ముసురు

ముసురు
X

ముసురుపట్టి వాన కురుస్తోంది

పల్లె పల్లెంతా కట్టెలపొయ్యి దగ్గర

ముడుచుకొని కూర్చున్న అవ్వలా ఉంది

పల్లె పల్లెంతా నీటికుండలా

ముసురు వానను మోస్తుంది

ఇంటిచూరు నుంచి సన్నగా ధారగా

జారిపడుతున్న చినుకులు

తాటాకు ఇంటిని ఓ చిన్న

జలపాతంగా మార్చాయి

జారే చినుకులను చూస్తున్న నా కళ్ళు

చూరు క్రింద వాకిట్లో పిల్లకాలవలా

పారుతున్న నీటిలో కాగితం పడవల్లా

తేలుతున్నాయి

వానలో తడిసిన ఇంటి తాటాకుల వాసన

తాటి ముంజులను గుర్తు చేసింది

ఇంటిలో మండుతున్న

పొయ్యి నుంచి వచ్చిన పొగ

ఇంటి కప్పుపై పొగమంచులా కమ్మేసింది

పొయ్యి దగ్గర అమ్మ తడిసిన కట్టెలను

వెలిగించేందుకు అవస్థలు పడుతుంది

తాటాకుల సందుల్లోంచి వర్షం

చుక్క చుక్కలుగా ఇంటిలో పడుతున్న చోట

అమ్మ గిన్నెలు పెట్టింది

అవి కదిలే పడవల్లా ఉన్నాయి

గిన్నెలో పడుతున్న చినుకులు శబ్ధం

గడియారంలా మోగుతుంది

చుట్టకాలుస్తూ నాన్న ఇంటిలో వర్షం

పడకుండా ఆకులను సరిచేస్తున్నాడు

నీరుగారుతున్న గోడలు చెమ్మగిల్లిన

మట్టి అరుగులు వెచ్చని చేతులు కోసం

ఎదురుచూస్తున్నాయి ఇంటి పైకప్పును

ఒంటి చేత్తో మోస్తున్న నిట్రాట...

ఎడతెరిపి లేని ముసురువానలో

ధైర్యంగా నిద్రపోయే నిలువెత్తు భరోసాగా

నిలబడింది

పొనుగుమట్ల అశోక్ కుమార్

99593 79709.

Tags

Next Story