ఊపిరి స్పర్శ

X
నా ఊపిరి
నన్ను మాత్రమే కాదు
నాలో నిక్షిప్తమైన నీ జ్ఞాపకాల్ని
నాలో సజీవమైన నీ తలపుల్ని
ఎప్పటికీ బతికిస్తూనే వుంది
నువ్వు దూరంగా వుంటేనేం
నీ శ్వాస పరిమళం
నన్ను అంటుకునే వుంటుంది
నీ మాటల మధురిమలు
నన్ను పట్టుకునే వుంటాయి
ఏకాంతంలోనూ
నేను ఒంటరి కానే
కాదంటూ
గడిపిన నీ
సాంగత్యంలోని క్షణాలు
నిన్ను నా గుండె భుజాలపై
అలా నాతోపాటు తీసుకొస్తుంటాయి
మనతోపాటు
కలుసుకున్న
మన ఊపిరి
స్పర్శలు
అదేదో మొక్కను అంటుకట్టినట్టు
కొంగ్రొత్త ఊపిరికి ప్రాణం పోసింది
నాతోనే నాలోనే నన్ను స్పృశిస్తూ...
నిన్ను చూడాలనుకున్నప్పుడు
నా కనురెప్పలు మూస్తాను
నిన్ను కలవాలన్నప్పుడు
నీ జ్ఞాపకాల్ని ఊపిరితో నిమురుతాను
నీ ఒడిలో సేదతీరిన అనుభూతికై...
- యు.ఎల్.ఎన్.సింహా
Tags
Next Story
-
Home
-
Menu
