకులు, సామూహిక చైతన్యం వంటి భావనల వెలుగులో నుంచి చూస్తే విమలక్క ప్రయాణం ఒక ముఖ్యమైన సాంస్కృతిక అనుభవంగా నిలుస్తుంది. మనిషి ప్రశ్నించే స్థితికి చేరుకోవడం, అన్యాయాన్ని సహజమైనదిగా అంగీకరించకుండా దాని మూలాలను అర్థం చేసుకోవడం. మార్పును ఊహించే చైతన్యాన్నిపొంది దానికోసం ఆచరణాత్మకంగా పనిచేయడం. ఈ అర్థంలో విమలక్క పాట ఒక సమకాలీన సాంస్కృతిక జోక్యం. అది వినేవారిని కేవలం భావోద్వేగానికి గురిచేయకుండా, తన చుట్టూ ఉన్న వాస్తవాన్ని కొత్తగా చూడమని, ఆలోచించమని ఆర్తితో పల్లవిస్తూ పిలుస్తుంది. ఆమె పాటలో దోపిడీ, దుఃఖం,అసమానత, శ్రమ, ది గులు, బాధ, ప్రతిఘటన,ఆశ. ఇవన్నీ ఒకే జీవన ప్రవాహంలో వడివడిగా కలుస్తాయి. అందుకే ఆమె స్వరగానం వ్యక్తిగత ప్రదర్శనగా కాకుండా సామూహిక సజీవ అనుభూతికి నిలువెత్తు స్వర రూపంగా పరావర్తించి మన మెదళ్లలోకి ప్రసారమయ్యి మనల్ని నిలువునా ఆవహించి మనల్ని వెంటాడే పాటవుతుంది.

ధ్వని శాస్త్ర పరంగా విమలక్క పాటలోని ప్రత్యేకత, కేవలం ఆమె స్వరానికున్న శక్తీ కాదు. అది తన స్వర తీవ్రత, పిచ్, టింబర్, రెజొనెన్స్ , తన ఉచ్చారణ వంటి ధ్వని లక్షణాల అపురూప సమ్మేళనంలో వుంది. స్వరంలోని హార్మోనిక్ నిర్మాణం ఆమె గొంతుకు ప్రత్యేకమైన ఒక గర్జన లాంటి ఉద్రిక్త లక్షణానిస్తుం ది. ఆలపించే పాటలో ప్రతీ సారి నిజంగా భావాత్మకంగా అనివార్యంగా మమేకమైతే తప్ప ఈ శక్త్తి సాధ్యం కాదు. విమలక్క స్వరం ఎప్పుడూ ఒకే స్థాయిలో కొనసాగదు. అవసరానికి అనుగుణంగా మృదుత్వం నుంచి తీవ్రతకు, తక్కువ ధ్వని నుంచి గర్జనకు మారుతుంది. ఇలా పాటలో పరిణమించే ఈ మార్పు ఒక డైమిక్ కాంట్రాస్టుగా రూపొంది మన శ్రవణానుభవంలో లయించిమనం వివరించలేని తన్మయో ద్రేక భావోద్వేగాన్ని పెంచుతుంది. మనం విమలక్క స్వరం విన్నపుడు అందులోని పిచ్ కేవలం శబ్దంగా మాత్రమే ఉండదు.

జానపద గానంలో పదం అత్యంత ముఖ్యమైనది. ప్రతి అక్షరం స్పష్టంగా వినిపించే ఆర్టిక్యూలేషన్. ఇది పాట సందేశాన్ని నేరుగా శ్రోతకు చేరుస్తుంది. విమలక్క స్వరం ధ్వనిశాస్త్ర పరంగా అధిక వోకల్ ఇంటెన్సిటీ, స్పష్టమైన ఆర్టిక్యూలేషన్, ప్రభావవంతమైన డైనమిక్ వేరియేషన్ కలిగిన టిపికల్ స్వరం. అందుకే అది వినిపించే శబ్దంగా మాత్రమే కాకుండాప్రతిధ్వనించే గర్జనగా అనుభూతించిఅనుక్షణం మన అనుభవాన్ని ఆవరిస్తుంది. అక్క గానాన్ని రికార్డింగ్‌లో మాత్రమే వింటే ఒకలా, ప్రత్యక్ష ప్రదర్శనలో ప్రజల మధ్య విన్నప్పుడు మరోలాతెలుస్తుంది. విమలక్క మైక్ సహాయమే లేకుండా వందలాది ప్రజలకు వినిపించేలా పాడగలదు. తన అసలైన బలం ఇదే.

