నాలోంచి పలికే వాక్యం దొరికింది

మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో 1966లో తణుకు ప్రాంతంలో పుట్టాను. ఊహ తెలిసేసరికి మాతామహుల ఉమ్మడి కు టుంబంలో సూర్యారావుపాలెంలో ఉన్నాను. అ యిదారేళ్ల వయసులో నాన్న ఉద్యోగం చేస్తున్న చాగల్లు చేరాను. పన్నెండేళ్లపుడు కుటుంబం అంతా తణుకు చేరాము. నాన్న కోళ్ళమందుల వ్యాపారం ప్రారంభించారు. పల్లె నుండి గ్రామానికి, అటు నుండి పట్టణానికి చేరే క్రమంలో, బాల్యం నుండి కౌమారానికి, అంటు నుండి యవ్వనానికి చేరే క్రమంలో నాకు నేను దూరమవుతున్న ఒంటరితనమేదో పెరుగుతూ ఉండేది.
పదేళ్ల వయసు నుండి చదవటం ఇష్టంగా ఉండేది. టెన్త్ పూర్తయే నాటికి సీరియస్ సాహిత్యంలోకి వెళ్ళాను. శరత్ మొదలు టాల్ స్టాయ్ వరకూ చదువుకుంటున్న దశలో, ఇంటర్‌లో, చదవటానికి ఏమంత ఆసక్తి లేని కవిత్వం రాయటం మొదలుపెట్టాను. ఏదో ఒక ఉద్వేగం, మెరిసే ఆలోచన తోచాక, రాసేవరకూ మనసు నిలిచేది కాదు. ఇంటర్ తెలుగు లెక్చరర్ జీయస్వీ గారి సలహాపై మహాప్రస్థానం చదివాను. ముందుమాట రాసిన చలం మరింత ఆకర్షించారు. ఒకవైపు చలం, మరోవైపు కమ్యూనిస్టు సాహిత్యంతో ఆ రోజులు ఆదర్శాల ఉద్వేగాల్తో వెలుగుతున్నట్లుండేవి. కానీ, పంచుకొనే తోడెవరూ ఉండేవారు కారు. కొన్నాళ్ళకి, బాహ్య విషయాల ఉద్వేగాల కన్నా లోతుగా హృదయంలో నిలవనీయని వెలితి ఏదో తోచింది. జిడ్డు కృష్ణమూర్తి జీవన వ్యాఖ్యలు దొరికింది. బావున్నట్టు అనిపించింది. అనేక సందిగ్ధతలతో ఉండగా, డిగ్రీ చివర్లో, చలం రాసిన భగవాన్ స్మృతులు దొరికింది. శ్రీ రమణమహర్షి తీవ్రంగా ఆకర్షించారు. నేనెవరో తెలిస్తే ఇన్ని దుఃఖాల నుండి విముక్తి అని లోతుగా, బ లంగా తోచింది. పెనుగులాట మొదలైంది. అదేమీ తేలిక విష యం కాదని, లోకం పట్టు గొప్పదని, దీనిని తప్పుకోవడం చిన్న విషయం కాదని, ఇప్పటికీ అనిపిస్తూ ఉన్నా, ఈ వెదుకులాటతో పోలిస్తే మిగిలినవి ఏమంత కాంతిగా తోచవు. లోచూపు పెరిగేకొద్దీ విస్తృతి, వైవిధ్యాలపై ఆసక్తి తగ్గింది., చదువుపై కూడా. లోతులోకి, సారంలోకి చూడటం ఒకటే ఆకర్షణగా మిగిలింది.
భగవాన్ బోధన, టాగోర్ కవిత్వ ప్రభావాలతో రాసుకున్న కవితలతో తొలి సంపుటి ఆరాధన 89లో వచ్చింది. ఆరాధన వలన చిక్కాల కృష్ణారావు గారి ద్వారా ఆలపాటి రాంబాబు పరిచయమయ్యారు. అనేక సాయంకాలాలు, రాత్రులు ఆయనతో, జీయస్వీ, సక్సేనా రాజు గార్లతో తాత్విక చర్చలలో గడిచాయి, 18లో ఆయన కాలం చేసేవరకూ.