సమాజం అంచున సంచరించే అణగారిన ప్రజల అనుభవాలకు స్వరం ఇచ్చే సబాల్టన్ సాంస్కృతిక వ్యక్తిత్వం విమలక్క సొంతం. ప్రధాన స్రవంతి సంగీతంలో విమలక్క అక్షరాలా ఒక ఉపశ్రేణి గాయని. చరిత్ర పెదవి విప్పకుండా మౌనంగా ఉంచిన ఉపశ్రేణుల జీవితాలకు సామూహిక అస్తిత్వాన్ని సృష్టించిన సాంస్కృతిక స్వరం విమలక్క పాట. పాటకు స్త్రీ అనుభవాన్ని, సామాజిక ప్రశ్నలను, సామూహిక గానశక్తిని కలిపిన స్వరాన్ని అందించింది. ఆమె కళను కేవలం మార్క్సిస్టు ప్రచార గానంగా పిలవడం దాని సౌందర్య విస్తృతిని తగ్గించడమే. ఆమె పాట ప్రజల జ్ఞాపకానికి భాష. ఆదో పతిత భ్రష్ట బాధా సర్ప ద్రష్ట సామూహిక స్వీయ అనుభవ

విమలక్క పేరు వినగానే, అమెరికా జానపద సంగీతాన్ని పౌరహక్కులు, శాం తి, సామాజిక ఉద్యమాలతో అనుసంధానం చేసిన జోన్ బాయెజ్. అర్జెంటీనా లాటిన్ అమెరికా ప్రజల, కార్మికుల, అణగారిన వర్గాల భావాలను గానించిన మెర్సిడెస్సోసా, గ్రామీణ జానపద సంప్రదాయాన్ని సేకరించి, ప్రజల జీవితం, సామాజిక ప్రశ్నలతో పాట కట్టిన వికోర్‌శైరా, మిరియం మకేబా, వయొలెట్ పార్రా గుర్తుకొస్తారు. వీరందరిలో విడివిడిగా కనిపించే కొన్ని లక్షణాలు విమలక్కలో ఒకే సాంస్కృతిక రూపంలో కలుస్తాయి. వామపక్ష సాంస్కృతిక ఉద్యమ ప్రదర్శనాకారిణి అయిన మహిళ బాలడీర్ వంటిది విమలక్క.

జానపద గానాన్ని ప్రజా ఉద్యమాలనూ , సామాజిక న్యాయాన్నీ అణగారిన వర్గాల గొంతుకగా ఉపయోగించిన మహిళలు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. తెలంగాణ జానపద సంప్రదాయం, ప్రాంతీయ అస్తిత్వం, మహిళా సమస్యలు , సామాజిక న్యాయం, ఉద్యమ రాజకీయాలను ఒకే సాంస్కృతిక రూపంలో కలిపి నిర్మించిన ఆమె సాంస్కృతిక రూపం విశిష్టమైనది.

విమలక్క గానంలో నేను పాడుతున్నాను కంటే మనం మాట్లాడుతున్నాం అనే భావన బలంగా ఉంటుంది. తన స్వరం వ్యక్తిగతమైనదే అయినా, దాని తాత్విక స్వభావం సామూహికం. విమలక్క పాట ప్రేక్షకులని కేవలం వినేవారిగా మాత్రమే వుంచేయదు. వారిని నిరంతరం సమూహ సామాజిక అనుభవంలో భాగస్వామిగా చేస్తుంది. స్వరలయలో శ్రోత కేవలం వినేవాడు కాదు. తన్ను మరిచి తానూ ఆమాంత్రిక శబ్దలయ లోకి నింపాదిగా ప్రవేశిస్తాడు. ఇది శాస్త్రీయ సంగీతంలోని వ్యకి ్త-స్వర సంబంధం కంటే భిన్నమైన సంగీత అనుభవాన్ని సృష్టిస్తుంది. ఆధిపత్యం నుంచి పుట్టిన శాస్త్రీయ సంగీతం గొప్పగా భావించే శ్రుతిశుద్ధి ఆమెగళంలో ఉండదు. అందుకు విరుద్ధంగా శాస్త్రీయ సంగీతంలో అవలక్షణాలుగా పేర్కొనే స్వరంలో నిగరుకు, ఒత్తిడి, పిలుపు, పునరావృతం వంటి వాటితో ఆమె లక్షలాది మందిని కదిలిస్తుంది. నిజానికి అవే ఆమె పాటకు సామాజిక సౌందర్యాన్ని ఇస్తున్నాయి.

అక్క గానం ప్రజలకు వారి అనుభవాలకూ మధ్యవర్తి. అందుకే ఆమె స్వరం వ్య క్తిగతమైనదే అయినా, తన గాన తాత్విక స్వభావం మాత్రం సామూహికం. ప్రజల అనుభవాన్ని పాటగా, పాటను సామూహిక జ్ఞాపకంగా, ఆ జ్ఞాపకాన్ని సా మాజిక చైతన్యంగా మార్చేక్రమంలో విమలక్క అణగారిన ప్రజలు తమను తాము అసలు స్వరంలో గుర్తించుకునే స్థల కాలాలను సృష్టించింది. పాట ఒక కళ మాత్రమే కాదు, అదో అనుభవాన్ని పలికించే మార్మిక భాష. ప్రజల కోసం వారి మధ్యవారితో కలిసి యాభైఏళ్ళు నుంచీ అవిరామంగా ప్రత్యక్ష సాంస్కృతిక ఉద్యమం నిర్మిస్తున్న విమలక్క అసలైన ప్రజాసాంస్కృతిక వారసురాలు.

మోత్కూరు శ్రీనివాస్,

9866061350

Tags

Next Story