94లో కొప్పర్తి తణుకు చేరారు. ఆయన స్నేహంతో ఆధునిక తెలుగు కవిత్వ లోకం విస్తృతంగా పరిచయమైంది. ఈ సమయంలోనే, సంజీవ దేవ్ వ్యా సాల్లో హైకూ గురించి చదివి, ఇస్మాయిల్ గారికి నా తొలి హైకూలు చూపించటమూ, తర్వాత ఆయన రాసిన హైకూలతో ఒక్కసారిగా హైకూకి తెలుగునాట గుర్తింపు రావటమూ జరిగాయి. కొప్పర్తిగారి సహాయంతో ఎడిటింగ్ చేసి, తొలి హైకూ సంపుటి ‘దృశ్యాదృశ్యం’ 95లో తెచ్చాము. తణుకులో చేరా, ఇస్మాయిల్, కె. రామ్మోహన్ రాయ్‌లతో ఆవిష్కరణ సభ జరిపాము. 97లో హైకూ, 99లో పూలు రాలాయి హైకూ సంపుటాలు వచ్చా యి. పూలు రాలాయి నాటికి, కంజిరలో నాసరరెడ్డి అనువదించిన జపనీయ హైకూల స్థాయిలో రాయగలిగాననిపించింది.
తర్వాత సుమారు దశాబ్దం పాటు జీవితపు వత్తిడులతో నిశ్శబ్దకాలం. ఆ కాలంలో మూడేళ్ళు ఒక స్కూల్ నడిపాను. 2006లో అప్పటికి రాసిన వచనకవిత్వంతో నేనే ‘ఈ క్షణం’ సంపుటి తెచ్చాను. నాదైన శైలి కోసం, వస్తువు కోసం తపన పడటం ఈ సంపుటిలో కనిపిస్తుంది. 2010లో నిసర్గదత్త సం భాషణలు చదువుకున్నాక, లోపలంతా గొప్ప శక్తి, కాంతి నిండినట్లు ఉండేది. మళ్ళీ కవిత్వం నాలో తెరుచుకుంది. ఊహలు, వాక్యాలు ప్రవహించటం మొదలైంది. 2011లో ‘ఆకాశం’ వచ్చింది. పూర్తిగా నాలోంచి పలికే వాక్యం దొరికింది. 15లో ‘నీలో కొన్నిసార్లు’ వచ్చింది. 21 లో నాన్న కాలం చేశాక, వ్యాపా ర, కుటుంబ బాధ్యతలతో కవిత్వ సృజన నెమ్మదించింది. 23లో ఊరికే జీవితమై ప్రచురించాక, ఇక కవిత్వం సరిపెడదామనుకున్నాను. మళ్లీ, ఏకాంతపు రాత్రులలో కవిత్వం పుష్పించిం ది. 25లో ‘సృష్టి’ వచ్చింది. ఈ క్రమంలో గ్రహించింది ఏమంటే, రాసేది ఏమైనా కానీ, హృదయం నుండి పలికితేనే హృదయాన్ని చేరుతుందని. హృదయం నుండి జీవిస్తేనే హృద యం నుండి రాయగలమని. ఈ దశకి చేరాక పలికితే రాయని సందర్భాలున్నాయి గానీ, బలవంతంగా రాసింది లేదు. మొత్తంగా ఇప్పటికి మూడు హైకూ, ఆరు వచన కవితా సంపుటాలు వచ్చాయి.
బివివి కవితలన్నీ ఒకలానే ఉంటాయి అనేవారున్నట్లే, ఒక లా కనబడుతూ, అనేక ఛాయలు, గాఢతలు చూపుతాయని ప్రేమించేవారున్నారు. అర్థంకావనే వారిలానే, శాంతినీ, ఊరటనీ ఇస్తాయనేవారున్నారు. ప్రక్కన పెట్టిన వారిలానే, తరచూ ఒకటి, రెండు కవితలో, హైకూలో చదువుకొనే, తలచుకునే వారున్నారు. రచనలు ఆసక్తి ఉన్నవారికి అందుబాటులో ఉండాలని bvvprasad.blogspot.comలో ఉంచాను.
బివివి ప్రసాద్
Tags
-
Home
-
Menu
